- ఆప్టే
వీహెచ్‌పీ జాతీయ కార్యదర్శి ఎస్‌ఎస్ ఆప్టే తన సందేశంలో అనేక అంశాలు పేర్కొన్నారు. రెండురోజుల కార్యక్రమాలలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వాటిలోని అంశాలు:
పరిషత్ ఆంధ్ర శాఖకు జగద్గురువులు కామకోటి శంకరాచార్యులవారు ప్రారంభోత్సవం చేశారు. 1200 ఏండ్ల క్రితం ఏ జగద్గురువువల్ల హిందూ సమాజంలో నవచైతన్యం జాగృతమయిందో ఆ జగద్గురువు స్థాపించిన ఒక పీఠం అధిపతులు నేడు పరిషత్‌కు ఆశీస్సులు ఇచ్చారు.
దీని అర్థం గుర్తించండి. ఈ 1200 ఏండ్ల కాలంలో ఎందరో సుల్తాన్‌లు, రాజులు, సామ్రా జ్యాలు వచ్చాయి, పోయాయి. కాని జగద్గురు పీఠం మాత్రం అవిచ్ఛిన్నమైన పరంపరగా కొనసాగుతోంది. రాజులు, రాజ్యాలు గతించినా ధర్మరాజ్యం మిగులుతుంది. ధర్మరాజ్యానికి అధిపతి కౌపీనధారి అయిన జగద్గురువు.
పరిషత్ శాఖ ప్రారంభం కావడంతో మన కర్తవ్యం ప్రారంభమయింది. ‘‘ప్రారంభశూరః బలు దాక్షిణాత్యా’’ అనే అపవాదును మనం తొలగించాలి.
ఆ కర్తవ్యం ఏమిటి? భారతవర్షం ధర్మక్షేత్రం, ఇక్కడ ధర్మరక్షణ జరగాలి. దానికై హిందూ సమాజ రక్షణ జరగాలి. కాని నేడు దేశంలో స్టాలిన్ గ్రాడ్‌లు, క్రైస్తవస్థాన్, ముస్లింస్థాన్‌ల నిర్మాణానికి కృషి చేసేవారు ఉన్నారు. సమాజ రక్షణ నిర్లక్ష్యమవుతోంది, ఎందువల్ల?
క్రీ.శ.8,9 శతాబ్దాలలో మన స్వాతంత్య్రానికి గ్రహణం పట్టింది. దేశం పరాధీనం అయింది. 1000 ఏండ్ల పరాయి పాలన తర్వాత 1947లో మనకు స్వరాజ్యం తిరిగి వచ్చింది. గత వేయి ఏండ్లలో మనం దేనిని కోల్పోయాం? మనం తిరిగి దేనిని సంపాదించవలసి ఉంది?
మొన్న మొన్న దేశ విభజన జరిగింది. అంతకు పూర్వం పర్షియా, ఇరాన్‌లు భారతవర్షం నుండి విడిపోయాయి. ఒకప్పుడు సప్తసింధు అనగా ఏడునదులు గల ప్రాంతం. తర్వాత కాలంలో పంజాబ్ అనగా ఐదు నదులు ప్రాంతం అయింది. 1947లో మరి మూడు నదులుపోయి మనకు రెండు నదులే మిగిలాయి. ఏ సింధునదివల్ల ‘హిందూ’ అనే పేరు వచ్చిందో ఆ సింధునది పోయింది.
మిగిలిన దేశంలో అయినా హిందువులం ఏకం కాలేమా? ఆచార వ్యవహారాలలో కొద్దిపాటి విభేదాలు ఉన్నప్పటికీ మనమంతా రామ, కృష్ణాది దేవతల పేర్లే పెట్టుకుంటున్నాం. తిరుపతి వెంకటేశ్వరుణ్ణే ఉత్తరాదివారు బాలాజీ అని పిలుస్తున్నారు. మన పవిత్ర నదులన్నీ మనల్ని కలిపి ఉంచుతున్నాము. కాని దురదృష్టమేమంటే నేడా నదీజలాల కోసం వివాదాలు ప్రారంభమయ్యాయి. మనల్ని కలిపి ఉంచిన నదులు నేడు మనల్ని విభజిస్తున్నాయి.
మనవి 30 లక్షల దేవాలయాలు
మన పూర్వులు 30 లక్షల దేవాలయాలు నిర్మించారు. నేడు ఈ ఆలయాలెన్నో నాశన మయ్యాయి. జీర్ణావస్థలో ఉన్నాయి. శత్రువులు మాయోపాయాలతో హిందూ సమాజం నుండి వ్యక్తులను తమలో చేర్చుకుంటున్నారు. హిందూ సమాజం అనే ప్రవాహంలో నీరు బయటికి పోతోంది. భాక్రానంగల్ ప్రాజెక్టుకు బీట వచ్చినప్పుడు పంజాబు ప్రజలకు జలప్రళయం సంభవించకుండా నాటి ప్రధాని పండిత నెహ్రూ దానికి మరమ్మత్తు చేయించారు. అదేవిధంగా గత వేయి ఏండ్లలో మన సమాజంలో నుండి ఎంతో నీరు బయటికి ప్రవహించింది. నేడు దీనికి ఆనకట్ట వేయాలి. నాడు దేశంలో అంతా హిందువులే. నేడు 16 కోట్లమంది హైందవేతరులుగా మారారు. పాకిస్థాన్‌లో 10 కోట్లు, భారత్‌లో 5 కోట్ల ముస్లింలు, ఒక కోటి క్రైస్తవులు, ముస్లింలు మన దైవ విగ్రహాలను ధ్వంసం చేస్తూనే ఉన్నారు. మహారాష్ట్రంలో వినాయకచవితికి ఊరేగింపుపై దాడులు జరగడం పరిపాటి అయింది. వీరు కాక దేవుడు, ధర్మం లేదనే సామ్యవాదులు ఇంటింటిలో తయారవుతున్నారు. కనుక ధర్మరక్షణకు సమాజ రక్షణ జరగాలి.
దీనికై బానిసత్వ కాలంలో ఏర్పడిన మాలిన్యాలను మన మనసుల నుండి మన ఇళ్ల నుండి, మన ఆలయాల నుండి తొలగించాలి వాటిని తిరిగి పవిత్రం చేయాలి.
మనకు ధర్మం గురించి, మతం గురించి మరొకరు నేర్పనవసరంలేదు. సహజీవన సిద్ధాంతాన్ని ఒక్క భారతదేశమే ప్రతిపాదించగలదు. చైనా దాన్ని స్వీకరిస్తుందనుకున్న పండిత నెహ్రూ చివరకు అది వెన్నుపోటు పొడిచిందని అంగీకరించారు.
కనుక సనాతన ధర్మాన్ని, ఆధునికతను మేళవించి యుగపరివర్తన చేయవలసిన అవసరం ఉన్నది. దానికై అవతారం ఎత్తడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నారు. అయితే ఏ ఇంటిలో అవతారం ఎత్తాలి? మన మనసులను, గృహాలను పరిశుద్ధం చేసుకోవడం ద్వారా యుగ పరివర్తనకు భూమిక నిర్మించాలి. అన్ని రంగాలలో స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాలి. ఈ పని ప్రభుత్వం చేయజాలదు. మనమే చేయవలసి ఉంది. అట్టే యుగ పరివర్తనయే విశ్వహిందూ పరిషత్ ఆశయం.
మొదటి ఆశీస్సులు కంచి పీఠంవారివే
ఆప్టే మరొక సమావేశంలో ఇలా ప్రసంగించారు: ‘‘విశ్వహిందూపరిషత్ స్థాపన హిందూ పద్ధతిలో జరిగింది. జగద్గురువులు, ఆచార్యులు, సాధుసంత్‌ల ఆశీస్సులతో అది ప్రారంభమయింది. ఈ సంస్థ స్థాపనకు మార్గదర్శనం కోసం మొదట కంచి కామకోటి పీఠాధిపతులు వద్దకు వెళ్లారు. సంస్థకు మొదటి ఆశీస్సు వారిది. ఆ తర్వాత మిగతా జగద్గురువులు, రామానుజాచార్యులు, మధ్వా చార్యులు, మాస్టర్ తారాసింగ్ ప్రభృతులు తమ ఆశీస్సులు అందించారు. ఆ విధంగా ప్రపంచ హిందువులను గురించి ఆలోచించే ఒక సంస్థకు అంకురార్పణ జరిగింది.
పరిషత్ ఉద్దేశం ఏమిటి? వేయి ఏండ్ల బాని సత్వం వల్ల మన సమాజం విచలితం, విభ్రాంతం అయింది. విదేశం, విధర్మీయ ప్రభావం మనల్ని పెడత్రోవ పట్టించాయి. మన ఆచరణలో, ఆలోచనలలో మార్పు వచ్చింది. 5000 ఏండ్ల మన జాతిని కలిపి ఉంచిన సంస్కృత భాషపై కన్న 150 ఏండ్లు స్వభాషలపై సవారీ చేసిన ఆంగ్ల భాషపైన నేడు మనలో కొందరికి మమకారం ఉండడం ఈ దుస్థితిని సూచిస్తోంది.
1200 ఏండ్ల సంఘర్షణ తర్వాత మనం స్వతంత్రులం అయినాం. 1200 ఏండ్ల మొత్తం చరిత్ర కలిగిన జాతులు ప్రపంచంలో ఎన్ని ఉన్నాయి? స్వరాజ్యం తర్వాత దాస్య కాలంలోని భ్రమలను తొలగించి జాతి ఎలా ముందుకు పోవాలో ఆలోచించడం కర్తవ్యం అవుతోంది.
అయితే ఈ పని ఎవరు చేయాలి? ప్రభుత్వం దీని గురించి ఆలోచించడం లేదు. సోషలిజం, కమ్యూనిజం, తిండి, బట్ట-ఇత్యాదులకే అది పరిమితమవుతోంది. ఆత్మను గురించి, ధర్మాన్ని గురించి దానికి పట్టదు. ‘‘ధర్మాన్ని దూరంగా ఉంచు’’ అనేదే దాని ధోరణి అయింది. గత 20 ఏండ్లలో దీని ఫలితం మనం అనుభవిస్తూ వచ్చాం.
కనుక స్వరాజ్యానంతరం జాతి పయనించవలసిన మార్గాన్ని నిర్దేశించడానికై కుంభమేళా సమయంలో ప్రయాగలో విశ్వహిందూ సమ్మేళనం జరపాలని నిశ్చయించారు.
ప్రయాగ సమ్మేళనం చరిత్రాత్మకం
ప్రయాగ సమ్మేళనం అద్వితీయం, చరిత్రాత్మకం. 7,8వ శతాబ్దులలో శ్రీహర్షుడు ఇట్టి సమ్మేళనాన్ని నడిపాడు. 1200 ఏండ్ల తర్వాత ముగ్గురు జగద్గురువులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు మొదలగు 20మంది ఆచార్యులు ఒకే వేదికపై ఆసీనులైనారు. జైన, సిక్, బౌద్ధ సంప్రదాయాల అధిపతులు కూడా వీరిలో ఉన్నారు. 16వేలమంది ప్రత్యేక ప్రతినిధులు సమ్మేళనంలో పాల్గొన్నారు. పరిషత్‌కు కార్యసమితి ఏర్పాటయింది. నేపాల్ మహారాజా పోషకులుగా, మైసూరు మహారాజా అధ్యక్షులుగా ఉండడానికి అంగీకరించారు.
ఆ తర్వాత పరిషత్‌కు ఒక నిబంధనావళి ఏర్పడింది. దాని ప్రకారం సాధుసంత్‌లతో కూడిన ఒక మార్గదర్శక మండలి, ఒక ధర్మకర్తల మండలి (దీశీ•తీ• శీ• •తీబ•వవ) ఒక కార్యసమితి ఏర్పడ్డాయి. జిల్లా స్థాయి వరకు సమితులు ఏర్పరచాలని నిశ్చయించారు.
ఇక పరిషత్ నిర్వహించే, నిర్వహించదగిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు బొంబాయిలో కార్పొరేషన్ చెత్తకుండీలలో రోజూ సగటున 25-30 నవజాత శిశువులు దొరుకుతారు. వారిని హిందువులు తీసుకువెళ్లరు. మిషనరీలు, ముస్లింలు తీసుకువెళ్లి పోషిస్తారు. ఎవరో పొరపాటు చేయడం వల్ల జన్మించిన శిశువులే వారు. అయినా వారు మనవారే. కశ్మీరులో అపహరించిన హిందూ మహిళ తిరిగి వస్తే, ఆమెను ఎవరు స్వీకరిస్తారు? అట్టి శిశువుల కోసం, ఇట్టి మహిళల కోసం అనాథాశ్ర యాలు స్థాపించాలి. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టవచ్చు.
పరిషత్ ఇంతవరకు సుమారు రూ. ఐదున్నర లక్షల విధి సేకరించింది. రూ. 3 లక్షల నిధి మిగిలి ఉన్నది. అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ లలో ఆదివాసి, వనవాసి క్షేత్రాలలో పరిషత్ కేంద్రాలు ప్రారంభమైనాయి. ఒక్కొక్క జిల్లాలో ఒక వేయిమంది సభ్యులను చేర్చడం కనీస క్యార్యక్రమంగా పని జరుగుతోంది.
ముఖ్యోద్దేశం ఏమిటి?
పరిషత్ ముఖ్యోద్దేశం ఏమిటి? హిందూ సమాజం ధర్మనిష్టమైన సమాజం. అర్థనిష్ఠమైనది కాదు. పునర్జన్మ, కర్మ సిద్ధాంతం దీనికి మూల సూత్రాలు. ధర్మమే జీవనానికి ప్రేరణ, స్ఫూర్తి ఇస్తుంది. కనుక ధర్మ రక్షణ జరగాలి. వేద వ్యాసుని కాలంలో, శ్రీకృష్ణభగవానుడు గీతోపదేశం చేసిన కాలంలో ధర్మం అంటే హిందూ ధర్మమే. కాని ఇతర మతాలపై ఆక్రమణ చేసే మతాలవల్ల ఈ దేశంలో ధర్మహాని జరిగింది. ‘తిండి పెడతాం. మతం మార్చుకోండి’ అనే బేరంతో మత ప్రచారం జరిగింది. ఫలితంగా పశ్చిమాన జోర్డాన్ నది సరిహద్దుగా ఉన్న భారతవర్షం కుంచించుకుపోయింది. హిందువుల సంఖ్య క్షీణించింది.
ఈ ధోరణిని అరికట్టాలి. ధర్మరక్షణకై సమాజ రక్షణ జరగాలి. గత మార్చి నెలలో మద్రాసులో జరిగిన విద్వత్ పరిషత్ ‘‘హిందూర్నపతితో భవతే’’ హిందువు ఎన్నటికీ పతనం చెందడు అని నిశ్చయించింది. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికై కర్తవ్య చ్యుతులైన హిందువులను కర్మతవ్య పరాయణులుగా మార్చాలి. ప్రపంచంలో ఆధ్యాత్మి కత హిందువుల ద్వారానే ఉద్ధరించబడగలదు.
ధర్మం స్థిరమైనదనీ, రాజు రాజనీతి అస్థిరమనీ భీష్ముడు ధర్మరాజుకు చెపుతాడు. క్షణ క్షణం మారే రాజనీతి వల్ల ఈ పని జరుగదు. నేటి రాజకీయం మరీ అర్థరహితంగా తయారవుతోంది. ముగ్గురి కన్న ఎక్కువ పిల్లలు కన్నవారికి ప్రభుత్వ సౌకర్యాలు, సహాయాలు నిలిపివేస్తామనీ, నాల్గవ కాన్పుకు గర్భిణీ స్త్రీల సెలవు మంజూరు చేయమనీ ఇట్టి వెర్రి మొర్రి ఆలోచనలు చేస్తున్నారు రాజకీయ నాయకులు. దేవాలయాలలో పూజా విధానాదులు నిర్ణయం ఎవరో ఐ.ఏ.ఎస్. ఆఫీసరు అధీనంలో ఉండడం మరొక విపరీత స్థితి. పరిషత్‌కు విరాళాలకు రాబడి పన్ను మినహాయింపు కోసం కోరితే క్రైస్తవ మిషన్‌లకు అట్టి మినహాయింపు ఇచ్చే ప్రభుత్వం పరిషత్ పని వర్గతత్వ పూరితం (శీఎఎబఅ•శ్రీ) కనుక దీనికి ఇవ్వమని అంటుంది. ఇలా ఉన్నాయి నేటి రాజకీ యాలు. కనుక ఇట్టి రాజకీయాలకు అతీతంగా సమాజ రక్షణకు కృషి చేయవలసి ఉంది.’’ అన్నారు ఆప్టే.
పీఠాధిపతులు ప్రజల వద్దకు వెళ్లాలి!
మరొక సందర్భంలో ఆప్టే ఈ మాటలు చెప్పారు: ఆచార్యులు ప్రజల మధ్యకు వెళ్లాలని ఆప్టే మనవి చేశారు. అలాగే దేవాలయాలు, నిధులు, వాటి సద్విని యోగం అనే సమస్య ఎలా ఏర్పడిందో వివరించారు. ‘‘నేడు దేశంలో 5000 మంది క్రైస్తవ మిషనరీలు ఉన్నారు. ప్రతీ 15 మైళ్లకూ, ఒక చర్చి నిర్మించడానికి వారు పథకాలు వేశారు. వారికి విదేశాల నుండి ఏటేటా రూ. 70 కోట్లు వస్తుంది. ఒక్క బొంబాయిలో 2500 మంది ‘బ్రదర్స్’కు మిషనరీలు శిక్షణ ఇస్తున్నారు. ఆదిశంకరుల జన్మస్థలం కాలడీ వద్ద గల ఒక సెమినరీలో 2000 మంది క్రైస్తవ మత ప్రచారకులు శిక్షణ పొందుతున్నారు.
అయితే ఈ చర్చిలు, మసీదులు ఇటీవలగా – అనగా 2000 ఏండ్ల లోపున వచ్చినవి. వేదకాలం నుండి ఈ దేశంలో ఆశ్రమాలు ఉండేవి. శ్రీ సి.వి. రామస్వామి అయ్యంగార్ దేవాలయాలపై సమర్పిం చిన నివేదిక ప్రకారం నేటికీ దేశంలో 30,000 దేవాలయాలు ఉన్నాయి. సాలీనా రూ. 10,000 ఆదాయం వచ్చే ఆలయాలు 900 ఉన్నాయి. వీటి ఆస్తులు, వీటి వ్యవస్థ ఒక పెద్ద సమస్య.
రామాయణ రామునికి దూరంగా వచ్చిన సీతకు వాల్మీకి తన ఆశ్రమంలో ఆశ్రయం ఇచ్చారు. నేడు కూడా మన ఆశ్రమాలు, మఠాలు, వలయాలు అన్నీ ఈ పనులకు ఉపయోగపడాలి. కడుపునొప్పితో బాధపడే వ్యక్తికి దానిని తగ్గించిన వాడే దేవుడు. అతడు రాయవెల్లూరు (క్రైస్తవ ఆసుపత్రికి) వెళతాడు.
పూర్వం నలందవంటి ఆశ్రమాలలో ఆయుర్వేద చికిత్స, ఆయుర్వేదంపై పరిశోధనలు జరిగేవి. నేడు కూడా దేవాలయాలలో ఔషధాలు ఎందుకు ఇవ్వకూడదు?
కంచి, మధుర, తిరువనంతపురం ఇత్యాది నగరాలు దేవాలయ కేంద్రంగా నిర్మించినవి. దేవాలయం సమాజ జీవనానికి కేంద్రం ప్రజల అవసరాలన్నీ అక్కడ తీర్చేవారు. హైందవ జీవనానికి కేంద్ర బిందువు ఆలయమే, పార్లమెంటు కాదు.
దేశంలో 90 లక్షలమంది సాధువులున్నారు. ఈ సాధువులను ధర్మపురుషులను సమీకరించడం అవసరం. భారత సాధు సమాజ్ ప్రతి సాధువునకూ ఒక సర్టిఫికెట్ ఇవ్వాలని ప్రతిపాదించింది. కౌపీనధారి అయిన సాధువు సర్టిఫికెట్ ఎక్కడ పెట్టుకుంటారు? ఇట్టి వెర్రిమొర్రి ఆలోచనలకు స్వస్తి చెప్పాలి. ఇందరు సాధువులలో గ్రామ గ్రామం తిరిగి ధర్మప్రబోధం చేయడానికి 2,3 వేలమంది ధర్మపురురుషులు దొరకరా? దేవాలయాలను, మఠాలను పరిషత్ కార్యాలయాలుగా చేయనివ్వండని మనం కోరాలి.
ఇలా ధర్మపురుషులు ప్రజల మధ్యకు బయలుదేరే పక్షంలో 5 ఏండ్లలో క్రైస్తవ ప్రభావాన్ని తొలగించ వచ్చు. వీరు ప్రవేశిస్తే మిషనరీలు తొలగిపోతారు. బ్రిటిషు ప్రభుత్వం 150 ఏండ్లు నాగా కొండలలోకి హిందూ మత ప్రచారకులు వెళ్లరాదని ఆంక్షలు అమలు జరిపారు. స్వర్గీయ లాల్‌బహదూర్ శాస్త్రి తాను ప్రధానమంత్రిగా ఉండగా రామకృష్ణమిషన్‌కు అక్కడికి సన్యాసులను పంపడానికి అనుమతి ఇచ్చారు, నేడు క్రైస్తవ మిషనరీలకు అక్కడి నుండి ఉద్వాసన చెబుతున్నారు.
ఆదిశంకరులు రెండుసార్లు దేశమంతా పర్యటన చేశారు. నేటి పీఠాధిపతులు, ఆచార్యులు తమ తమ పీఠాలలో కూర్చోవడానికి వీలు లేదు. కేరళలో క్రైస్తవులు 42 శాతం ఉన్నారు. హిందువులు మేలుకొనని పక్షంలో వచ్చే జనాభా లెక్కల నాటికి క్రైస్తవులు అధిక సంఖ్యాకులు కావడం సంభవం.
ఈ స్థితిలో అందరు పీఠాధిపతులను ఒకే వేదికపైకి తేవడానికి, వారి ఆవాహన, ఆదేశం, ఆశీస్సు పొందడానికి, సాధుసన్యాసులు ప్రజల మధ్యకు వెళ్లేటట్లు చేయడానికి పరిషత్ పథకాలు వేస్తోంది. అలా ముందుకు రావడానికి అప్పుడే కొందరు అంగీకరించారు. హిందూ దేవాలయ చట్టం జైన మందిరానికి వర్తించదు, మహంత్‌లకు ప్రభుత్వాధి కారి ఆదేశాలు ఇస్తారు. ఈ పద్ధతి పోవాలి. దేవాలయాలలో చక్కని వ్యవస్థ ఏర్పడాలి.
– ‘జాగృతి’ 25.09.1967