తెలంగాణ రాజకీయ యవనికపై పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా పరిస్థితులు, పాలనాతీరు మారడం లేదన్న విమర్శలు సర్వసాధారణ మైపోయాయి. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ అయినా, పాలనా పగ్గాలు చేపట్టి యేడాది పూర్తి చేసుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆలోచనా తీరులోను మార్పురావడం లేదన్న విశ్లేషణలు చుట్టుముడుతున్నాయి.

సాధారణంగా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకే నిర్ణయాధికారం, పరిణామాలపై బాధ్యత ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. వ్యక్తులు కాకుండా, వ్యవస్థల కేంద్రీకృతంగానే ప్రభుత్వాల పాలన సాగుతుందన్నది ఓ ఆనవాయితీ. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో పార్టీలు, వ్యవస్థలు కాకుండా, వ్యక్తి ప్రాధాన్యంగా పాలన సాగుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటినుంచీ ఇదే పరిస్థితి. రెండుసార్లు బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినప్పటికీ కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేంద్రంగానే పాలన సాగింది. మరో నాయకుడికి అసలు ప్రాధాన్యమే లేదు. ఎవరని లెక్క చేయకుండానే పాలన సాగిందన్నది అందరికీ తెలిసిందే. ఒకరకంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో తెలంగాణలో రాచరిక, నియంతృత్వ పాలన సాగిందన్నది విపక్షాల ఆరోపణలే కాదు… విశ్లేషకులు మాట కూడా. ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి యేడాది గడిచింది. వాస్తవానికి ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుందంటారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. వ్యక్తి కేంద్రంగానే పాలన సాగుతోందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. రేవంత్‌రెడ్డి అంతా తానే అన్నట్లుగా, తన నిర్ణయాలనే అమలు చేస్తున్నారని, మంత్రులకు కూడా అంతగా ప్రాధాన్యం లేదంటున్నారు. అయితే, నిర్ణయాల్లో అయినా ప్రామాణికత పాటించడం లేదన్న విమర్శలున్నాయి.

ఇప్పుడు రాష్ట్రంలో సమకాలీన పరిస్థితులు చూస్తే..సినిమా వాళ్లకు సంబంధించి ప్రభుత్వంతో పంచాయతీ ఏర్పడిరది. పుష్ప-2 సినిమా బెనిఫిట్‌ షోలో తొక్కిసలాటకు సంబంధించి సర్కారు వర్సెస్‌ సినిమా వాళ్లు అన్నంతగా దాదాపు పక్షం రోజుల పాటు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఏకంగా రాష్ట్రంలో బెనిఫిట్‌ షోలు, సినిమా టికెట్ల పెంపు అంశాలపై ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. అలాంటివేవీ ఇకపై తెలంగాణలో ఉండబోవని మంత్రులు ప్రకటించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. చెప్పడమే కాదు.. ఏకంగా అసెంబ్లీలోనే ఈ ప్రకటన చేశారు. చివరకు టాలీవుడ్‌ అంతా వచ్చి ప్రభుత్వ పెద్దలను కలిసిన సమయంలో కూడా రేవంత్‌రెడ్డి ఇదే నిర్ణయం ఫైనల్‌ అని తేల్చి చెప్పే శారు. తెలంగాణలో బెనిఫిట్‌ షోలు, టికెట్ల ధరలు పెంచడాలు ఉండబోవని కుండ బద్దలుకొట్టేశారు. కానీ, ఆ నిర్ణయానికి ఇచ్చిన మాటపై కనీసం పదిహేనురోజులు కూడా ఉండలేకపోయారు. సంక్రాంతి సినిమాల విషయంలో యూటర్న్‌ తీసుకున్నారు.

భారీగా విధాన నిర్ణయాల ప్రకటనలు చేయడం, ఆ తర్వాత కొద్ది రోజులకే వెనకడుగు వేయడం, యూటర్న్‌ తీసుకోవడం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి పరిపాటిగా మారుతూ వస్తోంది. పుష్ప-2 సినిమా విడుదల సమయంలో తొక్కిసలాట జరిగిన అనంతరం ‘ఇకపై తెలంగాణలో బెనిఫిట్‌ షోలు ఉండవు. అదనపు షోలు ఉండవు. టిక్కెట్‌ ధరలు పెంచబోం’ అంటూ రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగ గంభీరంగా ప్రకటించారు. తాను సీఎం సీటులో ఉన్నంత కాలం తెలం గాణలో బెనిఫిట్‌ షోలకు అనుమతివ్వబోమని, టికెట్‌ ధరల పెంపునకు కూడా అనుతివ్వబోమని ్డ అసెంబ్లీ వేదికగా వెల్లడిరచారు. ఆ తర్వాత సినీ పెద్దలతో జరిగిన సమావేశంలో కూడా అదే నిర్ణయాన్ని చెప్పారు. టికెట్‌ రేట్ల పెంపు, బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇచ్చే ప్రస్తే లేదన్నారు. కానీ ఇప్పుడు గేమ్‌ ఛేంజర్‌ విషయంలో మనసు మార్చుకోవడంతో ఈ అంశం కీలకంగా మారింది.

ఇప్పుడు.. రామ్‌చరణ్‌ హీరోగా, దిల్‌రాజు నిర్మించిన ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా బెనిఫిట్‌ షోలకు, అదనపు షోలకు, టిక్కెట్‌ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఏకంగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలకు విలువ లేకుండా అయింది. అంటే.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు రాష్ట్ర ఫిల్మ్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దిల్‌ రాజుకు లొంగిపోయారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

దీంతో సినిమా టికెట్స్‌ విషయంలో రేవంత్‌ రెడ్డి సర్కారుకు వచ్చిన సానుకూల వాతావరణం అంతా ఒక్కసారిగా తుడిచిపెట్టుకు పోయినట్లు అయింది. సినిమా విడుదల అయిన రోజు ఏకంగా ఆరు షో లకు అనుమతి ఇచ్చింది.10వ తేదీ ఉదయం 4 గంటల నుంచి బెనిఫిట్‌షోలు ప్రదర్శించేందుకు, ఆ రోజు 6షోలు, 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చారు. అంతేకాదు, 10వ తేదీన అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.150,సింగిల్‌ స్క్రీన్లలో రూ.100 పెంచుకోవచ్చని, అలాగే, 11వ తేదీనుంచి 19వ తేదీవరకు మల్టీప్లెక్సుల్లో రూ.100, సింగిల్‌ స్క్రీన్లలో రూ.50 టిక్కెట్‌ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది.

దీనిని బట్టి చూస్తే గేమ్‌ ఛేంజర్‌ సినిమాకు అదనపు బెనిఫిట్‌షోలు మాత్రమే లేవు. అది కూడా తొలిరోజు ఒక బెనిఫిట్‌ షో ఉంది. టికెట్ల పెంపు అనుమతి ఉంది. అంటే.. ప్రభుత్వం మాటలకు, చేతలకు అసలు పొంతన లేదన్నది స్పష్ట మవుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు కూడా కేవలం ప్రకటనలు, పొలిటికల్‌ హైప్‌ క్రియేట్‌ చేసేందుకే పరిమితమన్నది తేలిపోయిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్‌ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రేవంత్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన ప్రతిజ్ఞలు, ఇచ్చిన ప్రకటనలు వట్టి బూటకమేనా? అని నెటిజన్లు మండిపడుతున్నారు.

అత్యున్నతమైన అసెంబ్లీకి కూడా గౌరవం లేదా? చట్టసభకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చే విలువ ఇదేనా? అన్న విమర్శలు రాష్ట్రవ్యాప్తంగా వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సరే.. మాట తప్పింది అది కూడా సరే.. మరి.. సంక్రాంతికి విడుదలయ్యే అన్ని సినిమాలకూ ఇది వర్తింపజేయాలి కదా అన్న వాదనలు రేకెత్తుతున్నాయి. మిగతా సినిమాలకు ఇవ్వకుండా కేవలం దిల్‌రాజు సినిమా ఒక్కదానికే ఈ వెసులుబాటు ఇవ్వడం కూడా విమర్శలకు కారణమవు తోంది. దీనివెనుక క్విడ్‌ప్రో కో ఉందన్న ఆరోపణలు విపక్షాల నుంచి వస్తున్నాయి. ఆ సినిమా నిర్మాత దిల్‌రాజు ఎఫ్‌డీసీ చైర్మన్‌గా ఉన్నారని, ఆయనకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం జీవోలు ఇవ్వడం నేరం కాదా? అని సోషల్‌ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఇక, రాష్ట్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై న్యాయస్థానం కూడా మొట్టి కాయ వేసింది. రాజకీయ ప్రకటనలకు ఎలా ఉన్నా.. బెనిఫిట్‌షోలకు అర్థరాత్రి ప్రదర్శనలకు అనుమతులు ఇవ్వడంపై మండిపడిరది. పడుకోవాల్సిన సమయంలో సినిమాలేంటి? అని ప్రశ్నించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత అందరూ పడుకోవాల్సిన సమయంలో రాత్రి రెండు గంటలకు పిల్లలను పేరెంట్స్‌ రోడ్లపైకి ఎలా పంపిస్తారని కోర్టు నిలదీసింది. వాళ్ల స్థానంలో మీరుంటే ఇలాగే చేస్తారా?అని ప్రశ్నించింది.

గేమ్‌ చేంజర్‌ సినిమాకు ఇచ్చిన బెనిఫిట్‌షో అనుమతులపై పునఃసమీక్షించాలని ఆదేశించింది. గేమ్‌ ఛేంజర్‌ సినిమా టికెట్‌ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై పునఃసమీక్షించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏ నిబంధన ప్రకారం టికెట్‌ రేట్లు పెంచారో పేర్కొనలేదని తెలిపింది. రాత్రి పడుకోవాల్సిన టైమ్‌లో సినిమాలేంటని ప్రశ్నించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రాత్రి 11 గంటల తర్వాత థియేటర్లు, పబ్‌లు మూసివేతకు ఆదేశాలిస్తామని హెచ్చరించింది. తెల్లవారు జామున షోలకు అనుమతించరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గేమ్‌ చేంజర్‌ సినిమా అదనపు షోలు, టికెట్‌ ధరలను పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ హైకోర్టులో మూడు పిటిషన్‌లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన న్యాయస్థానం అదనపు షోల పేరుతో ప్రభుత్వం పర్మిషన్‌ ఇవ్వడాన్ని తప్పుబట్టింది. బెనిఫిట్‌ షోలకు ప్రభుత్వం.. పరోక్షంగా పర్మిషన్‌ ఇచ్చిందని ఆక్షేపించింది. ‘‘రాత్రి పడుకోవాల్సిన టైమ్‌?లో సినిమాలు ఏంటి? అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత పిల్లలను రోడ్లపై తిరగడానికి తల్లిదండ్రులు ఎలా అనుమతిస్తారు? 16 ఏండ్లలోపు వారికి అర్ధరాత్రి దాటాక సినిమాలు, పబ్‌ల్లోకి అనుమతించరాదని ఉత్తర్వులివ్వాల్సి ఉంటుంది’’అని న్యాయమూర్తి హెచ్చరించారు.

– సుజాత గోపగోని, 6302164068, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE