‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన

– గన్నవరపు నరసింహమూర్తి

చాలా మంది విద్యార్థుల గమ్యం..జ్ఞానం సముపార్జన కాదు… అమెరికా… డబ్బు సంపాదన… చాలా మంది ఐఐటీ విద్యార్థులు కూడా మైక్రోసాఫ్ట్ ‌లాంటి కంపెనీలో ఉద్యోగాలు సంపాదించి ఆ తర్వాత జీవితాన్ని విలాసాలతో  గడిపేయడం చాలా దురదృష్టకరమైన పరిణామం. 90 శాతం మంది ఐఐటీ విద్యార్థినీ, విద్యార్థులు మనదేశానికి సేవ చేయకుండా అమెరికా సేవలో తరిస్తున్నారు…

ఇవన్నీ చూస్తుంటే ఓ కవి చెప్పినట్లు

‘‘ఎక్కడకెళుతోందీ దేశం

ఏమైపోతోంది?

హిమశైల శిఖరంపైకా

పాతాళకుహరం లోకా?’’ అని…కడుపు తరుక్కుపోతోంది. రాను రాను మనలో దేశభక్తి తగ్గిపోతోంది.

‘‘నా దేశం భగవద్గీత

నా దేశం అగ్నిపునీత సీత

నా దేశం కరుణాంతరంగ

నా దేశం సంస్కార గంగ’’ అన్న దేశభక్తి భావన రానురాను ముఖ్యంగా విద్యార్థులలో తగ్గిపోతోంది. ఐఐటీలు లక్షల రూపాయాలు వ్యయం చేసి తయారుచేస్తున్న మేధావులు అమెరికా కోసం పనిచేయడం దేశద్రోహం కాక ఇంకేమిటి?

ఆలోచనలతో నా మస్తిష్కం వేడెక్కిపోతోంది. ఇటువంటి ఆలోచనలు వస్తే నాలో ఆవేశం పొంగుతుంటుంది. అమెరికా అభివృద్ధి చెందటానికి ఆ దేశం పౌరులు కాకుండా మనదేశం లాంటి ఇతర దేశస్తుల కృషి ఎక్కువని చెప్పవచ్చు. మన కన్నా మూడు రెట్లు వైశాల్యం గల ఆ దేశంలో మన జనాభాలోని మూడవ వంతు మంది మాత్రమే ఉండటం దాని అభివృద్ధికి కారణం అనీ మనవాళ్లు ఎప్పుడు తెలుసుకుంటారు? ఎవరు చెబుతారు వారికి? ప్రపంచీకరణ వల్లే భారతదేశంలో విదేశీ సంస్కృతి వెర్రితలలు వేస్తూ భారతీయతను దూరం చేసిందన్నది నిష్టుర సత్యం. అయినా ఎవ్వరూ కొత్తనీటిని ఆపలేరు… మార్పు సహజం. ప్రపంచం ప్రతీ 20 సంవత్సరాలకూ మారుతుంటుందనీ నేనెక్కడో చదివాను.  ముఖ్యంగా 20 సంత్సరాల నుంచి మనదేశం బాగా మార్పులకు లోనైంది. దానికి కొందరు సెల్‌ఫోన్లనీ, మరికొందరు టీవీలనీ, కంప్యూటర్ల నీ చెబుతుంటారు కానీ ప్రపంచీకరణన్నది వాస్తవం…

 పూర్వం అమ్మాయిలకు పెళ్లవడానికి ఇంటరూ, డిగ్రీ చదివించేవారు. ఇవాళ ఆడపిల్లలను  కంప్యూటర్‌ ఇం‌జనీరింగ్‌ ‌చదివిస్తున్నారు. ఇక మగ పిల్లలైతే కంప్యూటర్స్ ‌తప్ప ఇంకొకటి చదవటం లేదు. 80 శాతం ఇంజనీరింగ్‌ ‌కాలేజీల్లో కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ ‌బ్రాంచిలే ఉంటున్నాయి. సంప్రదాయక సివిల్‌, ‌మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ ‌వంటివి నిరాదరణకు గురవుతున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లోనే ఈ బ్రాంచ్‌లు ఉంటున్నాయి. ఇక బీఏ, బీకామ్‌, ‌బీయస్సీలను ప్రపంచం మరచిపోయింది.

అందుకే నేను సివిల్‌ ఇం‌జనీరింగ్‌ ‌చదువుతున్నానంటే ప్రతీవాళ్లు ముక్కున వేలేసుకున్నవారే.  చాలామంది కంప్యూటర్స్ ‌చదివిన వాళ్లకు  సివిల్‌, ‌మెకానికల్‌ ఉద్యోగాలేమిటో కూడా తెలియవు. ప్రభుత్వ ఉద్యోగాల గురించి అసలు తెలియదు.

రెండు నెలల క్రితం సమీర కనిపించి తాను అమెరికా వెళుతున్నట్లు చెప్పింది. జీఆర్‌ఈలో ఆమె బాగానే స్కోర్‌ ‌చేసింది. నాకు కూడా గేట్‌లో 200 లోపు రాంకు వచ్చింది. ఐఐటీలో ఎమ్‌టెక్‌ ‌సీటు వస్తుంది. నెలరోజుల తరువాత మా పరీక్షలు అయిపోయాయి. ఆఖరి పరీక్షనాడు కాలేజీ వదిలి వస్తుంటే నా కళ్లంట నీళ్లు తిరిగాయి. జ్ఞానం వచ్చిన తరువాత నాలుగు సంవత్సరాల పాటు మనం చదివిన కాలేజీ మన మీద గొప్ప ప్రభావం చూపుతుందనీ మొదట్లో మా లెక్చరర్‌ ‌గారి చెప్పిన మాటలు నిజమనీ ఇప్పుడు అర్థమౌతోంది.

ఇంటర్‌ ‌దాకా చదువు వేరు. అప్పుడు టీన్స్ ‌ప్రభావంలో ఉంటాము, అమ్మాయిలతో సరదాలు, సినిమాలు, షికార్లు… ఇలా సాగుతుంది. కానీ డిగ్రీ మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్‌ ‌వంటి ప్రొఫెషనల్‌ ‌చదువులు విద్యార్థి జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. మెదడుని వికసింప చేస్తాయి. ఆలోచనలను రేకెత్తిస్తాయి. బాధ్యతలను గుర్తుకు తెస్తాయి. మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి.

నేను బయటకు వచ్చేసరికి గేటు దగ్గర సమీర కనిపించింది…

‘‘బీచ్‌ ‌కెళదాం వంశీ! ఈ రోజుతో ఈ కాలేజీకి మనకు రుణం సరి… రేపట్నుంచీ మన దారులు వేరు’’ అంది…

నేను మౌనంగా తలఊపి ఆటోని పిలిచాను… పది నిమిషాల తరువాత బీచ్‌కి చేరాము.

బీచ్‌లో జనాలు పలచగా ఉన్నారు. చాలా మంది అప్పుడే వస్తూ కనిపించారు. ఇద్దరం నడుచుకుంటూ జనాలకు దూరంగా నిర్జన ప్రదేశానికి వెళ్లాం.

అక్కడ సముద్రపు హోరు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. సమీర సముద్రాన్ని చూస్తూ కూర్చుంది. నేను ఆమెను చూస్తున్నాను. సమీర ఇప్పుడు పూర్తి అందాలను సంతరించుకొని హుందాగా కనిపిస్తోంది. నాలుగు సంవత్సరాల క్రితం కాలేజీలో చేరినప్పటి కన్నా ఇప్పుడు  ఆమెలో పరిణితి కనిపిస్తోంది. ముఖంలోని కళని అందం డామినేట్‌ ‌చేస్తోంది.

హోరుగాలికి ఆమె పైట ఎగిరెగిరి పడుతోంది. నుదుటిని ముద్దాడాలనీ ముంగురులు చేస్తున్న ప్రయత్నాన్ని ఆమె చేతులు అడ్డుకుంటూ వమ్ము చేస్తున్నాయి.  మా ఇద్దరి మధ్య  మౌనం రాజ్యం ఏలుతోంది.  రేపట్నుంచీ ఇక్కడికి రాలేమని  ఇద్దరి గుండెల్లోని బాధ ఆ మౌనానికి కారణం కావచ్చు. అదే మెలాంకలీ.  ఎంత త్వరగా చదువైపోతుందా?అనీ ఎదురు మొన్నటి దాకాచూసేవాళ్లం. కానీ పూర్తైన ఈ రోజు  మాత్రం బాధగా ఉంది.

ఇప్పుడు మళ్లీ కాలేజీకి వెళ్లి చదువుకోవాలనిపిస్తోంది. కానీ అది కుదురుతుందా? సమీర ఇసుకలో ఏవో రాస్తోంది. మౌనం కన్నా గొప్ప భాష ఉండదంటారు. ఇప్పుడది నిజం అనిపిస్తోంది. మా ఇద్దరి మధ్య  ఉన్న మౌనాన్ని పారద్రోలాలనీ నేనంత ప్రయత్నిస్తున్నా నోరు మూగదై దాన్ని అడ్డుకుంటోంది.

ఆ సమయంలో ఇంటర్లోని జాన్‌ ‌కీట్స్ ‘‌శీ•వ శీఅ • +తీవమీఱ•అ •తీఅ ’ అనే పద్యంలోని ‘‘హెర్డ్ ‌మెలోడీస్‌ ఆర్‌ ‌స్వీట్‌ ‌బీ బట్‌ ‌దోజ్‌ అన్‌ ‌హెర్డ్ ఆర్‌ ‌సో స్వీటర్‌’’  ‌వాక్యం గుర్తు కొచ్చింది. ‘‘వినిపించని రాగాలే, కనిపించని అందాలే ’’ అనీ దీన్ని తెలుగులో ఎంత అద్భుతంగా రాసాడో కవి.

‘‘సమీరా! ఏమిటాలోచిస్తున్నావు’’ మొత్తానికి మౌనాన్ని జయించి ఆమె నడిగాను…

‘‘లోపల బాధని చెప్పటానికి మాటలు రావటం లేదు. కాలేజీని వదులుతున్నందుకు మనసంతా బాధగా ఉంది. కాలేజీలో ఉన్నన్నాళ్లు దాని విలువ మనకు తెలియలేదు.. ఇప్పుడు తెలిసినా ఉండలేం. వెనక్కి తిరిగి చూస్తే ఎన్నో అనుభూతులు, జ్ఞాపకాలు, ఎలా వీటిని మరచి పోవటం.’’. ఆమె మాట్లాడుతుంటే ఆర్ద్రత వినిపించింది…

‘‘నాకూ అలాగే అనిపిస్తోంది సమీరా! దానికి తోడు నీతో మాట్లాడే అవకాశం కూడా రేపట్నుంచీ ఉండదు. ఇక్కడున్నన్నాళ్లు అప్పుడప్పుడు మాట్లాడుకునే వాళ్లం . మన భావాలను, ఆలోచనలను, అనుభూతులను పంచుకునేవాళ్లం. చెప్పాలంటే నాకు నువ్వు తప్ప  ఇంకెవ్వరూ స్నేహితులు లేరు. అందులోనూ నువ్వు త్వరలో అమెరికా వెళ్లిపోతావన్న ఆలోచన నన్ను బాగా బాధపెడుతోంది..’’

 ‘‘వంశీ! దయచేసి ఆ మాట ఎత్తకు. ఆ ఆలోచన రాగానే నా మస్తిష్కం మొద్దుబారిపోతుంది..’’ అంది సమీర.

ఆమె మాటలు వినీ తలెత్తి చూసేను. ఆమె కళ్లలో  అస్పష్టమైన తడి…

‘‘సమీరా…! కొన్ని చేదు నిజాలను జీర్ణించుకోక తప్పదు. మన కిష్టం లేకపోయినా అవి అబద్దాలు అవవు. నువ్వు అమెరికా వెళతావన్నది కాదనలేని నిజం. కాకపోతే అది జీర్ణించుకోవడానికి సమయం పడుతుంది’’ అన్నాను.

‘‘అంటే నేను అమెరికా వెళ్లిన తరువాత నాతో మాట్లాడటం మానేస్తావా?’’  అడిగింది సమీర.

‘‘మాట్లాడతాను కానీ మీ నాన్నకు గానీ తెలిస్తే మళ్లీ  గొడవ చేస్తాడు… అప్పుడప్పుడు మాట్లాడుతుంటానులే’’ అన్నాను.

‘‘నువ్వు అమెరికా వచ్చి చక్కగా ఏ స్టాను ఫోర్డులోనో ఎమ్మెస్‌ ‌చెయ్యవచ్చు కదా! నువ్వు అక్కడుంటే నాకు కూడా ధైర్యం వస్తుంది. ఆ తరువాత ఇద్దరం చదువు పూర్తైపోగానే ఇండియాకి వచ్చేద్దాం’’ అంది సమీర ఆశగా.

(సశేషం)

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE