ఆ ‌తరువాత సంక్రాంతి వచ్చీ వెళ్లిపోయింది. పూర్వంలా సరదాలేదు. ఏదో వచ్చాము… ఉన్నాము అన్నట్లు గడిచింది… పూర్వం పెద్ద పండగ అంటే ప్రతీ ఇల్లు కళకళలాడేది… ఊరంతా పెళ్లి వాతావరణం ఉండేది…. పేకాటలు, ఏట్లో స్నానాలు, భోగి మంటలు, ఆటలు, పిండి వంటలు ఇలా ఆనందంగా గడిచేది. పండుగ తరువాత ఊరు విడిచి వెళ్ల బుద్ధి అయ్యేది కాదు… హరిదాసులు, గంగిరెద్దుల వాళ్లు, ఇంటి ముందర రథం ముగ్గులు, మంచులో తడిసిన కనకాంబరాలు, చామంతులు… ఇలా ఎన్నో అనుభూతుల్ని సంక్రాంతి మూట కట్టుకొని వచ్చేది… ఇప్పుడవన్నీ ఏవి?

‘‘ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహాలు’’ అనీ శీశ్రీ చెప్పినట్లు ‘‘ఏవి తల్లీ ఆ సంక్రాంతి శోభలు’’ అని అడగాలనిపిస్తోంది..

సంక్రాంతి తరువాత భారమైన గుండెతో కాలేజీకి వెళ్లిపోయాను.

కాలేజీలో రోజులు భారంగా గడుస్తున్నాయి… కానీ రాను రాను నాకు మా సివిల్‌ ఇం‌జనీరింగ్‌ అం‌టే ఇష్టం ఏర్పడసాగింది. థాంక్స్ ‌టు మై లెక్చరర్స్… ‌వాళ్లు  ఎంతో విజ్ఞానదాయకంగా ప్రతీ పాఠాన్ని బోధిస్తున్నారు. ఆ విధంగా, రెండు సంవత్సరాలు  ఆడుతూ పాడుతూ గడిచిపోయాయి. రెండవ సంవత్సరంలో మాకు ఆటో కేడ్‌ ‌డ్రాయింగ్‌ ‌చెప్పారు. పూర్వం సివిల్‌ ఇం‌జనీరింగ్‌ ‌డ్రాయింగులను పెద్ద పెద్ద డ్రాయింగ్‌ ‌పేపర్లపై సెట్‌ ‌స్వేర్స్, ‌టీ స్కేర్స్, ‌స్కేళ్లు, పెన్సిళ్లతో గీసేవాళ్లు… ఇప్పుడవన్నీ అదృశ్యమై పోయాయి… అంతా ఇప్పుడు కంప్యూటర్‌లోనే గీసేస్తున్నాము… పూర్తైన తరువాత ప్రింట్లు తీసుకోవాలి.

ఈ విషయంలో మా ఫ్రొఫెసర్‌ ‌గారు ఒక మంచి విషయాన్ని చెప్పారు. ‘‘మనిషికి, సమాజానికి పనికిరానిది, అవసరం లేనిదేదైనా అది అదృశ్యమై పోతుంది’’ అనీ డార్విన్‌ ‌చెప్పాడు.ఒకప్పుడు రేడియోలు… ఇప్పుడు లేవు… బ్లాక్‌ అం‌డ్‌ ‌వైట్‌ ‌టీవీలు, లేండ్‌ ‌లైను ఫోన్లు, టైపు మిషన్లు, స్టీమ్‌ ఇం‌జన్లు, ఇంకు పెన్నులు, మూడు చక్రాల రిక్షాలు,పెంకుటిళ్లు, పాత రకం బజాజ్‌ ‌స్కూటర్లు… ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో… కొత్తనీరు వస్తే పాతనీరు పోక తప్పదు… కాలంతో పాటు మార్పులు… మనిషి తనకు అక్కర్లేని వాటిని విసర్జించుకుంటూ పోతాడు.

మార్పులకు అలవాటు పడ్డవాడే ప్రపంచంలో మనగలడు. గతకాలము గొప్పదనీ చెప్పుకోడానికే బాగుంటుంది కానీ అది తిరిగి రాదు.. చకభ్రమణం ఎప్పుడు పురోగామే కానీ తిరోగామి కాదు…

మధ్య మధ్యలో ప్రొఫెసర్లు మంచి వేదాంతం చెప్పేవారు… ఇప్పుడు మనిషి అన్నింటికి కంప్యూటర్స్ ‌మీదే ఆధారపడుతునాడు. సివిల్‌ ఇం‌జనీరింగ్‌ ‌నాలుగు సంవత్సరాలలో మేము సుమారు పాఠ్య పుస్తకాలు చదవవలసి ఉంటుంది. అందులో కాలేజీలో చెప్పేది 30 శాతమే ఉంటుంది. మిగతాది మనం చదువుకోవాలి. దానికీ ఎంతో ఏకాగ్రత అవసరం. చాలా మంది కేవలం పరీక్షలో పాసవడానికి చదువుతారు. దానివల్ల ఏ ఉపయోగం లేదనీ మా హెడ్‌ ‌గారు ఎప్పుడూ చెబుతుండేవారు. ఆయన దేవరకొండ బాలగంగాధర్‌ ‌తిలక్‌ అమృతం కురిసిన రాత్రి లోని ‘‘హిమ శైల శృంగమైన ఎవరెస్ట్ని టెన్సింగు నార్కే ఒక్కడే ఎక్కగలడు’’ అన్న కవితను ఉదహరిస్తుండేవాడు.., ఏదైతేనేం నాలుగు సంవత్సరాల మా ఇంజనీరింగ్‌ ‌చదువు ఇంకో ఆరునెలల్లో పూర్తి కావస్తోంది…

ఈ మధ్యన చదువులో పడి సమీరని కలవటం లేదు.

ఒకరోజు నేను కేంటిన్లో ఉన్నప్పుడు సమీర వచ్చి ‘‘నీకీ విషయం తెలుసా?’’ అనీ అడిగింది.

నేను ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తున్న సమయంలో ‘‘మాధురి ఆరు నెలల క్రితం చదువు మానేసి వాళ్ల వెళ్లిపోయింది. వాళ్ల్ణ నాన్నగారు సడెన్‌గా చనిపోయారు…ఇప్పుడు దానికి వాళ్ల చుట్టాలబ్బాయితో పెళ్లట’’ అని చెప్పింది.

‘‘మాధురి చదువు మానేసిందా? పెళ్లా?! ఆశ్చర్యంగా ఉందే.. మరిన్ని రోజులుగా నాకెందుకు చెప్పలేదు’’ అనీ ఆమెను అడిగాను.

‘‘నాకూ తెలియదు… సడెన్‌గా వాళ్లూరు వెళ్లింది. మళ్లీ మొన్న వచ్చి ఈ విషయాలన్నీ చెప్పింది. తన చదువుకోవడానికి ఆర్ధికంగా ఇబ్బందులున్నయట… అందుకే తప్పక ఈ పెళ్లికి ఒప్పుకుందిట’’ అంది సమీర…

‘‘చాలా బాధాకరమైన విషయం చెప్పేవు. ముఖ్యంగా చదువు అందులో ఆఖరి సంవత్సరం ఇంజనీరింగ్‌ ‌మానివేయడం.ఆమె తప్పు చేసిందేమో ననిపిస్తోంది. నా ఉద్దేశ్యంలో ప్రతీవారికి చదువు అందునా స్త్రీలకు చాలా ముఖ్యం…అది మానేస్తే జీవితంలో చాలా కోల్పోవలసి ఉంటుంది. నువ్వు చెప్పలేదా?’’ అనీ సమీరని అడిగాను.

‘‘అన్నీ అయిపోయిన తరువాత వచ్చీ చెబితే ఏం చెబుతాను… తనకన్నీ తెలుసు.. తప్పక ఈ నిర్ణయం తీసుకుంది’’ అంది…

నేను చాలాసేపు మౌనం దాల్చేను. ఇద్దరికీ కాఫీ చెప్పాను.

కాఫీ తాగుతూ ‘‘నువ్వు జీ ఆర్‌ ఈ ‌రాసావా?’’ అనీ అడిగింది.

‘‘లేదు.. అయినా నేను అమెరికా వెళ్లను  సివిల్స్ ‌రాస్తాను… చూద్దాం? ఏం జరుగుతుందో.. నువ్వు రాస్తునావా?’’ అనీ అడిగాను…

‘‘రాస్తునాను.. మా అన్నయ్య వచ్చి దగ్గరుండి అప్లై చేయించాడు. రాయక తప్పదు’’ అంది…

‘‘ఏదీ చేసినా ఇష్టంగా చెయ్యి… మొక్కుబడిగా చేస్తే వేస్ట్… ‌వెళ్లడం ఇష్టం లేకపోతే ధైర్యంగా ఆ విషయం చెప్పాలి. లేదంటే ఇష్టంగా వెళ్లాలి. అంతేకానీ ఎవరి కోసమో మనం ఏ పనీ చెయ్యకూడదు. అది సరే … మాధురి పెళ్లి ఎప్పుడో ముందుగా చెప్పు … వెళదాం’’ అనీ ఆమెతో చెప్పాను.

ఆమె ‘‘అలాగే’’ అనీ చెప్పి  వెళ్లిపోయింది. మాధురి విషయం విన్నాక ఎందుకో సమీరతో మనస్పూర్తిగా మాట్లాడలేకపోయాను.

ఆమె వెళ్లాక  నేనాలోచనల్లో పడ్డాను…

జీవితం మనం అనుకున్నట్లు వెళ్లదు. అది గాల్లో ఎగిరే పక్షిలాంటిది… ఎప్పుడు ఏ వేటగాడి బాణం తగులుతుందో తెలియదు.ఎన్నో కలలతో ఈ కాలేజీలోకి అడుగు పెట్టింది మాధురి. ఆమె కళ్లలో  ఎప్పుడూ మెరుపు కనిపించేది నాకు. ఏది మాట్లాడినా స్పష్టత ఉండేది. ఏదైనా డబ్బు వల్ల చదువు ఆగిపోవడం అన్నది బాధాకరం.

అయినా ఆమె తొందరపడి అటువంటి నిర్ణయం తీసుకున్నదనిపిస్తోంది నాకు.. లేకపోతే ఏదో పరిష్కారం దొరికి చదువు పూర్తయ్యేది… ఇది మా అమ్మల తరం కాదు… స్త్రీలు అన్నింటా ముందుకు పోతున్న తరం… పోటీ పడుతున్న తరం… ఏదైనా ఆమె పెళ్లిక వెళ్లినపుడు అన్ని విషయాలు మాట్లాడాలి… ఆ ఆలోచన రాగానే నా మనసు కుదుట పడింది.

కాలం త్వరగా పరిగెడుతోంది. మొన్న ఇంజనీరింగ్‌లో చేరినట్లు అనిపిస్తోంది. అప్పుడే నాలుగేళ్లు అయిపోయాయా అనిపిస్తోంది. ఇంక ప్రాజెక్టు వర్క్ ఒక్కటే ఉంది. అది పూర్తయితే చదువు ముగిసినట్లే. మా ఫ్రెండ్స్ ‌చాలా మంది అమెరికా వెళతామనీ, మరికొందరు గేట్‌ ‌రాసి  ఎమ్‌టెక్‌ ‌చేస్తామనీ అంటునారు. నాకైతే సివిల్స్ ‌రాయాలని ఉంది… చూద్దాం… ఏం జరుగుతుందో… గేట్‌లో మంచి రాంక్‌ ‌వస్తే ఐఐటీలో ఎమ్‌టెక్‌ ‌చెయ్యొచ్చు. కాబట్టి గేట్‌కి అప్లై చేసాను. అది ఫిబ్రవరిలో పరీక్ష. ఆ తరువాత సివిల్స్ ‌ప్రిలిమ్స్ ‌రాయాలి… ఇప్పుడు నాకింకో సమస్య… నాన్నగారికి ఒంట్లో బాగుండటం లేదు… ఇంటికి దగ్గరగా ఉండాలి. వ్యవసాయం చూడాలి… అమ్మకి తోడుగా ఉండాలి.. తోడబుట్టిన వాళ్లు లేకపోవడం కూడా సమస్యే…

ప్రాజెక్ట్ ‌వర్క్ ‌పూరైంది. చాలా మంది నా స్నేహితులు ప్రాజెక్టును తాము స్వంతంగా చెయ్యలేక ఒక ఇనిస్టిట్యూట్‌ ‌సహాయం తీసుకున్నారు. వాళ్లు  రకరకాల ప్రాజెక్టులను తయారు చేసి మనకిస్తారు. ప్రొఫెసర్ల చేత అప్రువల్స్ ‌కూడా వాళ్లే చేయిస్తారట… ఆఖరికి చదువు కూడా వ్యాపారమైపోయింది. ఇంక విద్యార్థులేం నేర్చుకుంటారు. ఎలా తమ జ్ఞానాన్ని సమాజానికి ఏం పంచుతారు? నేను మాత్రం స్వంతగా ప్రొఫెసర్‌ ‌గారి సలహాతో పూర్తి చేసి సమర్పించాను. నా ప్రాజెక్టుని చూసి మా ప్రొఫెసర్‌ ‌గారు ఎంతో మెచ్చుకున్నారు… ప్రాజెక్టులు బాగుంటే వాటిని  స్టాన్‌ఫోర్డ్ ‌లాంటి విశ్వ విద్యాలయాల్లో లైబ్రరీలో విద్యార్థుల అధ్యయనం కోసం ఉంచుతారు.వాటిలో చాలా మంది ప్రాజెక్టులు నోబెల్‌ ‌పురస్కారాలందుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ మనదేశంలో చదువులు పూర్తి వ్యాపారం అయిపోయాయి. చాలా మంది ఇంజనీరింగ్‌ ‌విద్యార్థులకు న్యూటన్‌ ‌సూత్రాలు గానీ, ట్రిగోనామెట్రీ, కాలిక్యులస్‌లు తెలియవు. మా ప్రొఫెసర్‌ ‌గారు ఎన్నోసార్లు మా క్లాసులో 500లోపు ర్యాంకు  వచ్చిన విద్యార్థులను వీటిపై ప్రశ్నలు వేసి ఖంగుతిన్న సందర్భాలెన్నో ఉన్నాయి.

(సశేషం)

– గన్నవరపు నరసింహమూర్తి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE