‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన

‘‘‌నేనా? అమెరికానా? కుదరని పని సమీరా? నాన్నకు ఒంట్లో బాగుండటం లేదు. అమ్మ అన్ని పనులు చేసుకోలేదు. ప్రస్తుతం వాళ్లకి  నా అవసరం ఉంది. ఈ దేశంలో ఉంటే 10 గంటల్లో ఇక్కడికి రావచ్చు. అయినా నేను అమెరికా వస్తే మీ నాన్న నిన్ను అమెరికా పంపడు. నాకు దూరంగా చది వించాలనే మీ నాన్న నిన్ను అమెరికా పంపిస్తున్నాడు’ అన్నాను.

నా మాటలకు సమీర మౌనం దాల్చింది… ఇద్దరం నడుచుకుంటూ కెరటాలకు దగ్గరకు వెళ్లాం.కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. పడమటి సంజె ఎర్రటి కిరణాలు సముద్రంపై పడుతూ నుదుటి మీద తిలకం నిలువు బొట్టులా కెరటాల మీద కదులుతూ కనిపిస్తోంది…

సమీర ఒడ్డున నిలబడింది. అలలు ఆమె తెల్లటి కాళ్లను ముద్దాడుతూ వెనక్కి వెళ్లి పోతునాయి…

‘‘ఈ అలలను చూస్తూ ఉంటే నీకేమనిపిస్తోంది సమీరా’’ అని అడిగాను…

‘‘ఎన్ని అపజయాలు ఎదురైనా నిరాశ చెందకుండా విజయం కోసం ప్రయత్నించాలని అలలు చెబుతాయి. ఆ కెరటాలను చూడు. వాటికి అలుపుందా? తీరానికి వస్తూ వెనక్కి వెళ్లిపోతున్నాయి. అయినా వాటిలో అదే ఉత్సాహం…’ ’ అన్నది సమీర.

‘‘నిజం… అలలు తీరాన్ని తాకాలనీ నిరంతరం ప్రయత్నిస్తున్నా వాటి అంతర్ముఖ ప్రయాణం మాత్రం సముద్రగర్భం లోనికే. అలాగే మనం ఏ పని చేసినా మన గమ్యం మాత్రం మనకిష్టమైన వారి దగ్గరకే…’’ అన్నాను…

ఆ తరువాత వెనక్కి వచ్చాము…

‘‘వంశీ! అన్నట్టు మరచిపోయాను… మాధురి పెళ్లి జూలైలో.. నిన్ననే నాకు ఫోన్‌ ‌చేసి చెప్పింది. నిన్ను కూడా పిలుస్తానని చెప్పింది.’’ అంది సమీర.

‘‘మాధురి ఇంక చదవదా? పెళ్లి కొడుకు ఏం చేస్తున్నాడట?’’

‘‘అవన్నీ నేనడగలేదు.పెళ్లికి వెళ్లినపుడు తెలు స్తుందిలే… నువ్వు వస్తావా?’’

‘‘వస్తాను… కానీ జూలై అంటే నువ్వు అమెరికా వెళ్లిపోతావేమో?’’

‘‘నేను వెళ్లేసరికి అక్టోబర్‌ అయిపోతుందేమో… చూడాలి… అదంతా ఓ పెద్ద ప్రహసనం..! ఎప్పుడు ఎలా వెళ్లేది నేను చెబుతాను. నువ్వు డైరెక్టుగా పెళ్లి దగ్గరికి వచ్చెయ్‌. అప్పటికి నా అమెరికా ప్రయాణ వివరాలు కూడా తెలుస్తాయి.’’ అంది సమీర.

‘‘గేటులో నా ర్యాంక్‌కి ఐఐటీలో ఎమ్‌టెక్‌ ‌సీటు వస్తుంది. బహుశా నేను అందులో చేరవచ్చు. అయినా సరే ముందుగా నాకు చెబితే నేను తప్పకుండా వస్తాను.’’ అన్నాను.

ఇద్దరం నడుస్తూ హాస్టల్‌కి బయలుదేరాము…

‘‘వంశీ! రేపెలా మన ఊరు వెళతావు?’’

‘‘ఏముంది బస్సుకో, ట్రైన్‌కో వెళతాను… ఇంకా ఆలోచించలేదు…’’

‘‘రేపు ఉదయం నాన్నగారు నన్ను తీసుకెళ్లడానికి వస్తున్నారు. బహుశా నిన్ను కలవడం కుదరదేమో? ఊళ్లో కలుస్తావా?’’

‘‘కలుస్తాను… పొలానికి వచ్చినపుడు మెసేజ్‌ ‌పెట్టు..  వస్తాను…’’

‘‘హాస్టల్‌ ‌దగ్గర పడుతుంటే నాకు బాధ వేస్తోంది… రేపట్నుంచీ మన స్వేచ్ఛా జీవులం… కానీ ఇక్కడి కాలేజీ వాతావరణం అలవాటై మన ఊరు వెళ్లబుద్ధి కావటం లేదు’’… అంది సమీర…

ఇంతలో హాస్టల్‌ ‌వచ్చేసింది. ఇద్దరం ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకొని హాస్టల్లోకి వెళ్లిపోయాము.

                                                                                                    *  *  *

కాలచక్ర భ్రమణం కొనసాగుతోంది. మా ఆఖరి సంవత్సరం ఫలితాలొచ్చాయి. నాకు 80 శాతం పైగా మార్కులొచ్చాయి. సమీరకు కూడా 70 శాతం పైగా వచ్చాయి. శ్రీరామ్‌, ‌మధులు కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. సమీర అమెరికా వెళ్లే ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. నాకు ఐఐటీలో ఎమ్‌ ‌టెక్‌ ‌సాయిల్‌ ‌మెకానిక్స్ ‌స్పెషలైజేషన్‌లో సీటు వచ్చింది.

ఈ సంవత్సరం నేనే సూరి అనే రైతుని పెట్టి వ్యవసాయం మొదలు పెట్టాను. ట్రాక్టర్‌ ఒకటి కొనీ, రెండు బోర్‌ ‌వెల్స్ ‌తవ్వించాను.

ఒకరోజు నేను పొలంలో ఉన్నప్పుడు సమీర ఫోన్‌ ‌చేసి మాధురి పెళ్లికి   రేపు బయలుదేరుతున్నట్లు చెప్పింది. ఆ మర్నాడు నేను   బయలుదేరాను. మాధురీ వాళ్ల ఊరు వరాహపురం. మా ఊరికి 30 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది.

నేను అక్కడికి వెళ్లేసరికి  సమీర పెళ్లి పందిట్లో కనిపించింది. శ్రీరామ్‌, ‌మధు ఇంకా రాలేదు. ఇంకో రెండు గంటల్లో వస్తారు. సమీరతో పాటు మరికొందరు ఇంజనీరింగ్‌ ‌స్నేహితులు వచ్చారు. మాధురి ఇంట్లో నుంచి బయటకొచ్చీ నన్ను సాదరంగా ఆహ్వానించింది. మా అందరికీ ప్రత్యేకంగా ఒక ఇల్లు ఉండటానికిచ్చారు.

ఆ సాయంత్రం మాధురి మాతో కలసి ఏటికి స్నానానికి వచ్చింది. మా ఊరి ఏరే  వాళ్లది కూడా. మాకు దిగువన ఉంది వాళ్ల  ఊరు…

ఏటి ఒడ్డు నిర్మానుష్యంగా ఉంది. అది మా ఊరి కన్నా చిన్న పల్లె… ఊరు బాగుంది. ఏటి ఒడ్డునే మామిడి తోట… మేము ముగ్గురం ఇసుక దిబ్బ మీద కూర్చున్నాము.. ఏరు నిర్మలంగా, అమాయకంగా పారుతున్నది…

‘‘మాధురీ! ఏమిటిదంతా? నేను నీ పెళ్లి గురించి సమీర చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను తెలుసా? నాన్నగారు పోయారని తెలిసి చాలా బాధపడ్డాను’’ మాధురిని అడిగాను…

‘‘మా నాన్నగారు ఆకస్మాత్తుగా చనిపోవడంతో మా ఇంటి పరిస్థితి తలకిందులైంది. మేమెవ్వరం ఊహించలేదు. నాన్నగారు నా చదువుకోసం, అక్క పెళ్లి కోసం బాగా అప్పు చేసారు. ఆయన చనిపోగానే అన్ని సమస్యలూ ఒకేసారి వచ్చిపడ్డాయి. ఇంట్లో అమ్మ, తమ్ముడు.. తమ్ముడు చిన్నవాడు. నేను చదవాలంటే డబ్బు కావాలి. అప్పటికే  అప్పుల వాళ్లు తొందర పెట్టడం మొదలు పెట్టారు.. అందుకే మాకున్న నాలుగెకరాల పొలం అమ్మేసి బాకీలు తీర్చేసాము. ఆ తరువాత ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టాను.. ఇంతలో నాకు సంబంధం వచ్చింది. వాళ్లు మాకు చుట్టాలవుతారు. పెళ్లికొడుకు వాళ్లది  సాలూరు దగ్గర ఊరు. అక్కడతను టీచరుగా పనిచేస్తున్నాడు. అతనికి మూడేళ్ల క్రితం  పెళ్లి అయింది. కానీ సంవత్సరం క్రితం భార్య చనిపోయింది. పిల్లలు లేరు. వాళ్లొచ్చి అతన్ని పెళ్ళి చేసుకొమ్మని బలవంత పెట్టారు.. మా అమ్మ  బలవంత పెట్టింది. తనను  చేసుకుంటే మా కుటుంబాన్ని ఆదుకుంటాననీ, అండగా ఉంటాననీ ఆయన  చెప్పారు.ఇంక గత్యంతరం లేక ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఇంత కన్నా మంచి సంబంధం తేలేనని మా అమ్మ  చెప్పింది. ఆమె చెప్పింది నాకు సబబుగా తోచింది. అదీకాక ఆడపిల్లను ఎక్కువ కాలం పెళ్లి  చేయ్యకుండా పల్లెటూళ్లలో ఉంచరు..’’అనీ మాధురి జరిగిన విషయాలను చెప్పింది.

సమీర ఆమె చెబుతుంటే ఆసక్తిగా వినసాగింది…

‘‘మరి చదువు ఏం చేస్తావు?’’

‘‘పెళ్లయిన తరువాత పరిస్థితులు అనుకూలిస్తే డిగ్రీ చేస్తాను.’’

‘‘పరిస్థితులు అనుకూలించడమేటి? అవి అనుకూలించినా, అనుకూలించకపోయినా చదువు మానకు. అంత అనుకూలించని పరిస్థితులు ఏముంటాయి చెప్పు? అతను ఉపాధ్యాయుడనీ అంటు న్నావు కాబట్టి నీ చదువుకి అడ్డు చెబుతాడనీ నేననుకోను. డిగ్రీ దూర విద్యా విధానంలో పూర్తి చెయ్యి. ఇంటి దగ్గరే చదువుకొని కేవలం పరీక్షలకే కాలేజీకి వెళ్లాలి. నాకు నీ టెంత్‌, ఇం‌టర్‌ ‌సర్టిఫికెట్లు ఇస్తే నేను  అప్లై  చేస్తాను. పుస్తకాలు వాళ్లే పంపుతారు… ఆ తరువాత బీఈడీ చేస్తే నీ భర్తలా నువ్వు కూడా ఉపాధ్యాయురాలివి కావచ్చు. అదీకాక నువ్వు టీచరువైతే నీ పిల్లలికి చదువు చెప్పే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా చదువన్నది ఒక వ్యాపకం. ప్రపంచం గురించి బాగా తెలుస్తుంది. అలవాటైతే బాగా ఎంజాయ్‌ ‌చేస్తూ చదువుకోవచ్చు. కేవలం ఇంజనీరింగే చదువు కాదు. రకరకాల చదువులు… కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మానొద్దు’’ అనీ చెబుతుంటే మాధురి నా మాటలను ఆసక్తిగా వినసాగింది.

‘‘సమీర! నువ్వేం మాట్లాడటం లేదు’’ అని అడిగాను…

కాలచక్ర భ్రమణం కొనసాగుతోంది. మా ఆఖరి సంవత్సరం ఫలితా లొచ్చాయి. నాకు 80 శాతం పైగా మార్కులొచ్చాయి. సమీరకు కూడా 70 శాతం పైగా వచ్చాయి. శ్రీరామ్‌, ‌మధులు కూడా మంచి మార్కులతో

ఉత్తీర్ణులయ్యారు.

ధారావాహిక నవల

– గన్నవరపు నరసింహమూర్తి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE