ఓం ‌మిత్రాయనమః, ఓం సూర్యాయనమః, ఓం భాస్కరాయ నమః… అంటూ అక్కడ కొందరు బాలురు, యువకులు సూర్య నమస్కారాలు చేస్తున్నారు. అది పాఠశాల ప్రాంగణం. ఆ ప్రక్కనే దేవాలయం, అక్కడ కూడా సూర్య నమస్కారాలు చేస్తున్నారు.

అది తమస్సు పోయి ఉషస్సు వస్తున్న వేళ. సూర్యాగమన సందర్భం. సూర్యునికి నమస్కారాలు.

ఇది సంప్రదాయం. ఇది ఆరోగ్యదాయకం. సూర్య నమస్కారాలు చేసినపుడు శరీరానికి వ్యాయామం కలుగుతుంది. ఉల్లాసం వల్ల శక్తి పుడుతుంది. ఉత్సాహంతో పనిచేసే మానసిక స్థితి ఏర్పడుతుంది.

మానవుడు సౌరశక్తిని తనలోకి ఆహ్వానించడమే సూర్యనమస్కారాల ఉద్దేశం. దీనికి ఒక సంప్రదాయం (రిచువల్‌) ఉం‌ది. అది సంక్రాంతి నుండే సంక్రమించింది.

మకర సంక్రాంతి

సూర్యుడు ద్వాదశ రాశులలో ప్రతి మాసం ఒక రాశిలో ప్రవేశిస్తాడు. ఏ రాశిలో సూర్యుడు ప్రవేశిస్తే ఆ సంక్రాంతి అన్నమాట. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిందే మకర సంక్రాంతి. మిగతా సంక్రాంతులకు లేని ప్రాధాన్యం మకర రాశికే ఉంది. కారణం, వాతావరణంలో వచ్చే మార్పే. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించే వరకు చలిగా ఉన్న వాతావరణం, అప్పటి నుండి వేడిగా మారుతుంది. ప్రకృతిలో తేజస్సు వస్తుంది. ఆ తేజస్సు వ్యక్తిలో కూడా రావాలనే సూర్యోపాసన చేయడం అనే సంప్రదాయం ప్రారంభమయ్యింది.

పురాణ కథలు

  1. భీష్ముడు అంపశయ్యపై ఉత్తరాయణం వరకు ఉన్నాడు. ఉత్తరాయణ ప్రారంభంలో వచ్చే ఏకాదశి నాడే ఆయన పరమాత్మలో కలిసిపోయాడు. ఆ ఏకాదశి సంక్రాంతికి ముందే వస్తుంది. అందువల్ల ఏకాదశి నుండి సంక్రాంతి వరకు నియమ నిష్టలతో ఉంటారు.
  2. అండాళ్‌ : ‌ప్రసిద్ధిగాంచిన పూడికుడుత్త (గోదాదేవి) సంక్రాంతి పండుగనాడే శ్రీరంగనాధుననిలో లీనయ్యింది. అందుకే భోగి, కల్యాణం కనుమ అని మూడురోజులు ఈ పండుగ నిర్వహిస్తారు. జీవాత్మ అయిన గోదాదేవి పరమాత్మ అయిన శ్రీరంగనాధునిలో లీనం కావడం వల్లనే ఈ పండుగ జరుపుకొంటున్నారు.
  3. దేవతలను ఓడించి అమరావతిని బలిచక్రవర్తి ఆక్రయించాడు. శ్రీ మహా విష్ణువు వామనమూర్తియై, బలిని సమీపించి, మూడడుగులు నేల దానంగా గ్రహించి, త్రివిక్రముడై బలిని పాతాళానికి పంపించాడు. ఈ అంశం కూడా సంక్రాంతితో ముడివడింది.
  4. ఇంద్రుడు వ్రేపల్లె మీద రాళ్ల వాన కురిపించాడు. తనకివ్వాల్సిన ఆహుతులు వ్యవసాయదారులు – గోరక్షకులు అయిన ఆనాటి ప్రజలు ఇవ్వని కారణంగా ఇంద్రునికి ఆగ్రహం వచ్చింది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు గోవర్ధన గిరినెత్తి వారినందరిని కాపాడాడు. ఇంద్రుడు శ్రీకృష్ణుడు ముందు మోకరిల్లాడు. ఈ అంశం కూడా సంక్రాంతి పర్వదినానికి కారణమయ్యింది.

చారిత్రకాలు

  1. కొన్ని చారిత్రక కథలు కూడా ఈ పండుగతో ముడివడ్డాయి. కాటమరాజు చెల్లెలైన ‘గోబి’ సంక్రాంతినాడే పరమాత్మునిలో లీనమయింది. ఆమె భగవంతుణ్ణే భర్తగా భావించింది. ఆనాటి నుండి జనం సంక్రాంతి పండుగ సందర్భంగా ఆ గోబీకి గుర్తుగా గొబ్బెమ్మలను పెట్టడం ప్రారంభించి.
  2. గోదాదేవి పురాణ కథే అనిపించినా శ్రీవిల్లిపుత్తూరులో ఆమె జననం, విష్ణుచిత్తుని కూతురై నియమ నిష్ఠలతో జీవించడం, ధనుర్మాసమంతా అనేక వ్రతాలు నిర్వహించి 30 పాశురాల తిరుప్పావై రచించడం, శ్రీరంగనాథునిలో లీనం కావడం ఇదంతా చారిత్రక సంఘటనే. ఈనాటికీ ఆ తల్లి తిరుప్పావై ధనుర్మాసంలో పఠన పాఠనాదుల్లో ఉంది.
  3. స్వామి వివేకానందులు 1863వ సంవత్సరంలో దుందుభి పుష్యబహుళ సప్తమినాడు జన్మించాడు. ఆ రోజు సంక్రాంతి. 63వ సంవత్సరంలో జనవరి 12. అయితే ఆ తర్వాత సంక్రాంతి జనవరి 14 నాడుకు మారింది. సూర్య సంక్రమణంలోని ఈ మార్పు ఇది. వివేకానందస్వామి జయంతి పర్వదినంగా మారడం సహజమే. అది చరిత్రలో నిలిచే ఘట్టమే.

సామాజికాంశాలు

  1. హిందూదేశం వ్యవసాయ ప్రధానమయింది. వర్షాకాలంలో వేసిన పంటలన్నీ ఇంటికి వచ్చే సమయమిది. అందువల్ల సంక్రాంతి పండుగ సంబరాల పండుగయ్యింది.
  2. ఇండ్లు ధాన్యంతో సుసంపన్నంగా ఉన్న కారణాన అల్లుళ్లు, ఆడపడుచులు వస్తారు. చీరెసారె పెడతారు. ఈ కోలాహలమంతా పండుగే అయింది.
  3. ఇంటికి వచ్చిన ధాన్యం (నవధాన్యాలు) నడింటిలో కుప్పలుగా పోసి, మధ్యలో పాలు పొంగించే ఆచారం పూర్వముండేది. ఇప్పుడు కూడా ప్రతి ఇంటిలో ఈ ఆచారం ఉన్నది. అయితే నవధాన్యాలు లాంఛనంగా పిడికెడు పోసి మధ్యలో పాలు పొంగిస్తారు.
  4. గంగిరెద్దులాట, కోళ్ల పందాలు, దున్నపోతుల ఆటలు, బండ్ల పందాలు, ఇంటి ముంగిట నిండా పరచిన ముగ్గులు. ఇవ్వన్నీ సంక్రాంతి సంబరాలే.
  5. పులగం వండడం. ఇంటికి వచ్చినవారి నోరు తీపి చేయడం, నువ్వుల బెల్లం పంచడం – ఇవన్నీ ఇంట్లోనూ ఐదుగురు కలిసినచోట సామాజిక ఉత్సవాల్లోనూ కనిపిస్తాయి.

ప్రాకృతికాంశాలు

ఉహుఁహూఁ అనే విధంగా ఇంత కాలం వణికించిన చలి, మంచు సూర్యుని వేడి కిరణాలు తాకగానే మెల్లమెల్లగా తమ ప్రతాపాన్ని చూపడం మానివేస్తాయి. కాంతి సర్వత్రా విస్తరిస్తుంది.

మబ్బులు తొలగడం, వేడి వేడి వాతావరణం వ్యాపించడం వ్యక్తుల్లో ఉత్సాహాన్ని పెంచుతుంది. ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఈ ఉత్సాహం కూడా పండుగ జరుపుకోడానికి కారణమయింది.

ఇప్పుడు సంక్రాంతి ఎక్కడెక్కడ!?

ఒక పండుగ పుట్టడానికి కారణాలున్నాయి. దాని వెనుక పరమార్థాలున్నాయి. అవన్నీ మనం ఆచరిస్తున్నాం. పదిమందికి చెప్పుకొంటున్నాం.

సం అంటే సమ్యక్‌ అని, క్రాంతి అంటే విప్లవం లేదా, అభ్యుదయమని కదా అర్థాలు. ఇవాళ హిందువు క్రాంతిని ఎలా! ఎప్పుడు! ఎక్కడ! ఎందుకు! సాధించాలన్నదే ప్రశ్న.

  1. భూమి సమస్య: హిందూ ధాత్రికి క్రాంతి లేదు, వికాసం సంగతి దేవుడెరుగు. రోజురోజుకు కబ్జాలు పెరుగుతున్నాయి. మన సముద్రాన్ని, మన నేలను విస్తరణ వాదంతో చొచ్చుకువచ్చే విదేశీ శక్తులు ఆక్రమిస్తున్నాయి. కాబట్టి ఈ హిందువుల జన్మభూమికి అభ్యుదయం జరగాలి. ఇంతవరకు ఏయే భూములు ఎక్కడెక్కడ ఎవరెవరు ఆక్రమించారో ఆ భూములను ఈ దేశం తనవిగా చేసుకోవాలి. అప్పుడే క్రాంతి- సంక్రాంతి.
  2. జనాభా సమస్య : జనం పెరగడం క్రాంతి. కాని ఈ దేశంలో హిందువులు పెరగడంలేదు. ఇతర విదేశీ మతాలవారి సంఖ్య పెరుగుతున్నది. జననాల రేటులోనూ వారే ఎక్కువగా ఉన్నారు. హిందువు కుటుంబ నియంత్రణ పాటిస్తున్నాడు. వారెవరు పాటించడం లేదు. హిందువులను వారు మతాంతరీకరణ చేస్తున్నారు. వారి జనాభాను అలా పెంచు కొంటున్నారు. హిందువుల సంఖ్య తగ్గకూడదు, పెరగాలి. అప్పుడే సంక్రాంతి మరి.
  3. చొరబాటు సమస్య: భూభాగం గుండా, సముద్రాల గుండా, ఆకాశం గుండా ఈ దేశంలోకి ఆక్రమంగా ఎందరో విదేశీయులు ప్రవేశిస్తున్నారు. ఇక్కడ స్థిరపడిపోతున్నారు. సరిహద్దుల్లో అయితే ఓటర్ల లిస్టులోకి ఎక్కారు. రేషనుకార్డులు సంపాదించారు. భూములు కొంటున్నారు. ఈ దేశంలోని కొన్ని పార్టీలకు చందాలిచ్చి, డబ్బు కుమ్మరించి అందులోని వ్యక్తులను కొనేసి వారిని తమ సంస్థ మౌత్‌పీస్‌లుగా వాడుకొంటున్నారు. వీరందరిని అరికట్టాలి. వారి వారి దేశాలకు పంపాలి. అప్పుడే దేశంలో క్రాంతి సంక్రాంతి.
  4. విద్యారంగం సమస్య : ప్రభుత్వం నిర్వహించే విద్యారంగం నానాటికి తీసికట్టుగా తయారవుతోంది. ప్రభుత్వంలోని పెద్దలే విదేశీ మిషనరీల విద్యాసంస్థల్ని మెచ్చుకొంటున్నారు. విద్య ద్వారా వారు తమ మత విషాన్ని ఇంజెక్ట్ ‌చేస్తున్నారన్న సంగతి అందరికీ తెలుసు. హిందువుల పాఠశాలలూ ఉన్నాయి. ఆశ్రమ విద్యాలయాలు ఉన్నాయి. అవి హిందుత్వాన్ని గురించి చెప్పవు. పాఠాలు చెబుతాయి అంతే! తమ మత ప్రచారం ద్వారా ఈ దేశంలో తమ అనుయాయులను పెంచాలనుకొన్న మత సామ్రాజ్యవాద దేశాల ఏజెంట్లుగా పనిచేసారు. హిందువుల విద్యాలయాలు కేవలం పొట్టకూటికి నిర్వహించేవిగా తయారు కాకూడదు. ఆదర్శాలు, ఆచరణ రెండు ఉండాలి. ఈ ఆలోచనలతో హిందువులు తమ విద్యాలయాల్లో హిందూ సంస్కారాలకు ప్రాధాన్యమిస్తే సంక్రాంతి సాధ్యమవుతుంది.
  5. సామాజిక సమస్యలు : ఇవి కోకొల్లలు. అంటరానితనం, హెచ్చుతగ్గుల భేదభావం, వరకట్న దురాచారం, జంతుబలి… ఇలా ఎన్నో ఇవన్నీ సామరస్యంగా పరిష్కరించుకొనే ఏర్పాట్లు; అన్నిటికి మించి కలిసికట్టుగా పనిచేయడం ఇదే సంక్రాంతి.

సంక్రాంతివైపుగా పయనం

వ్యక్తి, కుటుంబం, సమాజం, దేశం క్రాంతివైపుగా పయనించాలనే ప్రతి వ్యక్తి క్రియాశీల కార్యకర్త కావాలి. భారతీయమైన భావజాలాన్ని అనుసరించాలి. విదేశీయుల వివిధ విధాల కుట్రల్ని భస్మంచేసి గుణపాఠం నేర్పి, భారతీయతలోని ఔన్నత్యం తెలిపేట్టుగా చేయాలి. తన వృత్తిలో తాను నైపుణ్యాన్ని సంపాదించి, విజయాలు సాధిస్తూనే దేశం మీద దృష్టిపెట్టి నడవాలి. అప్పుడే ఈ దేశంలో నిజమైన సంక్రాంతి నెలకొంటుంది.

– ధర్మవీర

– జాగృతి, జనవరి 11-17, 1999

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE