అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు రోజుల తరబడి ఇరు వైరి వర్గాల మధ్య నెరపిన మధ్యవర్తిత్వం సత్ఫలితాన్ని ఇచ్చింది. కాల్పుల విరమణ మూడు దశలుగా ముందుకు వచ్చింది. ఇజ్రాయెల్ నుంచి అపహరించుకొచ్చి, 471 రోజుల పాటు బందీలుగా చేసుకున్న వారిలో ముగ్గురు యువతులను హమాస్ మిలిటెంట్ల మూక స్థానిక కాలమానం ప్రకారం జనవరి 19న, అంటే ఆదివారం ముందుగా అనుకున్నట్టు ఉదయం ఎనిమిదిన్నరకు బదులుగా మూడు గంటలు ఆలస్యంగా పదకొండున్నర గంటలకు విడిచిపెట్టింది. ఇది జరిగిన దాదాపు ఏడు గంటల తర్వాత తన దగ్గర ఖైదీలుగా ఉన్న 90 మంది పాలస్తీనియులను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. అంతకు కొద్దిరోజుల ముందు కాల్పులు విరమించుకోకుంటే నా విశ్వరూపం చూపిస్తానంటూ రెండోసారి అమెరికా సంయుక్త రాష్ట్రాలకు అధ్యక్షుడైన డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన తీవ్ర హెచ్చరికతో పాటుగా ఈ నెల 20వ తేదీకి ముందు అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ చెప్పుకున్నట్టుగా ఆయన హయాంలో ఇరు వర్గాల మధ్య ఓ ఒప్పందం కుదుర్చుకోవడానికి చేసిన సుదీర్ఘ కాలపు ప్రయత్నాల వల్లనైతేనేమీ, ట్రంప్, బైడెన్‌లలో ఇంతటి ఘనత ఎవరిదైనప్పటికీ అటు ఇజ్రాయెల్‌లోనూ ఇటు గాజాలోనూ పండుగ వాతావరణం నెలకొంది.
అప్పటి దాకా విషాదపు చీకటి అలముకున్న ఇరు ప్రాంతాల ప్రజల ముఖాలు చాలా కాలం తర్వాత సూర్య కిరణం తగిలిన కమలంలా ఆనందంతో విచ్చుకున్నాయి. రహదారులన్నీ పరస్పరం అభినందించుకుంటూ, ఆలింగనం చేసుకునే వారితో నిండిపోయాయి. అప్పటిదాకా ఏ క్షణాన నెత్తిమీదకు ఏ బాంబు వచ్చి పడుతుందో అని బిక్కుబిక్కుమంటూ శరణార్థి శిబిరాల్లో బతుకులు సాగిస్తున్న పాలస్తీని యులు ఇంతకాలపు విధ్వంసంలో ఉందో లేదో తెలియని వారి ఇళ్ల దారి పట్టారు.
ముల్లు గర్రతో పొడిస్తేనే కానీ ఎంతటి కొమ్ములు తిరిగిన ఎనుము ఐనా మాట వినేది.. ముందుకు కదిలేది.. సేద్యాన్ని సుసాధ్యం చేసేది. అలాంటప్పుడు బీడు కూడా బంగారమౌతుంది. అలా కానప్పుడు మూడు కాలాలు పంటలు పండించే మాగాణి కూడా ముళ్ల పొదలును ఒంటి నిండా మొలిపించుకొని మరుభూమౌతుంది. దాదాపు 15 నెలల క్రితం అంటే 2023, అక్టోబరు 7న ఉదయాన్నే ఇజ్రాయెల్‌పైకి మిడతల దండులా విరుచుకుపడింది హమాస్ ముష్కర మూక. నిదుర కళ్లతో ఉలిక్కిపడి లేచిన ఇజ్రాయెల్‌కు ఏం జరుగుతున్నదీ అవగతం చేసుకునేలోగా 1,200 మందిని వారిలో అత్యధికంగా అభం శుభం తెలియని అమాయక పౌరులను పొట్టనపెట్టుకుంది హమాస్. మరో 250 మందిని బందీలుగా అపహరించుకొని పోయింది. నరమేధాన్ని మొదలెట్టింది మదమెక్కిన హమాస్ ముష్కర మూక అయితే అహంకారం కొద్దీ దానికి ఆజ్యం పోసి అగ్గిని మరింత రగిల్చి దాడి మీద దాడితో గాజాను మట్టి దిబ్బలా చేసింది ఇజ్రాయెల్. అప్పట్నుంచి ఇజ్రాయెల్ స్వయంగా చెప్పుకున్నట్టుగా 17,000 మంది హమాస్ మిలిటెంట్లను కలుపుకొని హమాస్ నమ్మబలికినట్టుగా పిల్లలు, మహిళలతో సహా మొత్తంగా 46,000 మంది పాలస్తీనియులు చనిపోయారు. దాదాపు 17 లక్షల మంది పాలస్తీనియులు నిరాశ్రయులైపోయారు. అలా పశ్చిమ ఆసియాలో చోటు చేసుకుంటున్న విపరిణా మాలు అంతర్జాతీయ సమాజానికి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. అదే సమయంలో అభివృద్ధి చెందిన దేశాలైతేనేమీ, అభివృద్ధి చెందుతున్న దేశాలైతేనేమీ వీటితో పాటుగా బీదా బిక్కీ దేశాలైతే నేమీ వాటిలో కొన్ని ఇజ్రాయెల్‌కు అండగా, మరికొన్ని హమాస్‌కు మద్దతుగా నిలిచాయి. అంతకుముందు అంటే అమెరికా లాంటి దేశాలు బతిమాలగా బామాగా నవంబరు 21, 2023,న నాలుగు రోజులపాటు కాల్పుల విరమణకు వైరి వర్గాలు అంగీకరించాయి. ఒప్పందానికి లోబడి ఇజ్రాయెల్ నుంచి బందీలుగా పట్టుకొచ్చిన 250 మందిలో 110 మందిని హమాస్ విడిచిపెట్టింది. అదే సమయంలో తన దగ్గర ఖైదీలుగా ఉన్న 240 మంది పాలస్తీని యులను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. అలా మొదలైన కాల్పుల విరమణ వారం రోజులపాటు కొనసాగింది. అయితే హమాస్ ఉగ్రమూకను మొదలుకంటా కాలరాచేంతవరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు నెతన్యాహూ. 2023, డిసెంబర్ 1, 2023న గాజాపైకి మరోసారి దాడులను మొదలు పెట్టింది ఇజ్రాయెల్.
ఈలోగా గాజాకు సంఘీభావం తెలుపుతూ ఇజ్రాయెల్‌తో కయ్యానికి కాలు దువ్వింది లెబనాన్‌కు చెందిన హెజ్‌బొల్లా ఉగ్రమూక. ఇందుకు దీటుగా లెబనాన్‌పై దాడికి దిగిన ఇజ్రాయెల్ ఒక్క రోజులోనే అంటే సెప్టెంబర్ 23, 2024న లెబనాన్‌లో 550 మందిని మట్టుపెట్టింది. అంతకు కొద్దిరోజుల ముందు అత్యంత నాటకీయంగా పేజర్లు, వాకీటాకీలు పేలిపోయిన ఘటనలో హెజ్‌బొల్లా అగ్రనేత హస్సన్ నస్రల్లా హతమైపోయాడు. వీటన్నింటికి తోడు యెమెన్‌కు చెందిన హౌతీ రెబల్స్ పాలస్తీనియులకు సంఘీభావం తెలుపుతూ, కాల్పుల విరమణకు పట్టు బడుతూ 2023, నవంబర్ నుంచి ఎర్ర సముద్రంలో ఓడలపై దాడులకు తెగబడ్డారు. రెండు నౌకలను ముంచేశారు. ఒకదాన్ని స్వాధీనం చేసుకున్నారు. కనీసం నలుగురు నావికులను చంపేశారు. అలా 100కు పైగా నౌకలపై దాడి చేశారు. వాటిలో ఇజ్రాయెల్‌తో పాటుగా అమెరికా, ఇంగ్లండ్ దేశాలకు చెందిన నౌకలు కూడా ఉన్నాయి. అలాగే ఎర్ర సముద్రం గుండా అమెరికా నుంచి భారత్‌కు వెళుతున్న ఒక వాణిజ్య నౌకకు దగ్గర్లో పేలుడు సంభవించింది. ఇది అంతర్జాతీయ షిప్పింగ్‌పై పెను ప్రభావం చూపింది. హౌతీ రెబల్స్ దాడికి భయపడి నౌకలు రూటు మార్చడంతో నౌకలు ప్రయాణించే దూరంతో పాటు ఖర్చు కూడా పెరిగిపోయింది. ఇదంతా అమెరికా లాంటి దేశాలను చికాకు పరిచింది. మొత్తమ్మీద యుద్ధాన్ని నివారించే దిశగా ఓ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చడంలో సామ, దాన, భేదోపాయలన్నీ ఎందుకూ పనికి రాకుండా పోయాయి. ఇక మిగిలింది దండోపాయమే. ఇలాగేతై లాభం లేదని ములుగర్ర పట్టుకున్నది అమెరికా. తోడుగా ఈజిప్టు, ఖతార్ దేశాలు. ఇజ్రాయెల్, హమాస్ రెంటిని అదుపులో పెట్టకపోతే పశ్చిమాసియా, మధ్య ప్రాచ్యంతో పాటు యావత్ ప్రపంచానికీ నేలా, నింగీ, నీరు ఇలా మూడింటా ముప్పే. ఈలోగా 2024, నవంబర్‌లో అంతర్జాతీయ న్యాయస్థానం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో పాటుగా ఆ దేశపు మాజీ రక్షణ మంత్రి యోవ్ గల్లాంట్ గాజాలో యుద్ధ నేరాలను పాల్పడ్డారనే అభియోగంపై వారిద్దరిపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. కోర్టు తీర్పును గౌరవిస్తామని అనేక దేశాలు చెప్పినప్పటికీ అమెరికా దాన్ని తోసిపుచ్చింది. మరో వైపు గాజాలో కాల్పుల విరమణ కోసం జరుగుతున్న మంతనాల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగంలోని అధికారులతో పాటుగా అధ్యక్షు డిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్‌కు చెందిన అధికారులు కూడా చురుకుగా పాల్గొనసాగారు. ఇదిలా సాగుతుండగా డిసెంబర్ రెండవ తేదీన ట్రంప్ సోషల్ మీడియా చేసిన ఓ హెచ్చరిక అంతటా సంచలనం సృష్టించింది. హమాస్ వర్గాల్లో కలవరం పుట్టించింది. ఇంతకు ట్రంప్ చేసిన హెచ్చరిక ఏమిటంటే.. అమెరికా అధ్యక్షుడిగా తాను అధికార పగ్గాలు చేపట్టేలోగా గాజాలో బందీలను విడుదల చేయని పక్షంలో నరకాన్ని చవిచూస్తారు అని.
ఎట్టకేలకు జనవరి 15న మంతనాలు చేస్తున్న వారు ఒక కాల్పుల విరమణ ఒప్పందానికి చేరుకున్నా రనే వార్త పాలస్తీనా, ఇజ్రాయెల్ పౌరులకు కొత్త ఊపిరి పోసింది. జనవరి 18న కొందరు మంత్రులు వ్యతిరేకించినప్పటికీ సదరు ఒప్పందానికి ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
విడుదలైనా భావోద్వేగాలకు బందీలే..!
మొదటి దశలో భాగంగా విడుదల ఆ ముగ్గురు కన్నవారికి దూరంగా, కనికరం లేని హమాస్ మిలిటెంట్ల కర్కశ నిర్బంధంలో అత్యంత భారంగా 471 రోజులపాటు బందీలుగా ఉన్నారు. మరికాసేపట్లో స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటారనగా ఆ మాత్రం భాగ్యానికి కూడా నోచుకోని విధంగా వారి పేర్ల జాబితాను ఇజ్రాయెల్‌కు అప్పగించడంలో హమాస్ జాప్యం చేసింది. అయినవారిని చేరు కుంటాము కదా అని ఆశపడుతున్న ముగ్గురు యువ తులకు క్షణమొక యుగమైంది. అక్కడ ఇజ్రాయెల్‌లో బందీలుగా విముక్తి పొందిన వారిని మనసారా హత్తుకొని ఆనందబాష్పాలు కురిపించాలని ఎదురు చూస్తున్న వారి కుటుంబ సభ్యులకూ అంతే నిరాశ ఎదురైంది. ఉదయం ఎనిమిదన్నర కాస్త పదకొండున్న ర అయ్యింది. మూడు గంటలు ఆలస్యంగా విడుదల చేస్తున్న ముగ్గురు యువతులు పేర్లను హమాస్ సోషల్ మీడియాలో ఉంచింది. ఆ ముగ్గురు 24 ఏళ్ల రోమి గోనెన్, 28 ఏళ్ల ఎమిలీ డమరి, 31 సంవత్సరాల డొరొన్ స్టెయిన్ బ్రెషెర్. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ వచ్చే ఆరు వారాల్లో విడుదల చేయాల్సిన 33 బందీల్లో ఈ ముగ్గురూ ఉన్నారు. సాయుధులైన హమాస్ మిలిటెంట్లు తోడు రాగా గుమిగూడిన జనం మధ్య రెడ్ క్రాస్ ప్రతినిధు లను ముగ్గురు యువతులు చేరుకున్నారు. అనంతరం ఇజ్రాయెల్‌లో అత్యంత భావోద్వేగ పూరితమైన వాతావరణంలో వారి కుటుంబ సభ్యులను కలుసు కున్నారు. ముందుగా అందరికన్నా వయసులో చిన్నదైన రోమి గోనెన్ విషయానికి వస్తే ఇజ్రాయెల్‌లో క్ఫార్ వెరడిమ్‌లో ఆమె ఉంటోంది. నృత్యమంటే ఆమెకు ఆరో ప్రాణం. అందుకనే 12 ఏళ్ల పాటు నేర్చుకుంది. సొంతంగా నృత్య ప్రదర్శనలు ఇచ్చి, అనతికాలంలోనే నృత్య దర్శకురాలిగా అవత రించింది. అంతలోనే దురదృష్టం వెన్నంటిన ఆ దుర్దినాన నెగెవ్ ఎడారిలో జరుగుతున్న నోవా ఫెస్టివల్‌కు వెళ్లింది. ఫెస్టివల్‌పైకి హమాస్ మిలిటెంట్లు విరుచుకుపడ్డారు. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న రోమీని మిలిటెంట్లు చుట్టుముట్టారు. ఆమెను అపహ రించుకుపోయారు. విడుదలైన తర్వాత రోమి అన్న మొదటి మాట ఆనందంతో నర్తించాలని ఉంది అని.
ఇక వెటర్నరీ నర్సుగా పనిచేస్తున్న డొరోన్ సంగతి మరీ దయనీయమైనది. ఆమెను కిబ్బుట్జ్ క్ఫర్ అజాలో ఆమె ఉంటున్న అపార్ట్‌మెంటు నుంచి హమాస్ మిలిటెంట్లు అపహరించారు. మిలిటెంట్ల రాకను పసిగట్టిన ఆమె వాట్సప్ ద్వారా కుటుంబ సభ్యులను, స్నేహితులను కాంటాక్ట్ చేసింది. వాళ్లు నన్ను పట్టుకున్నారు అంటూ ఆమె పంపించిన వాయిస్ మెస్సేజ్ ఆమె నుంచి వచ్చిన చివరి మెస్సేజ్. జంతువుల పట్ల డొరోన్ చూపించే ప్రేమ ఆమెను వెటర్నరీ నర్సుగా మార్చింది. విడుదలైన తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకున్న సమయంలో ఆమె పొందిన ఆనందం మాటలకు అందనిది.
బ్రిటిష్ – ఇజ్రాయెల్ జాతీయురాలైన ఎమిలీ డమరీ కూడా డొరోన్ ఉంటున్న ప్రాంతానికి చెందినదే. ఆమెను కూడా హమాస్ మిలిటెంట్లు ఇంట్లో ఉండగా దాడి చేశారు. ఆమె చేతిపైన కాల్చారు. ఆ దాడిలో ఆమె చేతికున్న రెండు వేళ్లు తెగిపోయాయి. ఆదివారం వారి నుంచి విడుదలై నప్పుడు కూడా ఆమె తన అరచేతికి కట్టు కట్టుకొని ఉంది. విడుదలైన తర్వాత తన తల్లిని కలుసుకున్న ప్పుడు ఆనందంతో వస్తున్న కన్నీళ్లను ఎమిలీ ఆపుకోలేకపోయింది. అమ్మను గట్టిగా ఆలింగనం చేసుకుంది. తన సోదరుడితో వీడియో కాల్‌లో మాట్లాడింది. ఇలా విడుదలైన ముగ్గురు యువతులు కూడా తమ విడుదలకు కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
కట్టుబడికి ఏదీ పెట్టుబడి?
ఇజ్రాయెల్ పాలకులకు, హమాస్ మిలిటెంట్లకు మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదరడంతో ఏడాదికి పైగా గాజా స్ట్రిప్‌లో శరణార్థి శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ ఉన్న ప్రజలు ఇక వారి సొంత ఇళ్లకు వెళ్లవచ్చనే మాట అంతటా వినిపిస్తోంది. కానీ 15 నెలల పాటు జరిగిన యుద్ధంలో అన్నిరకాలుగా దెబ్బ తిన్న గాజా, తదితర ప్రాంతాలు మరుభూమిని తలపిస్తున్నాయి. హమాస్ మిలిటెంట్లను నామ రూపాల్లేకుండా చేయడానికి ఇజ్రాయెల్ నేలపై నుంచే కాకుండా గగనతలం నుంచి కూడా జరిపిన భీకరదాడిలో అనేక నగరాలు శిథిలాలతో నిండిపోయిన బీడు భూముల్లా మారిపోయాయి. వరుస బాంబులదాడికి నేలమట్టమైపోయిన భవనాల తాలూకు శకలాలు అన్ని దిక్కులకు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. తాటి చెట్టంత నాగళ్లతో తొవ్వించి నట్టుగా ప్రధాన రహదారులు పెద్ద పెద్ద గుంతలతో నిండిపోయాయి. కీలకమైన తాగునీటి సరఫరా సాక్షాత్తూ భగీరథుడు వచ్చినా కానీ బాగుపడలేనంత దీనావస్థకు చేరుకుంది. ఆస్పత్రుల్లో అనేకం అశువులు బాసి చాలా కాలమైంది. ఇదంతా ఎప్పుడు ఎలా బాగుపడుతుంది అని అడిగితే ఎవ్వరూ బదులివ్వలేని పరిస్థితిలో ఉన్నాయి ఈ నగరాలు. ఉపగ్రహాలు అందించిన సమాచారం మేరకు గాజాలో దాదాపు 69% భవనాలు ధ్వంసమైపోయాయనే ఒక అంచనాకు ఐక్యరాజ్యసమితి – ఐరాస చేరుకుంది. అలా ధ్వంసమైపోయినవాటిలో 2,45,00 పై చిలుకు ఇళ్లు కూడా ఉన్నాయి. యుద్ధం మొదలైన తొలి నాలుగు నెలల్లో ధ్వంసమైపోయిన గాజా 18.5 మిలియన్ డాలర్లు నష్టపోయిందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.
50 మిలియన్ టన్నులకుపైగా శకలాలు గాజాలో పేరుకుపోయాయని ఐరాస పేర్కొంది. కాస్త అటూ ఇటూగా చెప్పాలంటే ఇది గిజా గ్రేట్ పిరమిడ్ సైజుకు పన్నెండింతలు పెద్దగా ఉంటుంది.
100కు పైగా ట్రక్కులు పగలనక రాత్రనక పనిచేసినా కానీ మిలియన్ల టన్నుల కొద్దీ శకలాలను పూర్తిగా లేకుండా చేయడానికి పదిహేనేళ్లు పైనే పడుతుంది. యుద్ధానికి ముందు 23 లక్షల మందికి గూడు లాంటి ఆ చోటులో ప్రస్తుతం కాస్తయినా జాగా లేకుండా పోయింది. అయితే శకలాలను ఎంతో జాగ్రత్తగా తొలగించాలి. ఎందుకంటే వాటిలో పెద్ద మొత్తంలో పేలకుండా మిగిలిపోయిన పేలుడు సామాగ్రి, ఇతర హానికరమైన సామాగ్రితో పాటుగా మానవ అవశేషాలు పోగుపడ్డాయి. వైమానిక దాడుల్లో చనిపోయిన వేలాది ప్రజల మృతదేహాలు భవన శిథిలాల కింద భూస్థాపితమైపోయాయని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. శిథిలాలను తొలగించి ఇళ్లను తిరిగి నిర్మించడానికి బిలియన్ల కొద్దీ డాలర్లు కావాలి. అదే సమయంలో ఇళ్ల నిర్మాణానికి భారీ యంత్రాలను, భవన నిర్మాణ సామాగ్రిని అక్కడికి తరలించాల్సి ఉంటుంది. ఉభయుల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అంటున్నారే కానీ దెబ్బ తిన్న ప్రాంతానికి ప్రభుత్వ ఏర్పాటుపై, పాలకులు ఎవరనే దానిపై అమెరికా నుంచి దోహా దాకా ఏ ఒక్క నేత పెదవి విప్పడం లేదు. గాజాను తిరిగి నిర్మించడానికి దాతల అండ దండలు ఎంతో అవసరం. కానీ ఒక ప్రభుత్వ మంటూ లేని ప్రాంతాన్ని ఆదుకోవడానికి దాతలెవరైనా ముందుకు వస్తారా అంటే ప్రస్తుతానికి చెప్పడం కష్టమే. హమాస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సూచనలు కనుచూపు మేరలో కనిపించడంలేదు. అలాగని హమాస్ అధికారంలో కొనసాగడం ఇజ్రాయెల్‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో గాజాను బాగుచేయ డానికి అవసరమైన పెట్టుబడులు సమకూర్చడానికి అంతర్జాతీయ దాతెలవరూ ముందుకు రారు. ఎందుకంటే ఆ ప్రాంతం గడచిన 20 ఏళ్లలో ఐదు యుద్ధాలను రుచి చూసింది కాబట్టి. ఇలాంటి పరిస్థితుల్లో గాజా పౌరులకు శాశ్వత ఆవాసాలుగా శరణార్థి శిబిరాలు మిగిలిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అదే జరిగినపక్షంలో కాల్పుల విరమణ ఒప్పందానికి ఏ మాత్రం విలువ ఉండదు.
– జాగృతి డెస్క్