అలోక్ కుమార్, వీహెచ్‌పీ జాతీయ అధ్యక్షుడు
వీహెచ్‌పీ జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆంధప్రదేశ్‌లో దేవాలయాల నిర్వహణపై ఆందోళన వెలిబుచ్చారు. ‘‘రాష్ట్రంలోని ప్రతి ఒక్క దేవాలయమూ తన ఆదాయంలో 7% ప్రభుత్వానికి ఇవ్వాల్సిందే. ఆదాయంలో మరో 5% సాముదాయక క్షేమ నిధి – కామన్ గుడ్ ఫండ్‌కు పోతుంది. వీటికి తోడు దేవాలయాలు అధిక పన్నులు, కరెంటు చార్జీలు కట్టాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం అలా హిందూ దేవాలయాల నుంచి మూటగట్టుకున్న రాబడిని లౌకికవాదం ముసుగులో ఇతర సామాజిక వర్గాలకు పంచిపెడుతోంది. హిందువుల వనరులను దోచుకుంటోంది’’ అని మండిపడ్డారు. దేవాలయాల నిర్వహణలో ప్రభుత్వ జోక్యాన్ని ఆయన దుయ్యబట్టారు. దేవాలయానికి సంబంధించిన అన్ని నిర్ణయాలను ధర్మకర్తలకు బదులుగా కార్యనిర్వహణ అధికారులు – ఈవోలు చేపడుతున్నారని అన్నారు. తద్వారా దేవాలయ వ్యవస్థను బలహీనపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాలకు అసలు సిసలు హక్కుదారులైన హిందువులకే వాటి నిర్వహణా బాధ్యతలను అప్పగించాలని అలోక్ కుమార్ డిమాండ్ చేశారు. ‘‘హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనంతో వాటి ఆదాయం దుర్వినియోగ మవుతోంది. ప్రభుత్వాలు చట్టాలు రుద్ది ఆలయాలలో అన్య మతస్తులను ప్రోత్సహిస్తున్నాయి. ఆలయ ఆదాయాలను ధర్మం కోసం వెచ్చించాలి తప్ప రాజకీయ, వ్యక్తిగత అవసరాల కోసం కాదు. ఇతర మతాల ప్రార్థనామందిరాల జోలికి వెళ్లని ప్రభుత్వాలు హిందూ ఆలయాలనే లక్ష్యంగా చేసుకున్నాయి. ఆలయాలకు అనుబంధంగా గోశాలలు, గురుకులాలు ఉండేవి. సాంస్కృతిక కార్యక్రమాలు, పెళ్లిళ్లు జరిగేవి. గ్రామపెద్దలు తీర్పులను న్యాయబద్ధంగా అక్కడే ఇచ్చేవారు. ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం వంటి వాటి నిధులను ఆడిట్, కామన్ గుడ్ ఫండ్ పేరిట తీసుకోవడం ఆక్షేపణీయం. ఆలయాల ఆదాయ వనరులను లౌకికతత్వం ముసుగులో ఇతర వర్గాలకు పంచుతోంది. ఆలయాల నిధుల నుంచి తీసుకుంటున్న 12 శాతాన్ని హిందువుల అవసరాలకే కేటాయించాలి. ఆగమశాస్త్రోక్తంగా పూజా కైంకర్యాలు నిర్వహణ బాధ్యతను బ్రాహ్మణుల తీసుకుంటారా? విశ్వహిందూ పరిషత్ తీసుకుంటుందా లేక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తీసుకుంటుందా అనే వితండవాదం, వింత ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఒకప్పుడు ఆలయాల సంరక్షణ బాధ్యతలను హిందువులే నిర్వహించేవారు. ఆ సంప్రదాయాన్ని పునరుద్ధరించి, అన్ని దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి. దేశంలోనే అతి పెద్ద ఆలయం తిరుమలలో, విశిష్టమైన కంచిపీఠంలో బ్రాహ్మణులే ఉన్నారా? బ్రాహ్మణేతరులు లేరా? హిందూ సమాజమే ఒక యంత్రాంగం (నెట్ వర్క్)గా ఏర్పడి దేవాలయాల సంరక్షణ బాధ్యతను తీసుకోవాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం కల్పించాలి.’’ అని ఆయన పిలుపునిచ్చారు.
ధర్మం పట్ల అవగాహన లేకనే..
మిలింద్ పరాండే, వీహెచ్‌పీ అఖిల భారత సంఘటన కార్యదర్శి
స్వాతంత్య్రానికి పూర్వం విదేశీయలు హస్త•గతం చేసుకుంటే స్వతంత్ర దేశంలో ప్రభుత్వాల పెత్తనం పెరిగిపోయింది అన్నారు వీహెచ్‌పీ అఖిల భారత సంఘటన కార్యదర్శి మిలింద్ పరాండే.‘‘ఆలయాలను తిరిగి హిందూ సమజానికి అప్పగించవలసిందిగా ఆంధప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. ప్రభుత్వ హస్తాల నుంచి దేవాలయాలకు విముక్తి కల్పించాలంటూ హిందువులు చిరకాలంగా చేస్తున్న డిమాండ్‌కు విజయవాడ ఊతమిచ్చిందని అన్నారు. ప్రభుత్వం అజమాయిషీ నుంచి దేవాలయాలను తప్పించాల్సిన విషయాన్ని ప్రస్తావిస్తూ వీహెచ్‌పీ నేతలు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిసినట్టు తెలిపారు. హిందువుల్లో స్వధర్మం పట్ల అవగాహన కొరవడిన కారణంగానే హిందువులపై, దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, దేవాలయాలకు చెందిన ఆస్తులు దోపిడీకి గురువుతున్నాయని, దేవాలయాల నిర్వహణలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. దేవాలయాలకు స్వయంప్రతిపత్తిని తిరిగి సాధించుకోవడానికి హిందువుల్లో ఐక్యత అవసరమని తెలిపారు. విదేశీ సంస్కృతి ప్రభావంతో దేశంలో మాదకద్రవ్యాల వినియోగం, సహజీవనం, వ్‌జీహాద్, కులవివక్ష లాంటి అరాచకాలు పెచ్చరిల్లుతున్నాయి. దేశంలో హిందువుల జనన రేటు తగ్గుతోంది. హిందూ సమాజం ఉంటేనే దేవాలయాలను రక్షించుకొని సంస్కతిని కాపాడుకుంటుంది.’’ అన్నారాయన.