అన్ని రంగాలు వేగంగా అభివృద్ధి చెందడానికి శాస్త్ర సాంకేతికత ప్రధాన పాత్ర పోషిస్తోంది. వాహనాలు, సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు మొదలుకొని గృహోపకరణాల వరకు శాస్త్ర సాంకేతికతను జోడించడం మన జీవితాలలో ఎంతో మార్పు తీసుకువచ్చింది. ఈ మార్పులు శారీరక శ్రమను తగ్గించడం, సమయాన్ని పరిమితం చేయడం, ఖర్చులను తగ్గించడం వంటి ప్రయోజనాలను కూడా అందించాయి. వ్యవసాయం వంటి రంగాలలో కూడా శాస్త్ర సాంకేతికతను జోడించడం ద్వారా సమర్థవంతమైన మార్పులు తీసుకురావడం సాధ్యమవుతోంది. ప్రస్తుతం డ్రోన్ టెక్నాలజీ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకురావడం ప్రారంభించింది. ఇప్పుడు సేద్యంలో డ్రోన్లు పంట, ఆరోగ్యం గురించి, స్థితిగతులను తెలియచేస్తున్నాయి. డ్రోన్లు పారిశ్రామిక రంగాన్ని విప్లవాత్మకం చేసిందన్న ప్రశంసను సాధించింది. అక్కడి పని సంస్కృతిలో గణనీయమైన మార్పు తెచ్చింది. అసాధ్యాలను కూడా సుసాధ్యాలను చేసింది. అయితే వీటి మీద వివాదాలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా వ్యక్తుల ఏకాంతాన్ని భగ్నం చేస్తున్నాయన్న విమర్శ తీవ్రమైనదే. 2021లోనే వీటి వినియోగం మీద చట్టాలు చేశారు.
డ్రోన్‌లను ఫిక్స్‌డ్ వింగ్ డ్రోన్లు, సింగిల్ రోటర్ డ్రోన్లు, ముల్టీ రోటర్ డ్రోన్లు, హైబ్రిడ్ వీటీఓఎల్ డ్రోన్లు అని విభజిస్తారు. ఇంకా ఫోటోగ్రఫీ డ్రోన్లు, బ్రష్‌లెస్ గింబల్ డ్రోన్లు, మిలటరీ డ్రోన్లు, వ్యవసాయ రంగ డ్రోన్లు, బ్రష్‌లెస్ గింబర్ మోటార్లు, బ్రష్‌లెస్ డీసీ మోటార్లు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ డ్రోన్లు, హై టర్క్యు గింబల్ మోటార్స్ కూడా ఉన్నాయి.
వ్యవసాయ రంగంలో డ్రోన్ సాంకేతికతను ప్రవేశపెట్టడం ఉపాధి, ఆదాయ మార్గాలను విస్తృతంగా పెంచింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో. ఇది గ్రామీణ యువతకు నైపుణ్యం పొందే అవకాశాలను అందిస్తుంది. వ్యవసాయ రంగంలో చక్కటి మార్పు తీసుకువస్తోంది. మానవ రహితంగా నడిచే ఈ చిన్నిచిన్న పరికరాలు సెన్సార్ల ద్వారా పనిచేస్తాయి. అంటే నేల మీద నుంచి వీటిని గాలిలో నడిపించవచ్చు. వీటికే కెమేరాలు అమర్చి ఉంటాయి. మనుషులు ప్రవేశించలేని, అధిరోహించ లేని ప్రదేశాలలోకి కూడా వీటిని పంపి అక్కడి పరిస్థితులను, రూపు రేఖలను శాస్త్రవేత్తలు తెలుసుకో గలుగుతున్నారు.
శాస్త్ర సాంకేతిక పురోగతి అభివృద్ధి రేఖ స్వరూపాన్ని అద్భుత రీతిలో మార్చివేసింది. సాంకేతిక పరిజ్ఞానం పురోగతిలో ఎన్నో విశేషమైన మలుపులు ఉన్నాయి. ఇంటర్నెట్ నుంచి ఎలక్ట్రికల్ వాహనాల వరకు ఈ మలుపులు కనిపిస్తాయి. మానవ రహిత గగన వాహనాలు (యూఏవీ అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ లేదా డ్రోన్‌లు) అందులో భాగమే. మన దేశానికి ఇటీవలి కాలంలోనే డ్రోన్లు ప్రవేశించి నప్పటికీ మానవ ప్రమేయం లేకుండా, నిజానికి అవసరం లేకుండా ఒక వాహనం గాలిలో సంచరించడం 1849 నాటి ఒక ప్రయోగం ద్వారా జరిగింది. ఆ పని ఆస్ట్రియా చేసింది. అది కూడా వెనీస్ మీద గాలి గుమ్మటాల ద్వారా బాంబులు వేసింది.
సమీప గతంలో చూస్తే మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికా పైలట్ రహిత విమానాలను రూపొందించింది. వాటినే కెటరింగ్ బగ్స్ అనేవారు. శత్రుదేశాల సరిహద్దుల మీద బాంబులు వేసేందుకు తయారైన టార్పెడోలు ఇవే. గైరోస్కోప్ ద్వారా వీటిని క్రమబద్ధం చేసేవారు. అమెరికా, బ్రిటన్ సైన్యాలు 1930లో రేడియో కంట్రోల్డ్ విమానాలు తయారు చేశారు. ఇవి ఇప్పటి బోయింగ్ అంత ఉండవు. ఇలాంటి డ్రోన్‌లను యుద్ధాలలో సైన్యమే వినియోగిం చేది. 20వ శతాబ్దంలో రేడియో కంట్రోల్డ్ విమానాల ఉపయోగం ఒక హాబీగా మారింది. తరువాత ఇవి విస్తృతంగా ప్రాచర్యం పొందాయి. కానీ 2013లో అమెజాన్ డెలివరీ సంస్థ కారణంగా దీని విస్తృతి, అర్ధం, పరమార్థం కొత్త రూపును సంతరించు కున్నాయి. తాము బట్వాడా చేయవలసిన వస్తువులను డ్రోన్‌ల ద్వారా అందించే ఉద్దేశంతో ఉన్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి డ్రోన్‌ల వాడకం, ప్రయోజనాల పరిధి ఎంతో విస్తరిం చింది. ఇప్పుడు ఒక్క పరిశ్రమలు మాత్రమే కాదు, నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్, ఈ కామర్స్, వ్యవసాయం, ఇంధనరంగం, ఆర్థిక సేవలు, మీడియా, వినోద రంగాలలో వీటి వాడకం ఇతోధికంగా పెరిగింది. పట్టణీకరణ ప్లానింగ్‌లో, నిర్మాణరంగంలో ఇప్పుడు డ్రోన్లు ఎంతో విలువైన పరికరాలుగా అవతరించాయి. క్రాప్ మానిటోరింగ్, భూముల గుర్తింపు, చీడపీడల గుర్తింపు, మందు చల్లడం, సాగు నీటి వాడకం, చలనచిత్ర నిర్మాణం వంటి అంశా లలో డ్రోన్‌ల సేవ కీలకంగా మారింది. మరీ ముఖ్యంగా వ్యవసాయంలో వీటి వినియోగం అనూహ్యంగా విస్తరించింది. కాబట్టి దేశ భద్రతలో ఎంతో కీలకమైన రక్షణ వ్యవస్థ మొదలు సేద్యం వరకు డ్రోన్‌ల వినియోగం నేడు అంచనాకు అందనిదంటే అతిశయోక్తి కాదు. ఇటీవలి సంవత్సరా లలో డ్రోన్‌ల వాడకం బాగా పెరిగింది. బహు ముఖంగా విస్తరించింది.
భారతదేశం అంటే చాలావరకు నాగలితో చేసే సేద్యం కనిపిస్తుంది. అలాంటి రంగంలో డ్రోన్లు ప్రవేశించాయి. భారత్ ప్రపంచంలోనే బలమైన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ. కానీ దేశంలో దిగుబడి మిగిలిన వ్యావసాయక దేశాల స్థాయిలో లేదు. వ్యవసాయోత్పత్తులలో ఇంత పెద్ద వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ బ్రెజిల్, చైనా, అమెరికా వంటి దేశాలతో పోటీ పడలేకపోతున్నది.ఈ నేపథ్యంలో జరిగిన గొప్ప పరిణామం డ్రోన్ల ప్రవేశం. ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ఉపయోగించే 100 డ్రోన్లను ప్రయోగించింది. ఇవన్నీ దేశీయ పరిజ్ఞానంతో చేసినవే. డ్రోన్‌శక్తి పేరుతో 2002లో ఈ పథకం ప్రవేశపెట్టినప్పటికీ ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలోనే ఇది కార్యరూపం దాల్చింది. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి నిరంతరం ప్రయత్నం జరుగుతూనే ఉంది. సర్టిఫికేషన్ పోగ్రాం, డ్రోన్లతో సాగే సేద్యానికి సబ్సిడీలు ఇందులో భాగమే. ఆరు లక్షల గ్రామాల మేపింగ్‌లోను భారత ప్రభుత్వం డ్రోన్ల సాయం తీసుకుంది. కిసాన్ డ్రోన్ల ప్రయోజనం చాలా విశాలమైనది. 5-19 కిలోల సామర్ధ్యం ఉన్న డ్రోన్ ఎకరం భూమిలో కేవలం పావుగంటలో పురుగు మందు చల్లి వస్తుంది. పంటల పాడు కావడం, అసమర్ధ నీటి పారుదల వ్యవస్థ, నేల పటిష్టతకు అవసరమైన చర్యలు లేకపోవడం, విపరీతి నీటి వినియోగం వల్ల చోటు చేసుకుంటున్న జలవనరుల కొరత, పర్యావరణ సమస్యలు దేశంలో రైతులు ఎదుర్కొంటున్నారు. వీటన్నిటికి సమాధానం చెప్పగల సామర్ధ్యం డ్రోన్‌లకు ఉంది. అందుకే వ్యవసాయరంగంలో డ్రోన్‌ల వినియోగం గురించి పరిశీలించాలి.
1. వ్యవసాయ డ్రోన్ల ద్వారా ఉపాధి అవకాశాలు
డ్రోన్ పైలట్ అర్హతలు, ఉద్యోగ అవకాశాలు :
డ్రోన్ నిర్వహణకు కనీసం పదవ తరగతి విద్య, 18 సంవత్సరాలు పూర్తయిన వారు అర్హులు. ఈ రంగంలో మహిళలు, పురుషులు ఇద్దరూ ఉపాధి అవకాశాలు పొందవచ్చు. నివేదికలు తెలిపిన ప్రకారం, భారతదేశంలో సుమారు 24,000 రిజిస్టర్డ్ డ్రోన్ పైలట్లు ఉన్నా, అసలు అవసరం చాలా ఎక్కువగా, లక్షలలో ఉందని వెల్లడైంది. ప్రస్తుతం దేశం మొత్తంలో అన్ని రంగాలలో కలిపి సుమారు 1 లక్ష డ్రోన్‌లు వినియోగంలో ఉన్నాయి, కానీ రాబోయే 2 సంవత్సరాలలో ఈ సంఖ్య 10 లక్షలకు చేరుతుంది.
సర్టిఫైడ్ డ్రోన్ పైలట్లు
డిమాండ్: డ్రోన్ల వినియోగం పెరగడంతో, వాటిని నైపుణ్యంతో నిర్వహించగల సర్టిఫైడ్ పైలట్లకు డిమాండ్ పెరుగుతోంది.అనేక సంస్థలు డ్రోన్ పైలట్ శిక్షణ కోర్సులను అందిస్తున్నాయి. ఆదాయం: సర్టిఫైడ్ డ్రోన్ పైలట్లు నెలకు రూ.20,000 నుండి రూ.50,000 వరకు సంపాదించవచ్చు.
డ్రోన్ టెక్నీషియన్లు
జాబ్: డ్రోన్ల నిర్వహణ, మరమ్మత్తుల బాధ్యత టెక్నీషియన్లది.ప్రాథమిక సాంకేతిక శిక్షణతో ఈ రంగంలో ప్రవేశం సాధ్యం. టెక్నీషియన్లు నెలకు రూ.25,000 నుండి రూ.80,000 వరకు సంపాదించవచ్చు.
స్వయం ఉపాధి (Entrepreneurs)
గ్రామీణ ప్రాంతాల యువత డ్రోన్లలో పెట్టుబడి పెట్టి, వాటిని అద్దెకు ఇచ్చే ద్వారా తమ స్వంత వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు.
ఒక డ్రోన్ కొనడానికి రూ.6 లక్షలు పెట్టుబడి అవుతుంది. రైతు ట్రాక్టరు అద్దెకు నడిపినట్లుగా తన పొలంలో పీచికారి చేసుకొని ఇతరులకు డ్రోన్‌ను అద్దెకు పిచికారి చేయటం ద్వారా రైతులు మంచి ఆదాయం పొందగలుగుతున్నారు. ఎకరా స్ప్రే చేస్తే రూ.500 చార్జ్ చేస్తున్నారు. ఉదాహరణకు, 20 ఎకరాలు పిచికారి చేసినట్లయితే, ఒక రోజు రూ.10,000 ఆదాయం వస్తుంది. నెలకు రూ.3 లక్షలు ఆదాయం వస్తుంది.
నిర్వహణ ఖర్చులు
పైలట్ జీతం : రూ. 25,000.
కో-పైలట్ జీతం : రూ.15,000.
వాహనానికి ఇంధన ఖర్చు నెలకు రూ. 3,000.
ఇతర ఖర్చులు : రూ. 2,000
మొత్తం ఖర్చు : రూ. 45,000.
నికర లాభం: పీక్ సీజన్‌లో నెలకు 2.5 లక్షల వరకు లాభం పొందవచ్చు.
సహాయక ఉద్యోగాలు
డ్రోన్ సేవల వ్యాపారానికి లాజిస్టిక్ కోఆర్డినేటర్లు, డేటా అనలిస్టులు, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్లకు ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.
రైతులకు ఖర్చు తగ్గింపు
సంప్రదాయ పద్ధతుల్లో ఒక ఎకరాకు రూ.700-రూ.900 ఖర్చు అవుతుండగా, డ్రోన్ల వినియోగం ద్వారా ఇది రూ.500కి తగ్గుతుంది.
వ్యవసాయం: సమస్యలు, అవసరాలు
భారతదేశం మొత్తం 70% ప్రజలు వ్యవ సాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే, వ్యవసాయం కూడా అనేక సవాళ్లను ఎదు ర్కొంటోంది. ముఖ్యంగా, కూలీల కొరత, విత్తనాలు, ఎరువుల ధరల పెరుగుదల, మిగతా సౌకర్యాల కొరత వంటి సమస్యలు రైతుల ముందు ఉన్నాయి. ఈ విద్యమైన సమస్యల వల్ల గ్రామాలలోని విధ్యా వంతులైన యువత వ్యవసాయం చేయలేక ఉపాది కోసం నగరాలకు పట్టణాలకు వలస వెళుతున్నారు.
మహిళలకు అవకాశాలు
గతంలో, వ్యవసాయంలో పురుషులు, మహిళలు కలిసి పనిచేసేవారు. ఈ సమానమైన భాగస్వామ్యం వ్యవసాయ కార్యకలాపాల ఆర్థిక క్రమశిక్షణను ప్రేరేపించేది. కానీ, ప్రస్తుతం సాంకేతికత పెరిగిన నేపథ్యంలో, మిషన్ల సహాయంతో పంట వేయడం నుండి కోసే వరకు అనేక కార్యకలాపాలు పురుషుల చేతుల్లోనే ఉన్నాయి. ఈ పరిస్థితి కుటుంబ ఆర్థిక పరిస్థితులను నష్టపోవడం, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు సృష్టించడం అనేదానిని కారణంగా మారుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ మహిళలను వ్యవసాయరంగంలో భాగస్వామిగా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ దిశగా, ‘‘నమో డ్రోన్డీధీ’’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా, 15,000 స్వయం సహాయ బృందాలకు రూ.8 లక్షల ఆర్థిక సహాయం అందించబడుతోంది. ఈ విధంగా, మహిళలు కూడా డ్రోన్ టెక్నాలజీ వాడి వ్యవసాయ రంగంలో సమానంగా భాగస్వామ్యంగా వ్యవహరించ వచ్చు.
డ్రోన్ టెక్నాలజీ ప్రాముఖ్యం
ప్రస్తుతం, డ్రోన్లు వివిధ రంగాలలో ఉపయోగ డుతున్నాయి. వాటి ప్రయోగాలు పర్యవేక్షణ, ఫోటోగ్రఫీ, సర్వే, రక్షణ రంగం, సూర్య ప్యానెల్ క్లీనింగ్, విపత్తుల సమయంలో ఆహారం సరఫరా వంటి అనేక రంగాల్లో విస్తృతంగా పెరిగాయి. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ద్వారా సమయానికి ఎరువుల పిచికారి, విత్తనాలు చల్లడం, నేల పరిస్థితు లను పరిశీలించడం వంటి ముఖ్యమైన పనులు చేపడతారు. ఇది కూలీల కొరతను అధిగ మించడమే కాకుండా, ఖర్చులను కూడా తగ్గిస్తుంది.
వ్యవసాయంలో డ్రోన్ వాడటం వల్ల
ఇతర ప్రయోజనాలు
1. పర్యావరణ పరిరక్షణ: డ్రోన్ పిచికారి ద్వారా ఎరువులు, రసాయనాలను సమర్ధవంతంగా నియంత్రించవచ్చు. దీనితో, పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది.
2. ఉపాధి అవకాశాలు: డ్రోన్ టెక్నాలజీ వ్యవసాయంలో ఉపయోగించే క్రమం, గ్రామీణ యువతకు కొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తుంది. మహిళలు కూడా ఈ రంగంలో తమ సామర్థ్యాన్ని చూపించడానికి వీలు పొందవచ్చు.
3. ఖర్చు తగ్గింపు: డ్రోన్ వాడకం ద్వారా వ్యవసాయం ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. సాంప్రదాయ పద్ధతుల్లో కూలీలకు ఇచ్చే జీతాలపై రైతులకు భారీ ఖర్చులు వస్తుంటాయి, కానీ డ్రోన్ వాడకం ఈ ఖర్చులను తగ్గిస్తుంది.
ప్రభుత్వ సహాయం, పథకాలు
రుణ సౌకర్యం : రైతులు మరియు వ్యవసాయ వ్యాపారాలకు డ్రోన్ల కొనుగోలుకు 6% వడ్డీ రేటుతో ఒక యూనిట్‌కి 10 లక్షల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం AIF
(Agriculture Infrastructure Fund) కింద అన్నీ బ్యాంకులు లోన్ అందిస్తున్నారు.
కస్టమ్ హైరింగ్ సెంటర్స్ (CHCS) :
డ్రోన్లను అద్దెకు ఇచ్చే విధానం ద్వారా అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడుతున్నాయి.
దీర్ఘకాల ప్రయోజనాలు
యువత ఉపాధి: గ్రామీణ యువత సాంకేతిక నైపుణ్యాలు పొందడమే కాకుండా పట్టణాలకు వలస పోకుండా ఉపాధి పొందుతోంది.
వ్యాపార విస్తరణ: డ్రోన్ల ప్రయోజనాలపై అవగాహన పెరిగే కొద్దీ డిమాండ్ పెరుగుతోంది.
పర్యావరణ ప్రయోజనం: సరైన మోతాదులో మందులు వినియోగించడం వల్ల కాలుష్యాన్ని తగ్గించవచ్చు.
ముగింపు
డ్రోన్ టెక్నాలజీ, వ్యవసాయ రంగంలో ఉపయోగించగలిగితే, ఇది రైతులకు ఖర్చులు తగ్గించి, సమయం తగ్గించి, లాభాలు పెంచేలా సహాయ పడుతుంది. అలాగే, ఇది గ్రామీణ క్షేత్రంలో కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించడం ద్వారా గ్రామీణ యువత మరియు మహిళలకు కొత్త మార్గాలు వేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. డ్రోన్ టెక్నాలజీని వ్యాప్తి చేసి, వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించడం ద్వారా భారతదేశంలో వ్యవసాయం మరింత సమర్థవంతమైన, లాభదాయకమైన రంగంగా మారవచ్చు.
గ్రామీణ యువతలో స్వయం ఉపాధి, స్వావలంబన ఏర్పడుతుంది. చాలా పరిశ్రమలు డ్రోన్ల ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నాలు ఆరంభించాయి. ప్రస్తుతం 150 డ్రోన్ స్టార్టప్‌లు ఉన్నాయి. ఈ స్టార్టప్‌లు సేద్యం కోసం డ్రోన్లు తయారు చేసే పనిలో ఉన్నాయి. చెన్నై కేంద్రంగా ఉత్పత్తులు చేసే ఒక స్టార్టప్ 2025 చివరికి సేద్యరంగానికి అనువైన ఆరు లక్షల కిసాన్ డ్రోన్లు తయారు చేయాలన్న సంకల్పంతో సాగుతున్నది. 2030 నాటికి భారత డ్రోన్‌ల మార్కెట్ 2.5 ట్రిలియన్ రూపాయలకు చేరుతుందని అంచనా వేస్తున్నారంటేనే, దీని భవిష్యత్ చిత్రపట్టాన్ని ఊహించ వచ్చు. అదే సంవత్సరం భారత్‌ను ప్రపంచ డ్రోన్ తయారీ కేంద్రంగా చూడవచ్చునని అంటున్నారు. దానికి ఆకాశమే హద్దు.
రమేష్ ఇందూరి
సిఈఓ ఏరియల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్
అగ్రికల్చర్ డ్రోన్ డిస్ట్రిబ్యూటర్, తెలంగాణ
9490548204