‘‌హిందువులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారంతా మన కుటుంబం. వారు ఎక్కడెక్కడ ఉన్నా మన సేవ అందించాలి. మనసులో ఆర్ద్రత ఉన్నవారు విశ్వహిందూ పరిషత్‌లో చేరాలి. ప్రతి గ్రామంలో పరిషత్‌ ‌శాఖలు స్థాపించాలి. 10 మంది హిందువులు ఉన్నచోట విశ్వహిందూ పరిషత్‌ ‌శాఖ స్థాపించాలి’  రాజమహేంద్రవరంలోని హిందూ సమాజం ప్రాంగణంలో సెప్టెంబర్‌ 17, 1967‌న కంచి కామకోటి పీఠాధిపతి, పరమాచార్య చంద్రశేఖరేంద్రస్వామి వారు ఇచ్చిన దీవెనలు ఇవి. ఆ రోజు నిజంగానే చారిత్రిక దినం. విశ్వహిందూ పరిషత్‌ (‌వీహెచ్‌పీ) ఆంధప్రదేశ్‌ ‌శాఖ ఆ రోజే పరమాచార్య వారి చేతుల మీద ప్రారంభమైంది. అవి గోదావరి పుష్కరాల పుణ్యదినాలు.

అవమానాల పాలవుతున్నవారికి, దారిద్య్రంతో కష్టాలు పడుతున్నవారికి సేవ చేయాలన్న ఆర్ద్రత ఉండాలని పరమాచార్య పిలుపునిచ్చి వీహెచ్‌పీ అంతరార్థం గురించి తెలియచేశారు. భిలాయ్‌ ‌లేదా రూర్కేలా వంటి చోట్ల పనిచేసే మనవారి గురించి మనం ఏ విధంగా యోగక్షేమాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తామో అదే విధంగా సింహళం, బర్మా, ఆఫ్రికా వంటి చోట ఉన్న హిందువుల స్థితిగతుల గురించి కూడా తెలుసుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు (జాగృతి, సెప్టెంబర్‌ 25,1967). ‌వీహెచ్‌పీ స్థాపన ధ్యేయం కూడా అదే. వీహెచ్‌పీ ఆది నుంచి అటు సనాతన హిందూ ధర్మరక్షణ, ఇటు ఆపన్నులకు సేవలు అందించడం అనే విధానాలతోనే పనిచేస్తున్నది. అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు మనిషికి ఆధ్యాత్మిక చింతన అందించాలి. కష్టాలలో ఉన్నప్పుడు చేయూతనివ్వాలన్నదే పరిషత్‌ ఆశయం. సంస్థకు మహనీయులు అందించిన సందేశం కూడా ఇదే. పరమాచార్యులవారే కాదు, పరమాచార్య వారసులు జయేంద్ర సరస్వతి స్వామి, నాటి శృంగేరి శారదా పీఠాధిపతులు, పెజావర్‌స్వామి వివిధ సందర్భాలలో ఈ సందేశామృతాన్ని అందిస్తూనే ఉన్నారు. ఇదంతా వీహెచ్‌పీ సైద్ధాంతిక భూమికను పరిచయం చేస్తుంది.

‘ప్రభువులకు, ఉద్యోగులకు సేవ చేయడానికి ఎంతోమంది ఉంటారు. కష్టాలకు, అవమానాలకు గురవుతున్న , దారిద్య్రంతో బాధపడుతున్న ప్రజలకు, దీనలకు సేవ చేయడమే నిజమైన సేవ’ అని పరమాచార్యవారు ప్రారంభసభలోనే చెప్పారు. సేవ చేసే భాగ్యం కూడా మనుషులు అందుకోవాలంటా రాయన. అదే కదా మాధవసేవ!

వీహెచ్‌పీ బాధ్యత ఎంత విస్తృతమో, విశాలమో పరమాచార్యులవారే నవంబర్‌ 26, 1967‌న తెనాలి సభలో అద్భుతంగా వివరించారు (జాగృతి, డిసెంబర్‌ 4, 1967). ‌వీహెచ్‌పీ సన్మానపత్రం అందుకుంటూ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు ఈ మాటలు చెప్పడం గమనార్హం. ‘కుటుంబంలోని ప్రతివారు రాష్ట్రసేవలో పాల్గొనాలి. స్త్రీలు అన్నదానాది విషయా లలో శ్రద్ధ వహించాలి. ఉభయులు ఈశ్వర సేవలో నిమగ్నులు కావాలి. ఇలా వ్యవహరించడంలో దేశ కల్యాణం ఉంది’ అని విశదం చేశారు వారు. వారు ఆనాటి తమ సందేశంలోనే మరొక మహత్తర అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ ‌హిందువులకు సేవ చేసే పని ఇప్పటికే విజయవంతంగా చేస్తున్నది. ఆ సంస్థలో చేరిన వారే కాదు, ప్రజలంతా దేశానికి స్వయంగా సేవ చేయాలని వారు చెప్పారు. దుష్ట స్వభావాల వల్ల, విదేశీయుల వల్ల మనం తెచ్చుకున్న ఆత్మన్యూనత నుంచి, పిరికితనం నుంచి స్త్రీపురుషులు ఇద్దరూ బయటపడాలని పరమాచార్య పిలుపునిచ్చారు. ఇలాంటి స్థితి నుంచి భారతీయులను విముక్తం చేయడం కూడా ఒక సేవగానే వారు పరిగణించారు. ధనవంతులతో పాటు, దేశంలో ఉన్న వారంతా శక్తి మేరకు దానధర్మాలు చేయాలని పిలుపునిచ్చారు. కుటుంబీకులతో పాటు ఒక బయటి వ్యక్తికి భోజనం పెట్టాలని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి, ఆ విధంగా చేయడం వల్ల దారిద్య్రం తగ్గుతుందని తాను అభిప్రాయపడుతున్నట్టు స్వామివారు చెప్పడం వాస్తవికంగానే ఉంది. వంట చేసే సమయంలో స్త్రీలు పిడికెడు బియ్యం ఒక పాత్రలో ఉంచాలని, పసుపు దారం కట్టి పరాశక్తీ! అందరికీ అన్నాన్ని ఇస్తావు అని తలుచుకోవలసిందని స్వామివారు బోధించారు. తరువాత ఆ బియ్యాన్ని నిజంగా కష్టపడుతున్నవారికి దానంగా ఇవ్వాలని చెప్పారు.

నవంబర్‌ 26,1967‌న తెనాలిలోనే జయేంద్ర సరస్వతి ప్రసంగించారు. ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ ఉత్సవంలో పాల్గొన్నారు. ‘అన్ని విషయాలలోను క్షమా గుణం మంచిదే. కాని మన దేశం, మత ధర్మాలు ఆరాధ్యదైవాలు నిందలకు గురి అవుతున్నపుడు క్షమాగుణం తగదు. దానిని నిరోధించగలగాలి. అలాంటి ప్రవృత్తి అత్యంతావశ్యకం’ అని (జాగృతి, డిసెంబర్‌ 12,1967) ‌సుస్పష్టంగానే చెప్పారు. సంఘ సార్వజనికోత్సవంలో ఆయన ఆనాడు చెప్పిన మాట ఇప్పుడు హిందువులకు బోధపడుతున్నదనే అనుకోవాలి. ఇదే కార్యక్రమంలో నగర సంఘచాలక్‌ ‌కోట లక్ష్మీనారాయణశాస్త్రి పలికిన పరిచయ వాక్యాలు కూడా స్మరణీయమైనది. దేశసేవ, భగవంతుని సేవ, మానవసేవలను సమన్వయించి ప్రతివారు తమ మనిషి జన్మను సార్ధకం చేసుకోవాలన్న ధర్మాన్ని ప్రబో ధిస్తున్న జగద్గురు కార్యాన్ని, అదే మార్గాన పయనిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యాన్ని వివరించి, జగద్గురువులకూ, స్వయంసేవకులకూ ఉన్న అనుబంధాన్ని ఆవిష్క రించారు. ‘అందరు కలసి ఉంటేనే ఏ పని అయినా జయప్రదమవుతుంది. అలాంటి సంఘీభావం, ఐకమత్యం అవసరం. మానసికమయిన ఏకత్వాన్ని సాధించినప్పుడే ఇది లభ్యమవుతుంది. పొడి పొడి హృదయాల వల్ల కలిగేది నిష్ప్రయోజనం మాత్రమే’నన్నారు జయేంద్ర.

రెండవ సరసంఘచాలక్‌ ‌పరమ పూజనీయ గురూజీ, తనను తాను పరిషత్‌ ‌ప్రచారకుడను అని ప్రకటించుకున్నారు. కంచి పరమాచార్యులు అంతటివారు వీహెచ్‌పీ విస్తృతి కార్యాన్ని స్వయంగా భుజాలకు ఎత్తుకున్నారు. ఆ మహనీయుడు పరిషత్‌ ‌విస్తరణ కోసం తపించారనే అనిపిస్తుంది. జనవరి 15, 1967న మచిలీపట్నంలో వీహెచ్‌పీ ఆధ్వర్యంలో జరిగిన హిందూ కల్యాణ దినోత్సవం సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం ఇదే చెబుతుంది. బందరు శాఖకు శ్రీకారం చుడుతూ ఆయన అన్నమాటలు విశేషమైనవి. అది పరిషత్‌ ‌చేసుకున్న అదృష్టమనే అనాలి. వారి ఆశీస్సులతోనే గొప్ప కార్యాలను సాధించిందని కూడా చెప్పాలి. ‘హిందూధర్మం ప్రాతిపదికగా హిందూ సమాజాన్ని ఏకం చేసి చైతన్యవంతం చేయడం విశ్వకల్యాణ కారకం. ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరు విశ్వహిందూ పరిషత్‌ ‌సభ్యులుగా చేరండి. మీరు కాక కనీసం మరి 10 మందిని సభ్యులుగా చేయండి’ అని పిలుపునిచ్చారు పరమాచార్య. కార్యక్రమాన్ని పరిషత్‌ ‌ప్రముఖుడు, జాగృతి పూర్వ సంపాదకులు తూములూరి లక్ష్మీనారాయణ నిర్వహించారు. ఒక స్థానిక శాఖను (వీహెచ్‌పీ) జగద్గురువులు ప్రారంభించడం చిరస్మరణీయమని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. పైన చెప్పుకున్నట్టు పరిషత్‌ ‌పటిష్టతకీ, కంచివారి చేయూతకీ ఇదొక ప్రబల నిదర్శనమే.

వీహెచ్‌పీ పని హిందూ ధర్మ పరిరక్షణకే పరిమితం కావడం లేదు. చారిత్రక స్పృహతో భారతీయ సమాజం పతనావస్థకు దారి తీసిన పరిస్థితులకు అనుగుణంగా లక్ష్యాన్ని సాధించడం, మార్పు తీసుకురావడం కూడా సంస్థ ఉద్దేశం. కాం హిందూ సమాజంలోకి చాలా వికృతులను తెచ్చి పెట్టింది. స్వతంత్ర భారతదేశంలో అయినా వాటి నుంచి విముక్తి పొందాలన్న బృహత్‌ ‌ప్రణాళిక కూడా పరిషత్‌ అనుసరిస్తున్నది. ఈ విషయాన్ని నాటి ధర్మ పీఠాల వారు, మఠాధిపతులు చక్కగానే గుర్తించారు. శృంగేరి శారదా పీఠం జగద్గురువు విద్యాతీర్థుల వారి మాటలు పరిశీలిస్తే ఇది అర్ధమవుతుంది (డిసెంబర్‌ 18, 1967). ‌కృష్ణా పుష్కరాల వేళ, డిసెంబర్‌ 11,1967‌న విజయవాడలోని సత్యనారాయణపురంలోని సీతారామ కల్యాణ మంటపంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ సందేశం ఇచ్చారు.

‘హిందూమతం గొప్పతనం తెలియక ఏవో ఆశలకు లోనయి ఇతర మతాలను అనుసరిస్తూన్న వారిని ‘స్వస్థాన మాగచ్ఛాత్‌’ అని తిరిగి మన మతంలోనికి తేవడం అవసరం. దీనికై కృష్ణానది వంటి పుణ్యతీర్థాలలో స్నానం చేయించడం, విభూతి, గోపీచందనం ఇవ్వడం, దేవస్థాన ప్రవేశం చేయించడం- ఇత్యాది చర్యలు చేపట్టాలి. ఇట్టి గొప్ప పనిని విశ్వహిందూ పరిషత్‌ ‌చేపట్టడం ముదావహం’ అన్నారు శృంగేరిస్వామి. పండితులు గిరిజన ప్రాంతాలకు వెళ్లి రామాయణ, భారతాలు చెప్పి, వారిలో ఏర్పడిన అపోహలను తొలగించే కృషి చేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఎప్పటికీ స్మరణీయమైన కొన్ని వాక్యాలు ఆ ఆధ్యాత్మికవేత్త చెప్పడం సమాజ అదృష్టంగానే అనుకోవాలి. ‘ఇతర మతాలు పుట్టింది మొన్న మొన్న. తమ మతంలో చేరని వాళ్లు నరకానికి పోతారని వారి వాదం. అయితే ఈ మతాలు పుట్టకముందు ప్రజలందరూ నరకానికే పోయారా? అప్పుడు ఈశ్వరుడు ఏమి చేస్తున్నాడు? మన తాతముత్తాలు అందరూ నరకానికే పోతే మనకు మాత్రం ఈ స్వర్గం ఎందుకు?’ అని ఆయన ప్రశ్నించారు.

భారతీయుల అనైక్యత ఎన్నో విపరిణామాలకు దారి తీసిందన్నది నిజం. దాదాపు వేయేళ్ల బానిసత్వానికి కారణాలలో ఈ అనైక్యత ప్రధాన కారణం. ఈ తప్పును దిద్దుకోవలసిందే. దానికి ఒక మార్గం ఏమిటి? విశ్వేశ్వర తీర్థ పెజావర్‌ ‌స్వామి చెప్పిన సమాధానం ఏమిటో చూద్దాం. ‘మనకు ఒక సంస్కృతి ఉన్నది. ఆ సంస్కృతిపై నిష్ట ఆధారంగా మనం సమైక్యతను సాధించగలం’ అన్నారు. నవంబర్‌ 21, 1967‌న విశ్వహిందూ పరిషత్‌, ‌రామకృష్ణ సమితి ఆధ్వర్యంలో గుంటూరు హిందూ కళాశాలలోని ఉన్నత పాఠశాల విభాగంలో ఏర్పాటు చేసిన సభలో పెజావర్‌స్వామి ప్రసంగించారు. ప్రఖ్యాత తెలుగు పండితుడు జమ్మలమడక మాధవరామశర్మ అధ్యక్షత వహించారు. సంప్రదాయ భేదాలు, భాషా భేదాలు ప్రజల ఐకమత్యాన్ని భంగపరచవు అన్న గొప్ప వాస్తవాన్ని స్వామివారు వెల్లడించారు (జాగృతి/11.12.1967). పైకి మతాల మధ్య ఐకమత్యం లేనట్లు, భాషా భేదాలు ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ మనమంతా రాష్ట్రీయ ఏకత్వాన్ని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. దీనినే ఈ రోజున భగ్నం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. కాబట్టి మనకు ఒక సంస్కృతి ఉంది, దాని ఆధారంగానే మనం ఐక్యత సాధించగలమని ఆయన గుర్తు చేశారు.

ఖమ్మం జిల్లా వీహెచ్‌పీ శాఖను శ్రీకాళహస్తి శ్రీశుక బ్రహ్మాశ్రమ స్థాపకులు విద్యాప్రకాశానందగిరి స్వాములు (1.1.1968) ప్రారంభించారు. ప్రతి మానవుడు తన ధర్మాలను, విధులను ఆలోచించుకుని వ్యక్తి శీలాన్ని పెంపొందింప చేసుకుంటే సమాజంలో అవసరమైన మార్పు వస్తుంది. విశ్వహిందూ పరిషత్‌ ఇట్టి ఆచరణ శీలురను తయారు చేయాలి అన్నారు. నిజమే ఇది బృహత్తర కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తగిన లౌకిక పారమార్ధిక సత్తా కలిగిన వివేకానందుని వంటి ప్రచారకులను కూడా విశ్వహిందూ పరిషత్‌ ‌తయారు• చేయాలని ఆ సందర్భంగా జరిగిన సభలో విద్యాప్రకాశానందగిరి పిలుపునివ్వడం అపూర్వం (జాగృతి/ 29.1.1968). విశ్వహిందూ పరిషత్‌ ‌వివేకానందులను తయారు చేసే సత్తా కలిగినదని వారు నమ్మారు. పరిషత్‌ ఏర్పడిన తొలినాళ్లలోనే సంస్థ సాధించే ఫలితాల మీద ఆధ్యాత్మిక వేత్తలలో ఎంతటి విశ్వాసం నెలకొని ఉండేదో దీనితో రుజువవుతున్నది.

‘మనలో హిందూత్వం పట్ల నిష్ట, శ్రద్ధాసక్తులు తగ్గినందువల్లనే జాతి నిర్వీర్యమై చైతన్య రహితంగా తయారైంది, జాతిని పునఃచైతన్యవంతం చేయడానికే వీహెచ్‌పీ కృషి చేస్తున్నది’ అని సంస్థ ఆంధప్రాంత అధ్యక్షుడు జటావల్లభుల పురుషోత్తం (జాగృతి/ 6.11.1967) అన్నారు. వీహెచ్‌పీ ప్రథమ కర్తవ్యంగా తీసుకున్న అంశం ఇదే. వీహెచ్‌పీ కర్నూలు శాఖను 8.10.1967న ప్రారంభించారు. పట్టణంలోని పే•టోని రామస్వామి దేవాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇతర మతాల నుంచి మన మతం ఏదీ అప్పు తెచ్చుకోవలసిన అవసరం లేదని సాక్షాత్తు గాంధీజీ చెప్పిన విషయాన్ని ఆరోజు పురుషోత్తం గుర్తు చేశారు.

10.10.1967న ప్రొద్దుటూరు విశ్వహిందూ పరిషత్‌ ‌శాఖ ప్రారంభమైంది.

సెప్టెంబర్‌ 29.30, 1964‌న బొంబాయిలోని స్వామి చిన్మయానంద ఆశ్రమం సాందీపని అకాడెమీలో పరిషత్‌ అం‌కురించింది. గురూజీ సహా ఎందరో మహనీయులు పాల్గొన్న సమావేశమిది. అది జరిగిన మూడు సంవత్సరాల తరువాత తెలుగునేలలో పరిషత్‌ ‌ప్రభవించింది. తొలి అడుగులన్నీ ఆధ్యాత్మిక శిఖరాల ఆశీస్సులతో పడ్డాయి. గోవధ నిషేధం, అయోధ్య ఉద్యమాలలో తెలుగువారు చురుకుగా పాల్గొన్నారు. పరిషత్‌కు తెలుగు ప్రాంతాలలో పునర్‌ ‌వైభవం ప్రాప్తించాలని కోరుకుందాం.


వక్ఫ్ ‌సంస్థలకు ఉన్న సౌకర్యాలు దేవాదాయ సంస్థలకు ఉండాలి

వక్ఫ్‌బోర్డులకు ఉన్న హద్దుల్లేని అధికారాల గురించి హిందూ ధార్మిక సంస్థలలో, మత పెద్దలలో, పీఠాధిపతులలో ఐదారు దశాబ్దాల నుంచి నిరసన కనిపిస్తున్నది. ఇందుకు ఉదాహరణ, శృంగేరి జగద్గురువులు విద్యాతీర్థ స్వామివారు విజయవాడలో ఇచ్చిన పిలుపు.

‘ముస్లిం వక్ఫ్‌బోర్డు సంస్థకు ఉన్న సమస్త సౌకర్యాలు హిందూ ధర్మాదాయ దేవాదాయ సంస్థలకు కూడా ఉండాలి అని విద్యాతీర్థ స్వాములు పిలుపునిచ్చారు.ఆంధప్రదేశ్‌ ‌ధర్మాదాయ సంస్థల సంఘ కార్యదర్శి కె.చంద్రశేఖర గుప్త ద్వారా విడుదల చేసిన ఒక ప్రత్యేక సందేశంలో ఆయన ఈ సూచన చేశారు. పూర్తి పాఠం:

ఆంధప్రదేశ్‌ ‌ధర్మ సంస్థల సంఘము వారు ఎండోమెంట్స్ ‌చట్టం వల్ల ధార్మిక సంస్థలకు కలిగే నష్టాల నివారణకు చేసే ప్రయత్నాలు విని శ్రీశ్రీ జగద్గురు మహాస్వాములవారు సంతోషించారు. ధర్మ సంస్థలపై పన్నులు, ఉద్యోగ భారములు వేశారని శ్రీశ్రీ స్వామివారికి నివేదించారు. ఈ విధంగా చేయడం వల్ల దాతల మనోభీష్టం ప్రకారం జరిగే అవకాశం లేక ఎక్కువ ధనం పన్నులు, ఉద్యోగుల కోసమే వ్యయమవుతుంది.

కేంద్ర ప్రభుత్వం వారు వక్ఫ్ ‌చట్టం ప్రకారం ముస్లిములకు కలుగచేసిన సౌకర్యాలనే, రాష్ట్ర ప్రభుత్వం ధర్మాదాయ సంస్థలకు కలగ చేయడం యుక్తం. ధర్మ సంస్థల, రాష్ట్ర ప్రభుత్వం ధర్మ విధులను ధర్మ కార్యాలకే దాతల మనోభీష్టం ప్రకారం వినియోగించే విధంగా చూడడం శ్రేయస్కరం. ఈ సంఘం వారు ఎండోమెంట్స్ ‌చట్టం వల్ల ధర్మ సంస్థల కష్టనష్టాలను నివారించడానికి చేసే ప్రయత్నాలు సఫలమగుగాక’.

(జాగృతి/ 18.12.1967)


సంక్రాంతి – విశ్వహిందూ కల్యాణదినోత్సవం

విశ్వహిందూ పరిషత్‌ ‌సంక్రాంతిని (మకర సంక్రమణం) విశ్వహిందూ కల్యాణదినంగా ప్రకటించింది. పరిషత్‌ ఆం‌ధప్రాంత కార్యదర్శి తూములూరి లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడించారు. విశ్వహిందూ పరిషత్‌ ‌సమాజమంతటినీ సంఘటితం చేయడానికి జాగృత పరచడానికి స్వీకరించిన కార్యక్రమంలో పండుగల నిర్వహణ ఒకటి. కిందటి సంవత్సరం మద్రాసులో జరిగిన విద్వత్పరిషత్‌లో విజయదశమి, దీపావళి, సంక్రాంతి, వైశాఖి (మేష సంక్రమణం), గురుపూజ (ఆషాఢ పూర్ణిమ), రక్షాబంధన్‌ (‌శ్రావణపూర్ణిమ) పండుగలను అందుకు స్వీకరించాలని ప్రతిపాదించారు. ఇందులో సంక్రాంతిని విశ్వహిందూ కల్యాణ దినంగా ప్రతిపాదించారు. కాబట్టి సంక్రాంతికి అన్ని ప్రాంతాలలో సభలు సమావేశాలు జరిపి నువ్వులు బెల్లం పంచిపెట్టాలని ఆయన సూచించారు (జాగృతి/ 1.1.1968).

ఇదే అంశాన్ని విశ్వహిందూ పరిషత్‌ ‌ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ ఆప్టే కూడా తెలియచేశారు (జాగృతి/ 15.1.1968). సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి మారడం అనే ఖగోళ శాస్త్రం విషయాన్ని ఎప్పుడు ఏ జాతి మొదట కనుగొన్నదన్న అంశం వివాదాస్పదం కావచ్చు. అయితే భూమండలంలోని జీవనానికి ఈ విశిష్టమైన పరిణామానికి ఉన్న ప్రాధాన్యం గుర్తించిన జాతి, పునరుజ్జీవనానికీ, ఆనందోత్సహానికీ, నవ్య ఆకాంక్షలకీ చిహ్నమైన ఒక పర్వదినంగా దానిని స్వీకరించిన జాతి ఒక్క హిందువులే అని ఆప్టే పేర్కొన్నారు.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE