ఆధునిక సంప్రదాయ పద్యకవుల్లో ప్రతిభ, వ్యుత్పన్నత, అభ్యాసం సమపాళ్లలో సముపార్జించుకున్న మహాకవి మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ప్రశంసించినట్లు ‘పాండిత్య స్పోరకమైన కవితాధార, లలిత మాధుర్యమైన కవితా శైలి రెండూ దైవానుగ్రహం వల్ల మధునాపంతుల వారికి సిద్ధించాయనటం’ వాస్తవం. విశ్వనాథ వారి కవితాధార, కృష్ణశాస్త్రి, కరుణశ్రీ వంటి కవుల శైలీలాలిత్యం మధునాపంతుల వారి ఆంధ్ర పురాణంలో కనిపిస్తాయి.
మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి మార్చి 5, 1920 తేదీన యానాం దగ్గర ఐలెండ్ పోలవరంలో మాతామహుల ఇంట జన్మించారు. ఆయన స్వగ్రామం యానాం దగ్గర పల్లెపాలెం. తల్లి లచ్చమాంబ, తండ్రి సత్యనారాయణమూర్తి. ఆంధ్ర పురాణం అవతారికలో తండ్రిని గూర్చి చెపుతూ అనుక్షణం నన్ను తీర్చిదిద్దాలన్న తపనతో తానొక పసివాడై అక్షరాభ్యాసం చేయించాడు. శబ్దమంజరిని బోధిస్తూ తన గొంతు కలిపాడు. తండ్రిగా తానెంతో బాధ్యత తీసుకొని సాహిత్యంతో పాటు ధార్మిక సాహిత్యాన్ని బోధించాడు. పిదప మధునాపంతుల వారి విద్యాభ్యాసం ప్రసిద్ధ గురువైన ఓలేటి వెంకటరామశాస్త్రి వద్ద సాగింది. ఆబాల్య ప్రతిభా వంతుడైన మధునాపంతుల వారి పాండిత్యానికి ముగ్ధుడైన గురువు ఓలేటి వారు ఆశీర్వదిస్తూ…’ అసమానంబగు పాండితీ విభవమార్జించి మాకెల్ల సం/తసము గూర్చుచు సత్కకవీశ్వరత నౌన్నత్యంబునుంగీర్తియున్/వసుధం పెంపు వహింప వర్ధిల్లగదె వత్సా! చిరంజీవివై / పసివానిన్ నినుగూర్చి పెక్కు పలుకన్ భావ్యంబె మా బోంట్లకున్’ అన్నారు. గురువు శిష్యుడిని ప్రశంసించటం సమంజనం కాదన్నది పండితాభిప్రాయం. శిష్యుడి పాండిత్య ప్రతిభకు ముగ్ధుడైన గురువు సత్కవిగా కీర్తిప్రతిష్టలు పొందాలని ఆశీర్వదించారు. భవభూతి ఉత్తర రామచరిత్రలో చెప్పినట్లు ‘రుషితుల్యులైన వారి వాక్కు వెంట అర్ధం పరిగెత్తుతుందట. రుషితుల్యుడైన గురువు ఆశీస్సు అక్షర సత్యమైంది. ఆయన ఆశీర్వ దించినట్లు ఆంధ్రపురాణ మహాకవిగా మధునా పంతుల వారు లబ్దప్రతిష్టులయ్యారు.
ఆంధ్రపురాణ రచనా విశేషాలు: 20వ శతాబ్దిలో అభ్యుదయ హేతువాద భావజాలం విస్తరిస్తున్న స్థితిలో బృహత్ పద్యకావ్యాలకు ఆదరణ ఉండదనే అభిప్రాయం పాఠకుల్లో ఉంది. కానీ గడియారం వేంకటశేష శాస్త్రి వారి శివభారతం, రాజశేఖర శతావధానిగారి రాణాప్రతాప చరిత్ర వంటివి ఆదరణ పొందాయి. మధునాపంతుల వారు ఆంధ్రజాతి చరిత్రను ఆమూలాగ్రంగా బృహ త్కావ్యంగా రచించాలన్న సంకల్పంతో ఆంధ్రజాతి మహేతిహాసంగా 1954లో ఆంధ్ర పురాణం రచించారు.
ఆంధ్రదేశాన్ని పాలించిన రాజవంశాల వారి పేర్లతో ఈ కావ్యాన్ని తొమ్మిది పర్వాలుగా విభజించారు. ఇందులో 1. ఉదయ, 2. సాతవాహన, 3. చాళుక్య, 4. కాకతీయ, 5. పునఃప్రతిష్ట, 6. విద్యానగర, 7. శ్రీకృష్ణదేవరాయ, 8. విజయ, 9. నాయకరాజ పర్వాలుగా వర్గీకరించారు. ఇందులో నన్నయ భారతావతారికను అనుసరించి అవతారిక ప్రవేశపెట్టారు.
మొదటిదైన ఉదయపర్వంలో ఆంధ్రుల ఉదయాన్ని తెలిపే కథాంశం ఉంది. ఇందులో చారిత్రక పూర్వయుగం నాటి హరిశ్చంద్ర కథను ఐతరేయ బ్రాహ్మణం ఆధారంగా రచించారు. హరిశ్చంద్రుడు తన కన్న కొడుకుని యాగ పశువుగా బలిచ్చే సందర్భంలో నవ్వు గాని నవ్వు నవ్వినట్లు రచయిత వర్ణించాడు. ఆధునిక కాలంలో శాస్త్రవిజ్ఞానం ఊహకందనంత వేగంతో పురోగ మిస్తున్నప్పుడు హరిశ్చంద్రుడి వంటి కట్టుకథలు నమ్మి చారిత్రక కావ్యాలు వ్రాయటం సమంజసం కాదని కొందరు విమర్శించారు. మధునాపంతులవారు ఆంధ్రపురాణం అని పేరు పెట్టినా అందులో పురాణ లక్షణాలేవి లేవని స్పష్టంగా చెప్పారు. దీన్నొక చారిత్రక కావ్యంగానే రచించారు. రెండోదైన సాతవాహన పర్వంలో దీపకర్ణి మహారాజు చరిత్రను సవివరంగా వర్ణించాడు. దీపకర్ణి వేటకు వెళ్లినప్పుడు సంతానం లేని ఆయనకు సాతుడనే బాలుడు దొరికాడు. ఆ బిడ్డను తెచ్చుకొని అపురూపంగా పెంచుకున్నాడు. అతనే సాతవాహనుడిగా ప్రసిద్దికెక్కాడు. అతడే హాలుడిగా, శాతవాహునుడిగా, శక పురుషుడిగా ప్రసిదికెక్కాడు. హాలుడు ధాన్యకటకం రాజధానిగా ఎందరో కవులు, కళాకారులను ఆదరించి సత్కరించాడు. ప్రాకృతాన్ని రాజభాషగా చేశాడు. ఆయన రాణీ లీలావతి సంస్కృత భాషా పండితు రాలు. రాణీ సరసంగా ‘మోదకైస్తాడయ’ (నీటితో కొట్టొద్దు) అన్నప్పుడు రాజుగారికి అర్ధం కానందున రాణీ ముందు తలవంచుకోవల్సి వచ్చింది. తన ఆస్థాన పండితులను పిలిచి అతి తక్కువ కాలంలో తనను సంస్కృత భాషావేత్తగా చేయమని కోరాడు. గుణాఢ్యుడు తాను ఆరు సంవత్సరాలలో నిష్ణాతుడిగా చేయగలనన్నాడు. శర్వవర్మ తాను ఆరునెలల్లో చేయగలనన్నాడు. గుణాఢ్యుడు, శర్వవర్మపై కోపంతో నీవు ఆరునెలల్లో చేయగలిగితే ‘నేను దేశభాషను సంస్కృత పాకృత భాషలను వదిలి అరణ్యవాసానికి వెళతానని’ ప్రతిజ్ఞ చేశాడు. శర్వవర్మ కుమారస్వామి అనుగ్రహంతో రాజుని ఆరునెలల్లో సంస్కృత భాషాప్రవీణునిగా తీర్చిదిద్దాడు. గుణాఢ్యుడు తన మాటకు కట్టుబడి తపోదీక్షకు వనవాసానికి వెళ్లాడు. దీక్షాదక్షుడై ‘గాధాసప్తశతి’ ని రచించాడు. తన శిష్యులతో రాజు దగ్గరకు ఆ గ్రంథాన్ని పంపినప్పుడు రాజు దానిని అవమానించాడన్న ఆవేదనతో కావ్య హోమం నిర్వహించి తాళపత్రాలను దగ్ధం చేశాడు. తరువాత రాజు పశ్చాత్తాపంతో గుణాఢ్యుని వేడుకొని దగ్ధమౌతున్న తాళపత్రాలను సేకరించి గాధాసప్తశతిగా కూర్పు చేశాడు. గుణాఢ్యుడు శాంతించక అవమానభారంతో రాజును నిందించి పరమపదాన్ని చేరుకున్నాడు. ఈ ఘట్టాన్ని రచయిత కరుణార్ద్రంగా వర్ణించాడు. మూడోదైన చాళుక్యపర్వంలో రాజరాజనరేంద్రుడు ఆస్థానకవి నన్నయ్యను భారతాంధ్రీకరణకు పూనుకోమ్మని ఆత్మీయంగా స్వర్ణతాంబూలం ఇచ్చాడు. నారాయణభట్టు సహకారంతో నన్నయ్య ఆది, సభా పర్వాలను, అరణ్యపర్వంలో కొంతభాగాన్ని ఆంధ్రీకరించి అర్ధాంతరంగా మరణించాడు. నన్నయ్య మరణంతో రాజరాజు శోకతప్పుడై కుమిలిపోయాడు. ఈ పర్వంలో రాజరాజు వైదికమతాభిమానాన్ని, నన్నయ్య రాజరాజుల అత్మీయ స్నేహానుబంధాన్ని, భారతాంధ్రీకరణలో నారాయణభట్టు ప్రాధాన్యాన్ని, రాజరాజు ఉదాత్తతను, వాఙ్మయ దృష్టిని సముచితంగా కవి వర్ణించాడు.
నాలుగోదైన కాకతీయ పర్వంలో ఓరుగల్లు రాజధానిగా కాకతీయ గణపతిదేవ చక్రవర్తి పాలనావైభవాన్ని గొప్పగా వర్ణించాడు. ఆయన వారసురాలు తెలుగు రాణీ రుద్రమ్మ ధీశక్తిని, ఆమె మనవడు ప్రతాపరుద్రుని రాజనీతిజ్ఞుడిగా, యువరాజుగా తీర్చిదిద్దిన విధానాన్ని కవి ఎంతో ప్రజ్ఞతో వర్ణించాడు. పర్వాలన్నింటిలో ఐదో పర్వంలో రాజవంశాల ప్రస్తావన లేకుండా కవి పునఃప్రతిష్టా పర్వంగా పేర్కొన్నాడు. ఇందులో ముసునూరి ప్రోలయ, కాపయ నాయకులతో పాటు రెడ్డి రాజుల చరిత్రను ఈ పర్వంలో వర్ణించాడు. కాకతీయుల అనంతరం సనాతనధర్మ ప్రతిష్టాపనకు కృషి చేసిన రాజులను గూర్చి ఇందులో ప్రస్తావించినందున ఈ పర్వానికి పునఃపతిష్టాపర్వం అనే పేరు ఔచిత్యంగా ఉంది. ఇందులో ఆంధ్రసాహిత్య చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కోదగిన విద్యానగర రాజవంశ చరిత్రను విద్యానగర, శ్రీకృష్ణదేవరాయ, విజయ పర్వాలు మూడింటిలో సవివరంగా చర్చించారు. ఈ పర్వాల్లో శ్రీనాథుడు ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడడిండిమ భట్టును ఓడించి కనకాభిషేక సత్కారాన్ని స్వీకరించటాన్ని సముచితంగా వర్ణించాడు. శ్రీకృష్ణదేవరాయలవారి సువిశాల సామ్రాజ్యవైభవాన్ని, భువనవిజయ సభలో అష్టదిగ్గజ కవులను ఆదరించి పోషించిన తీరును మనోజ్ఞంగా వర్ణించాడు. చివరిదైన నాయక రాజపర్వంలో 17వ శతాబ్దిలో విజయ నగరరాజ్యంలో లెస్సగా విరిసిపండిన ఆంధ్రవైభవం, నాయక రాజుల పాలనలో వెల్లివిరిసింది. తంజావూరులో రఘునాథనాయకుడు, విజయ రాఘవనాయకుడు శత్రువులను గెలిచి సామ్రాజ్యాన్ని విస్తరించుకొన్నారు. గర్వంతో విర్రవీగిన మధుర మహారాజును పరిహసిస్తూ ‘వీరెవరయ్యా! మధుర మహారాజులే/ ఇట్లు కృపణులై పట్టువడన్ వీరికి వలసెనే’ అన్నారు. మధునాపంతుల వారు ఈ సన్నివేశంలో తిక్కన భారతంలో ద్రోణుడు ద్రుపద మహారాజుని పరిహసించిన విషయాన్ని అనుసరిం చారు. ఈ పర్వంలో కవి నాయకరాజుల పాలనా వైభవాన్ని, సాహిత్య పోషణను సముచితంగా వర్ణిం చాడు.
ఆధునిక చారిత్రిక కావ్యాలలో ప్రసిద్ధమైనది ఆంధ్రపురాణం. ఆంధ్రపురాణ రచనవల్లనే మధునాపంతుల వారికి ఆంధ్రవిశ్వవిద్యాలయం వారి కళాప్రపూర్ణ సత్కారం లభించింది. ఆంధ్రకల్హణ అనే బిరుదు ఆయన్ను వరించింది. ఆంధ్ర పురాణ విశిష్టతను ఆధునిక మహాకవులు తుమ్మల సీతారామూర్తి, వేలూరి శివరామశాస్త్రి వంటి వారు గొప్పగా ప్రశంసించారు. డాక్టర్ కె రామోహన్రాయ్ ఆంధ్ర పురాణ విశిష్టతను ప్రశంసిస్తూ ‘‘సాధారణంగా పురాణాల్లో కనిపించే దైవభక్తికి మారుగా దేశభక్తి ఆంధ్రపురాణంలో కనిపిస్తుంది. ఆంధ్రజాతి కీర్తి గౌరవాన్ని చిరకాలం నిలపగల కావ్యమిది. ఆంధ్ర పురాణం ఒక్కటి చాలు వీరిని సుకవిగా ప్రస్తుతించ టానికి’’ అన్నారు. శాస్త్రిగారు శ్రీఖండం, చైత్రరథం వంటి ఖండకావ్యాలు ఛందోబద్ధంగా, మనోజ్ఞమైన శైలిలో రచించారు. పద్య కవిత్వమే కాకుండా ‘ఆంధ్రరచయితలు ‘ అనే గ్రంథంలో 113 మంది ఆధునిక రచయితలను గూర్చి విమర్శ దృష్టితో సరళమైన గద్యశైలిలో రచించారు. కొన్నాళ్లు ‘ఆంధ్రీ’ అనే పత్రికను కూడా నడిపారు. ఆయన జీవితం ఉపాధ్యాయ వృత్తిలో పునీతమైంది. మహాకవిగా చరితార్ధమైంది.
మధునాపమంతుల వారి ఆంధ్రపురాణంలో తెలుగు సంస్కృతీదీప్తిని, రాజవంశాల కీర్తిని, రాజాస్థానాల్లో విలసిల్లిన సాహితీపరిమళాల స్పూర్తినీ ఆకర్షణీయమైన సరళసుందరమైన శైలిలో అచ్చ తెలుగు పదాల పోహళింపుతో అక్షరబద్ధం చేశారు. ఆంద్రజాతి ఉన్నంత వరకు ఆంధ్రపురాణం నిలచి ఉంటుంది. మధునాపంతుల వారి కీర్తిని అజ రామరం చేసిన చిరస్మరణీయ కావ్యం ఆంధ్ర పురాణం.
(కేంద్ర సాహిత్య అకాడమీ వారు 5-03-2020 మధునాపంతుల వారి శతజయంతి సాహితీ సదస్సును నిర్వహిస్తున్న సందర్భంగా చదివిన వ్యాసం.)
డా।।పి.వి.సుబ్బారావు
విశ్రాంత అధ్యాపకుడు