ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభలు డిసెంబరు 28,29 తేదీల్లో విజయవాడలోని కేబీఎన్ డిగ్రీ కళాశాలలో ఘనంగా జరిగాయి. పొట్టిశ్రీరాములు ప్రాంగణంలోని రామోజీరావు ప్రధాన వేదికపై రెండు రోజుల్లో 12 సదస్సులు జరిగాయి. మరో రెండు చిన్న వేదికలపైనా.. 11 కవితా, సాహిత్య సమ్మేళనాలు, భాషోద్యమ, విద్యారంగ సదస్సులు జరిగాయి. వివిధ రాష్ట్రాల నుంచి భాషాభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముగింపు సభలో మొత్తం 18 తీర్మానాలను ఆమోదించారు. అన్నింటిలో, న్యాయపాలనపై సదస్సు ఆసక్తికరంగా ఉంది. తెలుగు భాషను పదిలం చేసుకోవడానికి ప్రజలు, రాజకీయ నేతలు, ప్రభుత్వాలు, రచయితలు, మేధావులు చేయిచేయి కలిపి అడుగులు వేయాలని ఈ మహాసభలు దిశానిర్దేశం చేశాయి. మొదటిరోజు సభను సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్. వెంకటరమణ ప్రారంభించారు. రెండో రోజు కూడా పలువురు న్యాయమూర్తులు, రాజకీయ ప్రముఖులు, సినీ, సాంస్కృతిక రంగ దిగ్గజాలు ముఖ్యఅతిథులుగా తరలివచ్చారు. రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చిన కవులు, రచయితలు, ప్రతినిధుల సదస్సులో మాతృభాషాభిమానం పరవళ్లు తొక్కింది. మాతృభాష నిర్లక్ష్యానికి గురవుతున్న విధానంపైనే ప్రతి సదస్సులో వక్తలు మాట్లాడారు. తెలుగుకు మళ్లీ వెలుగులద్ది భావితరాలకు చేరువ చేసేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలనే అంశంపై పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటిలోనూ తెలుగును నేర్పించడం ఆరంభిస్తే.. అమ్మ భాషకు అంతమే ఉండదని నినదించారు. ప్రజలు కోరుకుంటే.. ప్రభుత్వాలు కూడా మాతృభాషలో పాలనకు మార్గం సుగమం చేస్తాయని పేర్కొన్నారు.
రాజకీయంగా భిన్న సిద్ధాంతాలను పక్కనపెట్టి మాతృభాష పరిరక్షణ కోసం కలసికట్టుగా ప్రయాణం చేద్దామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. మహాసభలో రెండోరోజు ‘తెలుగు భాషాభివృద్ధి- తెలుగు భాష పరిరక్షణ – రాజకీయ నాయకుల పాత్ర’ అనే అంశంపై సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరవుతూ, అధికారుల కోసం తెలుగుభాషపై ఓ సదస్సు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ శాఖల్లో ఆదేశాలు తెలుగులో వచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
మహాసభలను మొదటిరోజు సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వెంకటరమణ మార్గదర్శి చిట్‌ఫండ్ ఎండీ శైలజా కిరణ్, ఇతర అతిథులతో కలిసి ప్రారంభించారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల గౌరవాధ్యక్షులు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వెంకట రమణ మాట్లాడుతూ, తెలుగు భాషను గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తి పంతులు తదితర ఎందరో ప్రముఖులు పరిపుష్టం చేశారన్నారు. అయినా నేడు వాడుక భాష ప్రజలకు దగ్గర కాలేదని, ఏ ప్రభుత్వాలు కూడా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయలేదన్నారు. ‘రాష్ట్రంలో తక్షణమే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలి. గత ప్రభుత్వం తెలుగుభాషను అణచివేయడానికి తీసుకువచ్చిన జీవో ఎంఎస్ 85 రద్దు చేయాలి. ఆ జీవోపై భాషాభిమాని గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసి విజయం సాధించారు. అయితే ఆ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుత ప్రభుత్వం ఆ పిటిషన్‌ను రద్దు చేసేలా చూసి పూర్వంలా తెలుగులో బోధనా విధానాన్ని ప్రవేశపెట్టాలి. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలుగుభాషాభివృద్ధి ప్రాథికార సంస్థను పునరుద్ధరించాలి’ అని జస్టిస్ వెంకట రమణ కోరారు.
తెలుగు పాలనా భాష కావాలని మండలి బుద్ధప్రసాద్ అభిలషించారు. రచయితలందరూ ఒకచోట కలసి తమ భావాలను పంచుకోవటానికి ఒక వేదికను నిర్మించి అందరూ కార్యోన్ముఖులై భాషాభ్యుదయమే ధ్యేయంగా భావించే అవకాశం కల్పించటమే ఈ మహాసభల ముఖ్య ఉద్దేశమన్నారు. పాఠశాలల్లో నిర్బంధ తెలుగు మాధ్యమం అమలు జరిగే వరకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని, అవసరమైతే తాను కూడా సత్యాగ్రహం చేస్తానని తమిళనాడు హోసూరు లోక్‌సభ సభ్యుడు గోపీనాథ్ అన్నారు. తెలుగు వ్యక్తిగా పార్లమెంట్‌లో సైతం తాను తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశానని ఆయన గుర్తు చేశారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల స్ఫూర్తితో తెలుగు ప్రజలు భాషాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ మాట్లాడుతూ, దేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడే నాలుగో భాష తెలుగు అని, అలాంటి భాషాభివృద్ధికి కలిసి కట్టుగా కృషి చేయాల్సిన సమయం ఆసన్న మైందన్నారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి మాట్లాడుతూ, ప్రపంచ తెలుగు రచయితల సంఘం మరింత సంస్థాగతంగా అభివృద్ధి చెందాలని సూచించారు. మాతృభాష సొంత కళ్లు అయితే పరాయిభాష కళ్లజోడు వంటిదన్న పూర్వ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచనలను ప్రతిఒక్కరూ పాటించాలన్నారు. మాతృభాషలో పట్టు ఉంటేనే ఏ భాష అయినా సులభంగా నేర్చుకోగలగుతామన్నారు.
రెండవ రోజు సదస్సులో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వాలు కొన్ని చట్టాలు చేసి భాషను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి రాజకీయ నేతలు ఉపయోగిస్తున్న భాషపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. మాతృభాష పరిరక్షణ కోసం త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలుగు పదసంపదను పెంచుకోవడానికి భాషా పండితులు నిఘంటువును తయారు చేయాలని, ఆ పదాలను పాటలు, కవిత్వాలు రాసే రచయితలకు పరిచయం చేయాలని సినీ గేయ రచయిత అనంతశ్రీరాం సూచించారు
అమెరికా తదితర దేశాలలో స్థిరపడిన తెలుగువారు తమ పిల్లలకు మాతృభాష నేర్పిస్తు న్నారని, వారికి భాషపై అంత ప్రేమ ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మనకు ఎందుకు లేదని సినీ నిర్మాత అంబికా కృష్ణ ప్రశ్నించారు. తెలుగులోకి అనువాదం చేసేటప్పుడు ఆంగ్ల పదాలకు సరిపోయే సమానార్థక పద సంపదను సృష్టించుకుని స్థిరీక రించుకోవాలని హై•కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.కృష్ణమోహనరావు సూచించారు. సమానార్ధక పదాలు లేకపోవడంతో తెలుగులో తీర్పును రాయడానికి ఎక్కువ సమయం పడుతోందని మరో న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు పేర్కొన్నారు. తీర్పులు మాతృభాషలో వెలువరించాలంటే ముందుగా ప్రభుత్వాలు చట్టాలను తెలుగులోకి అనువదించాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ఆత్మాభిమానం ఉన్న తెలుగువారు పరాయి భాషలో సంభాషించడంపై ఆలోచించాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేష్ పేర్కొన్నారు. బ్రిటిషర్లతో పాటు ఇప్పటి మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని న్యాయ స్థానాల్లో ఇప్పటికీ అక్కడి మాతృభాషల్లోనే తీర్పులు ఇస్తున్నారని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి గుర్తు చేశారు. రాజకీయ నేతల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపినప్పుడు భాష దానికదే ఎదుగుతుందని సీపీ•ఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సూచించారు. తెలుగు భాషకు ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తే బాగుంటుందని పీసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ సూచించారు.
తెలుగు మాధ్యమం అమలు ప్రయత్నాలు
భాషాభిమానులు, కవులు, రచయితలు, మేధావులు కోరుతున్నట్టుగా రాష్ట్రంలో అన్ని విద్యాలయాల్లోనూ ప్రాథమిక స్థాయి నుంచి తెలుగు మాధ్యమం అమలు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని ముగింపు సభకు ముఖ్య అతిధిగా హాజరైన పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజమహేంద్ర వరంలోని గౌతమి గ్రంథాలయం, విశాఖలో ఆంధ్ర విశ్వవిద్యాలయం గ్రంథాలయం మన భాషా వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి ఎంతో తోడ్పాటును అందించాయని, వాటిని సాహితీ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తే నేటితరం పిల్లలకు భాషపై ఆసక్తి పెరుగుతుందని తెలిపారు. ఎకో టూరిజం, వైల్డ్‌లైఫ్ టూరిజంతో పాటు సాహితీ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. భాషను పరిరక్షించడానికి ప్రభుత్వాలే కాకుండా పౌరసమాజం తగిన పాత్ర పోషించాలని సూచించారు. మాతృభాషను పరిరక్షించ డానికి, ప్రోత్సహించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.
మాతృభాషలో విద్యా బోధన జరిగినప్పుడు విద్యార్థుల్లో సంపూర్ణ మానసిక వికాసం పెంపొందుతుందని తెలిపారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, అధ్యక్ష, కార్యదర్శులు గుత్తికొండ సుబ్బారావు, డాక్టర్ జీవీ పూర్ణచందు, ఆచార్య కొలకలూరి ఇనాక్, తెలంగాణ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, సినీ గేయ రచయిత భువనచంద్ర, కేబీఎన్ కళాశాల కార్యదర్శి తూనుగుంట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు యువ రచయితలకు వివిధ సాహిత్య పక్రియలపై శిక్షణ తరగతులు నిర్వహించారు.
మహాసభలో తీర్మానాలు…!
- ఇంటా బయటా, అన్ని సామాజిక జీవన వ్యవహారాలలో తెలుగు వినియోగాన్ని పెంపొదించాలి.
- సమస్త వృత్తులు, జీవన విధానాలలో కనుమరుగైపోతున్న తెలుగు పదాలను వెలికితీసి ప్రాచుర్యం కల్పించడంతోపాటు,రచయితలు భాషాభిమానాన్ని కలిగించే రచనలు చేయాలి.
- ఆంగ్ల పదాలకు సమానమైన, సహజమైన పదాలను లు రచయితలను సృష్టించాలి.
- బాలల మనో వికాసానికి తోడ్పడేలా కనీసం ప్రాథమిక విద్య వరకూ తెలుగులోనే బోధన జరిగేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
- డిగ్రీస్థాయిలో అన్ని సెమిస్టర్లలో తెలుగుని ఒక పాఠ్యాంశంగా బోధించాలి.
- సాంకేతిక విద్యనూ మాతృభాషలోనే బోధించాలనే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఈ మహాసభ స్వాగతిస్తోంది.
- గత ప్రభుత్వం జారీ చేసిన జీ.వో రాష్ట్ర హైకోర్టు కొట్టి వేసిన నేపథ్యంలో నాటి ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఉపసంహరించాలి.
- తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థకు నిధులు కేటాయించి పటిష పరచాలి.
- ప్రజలకు ప్రభుత్వం చేరువయ్యేందుకు వీలుగా పాలనా వ్యవహారాలన్నీ, ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రభుత్వ ఉత్తర్వుల జారీ తెలుగులోనే జరిగేలా చర్యలు తీసుకోవాలి.
- తెలుగు అకాడమీ పూర్వ ఔన్నత్యాన్ని నిలపాలి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి
- రాష్ట్రం విభజనలో కోల్పోయి రాష్ట్ర గ్రంథాలయం, పురావస్తు ప్రదర్శన శాల, ఆర్కియాలజీ మ్యూజియం, స్టేట్ ఆర్కీవ్స్ లాంటి సంస్థలను ఏర్పాటు చేయాలి.
- తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 5 శాతం రిజర్వేషన్ కల్పించాలి.
- తెలుగు సాంస్కృతిక వైభవాన్ని నిలబెట్టటానికి, తెలుగు కళారూపాలను, దృశ్యకళలను కాపాడటానికి భాషా, సాంస్మృతిక విధానాన్ని రూపొందించాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను మహాసభ కోరింది.
-తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్