అందరికి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు


జనవరి 15 సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీ సాగికమలాకరశర్మ, మనోహరి వ్రాసిన ప్రత్యేక వ్యాసం

‘‌క్రాంతి’ అంటే మార్పు అని అర్థం. సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి మారడాన్ని ‘సంక్రాంతి’ అని అంటాం. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. ఈ విధంగా తిరగడానికి 365 రోజుల కాలం పడుతుంది. ఈ కాలాన్ని చాంద్ర, సౌరమానాల ప్రకారంగా 12 మాసాల కాలంగా విభజించారు. జ్యోతిశ్చక్రంలో కూడా 12 రాశులు ఉంటాయి. సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున ఒక నెలకు 30 డిగ్రీలు తిరుగుతాడు. ఒక నెల ఒక రాశిలో ఉంటాడు. సౌరమానం ప్రకారం సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి పేరుతో ఆ మాసాన్ని పిలుస్తుంటాం. సూర్యుడు ధనుస్సులో ఉంటే ధనుర్మాసం అవుతుంది.

జ్యోతిశ్చక్రంలో నాలుగు ప్రత్యేకమైన గుర్తింపు గలిగిన బిందువులు ఉన్నాయి. అవి మేషం, కర్కాటకం, తుల, మకర రాశులు. సూర్యుడు మేషం, తులలలో ఉన్నప్పుడు ‘విషువత్తులు’ ఏర్పడుతాయి. విషువత్తులంటే పగలు రాత్రి సమానంగా ఉండే రోజులు. అదేవిధంగా కర్కాటకంలోకి వచ్చినపుడు దక్షిణాయన ప్రారంభం, మకరంలోకి వచ్చినపుడు ఉత్తరాయణ ప్రారంభం అవుతుంది. ఈ ఉత్తరాయణ ప్రారంభకాలం పుణ్యదినంగా, ఉత్తరాయణమంతా దైవ సంబంధమైన ఉత్తమ కాలంగా పరిగణిస్తూ మకరరాశిలోకి సూర్యుడు ప్రవేశించే రోజును ‘మకర సంక్రాంతి’ పర్వంగా ఆచరించడం ప్రారంభమైంది. ఈ మార్పులన్నీ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండడంవల్ల జరుగుతుంటాయి. ఆకాశంలోని నక్షత్ర, గ్రహగతుల ప్రభావం వల్లనే రుతువులు ఏర్పడడం, ఇతర ప్రభావాలు ఉంటాయి. ఈ ప్రభావాలను భూమి స్వీకరించడంతో ఒక పద్ధతి, గమనం కనపడుతున్నాయి. వీటి ఆధారంగానే వివిధ వాతావరణాలకు అనుగుణంగా మానవ శరీరం స్పందిస్తుంది. కాలంలో వచ్చే మార్పులకు అనుగుణంగా, వాటిని సద్వినియోగం చేసుకుంటూ, భౌతిక, మానసిక అభ్యుదయాన్ని సాధించే ఉద్దేశంతోనే పండుగలు ఏర్పడ్డాయి.

పండుగల్లో ‘సంక్రాంతి’ అతి పెద్ద పండుగ. చాంద్రమానాన్ని అనుసరించి సూర్యుడు మకరరాశికి జనవరి 14 లేదా 15వ తేదీలలో ప్రవేశిస్తాడు. అందువల్ల ఈ పండుగకు జ్యోతిష పరంగా నిశ్చయమైన తేదీలు ఉన్నాయి. ఇది మూడురోజుల కనుము పండుగలు.

ప్రకృతిలో ఒకానొక మార్పు జరిగినపుడు నూతనమైన కాంతులు విశ్వవీధుల నుండి మనలను ప్రభావితం చేస్తున్నప్పుడు వాటికి అనుకూలంగాను స్పందించి ఆ ఉత్సవాన్ని అందరితో కలిసి పంచుకోవడమే పండుగల అంతర్గతమైన జ్యోతిషాంశం. ప్రతీ పండుగకు జ్యోతిషంతో సంబంధం ఉంది. జ్యోతిశ్చక్రంలోని గ్రహాలు, నక్షత్రాల ఉదయాస్తమయాలే ఈ పండుగలన్నింటికీ మూలకారణం.

ఈ పండుగ విధానాలలో సమైక్యత, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం మొదలైనవి ముఖ్యమైన అంశాలుగా కనిపిస్తున్నాయి.

‘కలయంపి చల్లి యలికిన

తలవాకిళులందు ఆంధ్ర తరళాక్షులు మ్రు

గ్గుల దొందరలిడిరి, భుజం

బుల నుండి జడల్‌

‌భుజంగములగుచున్‌ ‌వ్రేలన్‌’

అం‌టూ పల్లా దుర్గయ్య కవి ‘గంగిరెద్దు’ కావ్యంలో సంక్రాంతి సమయంలో స్త్రీల విధి విధానాలలో భాగమైన ముగ్గుల గూర్చి వివరించారు. ప్రకృతిలో మార్పు వస్తున్నప్పుడు కొన్ని క్రొత్త రకాల బ్యాక్టీరియాలు ఎదిగే అవకాశం, అవి మానవులపై అనేక దుష్ప్రభావాలు కలిగించే అవకాశాలు ఉంటాయి. అందుకే శుభ్రత పాటించడం కోసమే వివిధ పండుగలలో వేరు వేరు ఆకారాలు ఏర్పడినాయి. సంక్రాంతి సమయంలో ఇంటి ముందర చక్కగా పేడలతో చల్లి, పెద్ద, పెద్ద మ్రుగ్గులు, వాటిలో రంగులు నింపి వాటిపైన ‘గొబ్బెమ్మలు’ పెడుతుంటారు. అవి కూడా ఆవుపేడతో తయారుచేసినవే. దానిపైన పూలు జల్లి దాని చుట్టూ తిరిగి ఆడతారు. ‘గొబ్బీ’ పాటలు ఈ విధంగానే వెలుగులోకి వచ్చినవి.

భోగి రోజున భోగి మంటలు వేయడం సంక్రాంతి నాడు పిల్లలకు భోగి పండ్లుపోయడం, కనుము నాడు పశు ఆరోగ్యానికై ప్రత్యేకంగా శుభ్రపరిచి పసుపు మొదలైనవి వాటికి రాసి బ్యాక్టీరియాను తరిమికొట్టడం ఈ పండుగ మూడు రోజులు జరిగే అంశాలు. ముగ్గు (సున్నం)లో ఉన్న కాల్షియం కూడా బ్యాక్టీరియా నాశనకారియే.

అందరూ ఒక దగ్గరకు చేరి ఆనందాన్ని పంచుకుని సమైక్యతకు ఆధారంగా నిలిచిందీ పండుగ. భోగి పండుగనాడు ఆడపిల్లలు ‘భోగిపాటలు’ పాడుకునే సమయంలోనూ, సంక్రాంతి రోజున పేరంటం సమయంలో, బొమ్మల కొలువుల లోనూ పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఆనందోత్సా హలతో పాల్గొంటారు.

పూర్వపు ఆచారాలలో సంక్రాంతి నాడు ‘గంగిరెద్దు’ల వారు ఇంటింటికి తిరగడం, బుడబుక్కలవారు ప్రొద్దున్నే అందరినీ లేపడం, హరిదాసు భగవంతుని కీర్తనలతో ఇంటింటికీ తిరగడం మొదలైన అలవాట్లుండేవి. ఈనాటికీ ఈ అలవాట్లు ఉన్నప్పటికీ పూర్వం కన్నా తగ్గినాయి. సంస్కృతీ సంప్రదాయాలకు క్రమంగా దూరంగా రావడం జరుగుతున్నది. ఇక పట్టణాలలో ‘కలయంపి’ చల్లే అవకాశమే లేదు. గొబ్బెమ్మలు కొనుక్కొస్తున్నారు. ప్లాస్టిక్‌ ‌ముగ్గులు కూడా వచ్చాయి. ఇది ఆరోగ్యానికి, సంస్కృతికి వ్యక్తులు చేసే ద్రోహం. ఉన్నంతలో కనీసం పండుగ రోజున వీటిని పాటిస్తే అనారోగ్య పీడలుండవు. ఈ విధానాన్ని కవి రాయప్రోలు సుబ్బారావుగారు ప్రస్తావిస్తూ ఈ విధంగా అన్నారు.

బువ్వమ్ము బంతులన్‌ ‌కవ్వించి వయసు కా

వర మబ్బ పడతులు పాడలేరు,

గొబ్బితట్టిడు వేళ గూడ ప్రాయపు కన్నె

లరమర లే కాడ మఱచినారు

తద్దె పండుగల సైతముయాల లూగుట

మోటుగా ముగ్ధలు మూసినారు

రుక్మిణి మొదలుగా రుచిగొన్న బొమ్మల

పెండ్లిండ్లు బాలలు విడచినారు

ఏ నిరపరాధ మగ్ధు క్రీడలింతవరకు

జాతి ముఖ తిలకములైన చానలందు

సెంచె నానంద సౌందర్య సంచయమును

ఆ శుభము లస్తమించెడి నరయురేమొ?

నిజమే, ఆనంద, సౌందర్య సమన్వితమైన ఈ పండుగల అంతరార్థం అర్థం చేసుకోకుంటే అధోగతి తప్పదు.

వివిధ ప్రాంతాలలో ఈ పండుగ ఆచార వ్యవహారాలను ఆలోచిస్తే ఆంధ్రదేశంలోని ఆంధ్ర ప్రాంతంలో ఇది చాలా పెద్ద పండుగ. వారు వివిధ కారణాల రీత్యా ఆంధ్రదేశమంతటా ఉండటంవల్ల పండుగను అందరూ జరుపుకుంటున్నారు. తెలంగాణావారికి ఇది అశుభకరమైన పండుగ. ఈ రోజున ప్రత్యేకమైన నోములు చేస్తుంటారు తెలంగాణ వాళ్లు. సంస్కృతిలో ఈ విషయంలో ప్రక్కప్రక్కనే ఉన్నా వీరిలో ఈ వైవిధ్యం మనకు కనిపిస్తుంది.

సాహిత్యం ఆవిర్భవించక ముందే జ్యోతిషాలు ఉన్నాయి. అవి మనిషిని ఆనాడు ఈనాడు ఒకే విధంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రభావాలను అధ్యాయనం చేసి ముందుగా సూత్రీకరణ చేసిన అంశాలు జ్యోతిస్సుల గూర్చే. ఒక సూత్రము ఎక్కువ సార్లు పాటిస్తే అది జనవ్యవహారంలో వాడుక పదంగా మారిపోతుంది. అట్లాగే వచ్చినవి సామెతలు, నమ్మకాలు.

సంక్రాంతికి సంబంధించి కూడా వివిధ ప్రాంతాలలోని ఆచార వ్యవహారాలు అనేక సామెతలుగా ఏర్పడ్డాయి. అవి ముఖ్యంగా అప్పుడే వచ్చే వరి పంటను ఆధారంగా చేసుకుని ‘పౌష్యలక్ష్మి’ ఆరాధనాపూర్వకంగాను, పండుగలలో ఆచరించే విధి విధానాల గూర్చి కాలానుగుణంగా చేయవలసిన పనులను గూర్చి ఉన్నాయి.

కనుము నాడు మినుము కొరకాలి/ విశాఖ వరదలు సంక్రాంతి మచ్చులు/ కనుము నాడు కాకైనా వదలదు/ చేస్తే భోగి పండుగ – పాడితే ఆ భోగి/ ఉత్తరాయణం వచ్చింది ఉరేసుకోనున్నట్లు/ సంక్రాంతికి తిన్నది పదెత్తులు ఎల్లకాలం తిన్నది ఏడెత్తులు/ గాడిదకు భోగి నీళ్లు పోస్తే బూడిదలో పొర్లాడిందట/ సంక్రాంతికి సలి సంకలేపనీయదు/ రంగడే దైవం పొంగలే ప్రసాదం వంటి ఆచార వ్యవహారాలు, విధి విధానాలు, వాతావరణ ప్రభావ సంబంధ అంశాలతో కూడిన సామెతలు ఎన్నో.

చివరగా ఒక్క మాట – మన సంస్కృతి మహోన్నతమైనది. ఎన్నో రకాలుగా పరీక్షించి, నిగ్గు తేలిన అంశాలే నేటి పండుగలు ఆచారాలు. వాటికి అనుగుణంగా నడిస్తే మన దేశం సర్వ ప్రపంచానికి శిఖరాయ మానమవుతుంది. అన్ని మరిచి పాశ్చాత్య సంస్కృతివైపు ఆకర్షిస్తూ కూర్చున్నారా! అధోగతి తప్పనిసరి. జాతిని మేల్కొల్పే విధంగా ఉండే ఈ పండుగల సందర్భంలో ఈ విషయాలు ఒకసారి గుర్తుచేసుకోవడం అవసరం.

జాగృతి, జనవరి 11-17, 1999

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE