భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన రచన
– ఉలి
‘‘సరస్వతీ నమస్తుభ్యం.. వరదే కామరూపిణీ..
విద్యారంభం కరిష్యామి.. సిద్ధిర్భవతుమే సదా..
పద్మపత్ర విశాలాక్షీ.. పద్మకేసరి వర్ణినీ…
నిత్యం పద్మాలయాందేవీ.. సామాంపాతు సరస్వతీ..!’’
భక్తిశ్రద్దలతో వాగ్దేవిని మనస్పూర్తిగా ప్రార్థించి, సాష్టాంగ నమస్కారం చేశాయి అక్షరాలు, వాటి వినయ విధేయతలకూ, భక్తిప్రవత్తులకూ సరస్వతీదేవి ముగ్ధురాలై పోయింది.
అక్షరాలన్నీ మూకుమ్మడిగా వచ్చి, తనని వేడుకునేసరికి తనువెల్లా పులకించిపోయింది అక్షరమాతకి. వెంటనే తన వీణని శ్రుతి చేసి, ఆనందమయంతో రాగాలాపన చేసింది. సప్త సముద్ర తరంగాలవలె సప్తస్వరాలు ఉవ్వెత్తున స్వరఝరితో ఎగిసిపడుతుంటే, అది విన్న అక్షరాలు కూడా తన్మయత్వంతో ఊగిపోతూ.. రాగాలహరిలో తేలిపోతున్నాయి.
పులకించిపోతున్న తన పిల్లల్లాంటి అక్షరాలను చూసి, సరస్వతీదేవి పరవశించిపోతూ.. వీణాధరియై ఆలపిస్తోంది.
ఇంతలో…
ఎక్కడో అపశ్రుతిలా.. ‘ఆరున్నొక్క రాగం’ వినపడే సరికి, సరస్వతీదేవి నిర్ఘాంతపోయింది..!
తన చేతిలోని వీణని శ్రుతి చేసి, తీగల్ని మళ్లీ మీటింది. అయినా.. ఆ రాగం అలాగే వినిపిస్తోంది.
అది తన వీణలోనుంచి వస్తున్న రాగం కాదని గమనించి, అక్షరాలపై చూసింది.
కంటికీ మింటికీ ఏకధారలా అక్షరాలన్నీ ఏడుస్తున్నాయి..!
వాటి శోకాన్ని గమనించి, విచలితురాలయింది సరస్వతీమాత..!!
గుండె తరుక్కుపోయి, తల్లడిల్లిపోతున్న తల్లి మనసుతో అక్షరాలను అడిగింది. ‘‘ఏంట్రా..? ఏమైందీ..??
ఆర్ద్రతతో అడిగిన సరస్వతీమాతని చూసి, ఎగిసివస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కివెక్కి ఏడ్చాయి అక్షరాలు.
శోకసముద్రాలైన అక్షరాలని చూసి, కంగారుపడిపోయింది సరస్వతీ మాతృహృదయం.
చేతిలోని వీణని ప్రక్కకు పెట్టి, ఒక్క మెట్టు దిగి.. అక్షరాల దగ్గరకు వచ్చింది వాగ్దేవి.
పుత్రవాత్సల్యంతో ఆక్కున చేర్చుకొని, తల నిమురుతూ అడిగింది. ‘‘ఏంటీ..? ఏమైందీ..? ఎంతటి ఉపద్రవమైనా తీర్చుతాను. ముందు ఏం జరిగిందో చెప్పండీ..?’’
చంటిపిల్లల్లా అరచేతులతో కన్నీటిని తుడుచుకుంటూ ‘‘అమ్మా..! జగన్మాతా..!! నీకు తెలియదా తల్లీ..? అందరి తలరాతలను రాసే, చతుర్ముఖుని సతీదేవివి..! మేము చెప్పాలా- అమ్మా..?!?’’ అడిగాయి అక్షరాలు.
సరస్వతీదేవి చిన్నగా నవ్వి, అడిగింది. ‘‘మీరూ విద్యార్థుల్లానే తయారయ్యారు. ప్రశ్నకు ప్రశ్న సమాధానం చెపితే ఎలా..? మీ మనసుకు బాధ కలిగించిన అంశం ఏమిటో మాకెలా తెలుస్తుంది..?’’
ఒక్క క్షణం ఫెయిల్ అయిన విద్యార్థుల్లా.. తలవంచుకొని నిలుబడ్డాయి అక్షరాలు.
వాటి దిగులును చూసి, ‘‘నేను స్కూల్లో టీచర్ని కాదు, మీ కన్నతల్లిని..’’ అంది అక్షరమాత.
ఆ ఆప్యాయతకి పులకించిపోతూ అడిగాయి అక్షరాలు.
‘‘మేం అక్షరాలమే కదా..?’’ అడిగింది ఘ అక్షరం.
‘‘ఔను.. కాదని ఎవరైనా అన్నారా..?!’’ అంది సరస్వతీదేవి.
‘‘అక్షరం అంటే, ‘నాశనము లేనిది’ అనే అర్థం కదా..?!’’ అడిగింది ఋ అక్షరం.
‘నిజమే కదా..!’’ అన్నట్లు చూసింది సరస్వతీదేవి.
‘‘మరి, ఈమధ్య నన్ను పట్టించుకుంటున్నారా..? నన్నే కాదు చాలా అక్షరాలను మరిచిపోతున్నారు..!’’ అంటూ దిగులుపడింది బు• అక్షరం.
‘‘నిజమే.. నాకు ఎక్కడో చదివిన మినీ కవిత గుర్తుకొస్తుంది..
మనిషి…
తెలుసుకొని,
తెలుసుకొని,
తెలివిమంతుడవుతాడు..!
ఇంకా..
ఇంకా… ఇంకా…
అతిగా తెలుసుకొని,
‘అతి తెలివిమంతుడవుతాడు..!!’’ చెప్పింది సరస్వతీమాత.
కన్నీటితో తడిసిన అక్షరాల పెదవులపై చిరునవ్వు వెలగలేదు..!
అదే దిగులుతో, ఆవేదనతో కురవడానికి సిద్ధంగా ఉన్న శ్రావణమేఘల్లా ఉన్నాయి అక్షరాలు.
‘‘ప్రభవ నుండి అక్షయ వరకు తెలుగు సంవత్సరాల్లా.. మేం కూడా 60 అక్షరాలుగా ఉండేవాళ్లం. 18వ శతాబ్దం వరకు బాగానే ఉన్నాం.. 19వ శతాబ్దం వచ్చేసరికి 56 అక్షరాలమయ్యాం. ఇప్పుడు, 46కు పడిపోయాం. ఇంకా కొందరికైతే, ‘తెలుగు అక్షరాలెన్ని? అవి ఏమిటి..?’ అనడిగితే.. వింతగా చూస్తారే కానీ, ఏ ఒక్కరూ సరైన సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. ఇలాగైతే, రోజురోజుకీ మా సంఖ్య తగ్గిపోయి, మేం అంతరించిపోయే ప్రమాదం ఉంది..’’ తమ మనోవేదనని వివరించాయి అక్షరాలు.
‘‘నిజమే.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియాలంటే, ఒక్కసారి ఈ లోకం తీరుని గమనించండి.. మీకే తెలుస్తుంది..’’ అంది సరస్వతీమాత.
ఆ మాటతో ఒక్క క్షణం.. టీచర్ సిలబస్ చెప్పకుండానే, ఎగ్జామ్ పెట్టినట్లు బెదిరిపోయాయి. అక్షరాలు..!
‘‘అయ్యో..పాపం..!’’ అంటూ ఉలిక్కిపడి లేచాడు విద్యాసాగర్.
అర్ధరాత్రి వేళ.. నిద్రలేచి కూర్చున్నతన్ని చూసి, తలపైకెత్తి ‘‘ఏమైందీ..? పీడకలొచ్చిందా..?’’ అడిగాడు ధనుంజయ్.
చిన్నగా నవ్వుతూ ‘‘మంచి కలే వచ్చింది..’’ అన్నాడు విద్యాసాగర్.
‘‘నువ్ అదృష్టవంతుడివి మేష్టారూ..! నాకు ఏ కల రావడం లేదు. అసలు నిద్రనే పట్టడం లేదు..’’ అన్నాడు ధనుంజయ్.
‘‘ఇంకా.. ఆస్తిపాస్తులపై ఆశ పెట్టుకుంటే, కంటిచూపులు కాపలా కాస్తుంటాయి. నిద్ర-గుర్ఖాలా గస్తీ తిరుగుతూ ఉంటుంది..’’ అంటూ నవ్వాడు విద్యాసాగర్.
‘‘ఆహా.. కమ్మని తెలుగు మాట..! తెలుగు పండితుల వారి నోట తేనెలూరే కవిత్వం వచ్చింది..’’ అన్నాడు సంతృప్తిగా ధనుంజయ్.
‘‘తెలుగుకు తెగులు పట్టుకుందయ్యా ధనుంజయా..! కలలో.. అక్షరాలు అశ్రువులు రాల్చుతున్నాయ్, పాపం..!!’’ దిగులుపడ్డాడు విద్యాసాగర్.
‘‘అంటే, ఏవైంది మేష్టారూ..?’’ అంటూ బెడ్ నుంచి లేచి కూర్చున్నాడు ధనుంజయ్.
‘‘గ్లోబలైజేషన్..! ప్రపంచీకరణ..!! సెల్ఫోన్ చేతిలోకొచ్చేక.. ప్రపంచమే అరచేతిలో ఉందనుకుంటున్నారు.
కానీ.. ప్రపంచం కంటే, అరచేయి చిన్నది కదా..!? ఎంత ఒడిసి పట్టుకున్నా.. కొత్తగా వస్తుంటే, చేతిలో ఉన్నవి కొన్ని.. వేళ్ల సందుల్లోంచి జారిపోతుంటాయి..’’ అన్నాడు విద్యాసాగర్. ‘‘ఏమిటో.. మీ వేదాంతం అర్థం కాలేదు..’’ అనుమానం వ్యక్తం చేశాడు ధనుంజయ్.
‘‘అర్థం కాకపోవడమే మంచిది. అర్థమైతే, నీకు నిద్రపట్టదు.. ఇక, పడుకో. ఉదయం మాట్లాడుకుందాం..’’ చెప్పాడు విద్యాసాగర్ దుప్పటి నిండా కప్పుకొంటూ,
‘‘ఈ సస్పెన్స్‌తో, ఇక నాకేం నిద్ర పడుతుందీ..’’ అంటూ ముసుగేసుకున్నాడు ధనుంజయ్.
* * *
విద్యాసాగర్ పడుకున్నాడన్నమాటేగానీ, ఆలోచనలు కందిరీగల్లా ముసురుకుంటున్నాయి. నిద్ర సరిగా పట్టడం లేదు. అటూ ఇటూ కదులుతున్నాడు. వెల్లకిలా.. బోర్లా.. పడుకుంటున్నాడు. ఎలా పడుకున్నా, మెదడులో నిండిపోయిన ఆలోచనలు.. అతన్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వడం లేదు.
అక్షరాలు…
కంటతడి పెట్టుకున్న అక్షరాలు…
అశ్రువులవుతున్న అక్షరాలు…
ప్రాణభయంతో వణికిపోతున్న అక్షరాలు…
ఒక్కసారి చనిపోవడం ఎంతో హాయి..! కానీ, ‘చనిపోతాను’ అనే భయం.. చచ్చేవరకు క్షణక్షణం చంపేస్తుంది..!! అది మరణం కంటే, వెయ్యింతలు భయం కరమైనది..!!!
అలాంటి భయంతోనే అక్షరాలు బెంబేలెత్తి పోతున్నాయని అర్థం చేసుకున్నాడు విద్యాసాగర్. అందుకే,
అతని కంటిమీదకు కునుకు రావడం లేదు.
విద్యాసాగర్ తెలుగుపండితుడిగా పదవీ విరమణ పొంది, ఎనిమిదేళ్లు అయింది. రిటైర్డ్ అయ్యాక కూడా ఒంట్లో ఓపిక ఉన్నంతవరకూ ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాబోధన చేశాడు.
వృత్తిధర్మంగా తక్కువ జీతం అయినప్పటికినీ.. మాతృభాష అంతరించి పోకూడదనే ఉద్దేశ్యంతో విద్యాబోధన చేశాడు.
అచ్చులు 16 అక్షరములు, హల్లులు 37 అక్షరములు, ఉభయాక్షరములు 3.. మొత్తం కలిపి 56 అక్షరాలు విద్యార్థులకు నేర్పించాడు. కానీ, ఆంగ్లభాషపై ఉన్న వ్యామోహంతో మాతృభాష తెలుగును నిర్లక్ష్యం చేసేవారు విద్యార్థులు. కాస్తా కఠినంగా వ్యవహరిస్తే, విద్యార్థులు దారిలోకొస్తారని ఎగ్జామ్స్‌తో ఫెయిల్ చేస్తానంటే.. ఆ ప్రైవేట్ పాఠశాల కరెస్పాండెంట్ అంగీకరించలేదు. ఇది పోటీ ప్రపంచం. మిగతా పాఠశాలలకంటే మన స్కూల్ రిజల్ట్ తక్కువ వస్తే, మనకే అవమానం అంటూ.. ఎలా రాసినా తెలుగులో అధిక మార్కులు వేయాలని ఆంక్ష విధించారు. దాంతో, చేసేదిలేక.. అలాగే చూసీచూడనట్లు పరీక్ష పేపర్లు దిద్దేసి, ‘జయహో..’ అనేశాడు విద్యాసాగర్.
ఇలా.. చేయడం విద్యాసాగర్‌కు నచ్చలేదు. అది రాజ్యద్రోహం కంటె భయంకర నేరం అని దిగులుపడ్డాడు. ‘కంచె చేను మేసినట్లు..’ బోధన చేయాల్సిన వారే సరిగా నేర్పలేకపోతే, భవిష్యత్ తరాలకి భాష ఎలా చేరుతుంది..? అప్పటి (వరకు) సజీవంగా ఎలా ఉంటుంది..? అని మధనపడి, ప్రైవేట్ ఉద్యోగానికి రాజీనామా చేశారు విద్యాసాగర్.
అంతే..ఆ మరుసటి రోజు నుండి ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. పిల్లలు పెద్దవాళ్లు అయ్యేవరకు రెక్కలు ముక్కలు చేసుకొని, చేసీ చేసీ.. అలసిపోయిన అతని భార్య వేదవతి.. విద్యాసాగర్‌ని ఒంటరివాణ్ని చేసి, ‘‘వెళ్లిపోయి’’ నాలుగేళ్లు అయింది..!
ఉద్యోగం లేక సంపాదన డబ్బులు రాక పోవడంతో కుటుంబ సభ్యులకు చేదు అయ్యాడు విద్యాసాగర్. వండి పెట్టడానికి ఇద్దరు కోడళ్ల దృష్టిలో కరివేపాకు అయ్యాడు.
ప్రైవేట్ ఉద్యోగానికి రాజీనామా చేసిన మూడో రోజునే.. విద్యాసాగర్‌ను ఓల్డేజ్ హోంలో చేర్చారు ఇద్దరు కొడుకులు.
తనపై శ్రద్ధ కంటే, తెలుగు భాషపై ఉన్న వీరాభిమానంతో.. నిరంతరం ఆలోచిస్తూ మధన పడుతున్న విద్యాసాగర్… అక్షరాలు ఆవేదనతో ఏడుస్తున్నట్లు.. మరుగున పడిపోయిన ఋ, బు•, ఝ. ఱ.. వంటి 14 అక్షరాలు ఐ.సి.యు.లో ఉన్నట్లు.. కలలు వస్తున్నాయి.
* * *
మరుసటి రోజు ఉదయం…
ఆలస్యంగా కలతలతో నిద్రపోయిన ధనుంజయ్ ఉదయం 7 గంటలయినా మేల్కొనలేదు.
సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచిన విద్యాసాగర్‌కు ఆ ఓల్డేజ్ హోంకు ప్రతిరోజూ వస్తున్న దినపత్రికలను చదవడం అలవాటు.
ఆ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన ‘‘ఆస్ట్రేలియాలో తెలుగుభాషకు పట్టం’’ అనే వార్త చదివి ఎంతో సంతోషించాడు విద్యాసాగర్.
అక్కడి స్కూళ్లల్లో ఆప్షనల్‌గా తెలుగుభాష.. శాశ్వత నివాసానికి కూడా ప్రామాణికంగా తెలుగు.. ఆమోదించిన ఆస్ట్రేలియా కేంద్ర ప్రభుత్వం…
విదేశాల్లోనూ తెలుగుభాషకు దక్కిన అరుదైన గౌరవాన్ని తెలుసుకొని, విద్యాసాగర్ మనసు పులకించిపోయింది. ‘‘విదేశీ భాషల్లో తెలుగు లెస్స’’ కావాలని మనస్పూర్తిగా కోరుకున్నాడతను.
విదేశాల్లోనూ గౌరవం పొందుతున్న మన మాతృభాష అయిన తెలుగుని, ఇక్కడున్న మన తెలుగువారు ఎందుకు చిన్నచూపు చూస్తున్నారో అర్థం కాలేదు విద్యాసాగర్‌కు.
పాఠశాలల్లోనే భాషాపండితులకు గౌరవం దక్కటం లేదు. ముందస్తుగా.. గణితం, సామాన్య, సాంఘిక శాస్త్ర బోధకులకు ఇచ్చిన గౌరవం, జీతం.. తెలుగు భాషాపండితులకు కూడా సమాన స్థాయిలో ఇవ్వగలిగితే.. తెలుగు భాషాభివృద్ధికి పునాది పడినట్లే..! శాస్త్రం ఏదైనా.. భాషతోనే కదా బోధన జరిగేది..?! తెలుగు ఛందస్సులోనూ గురు, లఘువులు..ఉత్పలమాల, చంపకమాల గణాలు ఉంటాయి. ఇవీ లెక్కలే కదా..! క,చ,ట,త,ప లు.. గ,జ,డ,ద,బ లుగా మారడం.. ఒక విధమైన రసాయనిక చర్యనే కదా..! అని గొణుక్కున్నాడు. విద్యాసాగర్.
‘‘శుభోదయం మేష్టారూ..’’ అంటూ నిద్రలేవడంతోనే పలకరించాడు ధనుంజయ్.
‘‘తవ సుప్రభాతం..’’ అన్నాడు నవ్వుతూ విద్యాసాగర్.
‘‘నేను ఏడు కొండలవాణ్ణి కాదు.. నా దగ్గర ఏ కొండలూ లేవూ..’’ అన్నాడు ధనుంజయ్.
‘‘సంపాదించిన కొండలు.. కొడుకులూ కోడళ్లూ లాక్కున్నాకే కదా.. ఈ ఓల్టేజ్ హోమ్‌లో చేరింది.. ఇక్కడ మనమే కొండలం.. కన్నవాళ్లకి గుది బండలం..’’ నవ్వుతూ చెపుతున్నా విద్యాసాగర్ కళ్లల్లో కన్నీటిపొర తారాడింది.
ఇంతలో అక్కడికొచ్చిన రామనాథం వాళ్లని చూసి ‘‘ఆహా.. ఈ వయసులో హాయిగా నవ్వుతున్నారంటే, మీకంటే అదృష్టవంతులు లేరోయ్..’’ అన్నాడు.
అదే సంతోషంతో నవ్వుతూనే పాట పాడాడు విద్యాసాగర్, ‘‘బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్..’’
‘‘ఈ వయసులో కూడా ఆనందంగా పాటలు పాడుతున్నారంటే, మీరు చాలా గ్రేట్ మేష్టారూ..’’ అన్నాడు ధనుంజయ్.
‘‘బాధపడితే, మనకి వచ్చేదీ లేదూ.. పోయేదీ లేదూ..’’ అంటూ ‘‘కనుగొంటే సత్యమింతేనోయ్.. ఓ వింతేనోయ్…’’ పాట కంటిన్యూ చేశాడు విద్యాసాగర్.
‘‘వయసులో ఉన్నప్పుడు కన్నవారి క్షేమం కోసం కష్టపడతాం. చేతకాని వయసులో చేతికి అందివస్తా రనుకుంటాం.. అండగా నిలబడి, కాసింత కూడు పెట్టి, ఆదరిస్తే చాలు అనుకుంటే.. సంపాదించిన ఆస్తిపాస్తులు లాక్కొని, బయటికి తరిమేశారు.. నాలాంటి ముసలివారి పరిస్థితి ఇంతే..!’’ బాధపడ్డాడు రామనాథం.
‘‘అందుకే, వృద్ధాశ్రమాలు వృద్ధి చెందుతున్నాయి.. ఉమ్మడి కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి..’’ అన్నాడు విద్యాసాగర్.
‘‘ఈ పరిస్థితి ఇంతేనంటారా.. మేష్టారూ..?’’ అడిగాడు ధనుంజయ్.
‘‘మాతృభాషకూ గౌరవం లేదు.. మాతాపితలకూ ఆదరణ లేదు..’’ విద్యా సాగర్ గొంతు గద్గదమైంది.
‘‘నిజమేనయ్యా..! మీరు చెప్పింది అక్షర సత్యం..’’ అన్నాడు రామనాథం.
‘‘డబ్బు సంపాదనలో పడి, పరుగెడుతున్నారు జనం. ఊరికో లక్ష్మీదేవి ఆలయం ఉంది కానీ, జిల్లాకో సరస్వతీదేవి ఆలయమైనా ఉందా..? సరస్వతీదేవినీ, మాతృభాషనీ.. గౌరవించని వాళ్లు కన్న తల్లిదండ్రులను ఎలా ఆదరిస్తారయ్యా..?’’ దిగులుపడ్డాడు విద్యాసాగర్.
‘‘కళ్లు తెరిపించారు మేష్టారూ..!’’ అన్నాడు ధనుంజయ్.
‘‘మనం ‘కన్ను మూసే’ వయసులో.. కళ్లు తెరిస్తే ఎంత..? నేటి యువతరం కళ్లు తెరవాలయ్యా!’’ దిగులుపడ్డాడు విద్యాసాగర్.
‘‘అందుకు మీలాంటి వారే మార్గదర్శకులు కావాలి మేష్టారూ..!’’ వేడుకున్నట్లు చెప్పాడు ధనుంజయ్.
వేదాంతిలా నవ్వి, చెప్పాడు విద్యాసాగర్. ‘‘అంతా.. ఆ వాగ్దేవి దయ.. సా మాంపాతు సరస్వతీ…’’
* * *
కలత చెందిన మనసుతో వీణని ఎంతగా శ్రుతి చేసినా.. స్వరాలాపనకు అనుకూలంగా మార్పు చెందకపోవడంతో తీగెలనీ సరిచేస్తోంది సరస్వతీదేవి.
శ్రుతి తప్పిన హృదయవీణలో అపశ్రుతులు పలుకుతుంటే, చేతిలోని వీణని ఎన్ని తీగెలని శ్రుతి చేసినా.. ఆరున్నొక్క రాగమే పలుకుతోందని తెలిసినా, అక్షరాలపై వున్న మమకారంతో అన్ని మరిచిపోయింది వాగ్దేవి.
అక్షరమాత మానసిక ఆందోళననీ, మనోవేదననీ గమనించిన అక్షరాలు.. దిగులుగా అక్కున చేరాయి.
అమాయకంగా బెంబేలుపడిపోతూ తల్లి ముఖంలోకి చూస్తున్న అక్షరాలని చూసి, తన మనోవేదన.. పుత్రసమానులైన అక్షరాలకు తెలిస్తే కంగారు పడిపోతాయని దిగమింగుకుంది సరస్వతీమాత.
ఇప్పటికే 60 అక్షరాలలో నుండి 14 అక్షరాలు కనుమరుగయ్యాయి. వాటి ఉనికి, మనుగడ లేక జీవచ్ఛవాల్లా పడివున్నాయి.
‘‘ఒకప్పుడు తాత బామ్మలు, పిన్నీ బాబాయిలు, అత్తమ్మ మామయ్యలు, వారి పిల్లల సోదర సోదరీమణలు, మేనబావలు, మేనమరదళ్లు.. అందరూ కలిసి పెద్దపెద్ద ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు అలా ఎవరూ కలిసిమెలిసి ఉండటం లేదు. అసలు కన్నతల్లిదండ్రులే బరువైపోయి, వృద్ధాశ్రమాల్లో గడుపుతున్నారు.
ఈ మానవులే కలిసి లేనప్పుడు.. వాళ్లు మాట్లాడే అక్షరాలమైన మా ఉనికికి చోటెక్కడుంది..?!
ఒకప్పుడు పల్లెటూరిలో ఊరు ఊరంతా ఏవేవో వరుసలతో పలకరించుకుంటూ, మూకుమ్మడిగా ఉండేవారు. నేడు అభివృద్ధి చెందుతున్న నాగరికతతో నగరబాట పట్టిన మనుషులు అపార్ట్మెంట్ గోడల్లో ఇరుక్కుపోయి హడావిడి•గా జీవనం సాగిస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకూ పరుగులే పరుగులు..! కన్నపిల్లల క్షేమసమాచారం తెలుసుకునే సమయం చిక్కని ఉరుకులు పరుగులు..!
సంపాదనే ధ్యేయంగా యవ్వన కాలమంతా డబ్బు యావలో పడి, తినటాని క్కూడా సమయంలేని బిజీ బీజీ..! ఎవరి కోసం బ్రతుకుతున్నామో.. ఎవరి కోసం పరుగులు పెడుతున్నామో.. తెలియని అయోమయం..! అమాయకత్వం..!! చివరికి వాళ్లు సంపాదించిన ఆస్తిపాస్తులని లాగేసుకొని, వృద్ధాశ్రమాల్లో వదిలేసే పుత్రరత్నాలను చూస్తుంటే కోపం, ఉక్రోషం. చేతకాని వయస్సులో చావు కోసం ఎదురుచూసే గుండెబరువుతో గడుపుతున్న వృద్ధులను చూస్తుంటే, మా గుండె తరుక్కుపోతోంది.. రానురాను ఈ మానవ మనుగడ ఎలాంటి మార్పు చెందు తుందోనని ఆందోళన కలుగుతోంది..’’ అన్నాయి అక్షరాలు.
‘‘మీరు అంతరించిపోతున్నా.. ఈ మానవుల దుస్థితి ఆలోచిస్తున్నారంటే.. మీరు నిజంగా అక్షరాలే..! అక్షరాలంటే – ఒక్క ‘నాశనము లేనివి’ అర్థమే కాదు. ఓంకారం, జీవాత్మ, పరమాత్మ, పరబ్రహ్మం, మోక్షం.. అనే అర్థాలు కూడా ఉన్నాయి. అనంత విశ్వంలోంచి శబ్దతరంగాలుగా వచ్చే ‘ఓంకారం’ నుండి అక్షరాలుగా రూపాంతరం చెందారు. తెల్లనికాంతి నుండి అనేక రంగులుగా విడిపోయినట్లు.. మీరూ అక్షరాలుగా మార్పు చెందారు. ఏ అక్షరాన్ని ఎక్కడ ఉపయో గించాలో, వాటి అర్థం ఏమిటో తెలియక తికమకపడుతూ అక్షరాలని పట్టించుకోవడం లేదు. అక్షర దోషాలతో తప్పు భావం వస్తుందని గ్రహిస్తే, వారే సరిదిద్దుకుంటారు. త్వరలోనే పూర్తిస్థాయిలో మీ అక్షరాలకు మనుగడ వస్తుంది..’’ వివరించింది సరస్వతీమాత.
ఆ మాటతో సంతృప్తి చెందిన అక్షరాలు ‘‘నమో మాతా.. నమోస్తుతే..’’ అంటూ సవినయంగా నమస్కరించాయి.
* * *
వాగ్దేవి అనుగ్రహమో.. విద్యాసాగర్ శుభ సంకల్పమో.. తలచుకున్న వారం రోజుల్లోనే వారి కోరిక నేరవేరేలా తెలుగుభాషాభివృద్ధికీ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థకీ.. మార్గదర్శకం మొదలయింది!
గత ఇరవై సంవత్సరాలుగా వివాదంలో ఉన్న విద్యాసాగర్ స్థలం కోర్టు తీర్పుతో తిరిగి అతని స్వంతమైంది. విద్యాసాగర్ తరఫున వాదించిన లాయర్ జితేందర్ రెడ్డి ఆ విషయం చెప్పి, అందుకు సంబంధించిన కాగితాలు ఓల్టేజ్ హోమ్‌కు వచ్చి అందజేశారు. అది విన్న వెంటనే అదే లాయర్‌తో మాట్లాడి, ఆ స్థలాన్ని సరస్వతీదేవి ఆలయానికి ఇస్తున్నట్లు అగ్రిమెంట్ చేశాడు. ఆ వెంటనే రామనాథం, ధనుంజయ్‌లు.. సరస్వతీదేవి విగ్రహానికి, ఆలయ నిర్మాణానికి రూ.10 లక్షలు చందా ఇచ్చారు.
అనుకున్నదే తడవుగా.. రెండు నెలల్లోనే ఆ ఊరిలో సరస్వతీమాత ఆలయం నెలకొంది.
వృద్ధాశ్రమంలోని నలుగురు వృద్ధుల సంకల్పంతో ఆలయం నిర్మితమైందని మీడియా ద్వారా తెలుసుకున్న విద్యాశాఖ, దేవాదాయశాఖ మంత్రులు హర్షం వ్యక్తం చేశారు.
విద్యాసాగర్ కోరక మేరకు వసంతపంచమి రోజున.. వేదమంత్రోచ్ఛారణలతో విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది.
అది చూసిన అక్షరాలు ‘ఇలా ఊరుఊరున సరస్వతీమాత ఆలయాలు నెలకొంటే.. అక్షరం అక్షరంగానే బతుకుతుంది..’ అని ఆనందించాయి.
ఆలయ వ్యవస్థాపకునిగా విద్యాసాగర్ తొలిపూజ చేసి, మనస్ఫూర్తిగా ప్రార్ధించాడు.
‘‘సరస్వతీ నమస్తుభ్యం..
……………………….
సా మాంపాతు సరస్వతీ..’’
వచ్చేవారం కథ..
గృహపవ్రేశం
– రమాదేవి కులకర్ణి