ఆకాశవాణి. తెలుగు వార్తా విభాగం. జోళెపాళెం మంగమ్మ. న్యూస్ రీడర్.
‘వార్తలు చదువుతున్నది…’ అంటూ ఎంతోమంది శ్రోతలకు వినిపించిన స్వరం. ఇప్పుడు ఆమె జీవించి ఉంటే శత వసంతాలు.
రేడియో ప్రసిద్ధురాలిగానే కాదు…సాహిత్య, సామాజిక రంగాల్లోనూ ప్రవీణురాలు. తన ఇంటిపేరు జోలెపాళ్యం, జోలెపాలెం, జోలెపాళెం అని పలు రీతుల్లో ‘వినవస్తుంటే’ చిరునవ్వుతో స్పందించేవారు. ‘నేను రేడియో మంగమ్మని’ అంటుండేవారు. ఆ మాటల్లో వినమ్రత, సహనశీలత.అప్పట్లో దేశ రాజధాని నుంచి వార్తలు చదివిన సుప్రసిద్ధులలో ఒకరు. తెలుగు అకాడమీ నుంచి ఉగాది పురస్కృతి విజేత.జనన, మరణాలు రెండూ చిత్తూరు జిల్లా మదనపల్లెలో! ఆ జీవన ప్రస్థానం ఎన్ని మలుపులు తిరిగిందంటే…
మంగమ్మది వ్యవసాయ కుటుంబం. ఆమెకి మాత్రం చదువంటే ఎంతో ఇష్టం. మదనపల్లెలో బిసెంట్ థియొసాఫి•కల్ (బీటీ) కళాశాలలో చదివార. అనీబిసెంట్ బ్రహ్మజ్ఞానవాది. మేటి రచయిత్రి, దీటైన వక్త. అసలు పేరు అనీ, బిసెంట్‌ను పెళ్లాడి అనీబిసెంట్ అయ్యారు. పరిణామాల పర్యవసానంగా దివ్యజ్ఞాన సమాజ సభ్యురాలయ్యారు. ఆ పనుల్లో భాగంగానే లండన్ ప్రాంతం నుంచి మన దేశానికి వచ్చి, కేంద్రీయ హిందూ కళాశాల స్థాపనకు దోహదకారిగా నిలిచారు. నాడు ‘న్యూ ఇండియా’ పత్రిక సహ స్థాపకురాలు. ఆమె జాతీయవాద భావాలకు, జీవిత ఆదర్శాలకు ప్రభావితులయ్యారు మంగమ్మ. అందుకే బి.టి.కాలేజీలో డిగ్రీ చేశారు. పీజీ, బీఎడ్ తర్వాత ఢిల్లీలో డాక్టరేట్ సాధించారు.
విద్యాసంబంధ పరిశోధన చేస్తున్నపుడే, ఆ పక్రియ మీద అనురక్తి పెరిగి ఇతర రంగాలకు విస్తరించింది. తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషాంశాల మీదా మక్కువ పెంచుకున్నారు. ప్రత్యేకించి, పద ఉచ్ఛారణ గురించి. ఆంగ్లం, ఫ్రెంచి భాషల లోతుపాతులు తెలుసుకునేందుకు ప్రాచీన గ్రంథాలెన్నింటినీ సమగ్ర అధ్యయనం చేశారు.
పదాలు, పదబంధాలు, వాక్యాలు, వాటి నిర్మాణ రీతుల పరంగా ఎంతో తెలుసుకున్నారు. తెలుసుకున్నవాటిని ఇతరులకూ వివరించారు. కొంతకాలం బోధన సాగించారామె.
మూలపదాలు, వ్యాకరణం, విశేషణాలను విశ్లేషించే పని చేపట్టారు.మాటను పలికే విధానంలోనే అందం ఉంటుందని, ఉండాలనీ ఆమె నిశ్చిత అభిప్రాయం. అందుకు వీలుగా ఉపన్యాసంపైన చూపు సారించారు. ఆకాశవాణిలో చేరడానికి ముందు, ఆ తర్వాత కూడా బోధన వ్యాసంగానికే సమధిక ప్రాధాన్యమిచ్చారు.
నేషనల్ ఆర్కీవ్స్, లిఖితపత్రాలు / దస్తావేజులు, అలనాటి పద సంపదను భద్రపరిచే స్థలం. సరిగ్గా అదే ప్రాంగణంలో కొన్ని వేలగంటలు గడిపారామె. ఆ పత్రాలను చూస్తూ, చదువుతూ, అవగతం చేసుకుంటూ, విశిష్టతలను తన డైరీలో రాసుకుంటూ.
ప్రాచ్య లిఖిత భాండాగారం అంటే మాటలా? పురాతన వైభవమంతా అక్కడే కదా ఉంటుందీ! భారత రాజధానిలోనిది అతి పెద్ద వ్యవస్థ. ఆ సేవలన్నింటినీ చక్కగా వినియోగించుకున్నారు మంగమ్మ.
ఏ పదాన్ని ఎలా పలకాలో అలాగే పలికేవారు. అందులో ఒడుపు, సొగసు ప్రతిఫలించేది. వాక్యాన్ని ఎలా ఆరంభించి, కొనసాగించి, ముగించాలో ఆమెకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు.
ఉచ్ఛారణకు భావోద్వేగాల జోడింపువైనాన్నీ ఆ గొంతు విని తెలుసుకోవాలి ఎవరైనా! ఇంతటి ప్రతిభ, దక్షత ‘వార్తల చదువరి’గా ఆమె స్థానాన్ని సుస్థిరం చేసింది.
తెలుగు భాషలో ముద్రితమైన తొలి పుస్తకాలపైనే దృష్టి. ముద్రణ రంగం గురించిన ప్రత్యేక అభిరుచి. ఈ అన్నింటికీ జోడుగా దేశభక్తి, సాహసిక రీతి. ఆమెలో మరో విభిన్న కోణమూ ఉండేది. భారత రాజ్యాంగం, శాసనసభకు సంబంధించి. పార్లమెంటు సభ్యుల భావవ్యక్తీకరణ హక్కు గురించి వివరాలెన్నింటినో సమీకరించేవారు. హక్కులు, బాధ్యతలు, నిర్దేశక నియమాలు,ఆదేశిక సూత్రాలు…. ఈ పదాల మధ్య ఉండే చిన్నపాటి అంతరాల గురించీ ఎంపీలను ఆసక్తిగా అడిగి తెలుసుకునేవారు. ఆ తెలుసుకున్నవాటి ఆధారంగా వ్యాసరచనలు, సమీక్షలు చేయడం ఇంకో ఇష్టమైన పని.
విద్య, సారస్వతం, పాలన, రాజకీయం-ఈ నాలుగు రంగాలవారికీ మాటల మూటలే ఆస్తులు. ఏది ఎప్పుడూ ఎలా మాట్లాడాలో ఎంత బాగా తెలిసి ఉంటే అంత ఉన్నతంగా ఉంటుంది వర్తమానమైనా, భవిష్యత్తు అయినా. ఆమె ఆ మాటే అంటుండేవారు తరచూ.
అనేక సంత్సరాలుగా వార్తలు ఎడిట్ చేస్తూ, న్యూస్ రీడర్‌గా అనేక ప్రయోగాలు చేశారు.పుస్తకాలు రాయడం,వార్తలు చదవడంలో మీకు అభిమాన పాత్రమైనది ఏది? అన్న విలేకరుల ప్రశ్నకు….‘రాత, పఠనం – వీటి ఐక్యవేదిక ఆకాశవాణి. దశాబ్దాల చరిత అది. తెలుగు ప్రసారాలు మొదలయ్యాక ఎన్నెన్నో ఘన పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటిల్లో వార్తలకు ఎంతో విశిష్ట స్థానం కాబట్టే నాకు ఆకాశవాణిలో పని చేయడమే ఎంతైనా ఇష్టం. ఎంతో రాయవచ్చు. ఎంతైనా చదవవచ్చు. అయితే ఆ రాతలో అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవా ల్సిందే. వార్తలను చదవడంలో ఎప్పటికప్పుడు అప్రమత్తత వహించాల్సిందే. ఇవన్నీ వరాలుగా లభించాయి నాకు. అదృష్టశాలినని నాకు నేనే అనుకుంటాను. న్యూస్‌రీడర్ బాధ్యతలను అత్యంత పవిత్రంగా భావిస్తాను. నా సహచర వనితా మణులూ ఎందరో ఉన్నారు. కానీ, కాలక్రమణికలో ముందు వరసన చోటు కలగడం నా భాగ్యం’ అని వినయపూర్వక సమాధానమిచ్చారు.
రోజువారీ కార్యక్రమ సరళి ఎలా ఉండేదో ఆ కళాకారిణి మాటల్లోనే –
‘వార్తాప్రసారం తెల్లవారు జామున ఏడుగంటలకే మొదలయ్యేది. అందుకు కొన్ని గంటల ముందు నుంచీ సంసిద్ధ కావాలి. చాలా ముందుగా నిద్రలేచి ఏఐఆర్‌కి చేరేదాన్ని. అప్పటికే వచ్చి ఉన్న సమాచారాన్ని క్రోడీకరించుకోవటం అసలు పని. అదంతా కాగానే, వార్తాంశాలుగా రాసుకోవడం ప్రారంభమయ్యేది. ఆ వెంటనే న్యూస్ స్టూడియోలో రీడింగ్. అది కొన్ని నిమిషాల్లో పూర్తయ్యేది. అంటే – మొత్తం సంసిద్ధత అంతా ‘పావుగంట అయినా ఉండని రీడింగ్’ డ్యూటీ కోసమే!
అటు తర్వాత….
కొన్ని గంటల వరకు వ్యవధి లభించేది. మళ్లీ నిర్ణీత సమయానికి వార్తల చదువరి బాధ్యత! ఆలోగా పుస్తక పఠనం. చదవడం అంటే యథాలాపంగా కాదు. రికార్డులు, గణాంకాలు, మూలసమాచారాన్ని ఒక చోటకు తెచ్చుకోవడం. మనకుగా మనం చదువుకోవడం వేరు. వార్తలుగా గుది గుచ్చి శ్రోతలకు అందించడమనేది అదొక తీరు. వీటి మధ్య సమతుల్యం, అన్వయం కోసం శ్రమించేదాన్ని. అయితే అదంతా శ్రమగా అనిపించేది కాదు. ఇష్టంతో చేసింది కనుక సహజ సిద్ధంగానే ఉంటుండేది.
ఎప్పుడూ నూతనత్వం కోసం ప్రయత్నించాను. స్వరం, హెచ్చుతగ్గులు, భావ ప్రకటన, ఉచ్చరించే పద్ధతి, సమయాన్నీ సందర్భాన్నీ అనుసరించి మెలగడం… ఇవన్నీ ఆకాశవాణి నుంచే నేర్చుకున్నాను. ఎప్పుడు ఎంత చిన్న అవకాశం లభించినా, నా అడుగులు ప్రాచీన పత్రాల కేంద్రంవైపు పడేవి. స్టేషన్‌లో సాధన. భాండాగారంలో శోధన. వీటితో రోజులు పరుగులు తీసేవి. ఆ పరుగులో నేను అలిసిందంటూ లేదు. ఎప్పటికప్పుడే ఉత్తేజం పొందాను. నా సంతోషం. సంతృప్తీ ఇదే. వృత్తి, ప్రవృత్తి ఒక్కటై నన్ను నడిపించాయి.’
అధ్యయనంలో ‘నోట్సు’ రాసుకోవడం ఆమెలోని మరొక విశేషాంశం. అలా ఎన్నెన్నో నోట్సులు, ఫైల్సు, చుట్టూ ఉండేవి. ఒక్కమాటలో చెప్పాలంటే – నిబద్ధత.కేంద్ర సమాచార శాఖలో విధులు. విదేశాంగ విభాగంలో కర్తవ్యాలు. రెడ్‌క్రాస్ సొసైటీలో బాధ్యతలు. చరిత్ర అధ్యయన సంస్థలో భాగస్వామ్య పనులు. ఇవన్నీ ఆమె జీవిత అనుభవాలు.
విద్యారంగ సమున్నతికి ట్రస్టు స్థాపించి ఆధ్వర్యం వహించారు. గ్రామీణ అభివృద్ధి సంస్థకు అధ్యక్షురాలిగా వ్యవహరించారు. న్యాయసేవలు అందించే లోక్ అదాలత్‌లో సైతం తనవంతు సహాయాలు అందించారు.ప్రయోగాత్మక విద్యాకేంద్రం ఉపాధ్యాయ శిక్షణ వ్యవస్థల్లోనూ ఆమెది నిరుపమాన సేవ. ప్రతిఫలాన్ని ఎంత మాత్రమూ ఆశించని తత్వం.
ఫిబ్రవరి 01, 2017న ఆమె వెళ్లిపోయారు. స్వరాన్ని వరంగా మిగిల్చి! అందరి మనసులోనూ ఇప్పటికీ శాశ్వతంగా నిలిచే ఉన్నారు. ముఖ్యంగా 1960 ప్రాంతాల రేడియో శ్రోతలందరికీ!
వార్తలు చదవడం, చరిత్ర అంశాల్ని పరిశోధించి వెలుగులోకి తేవడం. వీటిని సరిసమాన స్థాయిలో నిర్వర్తించినందుకే మంగమ్మ చిరయశస్వి! ఆమె కథకురాలు. ‘స్టేషనుకు రండి’ శీర్షికలోనూ ‘రేడియో స్టేషను’ అనే అర్థం స్ఫురిస్తోంది కదూ! అదీ ఆకాశవాణికి, మంగమ్మకీ ఉన్న అవినావభావ అనుబంధం!
జంధ్యాల శరత్‌బాబు
సీనియర్ జర్నలిస్ట్