తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్
ఆంధప్రదేశ్ అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కొండంత అండగా ఉన్నారు. రాష్ట్రంలో ఎన్‌డిఏ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల కాలంలోనే రూ.3 లక్షల కోట్ల అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు కేటాయించిన మోదీ ఆంధప్రదేశ్ పట్ల తమ నిబద్ధ్దతను చాటుకున్నారు. రాష్ట్ర చరిత్రలో ఏ కేంద్ర ప్రభుత్వం చేయని రీతిలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. విభజిత ఆంధప్రదేశ్‌లో 2014 తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వానికి రూ. క్షల కోట్ల ప్రాజెక్టులు, నిధులు కేటాయించారు. రహదారులు, రైల్వేలైన్లు, ఓడరేవులు, పలు కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు కేటాయించారు. 2019లో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం కేంద్ర సాయాన్ని అందిపుచ్చుకోలేదు సరికదా విధ్వంసానికి పాల్పడింది. ఈ క్రమంలో 2024లో ఏర్పడిన తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీ, జనసేన (ఎన్డీఏ) కూటమి ప్రభుత్వం వెనుకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకువచ్చేందుకు కృషిచేస్తోంది. అందుకు అన్ని విధాలుగా ప్రధాని నరేంద్రమోదీ సహకరిస్తున్నారు. పంచాయతీలలో పండుగ కార్యక్రమంలో మౌలిక సదుపాయాలను మెరుగు పర్చడానికి కేంద్రం రాష్ట్రానికి రూ. 4 వేల కోట్లకు పైగా ఇచ్చింది. పల్లెల్లో రోడ్ల మరమ్మతులకు రూ.700 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.12,500 కోట్లు కేటాయించింది. పోలవరం నిర్మాణానికి రూ.15 వేల కోట్లు, దెబ్బతిన్న డయాఫ్రంవాల్ నిర్మాణం కోసం మరో రూ.900 కోట్లు ఇస్తామంది.
జనవరి 8న విశాఖలో పర్యటించిన ప్రధాని మోదీ రూ.2 లక్షల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థ్ధాపన, ప్రారంభోత్సవాలు చేశారు. 16న జరిగిన కేంద్రమంత్రి వర్గ సమావేశంలో విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.11,440 కోట్ల ఆర్థ్ధిక సాయం ప్రకటించింది. ఇక 19న విజయవాడలో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కృష్ణా జిల్లా కొండపావులూరు వద్ద ఎన్డీఆర్‌ఎఫ్ 20వ వ్యవస్థాపక వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ ప్రాంగణంలో నిర్మించిన ఎన్‌ఐడీఎం దక్షిణ సముదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఏపీకి సహకరిస్తాం : అమిత్‌షా
‘ఆంధప్రదేశ్ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ కొండంత అండగా ఉన్నారు. ఆ ఇద్దరి నాయకత్వంలో రాష్ట్రం మూడింతల ప్రగతి సాధిస్తుంది’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్‌ఐడీఎం దక్షిణ సముదాయం ప్రారంభం సందర్భంగా ఏర్పాటైన బహిరంగసభలో రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చారు. ‘సార్వత్రిక ఎన్నికల్లో మోదీ, చంద్రబాబుపై విశ్వాసంతో ఎన్డీయే కూటమిని గెలిపించిన ప్రతి ఒక్కరికీ నమస్కారాలు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ వచ్చేలాగానే, మానవ విధ్వంసం నుంచి కాపాడేందుకు ఎన్డీయే ముందుం టుంది’ అని వ్యాఖ్యానించారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే రాష్ట్రానికి రూ. మూడు లక్షల కోట్ల సహకారం అందించామన్నారు. అమరావతి నిర్మాణానికి నిధులిచ్చామని, 2028 నాటికి పోలవరం ప్రాజెక్టు నీళ్లు రాష్ట్రంలోని పొలాల్లో పారిస్తామన్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా రైల్వే జోన్ ఏర్పాటైందని, తాజాగా విశాఖ ఉక్కుకు ఊతమిచ్చి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మరింత పెంచామని అమిత్ షా పేర్కొన్నారు. విపత్తుల నిర్వహణ సంస్థలు ఒకేచోట ఉంటే విపత్కర పరిస్థితుల్లో సమన్వయం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నారు. గ్రామ స్థాయిలో ఎన్‌సీసీ ప్రతినిధుల నుంచి కేంద్ర ప్రభుత్వం వరకూ అన్నీ సమన్వయం చేసుకుంటేనే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని పేర్కొన్నారు. గతంలో ఒడిశాలో తుఫాన్‌లలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని, ఇటీవల రెండుసార్లు తుఫాన్లను ముందస్తు ప్రణాళికతో ఎదుర్కోవడం వల్ల ఒక్క ప్రాణం కూడా పోలేదని వివరించారు. ‘గతంలో ఉపశమనం తప్ప ముందు జాగ్రత్త చర్యలు ఉండేవి కావు. మోదీ ప్రభుత్వం జీరో క్యాజువాలిటీని లక్ష్యంగా నిర్దేశించుకుని పనిచేస్తోంది. దేశ, విదేశాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ ఎన్నో విజయాలు సాధించింది.
విపత్తుల్లో చిక్కుకున్న ప్రజలు ఎన్డీఆర్‌ఎఫ్ యూనిఫామ్‌లో ఉన్న వ్యక్తుల్ని చూడగానే ధైర్యం వచ్చిందని నాకు చాలా చోట్ల చెప్పారు. జపాన్, నేపాల్, మయన్మార్, టర్కీ తదితర దేశాల అధ్యక్షులు సైతం ఎన్డీఆర్‌ఎఫ్ సేవల్ని కొనియాడారు’ అని అమిత్ షా వివరించారు. అభివృద్ధి, సుపరిపాలనతో పాటు ఆర్థిక నిర్వహణలో మంచి అనుభవం ఉన్న చంద్రబాబునాయుడి కష్టానికి కేంద్రం తోడ్పాటు ఉంటుందని పునరుద్ఘాటించారు. గత వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిన రాజధాని అమరావతికి గడిచిన ఆరు నెలల్లోనే ఏపీ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచామని, ఇటీవలే రాష్ట్రపతి చేతుల మీదుగా ఎయిమ్స్ ప్రారంభమైందని, రాష్ట్రంలో రూ.1.20 లక్షల కోట్లతో జాతీయ రహదారులు నిర్మిస్తున్నామని అమిత్ షా వెల్లడించారు.
ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు
కేందప్రభుత్వం రూ.220 కోట్ల అంచనాలతో చేపట్టిన పలు పనులకు అమిత్ షా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కొండపావులూరులో యాభై ఎకరాల్లో నిర్మితమైన ఎన్‌ఐడీఎం భవనాన్ని ప్రారంభించారు. సుపాల్ తొమ్మిదో బెటాలియన్‌లోని రీజినల్ రెస్పాన్స్ సెంటర్(ఆర్‌సీసీ)తో పాటు హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్‌పీఏ)లో ప్రొబెషనరీ ఐపీఎస్‌లకు శిక్షణ ఇచ్చే ఇంటిగ్రేటెడ్ ఇండోర్ షూటింగ్ రేంజ్‌కు వర్చువల్‌గా శ•ంకుస్థాపన చేశారు. తిరుపతిలోని ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. జాతీయ, ప్రాంతీయ భాషల్లో రూపొందించిన ఎన్‌డీఆర్‌ఎఫ్ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. విశిష్ట ప్రతిభ కనబరిచిన తొమ్మిది మందికి రాష్ట్రపతి పోలీసు సేవా పతకాలను అమిత్ షా ప్రదానం చేశారు. ప్రకృతి విపత్తుల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ అందించే సేవలకు సంబంధించిన మాక్‌డ్రిల్‌ను తిలకించి, ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్లు
విశాఖ ఉక్కును ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించి పునరుజ్జీవింప చేయడానికి రూ. 11,440 కోట్ల ప్యాకేజీ అందించనున్నట్లు కేందప్రభుత్వం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ఆ మేరకు ఆమోదముద్ర వేసింది. ఈ ఆర్థిక ప్యాకేజీ తక్షణం అమల్లోకి వస్తుంది. స్టీల్ రంగంలో విశాఖ ఉక్కు ప్రధానమైన సంస్థ. విశాఖ ఉక్కు…పోర్టు ఆధారిత స్టీల్ ప్లాంట్. ఈ పరిశ్రమను ఏళ్ల తరబడి సమస్యలు వేధిస్తున్నాయి. త్వరలో రెండు బ్లాస్ట్ ఫర్నేస్లు ప్రారంభమవుతాయి. ఆగస్టు నాటికి 3 బ్లాస్ట్ ఫర్నేస్‌లు అందుబాటులోకి వస్తాయి. ముడిసరకు సరఫరా కోసం ఎన్‌ఎండీసీతో చర్చిస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఆత్మనిర్బరత్‌లో విశాఖ ఉక్కు కీలక పాత్ర పోషిస్తుంది. దేశ ఉక్కు అవసరాలు తీర్చడంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ది కీలక పాత్ర. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, కార్మికులకు శుభాకాంక్షలు తెలియచేశారు.
విశాఖ నుంచి అభివృద్ధి పథకాలు
విశాఖ పర్యటనకు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రూ.2 లక్షల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దీనిలో భాగంగా విశాఖ సమీపంలోని పూడిమడక వద్ద జాతీయ గ్రీన్ హడ్రోజన్ మిషన్‌లో భాగంగా రూ.1,85,000 కోట్ల్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయనున్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. రూ.149 కోట్లతో నిర్మించే దక్షిణ కోస్తా రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం, రూ.320 కోట్లతో చేపట్టే దువ్వాడ – సింహాచలం ట్రాక్ నిర్మాణం, రూ.159 కోట్లతో విశాఖ- గోపాలపట్నం ట్రాక్ నిర్మాణం, రూ.154 కోట్లతో గంగవరం పోర్టు, స్టీల్ ప్లాంట్ ట్రాక్‌ల నిర్మాణం, రూ.150 కోట్లతో బౌదర – విజయనగరం రోడ్డు విస్తరణ పనులతో పాటు, రూ.2,139 కోట్లతో కృష్ణపట్నం, పారిశ్రామిక పార్కు, రూ.4,593 కోట్లతో రోడ్ల నిర్మాణం, రూ.1,877 కోట్లతో నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్, రూ.3,044 కోట్ల తో ఏడు ప్రాజెక్టులకు, రూ.5,718 కోట్లతో 323 కి.మీ 3 రైల్వేజోన్లు, రెండు రాయలసీమ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతి రాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, టీజీ భరత్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవికుమార్, ఎంపీలు భరత్, సీఎం రమేష్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీని వాసరావు, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు.
ఆధునిక ఏపీని ఆవిష్కరిస్తాం: ప్రధాని మోదీ
ఆధునిక ఆంధప్రదేశ్‌ను ఆవిష్కరిస్తామని, రాష్ట్ర ప్రజల ఆశలకు మద్దతుగా ఉంటూ, అన్ని విధాల ఆదుకుంటామని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. విశాఖపట్నంలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జనవరి 8న జరిగిన బహిరంగ సభ వేదికగా రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రాష్ట్ర ప్రజల ప్రేమామానాలకు కృతజ్ఞతలు అంటూ, రాష్ట్రానికి తన అభిమానం చూపించే అవకాశం ఇప్పుడు వచ్చిందన్నారు. అరవై ఏళ్ల తర్వాత దేశంలో మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు లక్ష్యాలకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏపీకి అన్ని రంగాల్లో మద్దతుగా నిలుస్తున్నామని, రాష్ట్రంతో భుజం భుజం కలిపి నడుస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రాజెక్టులు రాష్ట్ర వికాసానికి తోడ్పడతాయని ప్రధాని వెల్లడించారు. దీంతోపాటు ఐటీ, టెక్నాలజీకి ఏపీ ప్రధాన కేంద్రం కానుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులు ఏపీ అభివృద్ధిని సరికొత్త శిఖరాలకు చేరుస్తాయన్నారు.