మోసగించిన కెరటాలను సైతం క్షమిస్తూ హుందాగా సాగిపోతున్న నౌకను స్ఫురింపచేస్తుంది ఆయన జీవనయానం. తంత్రులు తెగిపోతున్నా సుస్వరాలు వినిపించిన కవితాగానం ఆయన మాట. రాజకీయరంగంలో- భారత రాజకీయ రంగం-మీద ఆయన వ్యక్తిత్వం అరుదైన ఆవిర్భావం. ఆయన దృష్టి మట్టివాసనతో కూడిన పురోగతికి ఆవిష్కారం. భారతీయతకు సుదూరంగా జరిగిపోతున్న నాయకత్వ లక్షణాలను సమ్యక్ పథానికి మలిచే ప్రయత్నానికి ఆయనే నాందీ వాచకం. ఆయన పేరే అటల్ బిహారీ వాజపేయి. స్వతంత్ర భారత రాజకీయరంగం మీద ఆయనొక చెరగని సంతకం. భారతదేశానికి పరమవైభవ స్థితి కోసం కాలం కపాలం మీద పాత రాతను చెరిపేసి, కొత్త రాత రాసే ప్రయత్నం చేసిన స్రష్ట వాజపేయి. పాషాణం మీద పల్లవాన్ని వీక్షించిన ఆశావాది అటల్‌జీ. ‘నేను ఓటమిని అంగీకరించను/నేను సమరం చేయను’ అంటూ కృష్ణతత్వాన్ని జీవితానికి అన్వయించుకున్న కవి నేత.
సరళీకరణ, పారదర్శకత, వ్యవస్థీకృత సామర్థ్యం వంటి అంశాలకు ఆయన ఇచ్చిన మద్దతు తరువాతి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావడానికి పునాదిని నిర్మించి ఇచ్చాయి. భారత రాజకీయాల మీద ఆయన ముద్రనే కాదు, రాజనీతిజ్ఞుడిగానే కాదు, వ్యక్తిగా ఆయనను అంచనా వేయడమూ ఒక సవాలే. భారత విదేశాంగ విధానం మీద, దేశానికి అందవలసిన సుపరిపాలన మీద, ఇంకా చెప్పాలంటే హిందీ సాహిత్యం మీద ఆయన విడిచిన ముద్రలను అన్వేషించడం కూడా పెద్ద సవాలు. అందుకే వాజపేయి అంటే ప్లేటో కల్పనలోని ‘తత్త్వవేత్త అయిన పాలకుడి’కి ప్రతినిధిగా కనిపిస్తారని జేఎన్‌యూ వైస్ చాన్సలర్ ఆచార్య శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ ‘ది సండే గార్డియన్’ (డిసెంబర్ 25, 2024)కు రాసిన వ్యాసంలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు అంతా అంటున్న సాత్విక అధికారం అనే భావనలో ఆయన రాజకీయ చింతన మూలాలు ఉన్నాయి. సాంస్కృతిక బంధం ఉండాలి, ఆర్థిక ప్రయోజనం ఉండాలి. ఇదే సాత్విక అధికార విధానం. ఆయన ఉపన్యాసాలు, అందులోని పదబంధం ఎంత మధురమో, అంత తీక్షణం కూడా. అవి వెన్నెల ధారలు, అదే సమయంలో అగ్నిధారలు. ఎంత కవితాత్మకమో, అంత సూటిదనం. సమరనాదం, సామరస్య దృష్టి సమపాళ్లలో ప్రదర్శించడం వాజపేయి వాక్కుకే పరిమితం. పాకిస్తాన్ విషపుటాలోచనలను దృష్టిలో ఉంచుకుని ఆయన రాసిన ‘మస్తక్ నహీ ఝుకేగా’ (తలవంచం) కవిత జాతీయ భద్రత పట్ల ఆయన నిబద్ధతకు అద్దం పడుతుంది. కశ్మీర్ విషయంలో సీమాంతర ఉగ్రవాదానికే కాదు, అంతర్జాతీయ వేదికల ఒత్తిళ్లకు కూడా భారత్ తలొగ్గదని ఈ కవిత ప్రకటించింది. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమన్న నినాదంతో కన్నుమూసిన రాజకీయ గురువు శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయమే ఇందులోని ప్రతి అక్షరంలోను ధ్వనించింది.
అటల్‌జీ సైద్ధాంతిక భూమిక అమోఘమైనది. దానికి సాంస్కృతిక జాతీయవాదం, ఏకాత్మతా మానవతావాదం, విలువలకు కట్టుబడే నిబద్ధత పునాదులు. ఇందులోని నిజాయతీ, దేశభక్తి, నిబిడీకృతమై ఉన్న గాఢ చారిత్రక దృష్టి బీజేపీ ఎడల ఉన్న అంధ వ్యతిరేకతను పటాపంచలు చేశాయి.
ఆధునిక యుగానికి తగ్గట్టు దేశాన్ని తీర్చిదిద్దడం, కొత్త శతాబ్దాల వైపు జాతిని నడిపించడం దేశీయమైన చింతనతోనూ సాధ్యమేనని నిరూపిస్తూ వాజపేయి 11 సార్లు లోక్‌సభకు, రెండు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజనీతిజ్ఞత, కవితాత్మకత కలబోసిన ఉపన్యాసాలతో 47 ఏళ్లు పార్లమెంటును ఓలలాడిం చారు. వాజపేయిది వాగ్దేవి నర్తించిన జిహ్వ. హాస్య చతురత, చెణుకులు రాజకీయ ఉపన్యాసాలలో నిషిద్ధం కాదనీ, అవి వక్తృత్వానికి వన్నె తెచ్చేవేననీ భారత నేతలకు తెలియచెప్పిన రసహృదయుడు. మూడు దఫాలు ప్రధానిగా ఎన్నికయ్యారు. ఐదు దశాబ్దాల తరువాత భారత ప్రధాని పీఠం అధిరో హించిన తొలి కాంగ్రెసేతర ప్రధాని వాజపేయి. 24 పార్టీల ఆయన సంకీర్ణం తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం. ప్రధానిగా రెండవ దఫా పదవిని స్వీక రించిన తరువాత పోఖ్రాన్ అణుపరీక్షను (అదే ఆపరేషన్ శక్తి) ధైర్యంగా నిర్వహించారు. అది గొప్పతనం కోసం, కీర్తి కోసం ఆరాటం కాదు. వర్తమాన ప్రపంచంలో మాతృభూమి కోసం ప్రపంచాన్ని ధిక్కరించిన ధీరత్వం. దేశ భద్రతపై జాతి అభిప్రాయంలో ఇదొక విస్ఫోటనం. సెక్యులరిజం అనే దగా నుంచి, ఉదారవాదం అనే వెన్నుపోటు నుంచి జాతిని రక్షించడానికి భారతీయ జనసంఘ్, భారతీయ జనతాపార్టీలు అవిశ్రాంతంగా యుద్ధం చేశాయంటే అందుకు వాజపేయి వంటి మడమ తిప్పని సేనానులే కారణం. చిన్న అవకాశంలోను మేరువును అధిరోహించే ప్రయత్నం చేశారాయన. విజయమూ సాధించారు. అయినా దేశంలో రాజకీయం పేరుతో సాగిపోతున్న సర్వ విధ్వంసం గురించి, సకల భ్రష్టత్వం గురించి ఆయన గుండె మండుతూనే ఉండేది. ‘ఈ అధికార దాహార్తులను చూసి ఐదు వేల ఏళ్ల మన సంస్కృతి గర్వించాలా? దుఃఖించాలా? స్వార్థం కోసం అంతులేకుండా సాగిపోతున్న• ఈ పరుగులో చివరికి మనం స్వాతంత్య్రాన్నే కోల్పోతాం సుమా!’ అని హెచ్చరించారాయన. అందుకే రాజకీయ అనిశ్చితి యుగానికి ఆయన పాలన సమాధానంగా నిలిచింది. 1996లో 13 రోజులకే తన ప్రభుత్వం కూలినప్పుడు, 1998లో 13 మాసాలకే కూల్చినప్పుడు భారత పార్లమెంట్ సాక్షిగా ఆయన ఇచ్చిన ఉపన్యాసాల• చరిత్ర విస్మరించలేనివి. అది తన ఓటమి కాదని, తన పార్టీ వైఫల్యం కాదని విధర్మీయ చింతన, విదేశీ సిద్ధాంతాలు దేశాన్ని ఇంకా మోసగించే ప్రయత్నంలో ఉన్న ఫలితమేనని ఆ రెండు పర్యాయాలు అటల్‌జీ గర్జించారు. ఇంత గొప్ప చరిత్ర ఉన్న దేశంలో, స్వాతంత్య్ర పోరాటం నడిపినట్టు చెప్పుకునే పార్టీ ఇంకాస్త విధ్వంసం చేయాలన్న ఉద్దేశంతోనే జాతీయ భావాల పార్టీని గద్దె దించిందన్న గుట్టును విప్పారు. అంత నిరాశలోను ఆయన ఆశాజ్యోతినే వీక్షించారు. బీజేపీ ఆవిర్భావ వేళ 1980లో ముంబై వేదికగా ఆయన చెప్పిన మాటలు చిరస్మరణీయమని చెప్పక చెప్పారు. చీకటి తొలగిపోతుంది, వేకువ వస్తుంది, కమలం వికసిస్తుంది అన్నారాయన.
రైట్ మ్యాన్ ఇన్ ది రాంగ్ పార్టీ అని ఎంతమంది ఎద్దేవా చేసినా ఆయన కమలం నీడలోనే ఉన్నారు. ఆయన రాజకీయం, ఆయన ప్రజాసేవ, చింతన అన్నీ ఎన్నికల గెలుపోటములతో, పదవీ వైభోగాలతో ముడిపడినవి కానేకాదు. ఒక్క ఓటు కోసం తనవైన విలువలను కాస్త సడలించి ఉంటే, ప్రధానిగా కొనసాగి ఉండేవారు. కానీ చరిత్ర ఒక మహోన్నత నేతకు సంబంధించిన వాక్యాలను కోల్పోయి ఉండేది. అది తెలుసు వాజపేయికి. అందుకే ఆయన తన జీవితం మీద పడే మచ్చ కంటే, పార్టీకి మిగిలే అపకీర్తి కంటే, చరిత్రలో తన పేరు పక్కన చేరే హేళనాత్మక వ్యాఖ్యలకే భయపడ్డారు. అంతరాత్మను అందలం ఎక్కించారు. ఆయన పదవి నుంచి దిగిపోయారు. ఒక్క ఓటుతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. ప్రభుత్వాలను నిలుపుకోవడానికి పార్టీలకు పార్టీలనే చీలుస్తూ ప్రజాస్వామిక హత్యలు యథేచ్ఛగా సాగిన కాలంలో ఇది అపూర్వం.
1996లో బీజేపీ పార్లమెంటులో మెజారిటీ స్థానాలు ఉన్న పార్టీ. ఆ మేరకు రాష్ట్రపతి అవకాశం ఇచ్చారు. అటల్‌జీ ప్రధాని అయ్యారు. కానీ సభలో మెజారిటీ లేదు. తాను రాజీనామా చేస్తున్నానని చెప్పడానికి సభలో దాదాపు 90 నిమిషాలు వాజపేయి చేసిన ప్రసంగం, అప్పటికి పార్లమెంటు సాక్షిగా ఓడిన పార్టీని, దేశ ప్రజల హృదయాలలో ప్రభంజనంలా తాకింది. తరువాత గెలిపించింది. భారత రాజకీయాలను అనిశ్చితిని మరింత అనిశ్చిత స్థితి వైపు శరవేగంగా తీసుకుపోతున్న నాటి వాతావరణాన్ని వాజపేయి దేశ ప్రజల దృష్టికి తెచ్చిన తీరు నభూతో నభవిష్యతి. నాడు కాంగ్రెస్ కూటమిలో 14 పార్టీలు ఉన్నాయి. అవన్నీ ఎన్నికలలో కలసి పోటి చేసినవి కాదు. పోలింగ్ కేంద్రాలలో కాంగ్రెస్ వ్యతిరేకమే. కానీ పార్లమెంటు ప్రాంగణంలో బీజేపీ వ్యతిరేక అజెండాతో చేతులు కలిపాయి. ఇలాంటి పతనం కాంగ్రెస్, దాని మిత్రులలోనే కనిపిస్తుంది. దీనిని దేశ ప్రజల మనసుకు హత్తుకుపోయేలా చెప్పడంలో వాజపేయి చూపిన ప్రతిభ అనిర్వచ నీయం. అయితే అది ఊకదంపుడు కాదు. ప్రమాదపుటంచులకు చేరుతున్న భారత రాజకీయ దిగుజారుడును అడ్డుకునే ప్రయత్నమనే చెప్పాలి. అది తరువాతి ఎన్నికలలో ప్రతిఫలించింది కూడా. అందుకే పరాజయంలోను అటల్‌జీని నాటి దేశ ప్రజలు ఆకాశమంత ఎత్తులో దర్శించారు. 1996, మే 27,28 తేదీలలో భారత ప్రజానీకం సాక్షాత్తు పార్లమెంటు వేదికగా గీతోపదేశం విన్నది. దేశం ఎప్పటికీ గుర్తుంచుకోదగిన, కుళ్లు రాజకీయాల పట్ల ఒక స్పృహను కలిగించే సందేశం ఆయన వినిపించారు.
‘ప్రజాతీర్పు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉంది. కాంగ్రెస్ బలం సగానికి తగ్గిపోయింది. విభిన్న ప్రదేశాలలో వేర్వేరు పార్టీలు కాంగ్రెస్‌ను ఓడించాయి. ఇప్పుడు ఆ పార్టీలే కేంద్రంలో తిరిగి కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ కూడా తగుదునమ్మా అంటూ తయారైంది. మిమ్మల్ని ప్రజల తిరస్కరించారు. మమ్మల్ని పూర్తిగా అంగీకరించలేదు. అయితే వేర్వేరుగా పోరాడిన వారు ఇప్పుడు కలసి ప్రజాతీర్పు మా పక్షాన్నే ఉందంటున్నారు. ఇదెక్కడి విచిత్ర తర్కం?’ అని ఆయన వేసిన ప్రశ్న క్షుద్ర రాజకీయ చరిత్రను ఎప్పుడూ నిలదీస్తూ ఉండేదే. లోక్‌సభలో బీజేపీ ఎక్కువ స్థానాలు సాధించిన పార్టీ కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ఆహ్వానించారు. మేం విశ్వాస తీర్మానంలో నెగ్గడానికి ప్రయత్నించాం. కానీ కొన్ని పార్టీలు తమ ఓట్లు పోతాయి కాబట్టి సమర్ధించలేమని చెప్పాయి. ఇక్కడే ఒక ప్రశ్న. జాతి ప్రయోజనాలను కూడా త్యజించి ఓట్ల కోసం పాట్లు పడతామా? అని వాజపేయి వేసిన ప్రశ్న ఎప్పటికీ విలువైనదే. దేశంలో ఎక్కువ పార్టీలకు ఇప్పటికీ ఆయన ప్రబోధం తలకెక్కలేదు. 12 శాతం ఉన్న మైనారిటీలు ముస్లింలు. సిక్కులు 2 శాతం ఉన్న మైనారిటీలు. వీరి గురించి మీరెందుకు మాట్లాడరు అని ఆనాడే వాజపేయి నిలదీశారు. ఈ దేశంలో మైనారిటీలు అంటే ముస్లింలు మాత్రమే అనే భావనకు బలం చేకూర్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుంది. 1984లో తాము సిక్కులకు అనుకూలంగా మాట్లాడి నష్టపోయామని వాజపేయి గుర్తు చేశారు.
తన మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ను ఆ చర్చలోకి లాగినందుకు కూడా వాజపేయి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మీకు ఆర్‌ఎస్‌ఎస్‌తో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. కానీ ఇక్కడ వినిపించిన ఆరోపణలకు అర్ధమే లేదని తేల్చి చెప్పారాయన. వాజపేయి సమయస్ఫూర్తికి గీటురాయి వంటి ఒక ఉదంతం అప్పుడే పార్లమెంటులో జరిగింది. అటల్‌జీ దిగిపోతే హెచ్‌డి దేవెగౌడ ప్రధాని కావడం ఖాయం. అయితే ఆయన కూడా ఒక సందర్భంలో ఆర్‌ఎస్‌ఎస్ సేవలను శ్లాఘించారని అటల్‌జీ గుర్తు చేశారు. దీనితో కాంగ్రెస్‌లోని సంకీర్ణ పేకమేడ ఎక్కడ కూలిపోతుందోనని అన్ని బీజేపీయేతర పక్షాలు చేసిన అల్లరి జుగుప్సాకరం. అప్పుడే గొడవ చేసిన కమ్యూనిస్టులకు కూడా వాపేయి కర్రు కాల్చి వాత వేశారు. 1962 చైనా దురాక్రమణ తరువాత జరిగిన గణతంత్ర దినోత్సవంలో పాల్గొనడానికి ప్రథమ ప్రధాని నెహ్రూ ఆర్‌ఎస్‌ఎస్‌ను ఆహ్వానించారే కాని, కమ్యూనిస్టులను కాదని గుర్తు చేశారు. అటల్‌జీ కుళ్లు రాజకీయం చేయరు. ఆయన జీవితంలో అలాంటి దాఖలాలు లేవు. కానీ ఆయన సమయం చూసి చేసే ప్రకటనలు విపక్షాల కూసాలు కదిల్చేవి. తరువాత అదే జరిగింది. ప్రధాని పదవికి రాబోతున్న దేవెగౌడ అత్యవసర పరిస్థితి (1975) వేళ ఆర్‌ఎస్‌ఎస్ చేసిన త్యాగాలను శ్లాఘించారన్న మాట ఆనాటి పరిస్థితులలో కాంగ్రెస్ కూటమికి గొడ్డలి పెట్టు. అది పేపర్ క్లిప్పింగ్‌తో సహా చూపడంతో పెద్ద గొడవే రేగింది. దానికి వాజపేయి ముక్తాయింపు, ‘దేవెగౌడ ఆర్‌ఎస్‌ఎస్‌ను సరిగా అర్ధం చేసుకున్నా’రన్న మాట. అలాగే గణతంత్ర దినోత్సవానికి నెహ్రూ ఆర్‌ఎస్‌ఎస్‌ను ఆహ్వానించడం అనే మాట ఉదారవాదిలో వచ్చిన మార్పును, ఇప్పటికీ మారని పిడివాదుల ధోరణినీ ప్రతిబింబించింది. అదీ వాజపేయి మాటలోని పదను, లోతు. చారిత్రకత.
భారతీయ జనసంఘ్‌కు ఒక తాత్వికత ఉంది. దార్శనికత ఉంది. ఆ విషయం నాటి ఆ సంస్థ నాయకుల మాటలలో వెల్లడి అవుతూనే ఉండేది. చాలామంది అనుకుంటున్నట్టు జనసంఘ్ కాంగ్రెస్ ‘దుశ్శాసనానికి’ ప్రతిక్రియగా ఉద్భవించలేదు. భారతీయ జీవన వికాసానికి సంబంధించిన మహత్త లక్ష్య సాధన కోసం అవతరించింది అని చెప్పారాయన. ఆ సందర్భంలోనే ఆయన చెప్పిన ఒక విలువైన మాట ఉంది. ‘ఈ దేశాన్ని విదేశాల కార్బన్ కాపీగా మార్చడాన్ని జనసంఘ్ వ్యతిరేకిస్తున్నది. విదేశాల అనుభవం నుంచి గ్రహించడానికి మనం వ్యతిరేకులం కాదు. కానీ విదేశాల పూజారులంగా మాత్రం తయారు కావడాన్ని సహించలేం. మన దేశ పరిస్థితులు, భారతీయత గీటురాయిపై విదేశాల అనుభవాలను పరిశీలిస్తాం… వర్తమాన పరిస్థితులను పురస్కరించుకుని భవిష్యత్తును నిర్మించుకొనడం జనసంఘ్ లక్ష్యం’ (జాగృతి, 13.5.1960) అన్నారాయన. జనసంఘ్‌కు కొనసాగింపు బీజేపీ. కానీ కొన్ని సవరణలు ఉన్నాయి. లక్ష్యాలు మాత్రం అవే. నిర్మాణాత్మక దృక్పథం కలిగి ఉన్న ఏ రాజకీయ పక్షమైనా, సామాజిక సంస్థ అయినా ఈ మాటలను గీటురాళ్లుగా తీసుకొనవలసి ఉంటుంది. వాజపేయి తలుచుకోవడం అంటే భారత్‌ను నిర్మాణాత్మకంగా మలిచే కృషిలో, చింతనలో భాగస్వాములం కావడమే. అది ఎప్పటికీ అవసరం.
– డా. గోపరాజు నారాయణరావు
తలవంచలేము
వీగి పోతామేమోగాని
తలవంచలేము
సత్యం సంఘర్షణ శక్తితో
న్యాయ పోరాటం నిరంకుశత్వంతో
చీకటి ఎలుగెత్తి పోటీకి పిలిచింది
అంతిమ కిరణం అస్తమైపోతుంది
నిష్ఠాదీపాన్ని తొణికిపోకుండా..
వజ్రాఘాతమే కానివ్వు
భూకంపమే రానివ్వు
ఇది సరిసమాన యుద్ధం కాదు
మేము శూన్యహస్తులం వారు సన్నద్ధులు
అన్ని రకాల శస్త్రాల నిపుణులు
ఇక పశుత్వం నిర్లజ్జయై ఎగిసినా
మరల మరల పోరాడతాం
అంగదుడు సాగించే దౌత్యంతో
ప్రాణం పణంగా పెట్టి చేస్తాం ప్రతీకారం
సమర్పణ భావం ఇక అప్రస్తుతం
పోటీలో పెట్టేశాం అన్నీ
ఆగలేమిక..
వీగి పోతామేమోగాని తలవంచలేము
మూలం : అటల్ బిహారి వాజపేయి
అను: శ్రీపెరంబుదూరు నారాయణరావు