సంపాదకీయం
శాలివాహన 1946 శ్రీ క్రోధి పుష్య శద్ధ సప్తమి – 06 జనవరి 2025, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
దేశం పట్ల గౌరవం, సమాజం పట్ల జవాబుదారీతనం ఉన్న ఒక వర్గం పత్రికలు, శీర్షికలు నిర్వహించే మేధావులు ప్రస్తావించేవారా పేరు. తరువాత కాంగ్రెస్‌ను దుయ్యబట్టడానికి బీజేపీకి ఆయుధంగా మారినది కూడా ఆ పేరే. చివరికి ఒక గుడిసె మీద పడిన నిప్పు రవ్వ మొత్తం చుట్టబెట్టినట్టు ఇవాళ ఆ పేరు పార్లమెంటులో, మీడియాలో పదే పదే ప్రస్తావించక తప్పని వాతావరణం ఏర్పడిరది. 2024 నాటికి భారత రాజకీయాలను శాసించే స్థాయికి, పార్లమెంట్‌ను కుదిపే స్థితికి చేరింది. ఆ పేరే జార్జ్ సోరోస్. ఆ పేరుతో విపక్షాలు దేశ రాజకీయాలను ఇంకాస్త దిగజార్చాయి. సోరోస్ అంటే భారత్ నుంచి భారతీయ మూలాలను పెకలించాలన్న ధ్యేయంతో నిరంతరం కుట్రలు సాగించేవాడు. చిత్రాతిచిత్రమైన అంశం`కోట్లకు పడగలెత్తిన ఈ అమెరికా వ్యాపారవేత్త వేసే బిస్కెట్లకు అర్రులు చాస్తూ, భారత వ్యాపార దిగ్గజం ఆదానిని విమర్శించడం. కాంగ్రెస్‌కీ, దాని తొత్తులకీి అమెరికా పారిశ్రామికవేత్త పూజనీయుడు, భారత పారిశ్రామికవేత్త దోపిడీ దొంగ.
సోరోస్…94 ఏళ్లు మీదపడి, కాటికి కాళ్లు చాచిన అమెరికా పారిశ్రామికవేత్త. అసలు హంగరీ జాతీయుడు. ఇక్కడి కాంగ్రెస్ తప్ప, ప్రపంచంలో ఏ ఒక్కరు సోరోస్‌ను గౌరవించినట్టు కనిపించదు. మరి అమెరికాలో కూర్చుని, ఈ ముదిమిలోను ఇంత విధ్వంసం ఎలా సృష్టిస్తున్నాడు? ఇతడికి ప్రపంచ వ్యాప్తంగా సంస్థలు ఉన్నాయి.వీటి పనేమిటి? ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామిక ప్రభుత్వాలను పనిగట్టుకుని కూల్చడం. ఇందులో క్రైస్తవ మత వ్యాప్తి కోణం సుస్పష్టం. ఇతడు కుమ్మరించే నిధులలో ఈ పనికే ఎక్కువ వాటా. నకిలీ రైతు ఉద్యమాలు, షాహీన్‌బాగ్ తిష్టలకు అదే పెట్టుబడి. విద్యకు కూడా సాయం చేస్తానని అంటాడు కాని, అది ఐదు శాతం. ప్రభుత్వాల కూల్చివేతకు 35 శాతం. ఏ దేశంలోనైనా వాటి జాతీయ ప్రయోజనాలు నెరవేరకుండా చేయడమే ఆ సంస్థల పని. ఇందుకు ప్రతి దేశంలోను కాంగ్రెస్ వలెనే, విదేశీ మూలాలు, అధికారమే పరమావధిగా ఉండే పార్టీలూ, వ్యక్తులూ ఉన్నారు. ఇక్కడ అలాంటి పాత్ర పోషిస్తున్నవాళ్లుగా సోనియా, రాహుల్, ప్రియాంక వాద్రా ఎనలేని కీర్తి సంపాదించుకున్నారు. సోరోస్ నడిపే ఓసీసీఆర్‌పీ (ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్)తో చాలామంది కాంగ్రెస్ నేతలకు, ముఖ్యంగా గాంధీ`నెహ్రూ కుటుంబానికి సంబంధం ఉందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా బాహాటంగానే ఆరోపించారు. ఈ సంస్థ ప్రథమ కర్తవ్యం ఏమిటంటే, ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో వ్యవస్థలలో కల్లోలం సృష్టించడం. ఇవన్నీ పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ మీద బీజేపీ సంధించిన విమర్శనాస్త్రాలని గ్రహించాలి. వీటిని కాంగ్రెస్ పెద్దలు సుస్పష్టంగా ఖండిరచకపోవడం మరీ విచిత్రం.
నరేంద్ర మోదీని ప్రధానిని కానివ్వనని శపధం చేసిన మనిషి సోరోస్. ఆ దురద అతడికెందుకు? 2024 ఎన్నికలకు చాలా ముందే సోరోస్ ఆ కుట్రలకు తెరతీశాడు. ఫిబ్రవరి 17, 2023న మ్యూనిచ్‌లో ఏర్పాటు చేసిన భద్రతా గోష్టిలో ప్రస్తుత భారత్ ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తానని ప్రతిన పూనాడు. మోదీకి ఆదాని మిత్రుడని ఈ ముసలి పీనుగు కూసింది కూడా ఆ సభలోనే. అన్ని రకాలుగా విఫలమైన సోరోస్ హిండెన్ బర్గ్ నివేదిక ద్వారా భారత్ ఆర్థిక పరిస్థితిని కల్లోల పరచాలని ప్రయత్నించాడు. ఇలాంటి విదేశీ కుట్రదారులను భారతీయులు, భారత రాజకీయ పార్టీలు కలసి కట్టుగా ఎదుర్కొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు నిన్న డిసెంబర్‌లోనే పిలుపునిచ్చారు. దీనికి కాంగ్రెస్ ఎడమొహం పెడమొహం పెట్టి సోరోస్ పట్ల తమ ప్రేమానురాగాలను చాటుకుంది. ఉండదా మరి! సోరోస్‌దే, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్‌తో సోనియా గాంధీకి సంబంధం ఉంది. ఏం? ఉండకూడదా? అని ప్రశ్నించేవారికి ఒక విన్నపం. కశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా చూడడం ఈ సంస్థ ధ్యేయం. దీనిని ఏమనాలి? ఓపెన్ సొసైటీ నిధులతో పనిచేసే ఫోరమ్ డెమాక్రటిక్ లీడర్స్ ఇన్ ఆసియా పసిఫిక్ సంస్థకు సాక్షాత్తు సోనియా కో`ప్రెసిడెంట్. దీనికీ రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కీ బంధం ఉంది. భారత్‌ను ఏకం చేసే పేరుతో విచ్ఛిన్నం చేయడానికి సాగిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సలీల్ శెట్టి సోరోస్ మనిషి. భారత్‌లో సామాజిక, రాజకీయ కల్లోలం సృష్టించడమే ధ్యేయంగా ఉన్న దుష్టుడితో, అతడి సంస్థలతో సన్నిహితంగా మెలుగుతున్న సంస్థ కాంగ్రెస్.
సోనియాకూ, ఆమె పుత్రరత్నానికీ ఈ దేశం మీద గౌరవం లేదు. ఎదుటివారిని కనీసంగా గౌరవించే సంస్కారం కూడా లేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూయడంతో బీజేపీ ప్రభుత్వం ఏడు రోజులు సంతాపదినాలు ప్రకటించింది. కానీ రాహుల్ విదేశాలలో విహరిస్తూ విలపించదలుచుకున్నాడు కాబోలు. వియత్నాం యాత్రకు వెళ్లిపోయాడు. స్వాతంత్య్రం కోసం విదేశీయుల మీద పోరాడామని చెప్పుకునే కాంగ్రెస్, స్వతంత్ర భారతదేశంలో ఇంత దేశ వ్యతిరేకతను ఎలా మూటకట్టుకుంటున్నది? ప్రపంచమంతా ఈసడిస్తున్న సోరోస్ వంటివాడి తోక పట్టుకుని ఎన్నికల గోదాను ఈదాలని ఎందుకు అనుకుంటున్నది? శరద్ పవార్, పీఏ సంగ్మా వంటి వారు కాంగ్రెస్‌ను ఎందుకు వీడి వెళ్లారో మనందరికీ గుర్తుంది. అందులో సోనియా విదేశీయతే ప్రధాన పాత్ర పోషించింది. కాంగ్రెస్‌ను వీడి వారేదో సాధించారని కాదు. ఒక గొప్ప సత్యం దేశం ముందు పెట్టారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మేలుకోవాలి. మనం మన మూలాల కోసం వెతుకుదాం. ఇంకా విదేశీ గాలాల వెనుక ఎందుకు? కొత్త సంవత్సరంలో అయినా భారతీయ చింతనతో రాజకీయాలు సాగాలని ఆశిద్దాం.