‘అధికారంలోకి రావాలంటే అణచివేతకు గురైన వర్గాల్లో ఆశలు రేపాలి. అసంతృప్తిగా ఉన్న వర్గాల అభిలాషలను తెలుసుకోవాలి. ప్రజల కష్టాలు, ఆశలను గమనించి అందుగు తగ్గట్టు ప్రణాళికలు రూపొందించుకోవాలి. అధికారంలో ఉన్న వారిలో అసంతృప్తులను పసిగట్టి వారిని తమకు అనుకూలంగా మల్చుకోవాలి. దీంతోపాటు మన చుట్టూ ఉన్న వారి పట్ల అపమ్రత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు వారి కదలికల్లో, నడతల్లో తేడాలను పసిగట్టాలి. బాధ్యతారాహిత్యులను నమ్మకూడదు. పొగడ్తలతో, తప్పుడు సలహాలతో పక్కదారి పట్టించేవారిని దూరం పెట్టాలి. అనుభవమున్న వారిని ప్రోత్సహించాలి…’ చాణక్యుడు చెప్పిన ఈ రాజనీతి సూత్రాలు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి సరిగ్గా సరిపోతాయి. బీజేపీకి రాష్ట్రంలో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటే అధికారం అసాధ్యమేమి కాదు.
తెలంగాణ సాధనలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో పాటు కీలక పాత్ర పోషించిన బీజేపీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆశించిన ఫలితాలు పొందలేకపోయింది. కొత్త రాష్ట్రంలో 2014లో జరిగిన మొదటి శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమ పార్టీగా సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ వరుసగా రెండోసారి 2018లో కూడా పగ్గాలు చేపట్టారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ప్రజా వ్యతిరేకత పెరిగిపోవడంతో 2023లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు అధికారాలను అనుభవించగా, తెలంగాణ ఉద్యమానికి మొదటి నుండి మద్దతుగా నిలిచిన బీజేపీ మాత్రం వరుసగా మూడుమార్లు కూడా విఫలమవడానికి ప్రధాన కారణం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక పోవడమే. రాష్ట్రంలో పార్టీకి ఉన్న బలాన్ని పటిష్టపర్చు కోలేకపోవడమే.
ప్రత్యేక తెలంగాణలో మొదటిసారి 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకొన్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో 7.10 శాతం ఓట్లతో 5 స్థానాలు, లోక్‌సభ ఎన్నికల్లో 10.46 శాతం ఓట్లతో 1 స్థానం గెలిచింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 6.98 శాతం ఓట్లతో 1 స్థానం, 2019 లోక్‌సభ ఎన్నికల్లో 19.65 శాతం ఓట్లతో 4 స్థానాలు, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 13.90 శాతం ఓట్లతో 8 స్థానాలు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో 35.08 శాతం ఓట్లతో 8 స్థానాలు గెలిచింది. 2016లో గ్రేటర్ ఎన్నికల్లో కేవలం 4 స్థానాలే గెలిచిన బీజేపీ ఎవరూ ఊహించిన విధంగా, 2020 జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికల్లో బీజేపీ 48 వార్డుల్లో గెలిచి తన సత్తా చాటింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే 2018 అసెంబ్లీ ఎన్నికలు మినహాయించి మిగతా అన్ని ఎన్నికల్లోనూ బీజేపీకి చెప్పుకోతగ్గ ఫలితాలు వచ్చాయి. ప్రధానంగా 2019 పార్లమెంట్ ఎన్నికల అనంతరం తెలంగాణలో బీజేపీ బాగా పుంజుకుంది. ఇదే సమయంలో వివిధ కారణాలతో 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో, 2021లో జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ గెలుపులతో 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కనిపించింది. కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. ఈ దశలో బీజేపీ చేసిన కొన్ని స్వీయ తప్పిదాలు 2023 రాష్ట్ర శాసనసభ ఎన్నికల నాటికి కాంగ్రెస్‌కు వరంగా మారాయి.
రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచి ఉత్సాహం మీదున్న బీజేపీకి మునుగోడు ఉప ఎన్నిక శాపంగా మారింది. అప్పటి సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి రాజీనామా చేసి బీజేపీ తరఫున పోటీ చేయగా, బీఆర్‌ఎస్ అంగ, అర్థ బలం ముందు ఓడిపోయారు. మరోవైపు సైద్ధాంతికంగా బీజేపీ అంటే పొసగని వామపక్షాలు బీజేపీ ఓటమే లక్ష్యంగా అప్పటివరకు ఒకరంటే ఒకరు పడని బీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచారు. రాష్ట్రంలో రెండు ఉప ఎన్నికల్లో గెలిచిన బీజేపీ మునుగోడులో కూడా గెలిచుంటే అప్పటికే అవకాశం కోసం ఎదురుచూస్తున్న బీఆర్‌ఎస్ పార్టీలోని కీలక నేతలు బీజేపీలో చేరేవారు. మునుగోడులో బీజేపీ ఓడిపోవడంతో ఆ పార్టీ బలంపై నమ్మకం సన్నగిల్లడంతో పలువురు కీలక బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరి ఇప్పుడు రేవంత్‌రెడ్డి సర్కారులో మంత్రులుగా ఉన్నారు. కొని తెచ్చుకున్న మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత బాధ్యతారాహిత్యంగా రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరడంతో బీజేపీలో చేరాలనుకునేవారికి తప్పుడు సంకేతాలు పంపినట్టయ్యింది.
పార్టీ బలం పెరగ్గానే పొలోమని పార్టీలో చేరేవారి పట్ల అవగాహన ఉండి ఉంటే బీజేపీకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల్లో ఇప్పుడు దాదాపు 40 మంది ప్రస్తుతం పార్టీలో లేరు. సిద్దాంతాలపై నమ్మకాలు లేకుండా అవకాశ వాదాలతో పార్టీలో చేరేవారి పట్ల అప్రమత్తంగా లేకపోతే ఇలాంటి ప్రమాదాలే వస్తాయి. రాజనీతిజ్ఞుడు చాణక్య చెప్పినట్టు మన చుట్టూ ఉన్న వారిపై సరైన నిఘా లేకపోతే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. 2023లో కనీసం 40 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని ఊహించిన బీజేపీ 8 స్థానాలకే పరిమితమైనా, మోదీ చరిష్మాతో 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలు గెలిచింది. 8 ఎంపీ స్థానాలంటే 50కి పైగా అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి బలం పెరిగినట్టు భావించవచ్చు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా ఇదే బలాన్ని రాబోయే మూడు సంవత్సరాలూ కొనసాగిస్తే తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టడం గగనమేమీ కాదు. అయితే పార్టీలో చొరవ తీసుకునే నాయకత్వ లేకపోవడం, వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవడంలో పార్టీ విఫలమవుతుండడంతో పార్టీ కింద స్థాయి నేతలు, కార్యకర్తలు సానుభూతిపరులు తీవ్ర నిరాశతో ఉన్నారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ సంబురాలు చేసుకుంటున్నా క్షేత్రస్థాయిలో ప్రజలు సంతృప్తిగా లేరనేది కాదనలేని సత్యం. ఆరు గ్యారెంటీలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పూర్తిస్థాయిలో పథకాలను అమలు చేయలేకపోయింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఇవ్వలేదు. చేయూత పింఛన్ల పెంపు చేపట్టలేదు. యువతకు నిరుద్యోగ భృతి ఊసే ఎత్తడం లేదు. సబ్సిడీ గ్యాస్, ఉచిత కరెంటు కూడా సగం మంది లబ్ధిదారులకు అందడం లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నా దీనిపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. రైతు రుణాల మాఫీ కూడా అందరికీ జరగలేదు. రైతు భరోసాపై ఇంకా నియమ నిబంధనలే రూపొందించలేదు.
ఇలా కాంగ్రెస్ మానిఫెస్టోను ముందర పెట్టుకుంటే అమలు కానీ హామీలే అధికంగా ఉన్న దశలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంలో ప్రతి పక్షాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం కావడంతో ఆ పార్టీలో కేటీఆర్, హరీశ్‌రావు, కవితల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు మొదలైంది. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ సమస్యలపై ఉద్యమాలను చేపట్టడంలో విఫలమవుతోంది. మరోవైపు కాంగ్రెస్ పదేళ్ల కేసీఆర్ పాలన వైఫల్యాలను, గత ప్రభుత్వం అవినీతిని ఎత్తిచూపడంలో సఫలం కావడంతో బీఆర్‌ఎస్ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. ఇటు కాంగ్రెస్ వైఫల్యాలను, అటు బీఆర్‌ఎస్ అవినీతిని బీజేపీ అందిపుచ్చుకుంటే పార్టీకి చక్కటి అవకాశాలు ఏర్పడుతాయి.
రాష్ట్రంలో ఇప్పుడు బీఆర్‌ఎస్ చచ్చిన పాములా ఉంది. ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ ఉన్నా, నాయకత్వ లోపం కనిపిస్తుంది. గెలిచిన ప్రజాప్రతినిధులు గోడమీద పిల్లుల్లా ఎప్పుడు ఏ పార్టీలోకి మారుతారో తెలీదు. ఓడిన వారు మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు వేచి ఉందామని నిద్రావస్థలో ఉన్నారు. దీంతో ప్రజా సమస్యలపై గళమెత్తే అవకాశాన్ని అందిపుచ్చుకుంటే బీజేపీకి ప్రజా క్షేత్రంలో బలం పెరుగుతుంది. ప్రజల్లో బలం పెరిగితే బలమైన నేతలు కూడా బీజేపీకి వరుస కడుతారు. ప్రధానంగా కాంగ్రెస్ రైతులకు, మహిళ లకు, యువతకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చడంలో విఫలమవడంతో సంబంధిత వర్గాల్లో ఉన్న అసంతృప్తికి అనుగుణంగా అంశాల వారీగా ప్రజా సమస్యలపై సమిష్టిగా పోరాడితే ఆయా వర్గాలు పార్టీకి దగ్గరవుతాయి.
గతంలో బీఆర్‌ఎస్ పాలనలో నియోజకవర్గాల్లో ఆశించిన మేరకు అభివృద్ధి జరగకపోవడం, స్థానిక ప్రజాప్రతినిధుల అవినీతితో ప్రజలు విసుగెత్తిన తీరు, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కూడా అదే కొనసాగు తుండడంతో నియోజకవర్గాల్లో అసంతృప్తి నెలకొంది. ఈ పరిస్థితులను బీజేపీ ఆసరాగా తీసుకొని ఎన్నికల సమయంలో నియోజకవర్గాల్లో హడావిడిగా ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకునే బదులు, క్షేత్రస్థాయిలో సొంత పార్టీ నేతలను గ్రూపులకు అతీతంగా ప్రోత్సహించి, పార్టీ తరఫున వారందరిలో భరోసా కల్పిస్తూ వారికి దశ దిశలను నిర్దేశిస్తూ పార్టీని పటిష్టం చేసుకుంటే ఎన్నికల నాటికి బీజేపీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బీఆర్‌ఎస్ గ్రూపు రాజకీయాలు కొలిక్కి వచ్చేలోగా కాంగ్రెస్‌పై ఉన్న ప్రజావ్యతిరేకతను బీజేపీ పార్టీ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలి. బీజేపీ తెలంగాణలో హైడ్రా, మూసీ, గ్రూప్ పరీక్షలు, శాంతి భద్రతలు వంటి అంశాలపై ఉద్యమించినా పార్టీకి దక్కాల్సిన మైలేజీ దక్కలేదు. సమస్యలపై నాయకులు సమిష్టిగా కార్యక్రమాలు చేపట్టకుండా ఎవరికివారే యమునాతీరే అన్నట్టు వ్యవహరించడంతో వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నట్టయ్యింది. ఇందుకు పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వం చొరవ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
బీఆర్‌ఎస్‌లో ఉన్న సమస్యలను సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే ముందు బీజేపీలో ఉన్న అంతర్గత సమస్యలను పరిష్కరించుకుంటూ బలోపేతమైన నాయకత్వం ఏర్పడాలి. ఇందులో భాగంగానే ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో చర్చించి రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి కోసం వారికి మార్గదర్శకం చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. గతంలో ఏ మాత్రం బలం లేని అస్సాం, పశ్చిమబెంగాల్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎదురులేని పార్టీగా నిలుస్తున్న బీజేపీకి మొదటి నుండి ఉనికి ఉన్న తెలంగాణలో బలపడడం అసాధ్యమేమి కాదు. దీనికి కావాల్సింది బలమైన నాయకత్వం. రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షులు వస్తారని కొంత కాలంగా వినిపిస్తున్నా కాలయాపన జరగడం కూడా పార్టీకి నష్టమే. ఇప్పటికే పూర్తయిన మొదటి సంవత్సరంతో పాటు ఎన్నికల చివరి సంవత్సరాన్ని కూడా మినహాయిస్తే ఇంకా మూడు సంవత్సరాల సమయం మాత్రమే ఉన్నట్టు లెక్క. రాష్ట్రంలో ఏర్పాటయ్యే కొత్త కమిటీ నిలదొక్కుకునేందుకే కనీసం ఆరు నెలలకు పైగా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం కూడ వేగంగా చర్యలు తీసుకుంటే పార్టీ బలపేతానికి తోడ్పడుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యాలకు తోడు, బీఆర్‌ఎస్‌లో స్తబ్ధత నెలకొనడంతో రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం వేగంగా అడుగులేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికలప్పుడు పార్టీలోకి ఎవరిని పడితే వారిని హడావిడిగా చేర్చుకోవడం కంటే వీలైనంతగా సైద్ధాంతికంగా కట్టుబడి ఉన్న సొంత కార్యకర్తలకే ప్రాధాన్యతివ్వాలి. రాష్ట్ర బీజేపీలో సమైక్యత కోసం చర్యలు తీసుకొని, బలమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేస్తే పార్టీ పట్ల ప్రజలకు స్పష్టమైన అవగాహన ఏర్పడే అవకాశాలుంటాయి. ముందస్తు చొరవ తీసుకోకుండా చివరి నిమిషం వరకు వేచి చూసే ధోరణే కొనసాగితే గతంలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ ఎన్నికల నాటికి కోలుకున్నట్టే, రాబోయే ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్ కూడా కోలుకుంటే బీజేపీకి మళ్లీ ఎదురు చూపులు తప్పవు. పార్టీ సానుభూతి పరులకు నిరుత్సాహం తప్పదు.
– శ్రీపాద