‘‌మేం యుద్ధాన్ని కోరుకోం.. విశ్వశాంతిని కాంక్షిస్తాం..’ అన్నారాయన. మరో సందర్భంలో, ‘ఓటమిని అంగీకరించను.. పోరుకు వెనుకాడను..కాలం నుదిటిపై పాతను చెరిపేస్తా.. కొత్త రాతను లిఖిస్తా..’ అన్నారు.. మాజీ ప్రధాని, దివంగత అటల్‌ ‌బిహారీ వాజపేయి కవితల్లోని ఈ వాక్యాలు ఆయన కార్యదక్షతలోనూ ప్రతిఫలిస్తాయి. అణ్వాయుధ పరీక్షతో అగ్రరాజ్య ఆధిపత్యాన్ని సవాలు చేయడంతో పాటు, పొరుగు దేశానికి శాంతి సందేశాన్ని వినిపించారు. వైఖరిని మార్చుకోకుండా తోక జాడిస్తే కదనరంగంలో ఓడించి బుద్ది చెప్పారు. భారత్‌కు శాంతి మంత్రమే కాదు, యుద్దతంత్రం కూడా తెలుసునని చాటి చెప్పారు అటల్‌ ‌బిహారీ వాజపేయి హయాంలో జరిగిన కార్గిల్‌ ‌యుద్ధం ఒక చరిత్రాత్మక ఘట్టం.

మత ప్రాతిపదికన, భారత్‌ ‌మీద విద్వేషంతో ఏర్పడిన పాకిస్తాన్‌ ‌తన శత్రుత్వాన్ని నిరంతరం ఏదో రూపంలో ప్రదర్శిస్తూనే ఉంటుంది. భారత్‌తో కయ్యానికి కాలుదువ్వి 1947, 1965, 1971 యుద్ధాలకు దిగి ఓడినా బుద్ది రాలేదు. వెయ్యేళ్ల జిహాద్‌ ‌ప్రకటించుకున్న పాక్‌ ‌పాలకులు మన దేశంతో ప్రత్యక్ష యుద్దాల్లో గెలవలేక వక్రమార్గాన్ని ఎంచుకున్నారు. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి మన దేశంలోకి పంపడంతో పాటు, సరిహద్దును కబ్జా చేయడం ఇందులో భాగం. మన దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్‌ ‌పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలతో దేశ భద్రతను నిర్లక్ష్యం చేసింది. అటు అగ్రదేశాల కనుసన్నల్లో మెలుగుతూ దేశ రక్షణరంగంపై కూడా పెద్దగా దృష్టి పెట్టలేదు. అలాంటి సమయంలో తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా బాధ్యతులు చేపట్టిన వాజపేయి ఆ తప్పిదాలను సరిదిద్దారు. 1998లో రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతం పోఖ్రాన్‌లో అణుపరీక్షలు నిర్వహించారు. మన అణ్వాయుధ పాటవాన్ని చాటి చెప్పారు. అమెరికా బెదిరింపులు, ఆంక్షలకు తలొగ్గకుండా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఆపరేషన్‌ ‘‌శక్తి’పేరుతో మే 11,13 తేదీల్లో జరిపిన పరీక్షలివి. భారత క్షిపణి పితామహుడు అబ్దుల్‌కలాం కీలకపాత్ర పోషించారు. దీనితో అణు సామర్థ్యం కలిగిన ఆరవ దేశంగా భారత్‌ ‌నిలిచింది. ఈ పరిణామంతో పాకిస్తాన్‌ ‌కూడా చైనా నుంచి అరువు తెచ్చుకొన్న పరిజ్ఞానంతో హడావుడిగా అణు పరీక్షలు పరీక్షలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బిల్‌ ‌క్లింటన్‌ ‌భారత్‌, ‌పాక్‌ ‌మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి ద్వ్కెపాక్షిక ఒప్పందం చేసుకోవాలని సూచించారు. మాజీ ప్రధానమంత్రి లాల్‌బహదూర్‌ ‌శాస్త్రి ఇచ్చిన ‘జై జవాన్‌, ‌జై కిసాన్‌’ ‌నినాదానికి చివరలో.. సైన్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం చాటిచెప్పేలా వాజపేయి ‘జై విజ్ఞాన్‌’‌ను జోడించారు.

లాహోర్‌ ‌బస్సుయాత్ర

భారత్‌- ‌పాకిస్తాన్‌ల మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నా ఇరు దేశాల ప్రజల మధ్య సామరస్య పూర్వక వాతావరణం ఉండాలని వాజపేయి భావించారు. ఇందులో భాగంగా దేశ విభజన తర్వాత తొలిసారిగా రెండు దేశాల మధ్య ఢిల్లీ-లాహోర్‌ ‌బస్సును ప్రారంభిస్తూ 1999 ఫిబ్రవరిలో వాజపేయి తానూ వెళ్లారు. పాకిస్తాన్‌ ‌నాటి ప్రధాని నవాజ్‌ ‌షరీఫ్‌తో చర్చలు జరిపి లాహోర్‌ ఒప్పందంపై సంతకం చేశారు. దీని ప్రకారం రెండు దేశాలు మధ్య శాంతి, స్థిరత్వం కోసం, కశ్మీర్‌ ‌కేంద్రంగా ఉన్న అన్ని సమస్యలను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలి. అణ్వాయుధాలను ప్రమాదవశాత్తు లేదా అనధికారి కంగా ఉపయోగించడాన్ని తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి.

బుద్ది మారని పాక్‌

ఒకవైపు లాహోర్‌ ఒప్పందం సిరా తడి ఆరకముందే మరోవైపు పాకిస్తాన్‌ ‌తన దుష్టబుద్దిని బయటపెట్టుకుంది. ఆ దేశ సైనిక దళాల ప్రధాన అధికారి పర్వేజ్‌ ‌ముషార్రఫ్‌ ‌సరికొత్త కుట్రకు ప్రణాళికను తయారు చేశారు. దీని లక్ష్యం నేషనల్‌ ‌హైవే -1ను దిగ్బంధనం చేసి కశ్మీర్‌, ‌లడఖ్‌ ‌ప్రాంతాలను విడదీయడం, భారత సైన్యాన్ని సియాచిన్‌ ‌నుండి వెనక్కి పంపడం, కశ్మీర్‌ ‌సమస్య అంతర్జాతీయ వేదిక మీదకు తీసుకురావడం. ఈ కుట్రను లాహోర్‌ ‌శిఖరాగ్ర సమావేశానికి ముందే నవంబర్‌ 1998 ‌చివరిలో రూపొందించారని బయటపడింది. దీనికి ఆపరేషన్‌ ‌కోహి-పైమా (కెపి) అనే పేరు పెట్టుకున్నారు. ఈ కుట్ర విజయవంత మైతే కశ్మీర్‌ ‌విముక్తికర్తగా ప్రధాని షరీఫ్‌ ‌చరిత్రలో నిలుస్తారని ఆయనలో ఆశలు నింపారు. ఆ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్‌లో సియాచిన్‌పై పాకిస్తాన్‌-‌భారత్‌ ‌చర్చలు ప్రతిష్టంభనతో ముగిశాయి. ఆ తర్వాత అక్టోబర్‌లో పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌గా ముషార్రఫ్‌ను ప్రధాని నవాజ్‌ ‌నియమించారు. తమ కుట్ర అమలులో భాగంగా 1999 మే నెలలో పాకిస్తాన్‌ ‌సైనికులు, మిలిటెంట్లు కార్గిల్‌  ‌ప్రాంతాలను అక్రమించారు.

ఈ దురాక్రమణ వార్త తెలియగానే ప్రధాని వాజపేయి ఆ దేశ ప్రధాని నవాజ్‌ ‌షరీఫ్‌కు ఫోన్‌ ‌చేశారు. ‘మీరు నాతో చాలా దారుణంగా వ్యవహరించారు. లాహోర్‌లో నన్ను హత్తుకుంటూనే, మీవాళ్లను కార్గిల్‌ ఆ‌క్రమణ కోసం పంపిచారు..’ అన్నారు. అయితే నవాజ్‌ ‌షరీఫ్‌ ‌తనకు ఆ విషయం తెలీదని బుకాయించారు. ముషార్రఫ్‌తో మాట్లాడి మళ్లీ ఫోన్‌ ‌చేస్తానన్నారు. పాకిస్తాన్‌లో ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలకు విలువలేదని, సైన్యం తీసుకునే నిర్ణయాలే కీలకమని మరోసారి నిరూపితమైంది (కార్గిల్‌ ‌యుద్దం జరిగిన పాతికేళ్ల తర్వాత ఈ ఏడాది మేలో లాహోర్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించడం పాకిస్తాన్‌ ‌చేసిన పొరపాటు అని నవాజ్‌ ‌షరీఫ్‌ ఒక ప్రకటనలో తెలిపారు).

కార్గిల్‌ ‌విజయం

పాకిస్తాన్‌ ‌కపట వైఖరి ఇరు దేశాల మధ్య నాలుగో యుద్ధానికి దారి తీసింది. చొరబాట్లకు బుద్ధి చెప్పడమే లక్ష్యంగా భారత సైన్యం మే 26న ‘ఆపరేషన్‌ ‌విజయ్‌’ ‌మొదలు పెట్టింది. పెద్ద సంఖ్యల్లో సైనికుల్ని కార్గిల్‌కు తరలించింది. మూడు నెలల పాటు సాగిన ఈ యుద్ధంలో మన సైనికులు వీరోచితంగా పోరాడి టోలోలింగ్‌ , ‌టైగర్‌ ‌హిల్స్, ‌బాత్రా టాప్‌ ‌పర్వతాలను శత్రువుల చెరనుంచి విడిపించారు. ఈ విజయ సాధనలో 527మంది సైనికులు బలిదానం చేశారు. 1,363 మంది గాయపడ్డారు. సైన్యానికి అవసరమైన ఆయుధ, ఆహార సరఫరా అందించిన ‘టండా ట్కెగర్‌’ ‌దళంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మంది గాయపడ్డారు. పాక్‌ ‌సైనికులు దాదాపు 12 వందలకు పైగా మరణించారు.

జూలై 14న ఆపరేషన్‌ ‌విజయ్‌ ‌విజయవంత మైందని వాజపేయి ప్రకటించారు. దీంతో పాటు పాకిస్తాన్‌తో చర్చలకు భారత్‌ ‌షరతులు విధించింది. జూలై 26న యుద్ధం అధికారికంగా ముగిసింది. పాకిస్తాన్‌ ‌చొరబాటుదారులను పూర్తిగా వెళ్లగొట్టామని భారత సైన్యం ప్రకటించింది. దాదాపు రెండు నెలల 20 రోజుల తర్వాత పాక్‌ ‌సైన్యం పూర్తిగా వెనక్కి తగ్గింది. దాదాపు 130 స్థావరాలను భారత సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది.

కార్గిల్‌ ‌విజయంతో భారత సైన్యం సామర్థ్యం ప్రపంచానికి తెలియడంతో పాటు, ఇరుగుపొరుగు దేశాలకు ఒక హెచ్చరికను కూడా ఇచ్చినట్టయింది. దేశానికి దృఢమైన నాయకత్వం ఉన్నందునే ఈ విజయం సాధ్యమైంది. ఈ యుద్దంతో అటల్‌జీ ఖ్యాతి ప్రపంచానికి మరింతగా తెలిసొచ్చింది.

వాజపేయి యుద్ధనీతి

కార్గిల్‌ ‌పోరు తీవ్రంగా సాగుతున్న సమయంలో ఎయిర్‌ ‌చీఫ్‌ ‌మార్షల్‌ అనిల్‌ ‌యశ్వంత్‌ ‌ప్రధాని వాజపేయికి ఫోన్‌ ‌చేసి.. పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌లోని శత్రు స్థావరాలను ధ్వంసం చేసేందుకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరారు. అయితే స్వీయ నియంత్రణ పాటించాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎల్‌ఓసీని దాటవద్దని చెప్పారు. ఈ నిర్ణయం భారత దౌత్య విజయానికి కీలకమైనదిగా విశ్లేషకులు భావించారు. వాజపేయి యద్ధనీతిని ఆసియన్‌ ‌దేశాలు, యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌దేశాలే కాకుండా అమెరికా, చైనా కూడా స్వాగతించాయి. కార్గిల్‌ ‌యుద్దం తర్వాత నవాజ్‌ ‌షరీఫ్‌ను గద్దె దింపాడు ముషార్రఫ్‌. ఆ ‌తర్వాత తానే దేశ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాడు. రెండేళ్ల తర్వాత 2001లో పర్వేజ్‌ ‌ముషార్రఫ్‌ ఆ‌గ్రాలో శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ శిఖరాగ్ర సదస్సు ఆశించిన ఫలితా లను సాధించలేదు. ‘మనం విలువైన వనరులను యుద్ధాలపై వృథా చేస్తున్నాం. యుద్ధం చేయడం తప్పనిసరైతే.. నిరుద్యోగం, వ్యాధులు, పేదరికం, వెనుకబాటుతనంపై చేయాలి..’ అంటూ అటల్‌జీ ఒక కవితలో చెప్పారు.

క్రాంతిదేవ్‌ ‌మిత్ర

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE