అమెరికాలోని న్యూ ఆర్లీన్స్‌లో జనవరి ఒకటవ తేదీన కొత్త సంవత్సర వేడుకలపై ఇస్లామిక్‌ ‌స్టేట్‌(ఐసిస్‌) ఉ‌గ్రవాదం విషం కక్కింది. 14 మందిని పొట్టన పెట్టుకుంది. షంషుద్దీన్‌ ‌జబ్బార్‌ అనే 42 ఏళ్ల ఐసిస్‌ ‌ప్రేరేపిత ముష్కరుడు, మాజీ సైనికోద్యోగి బూర్బోన్‌ ‌వీధిలో ఆటపాటలతో ఓలలాడుతున్న ప్రజలపైకి   ట్రక్కుతో వేగంగా దూసుకొని వచ్చాడు. ఊహించని ఈ దుర్ఘటనలో మనుష్యులు దూది పింజెల్లా గాల్లోకి ఎగిరిపడ్డారు. అక్కడికక్కడే విగతజీవులయ్యారు. ప్రాణభీతితో పరిగెడుతున్న వారిపై మృతదేహాలు వచ్చిపడ్డాయి. చివరికి మృత్యురూపంలో దూసుకొస్తున్న ఆ ట్రక్కు ఒక హైడ్రాలిక్‌ ‌లిఫ్ట్‌ను ఢీకొని ఆగిపోయింది. అయినప్పటికీ శాంతించని ఐసిస్‌ ఉన్మాది ట్రక్కు దిగి మరీ జనంపైకి కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జన్మతః అమెరికా దేశస్తుడైన టెక్సాస్‌ ‌వాసి జబ్బార్‌ను కాల్చి చంపారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 14 మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరో 37 మంది గాయపడ్డారు.

అమెరికా ఆంగ్ల సమాజంలో భాగం. ఆ దేశం వారిది. అక్కడ సంప్రదాయం ప్రకారం ఆంగ్ల సంవత్సరాదికి వేడుక జరుపుకుంటారు. కానీ జనవరి 1న అలా విందులూ వినోదాలు జరుపుకోవడం ఇస్లాంకు విరుద్ధమంటూ ఫత్వాలు జారీ చేశారు కొందరు మౌల్వీలు. తాజా ఉదంతం వెనుక కూడా అలాంటి కారణం కనిపిస్తుంది. ఇది ఇతర దేశాల, సమాజాల సంస్కృతిలో జోక్యం చేసుకోవడమే. అందుకే ప్రపంచం దృష్టిని ఈ ఉదంతం వెంటనే ఆకర్షించింది. న్యూ ఆర్లీన్స్‌లో ఉగ్రదాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. దాడిని ఒక పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢమైన సంతాపాన్ని తెలిపారు. వారు ఈ విషాదం నుంచి త్వరగా కోలు కోవడానికి తగిన శక్తిని, ఉపశమనాన్ని పొందాలని మోదీ ఆకాంక్షించారు. కొద్ది రోజులలో పదవీ విరమణ చేయబోతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ‌దాడిని కోపం, నైరాశ్యం నుంచి పుట్టుకొచ్చినదిగా పేర్కొన్నారు. హింస ఏ రూపంలో ఉన్నప్పటికీ అది ఎంత మాత్రమూ సమర్థనీయము కాదని అన్నారు. దేశంలో ఏ వర్గంపైనా కూడా ఏ రకమైన దాడిని తాము ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బాధితులకు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ముప్పుకు తావు లేని విధంగా దాడి వెనుక కారణాలను సాధ్యమైనంత త్వరగా వెలికితీసే దిశగా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, స్థానిక పోలీసులతో కలిసి పనిచేయా ల్సిందిగా తన బృందాన్ని ఆదేశించినట్టు బైడెన్‌ ‌తెలిపారు. అమెరికా యావత్‌ ‌ప్రపంచానికి ఒక విపత్తుగా, హాస్యాస్పదంగా మారిపోయిందని కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌వ్యాఖ్యానించారు. బలహీనమైన, చేతగాని నాయకత్వంలో సరిహద్దులు బార్లా తెరిచి ఉంచితే ఏం జరుగుతుందో అదే ఇప్పుడు జరిగిందని అన్నారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ‌జస్టిస్‌ – ‌డీవోజే, ఎఫ్‌బీఐ, డెమోక్రట్‌ ‌ప్రభుత్వం, స్థానిక ప్రాసిక్యూటర్లు వారి విధులను సక్రమంగా నిర్వర్తించలేదని ఆరోపించారు. వారంతా అసమర్థులు, అవినీతిపరులు. వారు పొద్దస్తమానం అన్నివిధాలుగా ప్రభుత్వంలోకి, దేశంలోకి చొరబడుతున్న వారి నుంచి అమెరికన్లను కాపాడటానికి బదులుగా తనలాంటి రాజకీయ ప్రత్యర్థులపై అన్యాయంగా దాడి చేస్తుంటారని విమర్శించారు. దేశంలో ఇలాంటివి జరగడానికి అనుమతిస్తున్న డెమోక్రాట్లు అందుకు సిగ్గుపడాలని అన్నారు. ఇప్పటికే ఆలస్యమైనప్పటికీ ఇందులో సీఐఏ జోక్యం చేసుకోవాలని కోరారు. అమెరికా కుప్పకూలిపోతోంది. దేశమంతటా రక్షణ, జాతీయ భద్రత, ప్రజాస్వామ్యాన్ని హింస మింగేస్తోంది. ఒక పటుత్వమైన, శక్తిమంతమైన నాయకత్వం మాత్రమే దానిని ఆపగలదని పేర్కొన్నారు. జనవరి 20న కలుసుకుందామని, అమెరికాకు పూర్వ వైభవం తీసుకొద్దామని ఎక్స్ ‌వేదికగా అమెరికన్లకు ట్రంప్‌ ‌పిలుపునిచ్చారు. ఇంత జరిగినా, ఇన్ని ఆధారాలు బహిర్గతమైనా జబ్బార్‌ ‌చర్యను మతోన్మాదమేనని చెప్పడానికి అమెరికా యంత్రాంగం ఎందుకు వెనకాడుతున్నట్టు? ఈ ప్రశ్న మాత్రం ఇప్పుడు బాగా వినిపిస్తున్నది.

అమెరికాలో చాప కింద నీరులా సాగిపోతున్న ఇస్లాం ఉగ్రవాదానికి జబ్బార్‌  ‌దాడి నిదర్శనం. అతడు ఉపయోగించిన ఫోర్డ్ ఎఫ్‌-150 ‌ట్రక్కులో బాంబులను పేల్చడానికి ఉపయోగించే పరికరాన్ని పోలీసులు కనుగొన్నారు. వాహనంలో ఐసిస్‌ ‌జెండా, ఖురాన్‌లను గుర్తించారు. అదే సమయంలో దాడి జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో రెండు రోలింగ్‌ ఐస్‌ ‌చెస్ట్‌లో సొంతంగా తయారు చేసిన బాంబులను జబ్బార్‌ ఉం‌చిన వైనాన్ని పోలీసులు కనిపెట్టారు. అనంతరం అమెరికా దర్యాప్తు సంస్థ-ఎఫ్‌బీఐ చేపట్టిన దర్యాప్తులో యావత్‌ ‌ప్రపంచం నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దాడికి దిగడానికి కొద్ది గంటల ముందు జబ్బార్‌ ‌రూపొందించిన వీడియో లను ఎఫ్‌బీఐ డిప్యూటీ అసిస్టెంట్‌ ‌డైరెక్టర్‌ ‌క్రిస్టోఫర్‌ ‌రియా ప్రస్తావించారు. హూస్టన్‌ ‌నుంచి న్యూ ఆర్లీన్స్‌కు అద్దెకు తీసుకున్న ట్రక్కులో వస్తుండగా మార్గమధ్యంలో కొన్ని వీడియోలను అతడు ఆన్‌లైన్‌లో పోస్ట్ ‌చేశాడు. ఐసిస్‌కు తన మద్దతు తెలిపాడు.

 ప్రస్తుతం లింక్‌డ్‌ ‌యిన్‌ ‌నుంచి తొలగించిన అతడి ప్రొఫైల్‌ ‌ప్రకారం అమెరికా సైన్యంలో మానవ వనరులు, ఐటీ విభాగాల్లో పనిచేశాడు. 2009, ఫిబ్రవరి నుంచి 2010, జనవరి మధ్యకాలంలో అఫ్గానిస్తాన్‌లో విధులు నిర్వర్తించాడు. 2015లో సైన్యం నుంచి బయటకు వచ్చాడు.హూస్టన్‌ అతడి తాజా చిరునామా. 2015, 2017 మధ్యకాలంలో జార్జియా స్టేట్‌ ‌యూనివర్శిటీలో చదివాడు. కంప్యూటర్‌ ఇన్‌ఫర్మేషన్‌ ‌సిస్టమ్స్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు. 2021లో డిలాయిట్‌ ‌కంపెనీలో పనిచేశాడు. ఎర్న్‌స్ట్ అం‌డ్‌ ‌యంగ్‌ ‌కంపెనీలో కూడా పని చేశాడని భోగట్టా. బ్బార్‌కు మూడు పెళ్లిళ్లు జరిగాయి. మరో ఇద్దరితో వివాహేతర సంబంధాలు పెట్టుకొని వారి ద్వారా సంతానం పొందాడు. మొదటి పెళ్లి 2012లో పెటాకులైపోయింది. 2013లో జరిగిన రెండో పెళ్లి 2016లో ముగిసిపోయింది.  2017లో మూడో పెళ్లి చేసుకున్నాడు. 2022లో మూడో భార్యకు విడాకులు ఇచ్చేశాడు. వస్తున్న ఆదాయానికి, చేస్తున్న ఖర్చులకు పొంతన లేకపోవడంతో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు తాజాగా విడాకులకు దారి తీసాయని కోర్టు రికార్డులు పేర్కొన్నాయి. జబ్బార్‌ ‌రియల్‌ ఎస్టేట్‌ ‌రంగంలో కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. దీనికి సంబంధించిన లైసెన్సుకు 2023లో కాలం చెల్లింది. ట్రాఫిక్‌ ఉల్లంఘన, దొంగతనానికి సంబంధించిన నేర చరిత్ర కూడా అతడికి ఉంది. జబ్బార్‌ ‌గత వేసవి కాలానికి ముందు మిలిటెంట్‌ ‌మూకలో చేరాడు. దాడికి పాల్పడడానికి ముందు తన కుటుంబాన్ని మట్టుపెడదా మనుకున్నాడు. కానీ ఆగిపోయాడు. అలా చేసిన పక్షంలో తాను చేపట్టే ఉగ్రదాడి (ఇస్లాం పట్ల) విశ్వాసం ఉన్న వారికి, లేని వారికి మధ్య జరుగుతున్న యుద్ధంగా ప్రపంచం దృష్టిలో కాకుండాపోతుంది. ఎవరి తోడు లేకుండా ఒంటరిగా దాడికి పాల్పడిన జబ్బార్‌ ‌నూటికి నూరు శాతం ఐసిస్‌ ‌ప్రేరేపితుడే. దుర్ఘటన జరిగిన చోట సేకరించిన ఆధారాలు ఇందుకు నిదర్శనమని రియా తెలిపారు. జబ్బార్‌ ఐసిస్‌ ‌ద్వారా ఎలా ప్రేరేపితు డయ్యిందీ అటు అధికారులకు కానీ ఇటు అతడి బంధువులకు కానీ అంతుపట్టడంలేదు. అతడి సవతి సోదరుడు అబ్దుర్‌ ‌జబ్బార్‌ ‌చెప్పిన విషయం విస్తుపోయేలా ఉంది. 20 నుంచి 30 ఏళ్ల వయసులో షంషుద్దీన్‌ ‌జబ్బార్‌ ఆడిట్‌ ‌కంపెనీ డెలాయిట్‌లో పని చేశాడు. ఆ సమయంలో అతడు ఇస్లాంకు తలాక్‌ ‌చెప్పాడు. కానీ ఈ మధ్య కాలంలో మళ్లీ ఇస్లాం పట్ల విశ్వాసాన్ని పునరుద్ధ రించుకున్నాడు. ఇదే  అర్థం కావడం లేదన్నాడు జబ్బార్‌ ‌సవతి సోదరుడు. అయితే ఐసిస్‌ ‌ద్వారా ప్రేరేపితులయ్యేవారికి, దాడికి పాల్పడిన జబ్బార్‌కు మధ్య ఏ ఒక్క విషయంలోనూ పొంతన కుదరడం లేదని ఎఫ్‌బీఐ మాజీ ఏజెంటు అలీ సౌఫన్‌ అన్నారు. సర్వసాధారణంగా ఐసిస్‌ ‌వలలో పడేవారు యుక్త వయస్కులై ఉంటారు. కానీ దాడికి పాల్పడినప్పుడు అతడు 40వ పడిలో ఉన్నాడు. అంతకుమించి 10 ఏళ్ల పాటు అమెరికా సైన్యంలో పనిచేశాడు. ఒక దేశభక్తుడు ఐసిస్‌ ‌టెర్రరిస్టుగా మారడం విడ్డూరంగా ఉందని ఎఫ్‌బీఐ మాజీ ఏజెంటు విస్తుపోయారు. అదే సమయంలో పరాయి గడ్డ మీదున్న ఉగ్రమూకలతో జబ్బార్‌కు పొత్తు ఎలా కుదిరిందీ ఇప్పటికీ స్పష్టం కాలేదు. అయితే అతడు 2023లో ఈజిప్టుకు వెళ్లి కైరోలో వారం రోజులు న్నాడు. ఆ తర్వాత అమెరికా తిరిగి రావడానికి ముందు మూడురోజుల పాటు టొరొంటోలో ఉన్నాడనేది అధికార వర్గాల భోగట్టా. అలా అన్నేసి రోజులు విదేశాల్లో ఉండి అతడేం చేశాడో అంతు పట్టని వ్యవహారంగా మారింది. తాజాగా హూస్టన్‌ ‌లోని జబ్బార్‌ ‌నివాసంలో బాంబులు తయారు చేయడానికి ఉపయోగించే సామాగ్రిని ఎఫ్‌బీఐ దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. అదే సమయంలో దాడికి ఉపయోగించిన ట్రక్కును  నవంబర్‌ 14, 2024‌నే అద్దెకు తీసుకున్నాడనేందుకు ఆధారాలు అధికారులకు లభించాయి. ఆ క్రమంలో ఉగ్రదాడి జరపడం కోసం జబ్బార్‌ ఆరు వారాల పాటు కసరత్తు చేశాడు. దీంతో ఇది తొందరపాటు లేదా అనాలోచిత దాడి కాదని, ముందస్తు ప్రణాళికతో జరిగిన దాడి అనే ఒక నిర్దారణకు అధికారులు చేరుకున్నారు. అంతేకాకుండా తనకు సంబంధించిన ఆధారాలను రూపుమాపడానికి ఇంటి నిండా పేలుడు పదార్థాలు నింపాడు. తద్వారా ఇంటి ని నామరూపాల్లేకుండా చేయడం అతడి లక్ష్యమని దర్యాప్తులో వెల్లడయింది.

అందివచ్చిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అంతర్జాతీయ ఉగ్రమూక విస్తృతంగా వినియోగించు కుంటున్నది. దాంతో ఐసిస్‌ ‌తన నియామకాల్లో ఎక్కువ శాతం ఆన్‌లైన్‌ ‌చాట్‌ ‌రూమ్‌ల ద్వారా, ఎన్‌‌క్రిప్టెడ్‌ ‌కమ్యూనికేషన్స్ ‌ద్వారా చేపడుతోందని అమెరికా అధికారులు, ఇతర నిపుణులు చెబుతున్నారు. అలా నియమితులైన వారు ఐసిస్‌ ‌నుంచి నేరుగా అందుకునే ఆదేశాల ద్వారా కానీ సొంతంగా కానీ ప్రేరేపితులవు తారు. ఇక్కడే శవం మీద పేలాలు ఏరుకునే తీరుగా ఉంది ఐసిస్‌ ‌వ్యవహారం. తన నియామకాలను వృద్ధి చేసుకోవడానికి గాజా యుద్ధంలో సంభవించిన వేలాదిగా పాలస్తీనా వారి మరణాలను సాకుగా వాడుకుంటోందీ మతోన్మాద ఉగ్రమూక. నియమించు కున్న ఒక్కొక్క వ్యక్తిని ఒక యుక్తాయుక్త విచక్షణ విస్మరించిన మానవరూపంలోని తోడేలుగా మారు స్తోంది.  తద్వారా భూమండలంపై తనకు నిలువ నీడ లేకపోయినప్పటికీ•, అమెరికా, తదితర దేశాల్లో భయోత్పాతం, అస్థిర వాతావరణం సృష్టించడమే లక్ష్యంగా ఐసిస్‌ ‌పాశవికతను, మతోన్మాదాన్ని, హింసా ప్రవృత్తిని దాడుల రూపంలో ప్రదర్శించుకుంటోంది. ప్రాణాంతక దాడులకు పాల్పడినవారు ఐసిస్‌తో తమకు ఉన్న సంబంధాన్ని ఏదోక రూపంలో ప్రపంచానికి చాటి చెప్పారు.

ఒకసారి సింహావలోకనం చేసుకుంటే, 2015లో పారిస్‌లో ఐసిస్‌ ఉ‌గ్రమూక 130 మంది అమాయకు లను పొట్టనపెట్టుకున్న మారణకాండలో పాల్గొన్న టెర్రరిసుల్లో ఒకడు తాను ఐసిస్‌ ‌వాడిననే వెల్లడించాడు. ఆ విషయాన్ని దర్యాప్తు అధికారులు నిరూపించగలిగారు. ఐసిస్‌ ‌నుంచి శిక్షణ పొందిన 15 మంది ఉగ్రవాదులు సదరు మారణకాండకు ఒడిగట్టారు. అయితే 2016లో ఫ్లోరిడాలోని నైట్‌ ‌క్లబ్‌లో 49 మందిని ఒక వ్యక్తి చంపడం, 2017లో న్యూయార్క్‌లో ఒక వ్యక్తి జనాల మీదకు ట్రక్కును నడిపి ఎనిమిది మందిని పొట్టనపెట్టుకోవడం లాంటి తోడేలు తరహాలో ఒక వ్యక్తి చేసిన దాడుల వెనుక ఐసిస్‌ ‌ప్రమేయానికి సంబంధించి ఎలాంటి ఆధారమూ దర్యాప్తు అధికారులకు దొరక్కపోవడం గమనార్హం. నివురుగప్పిన నిప్పులా వ్యవహరిస్తోన్న మతోన్మాద ఉగ్రమూకను మొదలుకంటా మట్టుపెట్ట డానికి అమెరికాతో పాటుగా ప్రపంచ దేశాలు ఐక్యకార్యాచరణకు నడుంబిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

– జాగృతి డెస్క్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE