‘నవరస నాట్య సరోవర నవజీవన వర్థమాన నళినములారా!
నవమిత్రములారా, నవ నవోదయము మీకు సురభి నందనులారా!
రంగ రమణీయ జంత్ర మంత్రములు చూచి
నర్తకీ నర్తనా వర్తనములు చూచి
సమ్ముతము జెంది తన్మయత్వము నంది
మెచ్చెను సుధీజనమ్ము మేల్మేలు మిమ్ము!
స్త్రీ పాత్రంబులు స్త్రీలె దాల్చుటొక వైశిష్ట్యంబుగా నాట్యల/క్ష్మీ పూజా పరతంత్రులైన ధనలక్ష్మీ పుత్రులారా! కళా/ శ్రీ పాదార్చకులారా, మీకివె ••శుభాశీస్సుల్’…. అంటూ దశాబ్దాల కిందటే సురభి బృందానికి అభివాదాలు సమర్పించింది కవి హృదయం. అదే బృంద సభ్యురాలు జమునా రాయలు జయంతి జనవరి 22న.
రాయలు అంటే శ్రీకృష్ణదేవరాయలు. తనూ బృంద సభ్యులే. కళారంగంలో జమునగా పేరు ప్రఖ్యాతులందుకున్న ఆ రంగస్థల నటీమణి వివాహానంతరం జమునారాయలు అయ్యారు. నట శిరోమణిగా, నటనా విదుషీమణిగానే కాక ‘గాన కోకిల’ బిరుదునూ పొందారంటే – అదీ ఆమె కళాప్రభ, ప్రతిభ.
గుంటూరు ప్రాంతంలోని తెనాలి తన స్వస్థలం.
మరింత ప్రత్యేకత ఏమిటీ అంటే – ప్రథమ భారత సాతంత్య్ర సమరం నూట యాభై వసంతాల ఉత్సవ వేళ ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో ఆమె జీవించడం!
నటరాజ పాదమంజీరంగా కితాబు అందుకున్న జమున చిన్నప్పటి నుంచీ నిత్య ఉత్సాహి. ఇంట్లో అంతటా కళల వాతావరణం. ఆ భావ ప్రభావాల వల్లనే, ఎనిమిదేళ్ల పసిప్రాయంలోనే హరికథా ప్రదర్శన. సాహిత్య సంగీతాలతోపాటు నర్తన రూపాల మేళవింపు. చేతిలో చిడతలు (చిడతలు), కాళ్లకు గజ్జెలు, మెడలో పూలహారాలు, సుందర రీతిన తిలకధారణలు, నవరసాలూ ఆ హరికథలోనే!
అదిగో- ఆనాటి నుంచీ రసపోషణ అలవడింది. అనతికాలంలోనే మరో వేదికమీద నాటక పాత్రధారిణిగా ఆమె ప్రత్యక్షం. పోషించింది స్త్రీ పాత్రను కాదు, పురుషుడిగా. విశేషించి శ్రీకృష్ణుడిగా!
ఇంకో విలక్షణతా ఆ నటి సొంతమైంది. శ్రీకృష్ణ-సత్యగా ఏకకాలంలో నట ప్రావీణ్యం. అలా ఒకసారి కాదు. కొన్ని పదుల పర్యాయాలు అవే పాత్రల పరిపోషణ తన ప్రజ్ఞను నిరూపించింది.
ఆమె జీవితకాలం అరవై. నటనానుభవం యాభై. అంటే అర్ధ్థశతాబ్ద కళా సేవ. సంగీత సాహిత్య గంగాతరంగాలు ఉప్పొంగినట్లు, చల్లచల్లని పాలవెల్లిలో జాబిల్లి మల్లెమొగ్గలు వెదజల్లినట్లు, వందారు సుందరీ మందార మాలా మరందమ్ములందందు చిందినట్లు, సోగకన్నుల రాణి మూగ చూపులలోని రాగాలు తీగలై సాగినట్లు!
‘ముందుగా పాత్ర స్వభావాన్ని అవగతం చేసుకుంటాను. రూపచిత్రణ గురించిన అభిప్రాయాన్ని నాకు నేనుగా స్థిరపరచుకుంటాను. ఒకచోట ప్రేమభావం. మరో దగ్గర వీరరస పోషణం. ఇంకో సందర్భంలో కరుణ స్పష్టీకరణం. ఇదే విధంగా మరెన్నో వ్యక్తీకరణలతో నటనను సుసంపన్నం చేయాల్సి ఉంటుంది. సత్యభామ ఆత్మవిశ్వాసం, రాధ ప్రేమానుబంధ మాధుర్యం, వీటన్నింటికీ భిన్నంగా సామాజిక, సాంస్కృతిక కోణంలో ఇతర పాత్రలు. ఎప్పుడు ఏ భావమైనా వ్యక్తమయ్యేలా ఎంతో సంసిద్ధత అవసరమవుతుంది. అందుకే ఇంట్లో అయినా, రంగస్థలం మీదనైనా నా ఆలోచనలన్నీ పాత్ర పరిధుల చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. ఎప్పుడూ వైవిధ్యం చూపాలన్న తపన మనసంతా ఆచరించి ఉంటుందంతే. ఎంతవరకు సాధించానో, ఫలితం ఏ మేర అందుకోగలిగానో నిర్ణయించేది కళాభిమానులే’ అంటున్నపుడు జమున భావోద్నిగత అక్షరం అక్షరానో ప్రతిఫలించింది. అది- తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం బహూకరించిన సందర్భం. భాగ్యనగరంలో రవీంద్రభారతి వేదికపైన నాటక కళాపురస్కృతి ప్రదానం వేళలోనూ ఆమెలోని ఉద్వేగం ఎంతగానో ప్రస్ఫుటమైంది. కళాకారులు, అందునా సురభి రంగస్థల ప్రవీణులు మాట్లాడే ప్రతి మాటా ప్రేక్షక శ్రోతలకు అపురూపంగా అనిపిస్తుంటుంది. వినిపిస్తుంటుంది కూడా.
ఏ పాత్ర ప్రత్యేకత దానిదే. ప్రదర్శన వైభవమూ అంతటి శక్తిమంతమే. ‘కనుమూసి తెరచులోననె మారిపోయెడు నవదృశ్య పరివర్తనములు చూచి / ఇంద్ర ధనుస్సు పైకెక్కుచున్నట్లు రంగులు మారు తెర తెరంగులను చూచి / సినిమాల తలదన్ను చిత్రవిచిత్ర సంఘటన నిర్మాణ దక్షతలు చూచి / వాతాపి గణపతి గీతమారంభించు ప్రాక్సంప్రదాయ సంపదలు చూచి…. పులకించని కళా హృదయమంటూ ఉంటుందా? నటన, ప్రదర్శన ఒకదానికొకటి పోటీ పడుతున్న సమయాన కరతాళ ధ్వనులు మారుమోగని దృశ్యమంటూ అగుపిస్తుందా- చెప్పండి మీరే!
‘మీరు ఎన్నటికీ మరవని పాత్రలు రెండు చెప్పండీ’ అంటే… ఒకటి ఝాన్సీ లక్ష్మి, మరొకటి జిజియాబాయి అనేవారు ఆమె. జయలక్ష్మి జగజ్జనని భారతమాత, జయకొట్టరా నీదు జన్మభూమికి నేడు / వెలిగింపరా ధర్మవీర విజయజ్యోతి, తొలగింపరా ధూర్త దుశ్శాసనుల భీతి / నిండింపరా నీ అఖండ సంస్కృతి జగతి, పండింపరా ప్రజల గుండెలందున ప్రగతి’ అనే జయభారత్ గీతభాగాలనూ ప్రస్తావించేవారు. ఆ పాత్రల అభినయ తరుణంలో దేశభక్తి తరంగాలు వెల్లువెత్తి తనను అలౌకిక మహానుభూతితో నింపేవని ఎన్నోసార్లు వేదికల నుంచి ఉదాహరించారు నటీమణి జమున.
వీరమాతగా జిజియాను ఆమె శ్లాఘించిన సందర్భాలెన్నో! శివాజీకి ఉద్బోధ చేస్తున్నపుడు, మాతృదేశ రుణం తీర్చుకోవాలని సందేశమిస్తున్నపుడు ఆ తల్లి హృదయాన ఆకాంక్షలనేకం. దేశం తల్లడిల్లుతోంది. స్వతంత్ర సాధనకు పరితపిస్తోంది; ధర్మస్ఫూర్తిని నిలపాల్సిందీ, ఇష్టార్థ సంసిద్ధిని సుసాధ్యం చేయాల్సిందీ తన ధీరతనయుడేనని ఆ మాతృమూర్తి ఆదేశం. తన ఆ బోధనే భవానీమాత ఆజ్ఞగా పరిగణించి అనుసరించాలని చెప్తున్నపుడు జిజియా స్వరాన పలికిన దృఢత ఎంత ప్రీతి పాత్రమని వర్ణిస్తూ ఉండేవారు. ఇవన్నీ ఆమెలోని దేశానురక్తిని పలు విధాలుగా ప్రతిబింబించేవని ఇప్పటికీ గుర్తు చేసుకొంటూ ఉంటారు సురభి సహసభ్యులు.
నటిగానే కాదు – దర్శకురాలిగానూ ఆమెది అగ్రస్థాయి. శశిరేఖా పరిణయం నాటక ప్రదర్శనకు దర్శకత్వ బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించి, శ్రమకు ప్రతిఫలంగా ప్రతిష్ఠాత్మక నంది బహూకృతికి అర్హులయ్యారు. మరీ ముఖ్యంగా జీవిత సాఫల్య పురస్కారాన్ని స్వీకరించి మాట్లాడుతూ ‘సఫలత అనే పదంలోనే కళలన్నీ ఇమిడి ఉన్నాయి’ అని వ్యాఖ్యానించడం జమున అనుపమాన దక్షతకు తార్కాణం.
పద్యాలు పఠించినా, పాటలు ఆలపించినా విశిష్టత. అభినయం, గాత్రం, హావభావ ప్రకటనం ఎప్పుడూ దీటుగానే ఉండేవి. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నాటక ప్రదర్శన ప్రాచుర్యం కోసం ఎంతగానో పరిశ్రమించిన వ్యక్తి, శక్తి. నవరత్న మాలలు పొందినా, స్వర్ణపతకాలు అందుకున్నా, సత్కారాలూ, సన్మానాల పరంపరలో తలమునకలైనా నిగర్వతత్వమే. పద్మశ్రీ పురస్కార విజేతగా వెలిగిన తొలి తెలుగు రంగస్థల నటుడు ‘స్థానం’ వారి జయంతి మహోత్సవాన్ని హైదరాబాద్‌లో ఒక సంస్థ ఏర్పాటుచేసింది. అదే కళావాహిని వేదిక నుంచి పురస్కృతిని అందుకున్న జమున ‘ప్రతీ పురస్కారమూ భవిష్యత్ బాధ్యతలను పెంచుతుంది’ అంటూ వినమ్రత కనబరచడమే విశేష ఉదాహరణం. ఎంతో ఎదిగినా అంతగానూ ఒదిగి ఉన్న నైజం.
‘మా హృదయ ఫలకంపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం ’అని శ్లాఘించింది దృశ్యసాధనం. జీవనజ్యోతిగా ఆఖరి వరకు దారి,అలసి సొలసి శ్రమించిన ఆమె నాలుగేళ్లనాడు శాశ్వతంగా నిష్క్రమించారు. పాలకడలిలో ప్రభవించిన హాలాహలంలా జమున జీవన ఆశలను మింగేసింది ముంచుకొచ్చిన కరోనా. పద్యనాటకానికి సరికొత్త చరిత్రను సంపాదించి పెట్టిన ఘన కళాకారిణి అని నాటక అకాడమీ అక్షర నీరానాలు సమర్పించింది. ఆమె వద్ద అనేక సంవత్సరాలుగా మేకప్ కళాకారుడిగా పనిచేసిన వెంకటస్వామి కన్నీరు మున్నీరవుతూ ‘ఎక్కడికెళ్లారమ్మా మీరు?’ అంటూ సమాధానం లేని / రాని ప్రశ్న వేశారు ఆ రోజున. ఏది జయంతి, ఇంకేది వర్ధంతి? ఈ రెండు తేదీల మధ్యనా నిండిన కళాజీవితానికి గుర్తింపు ఎక్కడుందీ..అని నాట్యకళా పరిషత్తులూ విధిని ప్రశ్నించాయి.
రంగస్థలి అనగానే షణ్ముఖి ఆంజనేయరాజు, పీసపాటి నరసింహమూర్తి, వేమూరి రామయ్య వంటి ఉద్దండులు మన తలపునకు వస్తారు. వారి సహనటిగా తనను తాను పెంపొందించుకుని, రంగస్థల పరిధినీ మరింత పెంచి, యశస్సు సంపాదించారు జమునా రాయలు. ద్రౌపది, చంద్రమతి మాలినీదేవి, రాధ…. ఇలా ఏ పాత్రను ధరించినా ఎంత న్యాయం చేయాలో అంతా చేశారు. ఆ కారణంగానే మహనీయగా ఉన్నారు ఈనాటికీ.
ఆ వైదుష్యం అపారం. ప్రతిభా సామర్థ్యం అపురూపం. ఆమెది మహోదాత్త నటనా స్రవంతి. ఆ రసథుని నటనా సామ్రాజ్యలక్ష్మీ వాల్లభ్యం. అదంతా అనన్య లభ్యం. గుణసుందరి, పంచమ ధర్మం, మరెన్నో నాటకాల్లో నటించి మెప్పించి ఒప్పించి ప్రఖ్యాతి సంపాదించిన జమున చిన్న తెర ధారావాహికలలో సైతం ముందు వరసన ఉండేవారు.
మాధవ మాధవీ సుమ సమంచితముల్, విలసత్కళా జగ
న్నాథము, లక్షరామృత సనాథము, లున్నమితోత్తమాంగ గం
గాధర జటాజూట మణికాంతులు, నవ్యకళా స్రవంతులై
యాధునికాంధ్ర – రంగస్థల దృగంతములన్ సరసీకరించుతన్
అంటూ మనసంతా నటరాజ సమర్చన సాగిద్దాం. నటన రంగాన దీటుగా నిలిచిన జమున జయంతిని సురభి రంగస్థల ప్రాభవ వైభవాలకు చేతులు రెండూ జోడించి మొక్కుదాం. ‘నటీమణి’ అనే నాలుగు అక్షరాలకు ప్రత్యక్ష రూపమైన ఆమెను వందనాలతో అభినందిద్దాం; మనసులోనే, మనసుతోనే!
జంధ్యాల శరత్‌బాబు
సీనియర్ జర్నలిస్ట్