భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
డా।। ప్రభాకర్ జైనీ
గుండె నిండు కుండలా దుఃఖంతో నిండి ఉంది. మరొక్క వగపు అల తగిలినా, వరద గోదారిలా పొంగి పొర్లేటట్టుగా తయారయింది.
నాన్న గది మొదటి అంతస్తులో ఉంది. మొదటి మెట్టుమీద పాదం మోపినప్పటినుండి, చివరి మెట్టును చేరుకునే సరికి నాకు పది నిమిషాల పైనే పట్టింది.
కింద నిలబడి నన్నే చూస్తున్న మా ఆవిడ మాటిమాటికీ కళ్లు తుడుచుకుంటుంది. ‘నేను ఏ క్షణమైనా, నాన్న గదిలోకి వెళ్లలేక తిరిగొస్తే, నన్ను ఆదుకుని, హత్తుకుని, ఓదార్చడానికి సిద్ధంగా ఉన్నట్టుగా’ అనిపించింది నాకు.
అందుకే, మనసెంతగా మొరాయిస్తున్నా, ఒక్కొక్క అడుగు పైకి వేయడానికి, శక్తినంతా కూడదీసుకుని మెల్లిగా పైకే ఎక్కుతున్నాను.
మా నాన్నకు ఆస్త్మా ఉండేది. మెట్లు ఎక్కడానికి చాలా అవస్థ పడేవాడు. గ్రౌండ్ ఫ్లోరులోని గదిలో ఉండమంటే ఉండేవాడు కాదు. ఒక్కొక్క మెట్టు ఎక్కి, ఒక్క క్షణం ఆగి ఊపిరి పీల్చుకుని, మరొక మెట్టు చొప్పున ఎక్కుతూ, ఓ పది నిమిషాలకు తన గదికి చేరుకునేవాడు. మెట్లన్నీ ఎక్కిన తర్వాత విజయ గర్వంతో నన్ను చూస్తూ చెయ్యి ఊపేవాడు.
నాకు ఆస్త్మా వంటి ఆరోగ్య సమస్య లేకున్నా, మెట్లు ఎక్కడానికి నాన్నకు ఎంత టైము పట్టేదో, సుమారుగా నాకూ అంతే పడుతుందేమోనని పించింది.
ఎందుకంటే, ఆ గదిలో ఇప్పుడు నాన్నలేడు. నాన్నలేని గదిలోకి అడుగు పెట్టాలంటే నాకు కాళ్లూచేతులూ, మనసూ వణుకుతున్నాయి.
నాన్న సమూహంలో ఒంటరి. నాన్న అంతర్ముఖుడు. కొత్తవాళ్లతో తొందరగా కలవలేరు. గత కొన్నేళ్లుగా ఒంటరితనాన్ని ఇష్టపడుతూ, తన గదిలోనే ఎక్కువ సమయాన్ని గడిపేవారు.
నాన్న పదిహేను రోజుల క్రితం మొదటి అంతస్తు ఎక్కి తన గదిలోకి చేరుకున్న తర్వాత మళ్లీ మెట్లు ఎక్కే అవసరం రాలేదు. అదే రోజు రాత్రి నిద్రలోనే చనిపోయారు.
మెట్లు ఎక్కడానికి ఎంత టైం పట్టిందో చూసుకోలేదు. నాన్న గది ముందు నిలబడి తలుపు మెల్లిగా తెరిచాను. నాన్నకు చప్పుళ్లు అంటే చిరాకు. ఆయన లోపల ఉన్నప్పుడు మేము ఏ మాత్రం చప్పుడు కాకుండా తలుపు తీసేవాళ్లం. అదే అలవాటుతో, నాన్న లోపలే ఉన్నాడేమోనన్నంత జాగ్రత్తగా, తలుపు తెరిచాను. లోపలికి అడుగు పెట్టాను. కానీ, అడుగులు ముందుకు పడడం లేదు. గది నిండా విషాదపు తెరలు మందంగా పరుచుకుని ఉన్నట్టుగా, అవి నన్ను ముందుకు కదలనీయడం లేదన్నట్టుగా అనిపించింది.
పచ్చి పుండులా గుండె కలుక్కుమంటూనే ఉంది.
నాన్న గది అంటే, చిన్నప్పుడు, మాకొక అపురూప లోకం. ఒక మంత్ర నగరి. ఒక పూజా మందిరం. మాకేం కావాలన్నా నాన్న ‘ఛూం మంతర్’ అని ఆ గదిలో నుండే తెచ్చి ఇచ్చేవారు. నాన్న ఉద్యోగరీత్యా ఎన్నో ఊళ్లు తిరిగేవారు. ఎన్ని పనులున్నా, అక్కడ మా కోసం ఒక రోజు కేటాయించి, మమ్మల్ని సంతోష పెట్టే విధంగా ఉండే బొమ్మలు, ఆట వస్తువులు, పుస్తకాలు, బట్టలు కొని తెచ్చి, తన గదిలో దాచి పెట్టేవారు. వాటన్నింటినీ, మా పుట్టిన రోజులకో, పండుగలకో, మేం ఆటల పోటీలో గెలిచినప్పుడో లేదా మేం మార్కులు బాగా సంపాదించినప్పుడో ఇచ్చేవారు. ఆ సంఘటనను ఫొటో తీసి పెట్టుకునే వారు.
నాన్న గదిలోకి అడుగు పెట్టగానే, అలనాటి అపురూప జ్ఞాపకాలన్నీ నన్ను ముసురుకున్నాయి. నాన్న గదిలో ఎప్పుడూ ఒక రకమైన తాజా వాసన వచ్చేది. నాన్న వాడే అత్తరు పరిమళం పీల్చడం కోసం, నాన్న బయటకు వెళ్లగానే గదిలోకి చొరబడి, గుండెల నిండా ఆ వాసనను పీల్చుకునే వాళ్లం. కానీ, అత్తరు రాసుకునే సాహసం ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే, ఆ అత్తరు పరిమళం మా బట్టల నుండి వస్తే, దొంగలం దొరికిపోతామనే భయం ఉండేది. ఇప్పుడు కూడా అదే వాసన నా నాసికకు తోచింది.
నాన్న గది ఓ పెద్ద గ్రంథాలయం. అందులో, హిందీ, ఇంగ్లీషు, సంస్కృతం, తెలుగు పుస్తకాలు ఉండేవి. గోడల పక్కన వరుసగా పేర్చిన బీరువాల నిండా పుస్తకాలే. నాన్న చుట్టూ మంచంలో, కుర్చీలో, టేబుళ్ల మీదా పుస్తకాలే ఉండేవి. నాన్న ప్రపంచమంతా వేరే. ఆ మంచం నిండా పుస్తకాలు, పత్రికలు, తను వేసుకునే, మందులు, పర్సు, గడియారం, ల్యాప్ టాప్, పెన్నులు, పేపర్లూ.. అన్నీ అందులోనే మహా చిందరవందరగా ఉండేవి. ఎవరైనా సర్దాలని ప్రయత్నించినా, నాన్నకు నచ్చేది కాదు.
నాన్న తను వాడిన వస్తువులతో ఒక అనుబంధం ఏర్పరుచుకునే వారు. తను నలభై ఏళ్ల క్రితం నడిపిన స్కూటర్, వాడిన కళ్లద్దాలు, పెన్నులు జాగ్రత్తగా కాపాడుకునేవారు. నాన్న గదిలో అటువంటి వస్తువులు చాలానే ఉండేవి.
నాన్న లేనప్పుడు నేను చాలా సార్లు ఆ మంచం మీద కూర్చుని, నాన్న లాగే, పెన్ను నోట్లో పెట్టుకుని, ఆలోచిస్తున్నట్టుగా ఫోజు పెట్టేవాణ్ణి. మంచి మూడ్‌లో ఉన్నప్పుడు నాన్న నన్ను మంచంలో తన ఒళ్లో కూర్చోబెట్టుకుని ఎన్నో ముచ్చట్లు, కథలు చెప్పేవారు. నేను చెప్పే పిచ్చి కబుర్లకు పడీపడీ నవ్వే వాడు. నాకు సైకిల్ తొక్కడం నేర్పుతున్నప్పుడు, నాన్న నా సైకిల్ వెంబడి పరిగెత్తడం నాకింకాగుర్తుంది. నేను సైకిల్ తొక్కడం పూర్తిగా నేర్చుకున్న రోజున నాన్న ముఖంలో గర్వం తొణికిసలాడడం నేను మర్చిపోలేదు. సైకిల్‌ను బ్యాలెన్స్ చేయగలిగితే, జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేయవచ్చునని అంటుండేవారు.
అయితే, మా నాన్న మహాకోపిష్టి. తను అనుకున్న విధంగా పనులు జరగకపోతే, ఇల్లు రణరంగం చేసేవాడు. మేమంతా గజగజలాడి పోయేవాళ్ల్లం. నాన్న మహా మేధావి. మేము కూడా ఆయనలాగే, అదే స్థాయిలోనే ఆలోచించా లనే వాడు. బయట ప్రపంచం మహా భ•యంకర మైనదని, అందుకు తగ్గ లౌక్యం అలవరు చుకోలేకపోతే, భవిష్యత్తులో మేము కష్టాల పాలవుతామని బాధ పడేవాడు. విద్యార్థి వయసులో పూర్తి సమయం చదువుల కోసమే కేటాయించాలనీ, జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకుని, అందుకోసం, నిర్విరామంగా కృషి చేయాలని చెప్పేవారు. మేం వయసు ప్రభావం వల్లనో, స్నేహితుల ప్రభావం వల్లనో, దారి తప్పుతు న్నప్పుడు నాన్న హూంకరించేవారు. ఆయన చెప్పేది మా బాగు కోసమేనని అప్పుడు గ్రహించలేదు. అందరి ఇళ్లల్లో మాదిరిగా మాకు ఎందుకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం లేదని నాన్న మీద కసి పెంచుకునే వాళ్లం. నాన్న పీడ వదిలితే బాగుండునని అప్పుడప్పుడు అనుకునే వాళ్లం.
నాన్న కోపం తాటాకు మంటలా భగ్గుమని లేస్తుంది. వెంటనే చప్పున చల్లారిపోతుంది. మమ్మల్ని దెబ్బలు కొట్టిన రోజైతే, తర్వాత గది తలుపులు మూసుకుని, చీకట్లోకూర్చుని బాధపడేవారు. ఆ విషయం అప్పుడు మాకు తెలియక పోయినా, తరువాత్తరువాత మేం పెద్ద పెరిగిన తర్వాత ఆకళింపు చేసుకున్నాము.
నాకు యుక్త వయసు వచ్చేసరికి, నాన్న క్రమేపీ, సాత్వికంగా మారిపోయారు.నన్ను స్నేహితునిగా భావించి, నా ఆలోచనలకు విలువనిచ్చేవారు. మేమందరం కూర్చున్నప్పుడు సరదా కబుర్లు చెప్పేవారు. తన చిన్నప్పడు తను చేసిన అల్లరి గురించి చెప్పేవారు. అలా మాతో సరదాగా ఉంటూ, నవ్వుతూ ఉంటే మాకెంతో హాయిగా ఉండేది.
పల్లెటూళ్లో స్నేహితులతో కలిసి ఈత కొట్టడానికి వెళ్లి, బావిలో మునిగిపోతుంటే పక్కన ఉన్న వారు ఏ విధంగా రక్షించి, ఇంటికి తీసుకెళ్లి అమ్మమ్మకు అప్పచెప్పిన సంగతి గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకునే వాడు. నాన్న వయసు పెరుగుతున్న కొద్దీ ప్రతీ చిన్న సంఘటనకు విపరీతంగా చలించి పోయేవారు. కళ్లవెంబడి నీళ్లు కారిపోయేవి. ఎప్పుడో, మరణించిన బంధువులను తలుచుకుని, వాళ్లు తననెలా ప్రేమించేవారో చెప్పి బాధపడేవాడు.
నాన్న ఈ మరో రూపాన్ని, సాఫ్ట్ కోణాన్ని, జీవితంలో దగాపడ్డ వ్యక్తిగా చూసేసరికి, నాన్న నాకెంతో ప్రియమైన వ్యక్తిగా మారిపోయారనిపించేది. అలా మా మధ్య గాఢమైన బంధం ఏర్పడింది.
ఆలోచనల్లో మునిగి ఉన్న నేను ఇంతకు ముందు గమనించని కొన్ని విషయాలను గమనించాను. కిటికీలో నుంచి పడుతున్న సూర్యకిరణాలు, నాన్న ఎప్పుడో సగం తాగి మరిచిపోయిన టీ కప్పు, ఏదో రాస్తూ క్యాప్ తీసి పెట్టిన పెన్నూ, అసంపూర్తిగా ఉన్న ఒక కావ్యం – చూస్తుంటే కడుపులో మెలిపెట్టినట్టయింది.
నాన్న మొదట్లో ఎన్నో కష్టాలు పడ్డా, జీవితంలో ఒక లక్ష్యం ఏర్పరుచుకుని, నిర్విరామ కృషితో, ఆ లక్ష్యాన్ని సాధించిన విజేత. అందుకే, నాన్నకు కొంచెం ఆర్థికంగా వెసులుబాటు చిక్కిన తర్వాత, తన సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో, ఒక ట్రస్టును ఏర్పరచి, దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తుండేవారు. ‘సమాజానికి తిరిగి ఇవ్వాలి’ (+ఱఙవ •మీ• •శీ •శీమీఱవ••) అనే సదుద్దేశ్యంతో మమ్మల్ని కూడా ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసేవారు. నాన్న ముఖ్యంగా…అమ్మాయిల చదువు కోసమై కృషి చేసేవారు. ఒక ఇంట్లో, ఒక అమ్మాయి విద్యావంతురాలైతే, తనతో పాటు, తరువాత వచ్చే రెండు మూడు తరాల వరకు ఆ కుటుంబంలో విద్య ప్రాముఖ్యత తెలుస్తుందనే వారు.
నాన్న రచనల్లో కూడా అంతర్లీనంగా సమాజహితమనే ప్రయోజనం ఉండేలా చూసుకునే వారు. అందుకే, నాన్న గదిలో గోడకు ‘విశ్వ శ్రేయః కావ్యం’ అనే కొటేషన్ అంటించి ఉండేది.
నాన్న కల్మషం లేకుండా సంతోషంగా జీవించాలని చెప్తుండేవారు. ఎదుటివాళ్లు మోసగాళ్లని తెలిసినా, వాళ్లు సహాయం అడిగితే చేయకుండా ఉండలేని బలహీనత నాన్నది. నాన్న వ్యక్తిత్వం, నాన్న గది నిండా నిండి ఉందేమోననిపిస్తుంది నాకు. అందుకే, నాన్న గదిలోకి ప్రవేశించినప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్, ఒక సకారాత్మక ప్రకంపనను అనుభవించాను.
నాన్న సైడ్ టేబుల్ మీద నా పేరుతో ఉన్న ఫైల్ కనిపించింది. అందులో నాకు సంబంధించిన లెక్కలూ, పత్రాలూ ఉన్నాయి.
నాన్న డబ్బు విషయంలో కూడా చాలా పొదుపుగా ఉండేవారు. అనవసరపు ఖర్చులు పెట్టొద్దని నాకు చెప్పేవారు. మేము విలాసవంతమైన జీవితాన్నే గడిపినా, వేస్టేజ్ ఉండకూడదనే వారు. సంవత్సరానికి నాకొచ్చే జీతం చూసి విస్మయం చెందేవారు. తన ఉద్యోగ జీవితం నెలకు రెండు వందల యాభై రూపాయలు జీతంతో మొదలయిం దని చెప్పేవారు.
చాలా రోజుల పాటు నా అకౌంట్లన్నీ తనే మెయింటెయిన్ చేసేవారు. ఎన్నిసార్లు చెప్పినా నా జీతంలో నుండి ఒక్క రూపాయి కూడా, ఇంటి ఖర్చు కోసం తీసుకునే వారు కాదు. నా జీతంలోని ప్రతి రూపాయినీ జాగ్రత్తగా మదుపు చేసేవారు. కొంత డబ్బును షేర్లలో, కొంత డబ్బుతో ఒక ఫ్లాట్, కొంత ఛారిటీకి, కొంత డబ్బును గోల్డ్‌బాండ్స్ రూపంలో, కొంత బంగారాన్ని కొనుగోలు చేయడంలో, కొంత డబ్బును పుట్టబోయే నా పిల్లల పేర్ల మీద, నా భార్య పేర్ల మీద ఫిక్సడ్ డిపాజిట్లు, హెల్త్ ఇన్స్యూరెన్స్, ఇన్‌కం టాక్స్ రిటర్నస్ ఫైల్ చేయడం వంటి పనులన్నీ చాలా ఇష్టంగా చేసేవారు. నాకూ నా భార్యకూ నెలకు సుమారుగా ఇరవై లక్షల జీతం అయినా మేము మామూలు మధ్య తరగతి జీవితాన్నే గడిపే వాళ్లం. మా నాన్నే బలవంతంగా మమ్మల్ని ప్రపంచ యాత్రకు పంపించారు. ‘పొదుపు’ అంటే కేవలం దుబారా చేయకుండా ఉండడమేననీ, అంతేకానీ, జీవితాన్ని ఆస్వాదించే విషయంలో పొదుపు పనికిరాదని చెప్పేవారు.
ఆ గదిలో నాకు నాన్న రెండు విభిన్న రూపాలు సాక్షాత్కారమైనట్టుగా తోచింది.
నాన్నజ్ఞ్ఞాపకాలతో హృదయం బరువెక్కినా, సైమల్టేనియస్‌గా, కొండంత భారం తగ్గినట్టుగా కూడా అనిపించింది. అటువంటి భావన కలగడానికి నాకు లాజిక్ దొరకలేదు. నాన్న భౌతికంగా మా మధ్య లేరు అన్న బాధతో హృదయం బరువెక్కినా, నాన్న గది ఆయన ప్రతిరూపమని, ఎప్పుడొచ్చినా నాన్న ఆ గదిలోనే ఉన్నాడన్న విశ్వాసం వల్ల కొంత రిలీఫ్ కలిగిందేమోనని అనిపించింది.
అంతకు ముందు గదిలోకి ప్రవేశించినప్పటిలాగా, ఈ సారి విషాదపు తెరలు అడ్డంకిగా తోచలేదు. మెల్లగా లేచి నాన్న కప్ బోర్డులను తెరిచి, నాన్న బట్టలను తడిమాను. ఒక అపురూపమైన ప్రేమ ప్రవాహం నన్ను ముంచెత్తింది. నాన్నకు చిన్నప్పటి నుండి బట్టలంటే చాలా ఇష్టమని చెబుతుండేవారు, ఒక రకమైన పిచ్చి అనేవారు. సినిమా హీరోల కాస్ట్యూమ్స్‌ను చూసి, అటువంటి డిజైన్లలో తనూ కుట్టించుకునే వారు. ఇప్పటికి కూడా ఫేస్బుక్కులో వచ్చే ప్రకటనలను చూసి, బట్టలు తెప్పించుకుంటారు. చాలా వరకు ఇంకా సీల్ విప్పకుండా ప్యాకెట్లు అక్కడ పడి ఉన్నాయి. నాన్న రచయిత కాబట్టి చాలా సమావేశాలకు వెళ్తుండే వారు. అందుకోసమని టిప్‌టాప్‌గా తయారయ్యేవారు. ఈ వయసులో అందరూ లాల్చీలు, జుబ్బాలు వేసుకుంటుంటే, నాన్న మాత్రం జీన్స్ ప్యాంట్లు వేసుకునేవారు. నాన్న డ్రెస్సింగ్ చూసి, ఆయన అసలు వయసెంతో అంచనా వేయలేకపోయే వారు. నాన్నకు ఎంతో ఇష్టమైన బ్లాక్ టీ షర్ట్ తీసి నేను తొడుక్కున్నాను. నాన్నను కౌగిలించుకున్నట్టే అనిపించింది.
కానీ, ఆ టీ షర్ట్ అసలు యజమాని శరీరం కాలి బూడిదయిపోయిందనుకునే సరికి, నా కాళ్లు సత్తువ కోల్పోయి, నేను కింద కూలబడిపోయాను. గుండె లోతుల్లో ఎంత లోతైన దుఃఖపు సముద్రం ఉందో కానీ, మళ్లీ కన్నీళ్లు జలజలా రాలాయి.
అలా ఎంత సేపు ఉండిపోయానో నాకే తెలియదు. నాన్న గది తలుపు తెరుచుకుని, నా భార్య నా దగ్గరకి వచ్చి తను కూడా నా పక్కనే కూర్చుంది. నా భుజం మీద అలవోకగా తన చేయి వేసి, నాకు ధైర్యం చెపుతున్నట్టుగా చిన్నగా తడిమింది.
నాకు తెలుసు. నాన్న లేరనీ, ఇక మీదట, నాన్న లేని జీవితాన్నే నేను గడపాలనీ తెలుసు. బజారులో ఎవరైనా కలిసినప్పుడు ఫలానావారి అబ్బాయినని అతిశయంగా చెప్పుకునే వాణ్ణి. ఇప్పుడు ఇక ఆ అవకాశం లేదు.
ఈ పదిహేను రోజుల్లోనే పదిహేను సంవత్సరాల వయసు పెరిగినట్టున్నది, ముదిమి వయసు ముంచుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. బయటి ప్రపంచంలోకి వెళ్లి నాన్న లేని జీవితాన్ని ఎలా గడపాలోఊహించుకో లేక పోతున్నాను.
కొద్ది సేపటి తర్వాత నా భార్య చేతి మీద నా చేతిని ఉంచాను. నేను తేరు కున్నానన్నమౌన సంకేతాన్ని ఆమెకు పంపాను. పాపం ఇన్ని రోజులూ తనూ నాతో పాటే దుఃఖపు నావలో ప్రయాణించింది. ఆ నావ ఆటుపోట్లకు గురవుతుందని అనిపిస్తే, లంగరు వేసి నన్ను నిలబెట్టింది.
నాన్న గది నాకు తీపిచేదుల రుచి చూపించింది. నాన్నలేకున్నా, నాన్న గది నాకు మార్గ నిర్దేశనం చేస్తుందన్న నమ్మకం నాకుంది. నాన్న అలా నన్ను ఒంటరిగా వదిలేసి పోడని నాకు ప్రగాఢ విశ్వాసం.
ఈ రోజు నుంచి నాన్న గది, నాది.
నాన్నను కలవాలనుకున్నప్పుడూ, తనివితీరా నాన్న ఒడిలో తలవాల్చి ఏడవాలనుకున్నప్పుడూ, నాన్న జ్ఞాపకాలను నాలో సజీవంగా ఉంచాలనుకున్నప్పు డల్లా, నేను నాన్న గదికి వస్తూనే ఉంటాను.
నాన్న గది తలుపు జాగ్రత్తగా వేసి, నా భార్య ఆసరాతో మెట్లు దిగుతుంటే…
నాన్న గది ముందు నిలబడి వీడ్కోలు చెప్తున్నట్టని పించడంతో వెనుతిరిగి చూశాను. నిజంగానే నాన్న నాకు కనిపించారు చేయి ఊపుతూ.
వచ్చేవారం కథ..
యద్భావం తద్భవతి
– డా।। ఎమ్.సుగుణరావు