స్వతంత్ర భారతదేశ ఆర్థికవ్యవస్థలో 1991 దశకం ప్రథమార్థం అత్యంత క్లిష్టసమయం. కాంగ్రెస్ పార్టీ తరపున అనూహ్య పరిస్థితులలో ప్రధానమంత్రి పీఠం అధిష్టించిన పీవీ నరసింహారావుకు అది అగ్నిపరీక్ష కాలం. దేశంలోని బంగారం తాకట్టులోకి వెళ్లి కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం అంత సులువైన పని కాదు. అప్పటికే రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా ప్రతిభ కనబరచిన మన్మోహన్ సింగ్‌ను తమ జట్టులోకి తీసుకుని విత్త శాఖను అప్పగించారు. ‘కరవుకాటకాలతో అల్లాడే కుగ్రామంతో, బీద కుటుంబంలో పుట్టి, ఉపకార వేతనాలతో చదివిన నాకు ఈ దేశం అతి ముఖ్యమైన బాధ్యతలు అప్పగించి గౌరవించింది. దానిని నిలుపుకుంటూ అంకిత భావంతో సేవలు అందించేందుకు ప్రయత్నిస్తానని మాటిస్తున్నాను’ అని కేంద్ర ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ (జూలై 24,1991) చేసిన విన్నపం, ఆయన తీసుకు వచ్చిన ఆర్థిక సంస్కరణలలో ప్రతిఫలించాయి.
దేశ జీడీపీ వృద్ధిరేటు 1.1 శాతంతో, విదేశీ మారక ద్రవ్యం 83 కోట్ల డాలర్లకు పరిమితమై ఆర్థిక సంక్షోభం పడగలెత్తిన వేళ పీవీ రాజనీతిజ్ఞత, మన్మోహన్ మేధస్సు జమిలిగా దేశాన్ని ఆర్థిక ఇక్కట్లను నుంచి గట్టెక్కించాయి. దేశ ఆర్థిక వ్యవస్థ రుగ్మతకు సంస్క రణల శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి, ప్రతిపక్షాల మన్ననలనూ అందుకొన్నారు. ఆ సంస్కరణలతో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించింది. వాటిని వడిసిపట్టుకున్న ప్రస్తుత నరేంద్రమోదీ ప్రభుత్వం విదేశ మారక ద్రవ్య నిల్వలను 65 వేల కోట్ల డాలర్లను దాటించింది. 3.9 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో దేశం ప్రపంచంలో అయిదవ ఆర్థికశక్తిగా పరుగులు తీయిస్తోంది. మన్మోహన్ సేవలను స్మరించుకుంటూ ప్రధాని నరేంద్రమోడీ విడుదల చేసిన ప్రత్యేక సందేశంలో… ‘అంతులేని లేమితో జీవితమే పోరాటంగా మారిన స్థితి నుంచి అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చ నేందుకు మన్మోహన్ సింగ్ జీవితం భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. దేశ విభజన అనంతరం స్వగ్రామంలోనే సర్వస్వం వదిలేసి భారత్ చేరిన ఆయన తమ జీవిత ప్రస్థానంలో అనేక/ అసంఖ్యాక విజయాలు సాధించడం అసామాన్య అంశం. దేశం అత్యంత క్లిష్ట పరిస్థితులలో ఉన్న కాలంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా, పీవీ నరసింహారావు మంత్రి వర్గంలో ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక వ్యవస్థను నవ్య పథంలోకి తీసుకెళ్లారు’ అని నివాళులు అర్పించారు.
ఇక గురుశిష్యులు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్‌లను ‘ఆకస్మిక,యాదృచ్ఛిక’ ప్రధాన మంత్రులుగా విశ్లేషించే వారు అదే సమయంలో వారు ప్రతిభా సంపత్తితో ఎదిగిన తీరును అంగీకరి స్తారు. మన్మోహన్ పదేళ్ల ప్రధాన మంత్రి హోదాలో పార్టీ అధిష్ఠానం అదుపాజ్ఞలలో పాలన సాగించారనే వ్యాఖ్యలు ఎదుర్కొన్నా, వ్యక్తిగత ప్రయోజనాలు/స్వార్థం కోసం పాకులాడలేదు. తన రాజకీయ పరిమితులు తెలిసి, తన పరిధిలోనే పనిచేశారు తప్ప వివాదాలకు పోలేదు. జాతి శ్రేయస్సుకు అవసరమైన లక్ష్యాలకు ప్రాధాన్యం ఇచ్చారే కాని అవినీతి మకిలి అంటేలా స్వార్థ రాజకీయ నేతల జాబితాలో చేరలేదు. 1999 లోక్‌సభ ఎన్నికలలో ఢిల్లీ దక్షిణ నియోజకవర్గం నుంచి పొటీ పడినప్పుడు (ఆ ఎన్నికలలో పరాజితులయ్యారు) ఎన్నికల ఖర్చుకోసం పరిచయస్థుల వద్ద అప్పు చేయడమే ఆయన నిజాయతీ,నిస్వార్థ రాజకీయాలకు నిదర్శనమని విపక్ష నేతలు సయితం అంగీకరిస్తారు. ఆయన నిజాయతీని, చిత్తశుద్ధిని అనుమానించేందుకు వీలులేక పోయినప్పటికీ యూపీఏ రెండవ ప్రభుత్వంలో కొందరు సహచర మంత్రులపై పోటెత్తిన అవినీతి ఆరోపణలకు ప్రభుత్వాధినేతగా వాటిని కాయక తప్పని పరిస్థితి. అయినా ప్రధాన మంత్రిగా సాధించిన కొన్ని విజయాలు ఆయన ఘనతను పెంచాయి. 1990 దశకం ఉత్తరార్థంలో అణ్వస్త్ర పరీక్షలతో దూరం జరిగిన దేశాలకు స్నేహహస్తం అందించారు.
మన్మోహన్ జీవన నేపథ్యాన్ని పరిశీలిస్తే, దేశ ద్వితీయ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి స్ఫురణకు వస్తారు.ఆయనలానే నిరాడంబరుడు, ప్రచారానికి విముఖుడు. ప్రజాసేవకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నదే వారి భావన. కీలక ఇండో-అమెరికా అణు ఒప్పందానికి మన్మోహన్ ప్రధాన కారకుడైనా ఎలాంటి ప్రచారం కోరుకోలేదు. ‘నా కంటే గొప్ప విజయాలు సాధించిన వారు ఎందరో ఉన్నారు’ అంటూ తనకు ప్రకటించిన పురస్కారాన్ని (ఇండియన్ ఆఫ్ ది ఇయర్) ఇంటి వద్దే స్వీకరించారని నిర్వాహకులు చెప్పడం గమనార్హం.
భారత్ క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు పీవీ రాజకీయ చాణక్యం, మన్మోహన్ మేధాశక్తి తోడైందని ఆ సొంత పార్టీలోనే అత్యధికులు అంగీకరిస్తారు కానీ మరణానంతరం దక్కిన గౌరవంలో ఇద్దరిమధ్య వ్యత్యాసం కనిపి స్తుంది. డిసెంబర్ 26న కన్నుమూసిన మన్మోహన్ సింగ్‌కు నివాళులు అర్పించేందుకు తెలంగాణ శాసనసభ 30న ప్రత్యేకంగా సమావేశమైంది. ఆయనకు ‘భారతరత్న’ ప్రదానం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించగా, బీజేపీ సహా అన్ని పక్షాలు ఏకగ్రీవంగా ఆమోదించడం హర్షణీయం. సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం (డిసెంబర్ 23, 2004)లో కన్నుమూసిన పీవీ అంతిమ సంస్కారం నిర్వహణలో ఆయన పార్టీ అధిష్ఠానం, నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి, హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరిగిన తీరును ప్రత్యేకంగా ప్రస్తావించనవసరంలేదు. అంతిమ యాత్రకు ఆయన భౌతిక కాయాన్ని బలవంతంగా స్వరాష్ట్రానికి తరలించినట్లు, మోదీ ప్రభుత్వం మన్మోహన్ విషయంలో అనుసరించక దేశ రాజధాని లోనే అధికార లాంఛనాలతో నిర్వహించింది.
– జాగృతి డెస్క్