‘నీ దేశం, నీ సంస్కృతి పట్ల ఎవరైనా అగౌరంగా వ్యవహరిస్తే మీరు ధైర్యంతో, గర్వంగా వాటి గొప్పదనం చెప్పండి. కన్నతల్లిని, జన్మభూమిని గౌరవించని వారితో దేశానికి ఎప్పటికైనా ప్రమాదమే!.’ 1986లో హైదరాబాద్ పాతబస్తీలో శాలిబండ వద్ద సుధా టాకీస్ సమీపంలో ఏర్పాటు చేసిన బీజేపీ సభలో అటల్ బిహారీ వాజపేయి అన్నమాటలివి. వాజపేయి శత జయంతి తరుణంలోను ఆ మాటలు దేశ రాజకీయ పరిస్థితులకు సరిగ్గా సరిపోతాయి.
వాజపేయి ప్రమాణ స్వీకారోత్సవాలు 1996 (13 రోజులు), 1998 (13 నెలలు), 1999 (ఐదేళ్లు)
‘అటల్’ అంటే హిందీలో మొండి, పట్టుదల అని అర్థాలు. ఏదైన సంకల్పం చేస్తే దృఢనిశ్చయంతో పూర్తి చేయడంలో ముందుండే వాజపేయి స్వభావం మొండితనం, పట్టుదల ఆ పేరుకు సరిగ్గా సరిపోతాయి. అయితే ఆ మొండి వ్యక్తే ఎంతో మృదుస్వభావి. ఉదారవాది. మానవతావాది. ఆయన అతివాది కాదు. మితవాది. అజాతశత్రువు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో డిసెంబర్ 25, 1924న మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వాజపేయి 16 ఏళ్ల వయస్సులోనే ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకుడిగా చురుకుగా వ్యవహరించారు. స్వాతంత్య్రోద్యమంలో పాలుపంచుకున్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమం తమ సొంత ఆస్తిగా భావిస్తూ వందేళ్లుగా కుళ్లు రాజకీయాలు నడుపుతున్న కాంగ్రెస్‌కు వాజపేయి లాంటి ఎందరో స్వయంసేవకుల పోరాటాలు గుర్తుకు రావు. వాజపేయి జర్నలిస్టుగా, కవిగా, రచయితగా, ప్రజాసేవకుడిగా రాణించారు. మొదట జన్‌సంఘలో క్రియాశీలకంగా పనిచేసి, 1980లో జనసంఘ్ భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందడంతో తొలి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిగా ఆయన 1977లో ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించారంటేనే ఆయనకు దేశ సంస్కృతి పట్ల ఎంత అభిమానం ఉండేదో స్పష్టమవుతుంది. దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో జైలుకెళ్లిన ఆయన ధైర్యం కోల్పోకుండా నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు.
భావి ప్రధానిగా గుర్తింపు
జనసంఘ్ తరఫున 1957లో బలరాంపూర్ నుండి ఎంపీగా వాజపేయి గెలవడం భారతదేశ రాజకీయాల్లో కీలక మలుపు. వాజ్‌పేయి ప్రసంగాలకు ముగ్దులైన నాటి ప్రధాని జవాహర్‌లాల్ నెహ్రూ ‘‘ఈయన ఎప్పటికైనా దేశ ప్రధాని అవుతారనే చెప్పిన మాటలు 1996లో నిజమయినా, దురదృష్టవశాత్తు అది 13 రోజుల ముచ్చటే అయ్యింది. పార్లమెంట్‌లో మెజార్టీ నిరూపించుకోలేకపోయిన వాజపేయి ఎలాంటి బేరసారాలకు పాల్పడకుండా ఎంతో నిజాయతీతో రాజీనామా చేశారు. ఆ సందర్భంగా ఆయన పార్లమెంట్‌లో ‘‘పదవి కోసం పాకులాడే తత్వం మాది కాదు. సంఖ్య ఆధారంగా అధికారం ఉండవచ్చు, పోవచ్చు. పార్టీలు వస్తుంటాయి, పోతుం టాయి. కానీ ప్రజాస్వామ్యం ఎప్పటికీ నివాలి, వాటి విలువలు వర్థిల్లాలి….’’ అంటూ చేసిన ప్రసంగం భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలిచింది.
1998లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మెజార్టీ రావడంతో వాజపేయి రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినా, జయలలిత రూపంలో మరోసారి ఆటంకాలు రావడంతో ఒక్క ఓటు తేడాతో మెజార్టీ కోల్పోవడంతో మరోసారి 13 నెలలకే ఆ ప్రభుత్వం కూలిపోయింది. మిత్ర పక్షాలతో బీజేపీకి సరిపడడం లేదని అప్పటి ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తే… ‘‘ఏదో ఒకరోజు బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించి అనుకున్న లక్ష్యాలను పూర్తిచేస్తుంది…’’ అని అప్పుడు వాజపేయి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నరేంద్ర మోదీ రూపంలో వాస్తవం కావడం విశేషం. అనంతరం 1999లో వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 300 పైగా స్థానాలు సాధించడంతో ఆయన మూడోసారి ప్రధాని అయ్యారు. ఐదేళ్లు పూర్తిగా పాలించిన కాంగ్రేసేతర మొదటి ప్రధాని ఆయనే. దేశ భవిష్యత్తుకు పునాదిలేస్తూ అనేక కీలక కార్యక్రమాలు చేపట్టారు.
పరుగులు పెట్టిన దేశాభివృద్ధి
వేగవంతమైన సామాజిక మార్పులతో కూడిన అర్థిక అభివృద్ధితోనే దేశ సాధికారత సాధ్యమవుతుంని నమ్మిన వాజపేయి దేశాభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఆయన ప్రభుత్వం మౌలిక వసుతులను ఆధునీకరించి, కల్పించడంతో పాటు ఆర్థిక సంస్కరణలో భాగంగా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్స హించారు. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు. ఆయన హయాంలో చేపట్టిన ‘కనెక్టివిటి ఇండియా’ ప్రాజెక్టు దేశానికి మణిహారం.
దేశంలో నాలుగు వైపుల ఉండే నాలుగు మెట్రో నగరాలను అనుసంధానం చేస్తూ, జాతీయ రహదారులను కలుపుతూ 2001లో ‘స్వర్ణ చతుర్భుజి’ ప్రాజెక్టును చేపట్టారు. దీంతో దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులకు ఊహించని రీతిలో మహర్దశ వచ్చింది. ఇందులో భాగంగా రహదారులను విస్తరించడానికి భూములు సేకరించాల్సిన అవసరం ఉండంతో, పేదల భూములను ప్రభుత్వ కొల్లగొడు తుందనే విమర్శలొచ్చినా, ఆయన వెనకడుగు వేయక, భూములు కోల్పోయిన వారికి న్యాయం చేస్తూ దీర్ఘ కాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందడగు వేయడంతో దేశ రూపురేఖలు మారాయి. తాను మాటల మనిషిని కాదు, చేతల మనిషిని అని నిరూపిస్తూ అనతికాలంలోనే 5400 కిమీల మేర రహదారులను అభివృద్ధి చేసిన ఘనత వాజపేయిదే.
గ్రామాల అభివృద్ధి దేశ పురోగతికి సోపానం అని నమ్మిన వాజపేయి ‘గ్రామీణ సడక్ యోజన’ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా జాతీయ రహదారులకు సమాంతరంగా గ్రామీణ రహదారు లను కూడా వేగవంతంగా అభివృద్ధి చేయడంతో దేశ వ్యాప్తంగా రోడ్డు రవాణా సదుపాయాల్లో నూతన ఒరవడికి నాంది పలికినట్టయ్యింది. రోడ్ల విస్తరణతో పాటు రైలు, విమానాశ్రయాలు, ఓడరేవుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన వాజ్‌పేయి ప్రభుత్వం ధైర్యవంతంగా ముందుకు సాగింది. ఈ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, అభివృద్ధికి, సంస్కరణలకు, పెట్టుబడుల కోసం అసరమైన విభాగాల్లో ప్రయివేటీకరణకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించిన సందర్భంలో ప్రధానంగా వామపక్షాల నీడన ఉండే ఉద్యోగ సంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైన సమయంలో వాజపేయి వ్యూహాత్మంగా వ్యవహరించి ప్రైవేట్ పెట్టుబడులు సంస్థ అభివృద్ధికి మాత్రమేనని, ఉద్యోగులకు నష్టం జరగదనే భరోసా కల్పించారు. దీంతో ఈ రంగాలు కూడా వేగవంతంగా పురోగతి సాధించడంతో రవాణా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చి మౌలిక సదుపాయాల కల్పనలో దేశాభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. దేశంలోని విమానాశ్రయాలు అంతర్జాతీయ విమానాశ్రయాల స్థాయిలో, రైల్వే స్టేషన్లు విమానాశ్ర యాల స్థాయిలో అభివృద్ధి చెందాయి.
ప్రపంచంలో అగ్రరాజ్యాలు ఆధునిక సాంకేతిక తతో దూసుకుపోతున్న దశలో భారత్ కూడా టెక్నాలజీని వినియోగించుకోవాలనే సంకల్పంతో వాజపేయి ప్రభుత్వ రంగ సంస్థల్లో మార్పులు చేర్పులు చేపట్టడంతో దేశ సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. ఇందులో భాగంగా టెలికాం కమ్యూనికేషన్ రంగాల్లో ప్రైవేట్ భాగస్వామ్యం కల్పించాని సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవ డంతో అవి ప్రగతిపథంలో సాగుతున్నాయి. ఐటీ రంగానికి ప్రోత్సహించేందుకు విదేశీ పెట్టుబడు లను ఆహ్వానించడంతో హైదరాబాద్, బెంగుళూరు, పుణే వంటి నగరాలు ఐటీ రంగంలో దూసుకుపోయి, ఇప్పుడు కోట్లాది యువతకు ఉపాధి కల్పించే స్థితికి చేరుకున్నాయి. అందరికీ చదువు అందాలనే లక్ష్యంతో వాజపేయి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘సర్వ శిక్ష అభియాన్’ పేదలకు, బడుగు, బలహీన వర్గాలకు వరంగా మారింది.
అటల్ బిహారీ వాజపేయి ప్రజాదరణతో బీజేపీ వేగవంతంగా వృద్ధి చెందుతుందని భావించిన ప్రతిపక్షాలు ఆయనను పార్టీకి దూరం చేసే కుటిల యత్నాలు చేసినా ఆయన తన శైలిలోనే వారికి సమాధానం ఇచ్చారు. ‘సరైన వ్యక్తి అయిన అ•ల్ బీజేపీలో ఉండాల్సిన నేత కాదు’ అని ప్రతిపక్షాల వ్యాఖ్యలకు… ఆయన ‘‘అధికారం కోసం పార్టీ మారడం, పార్టీ చీల్చడం, కొత్త గ్రూపులు కట్టడం చేయాల్సి వస్తే ఆ అధికారం నాకు వద్దు…’’ అంటూ ఎంతో సున్నితంగా వారికి జవాబిచ్చి తన నిజాయతీని నిరూపించుకున్నారు. ఆయన సాధారణ ప్రజల కోసం ఎంత తపన పడేవారో ఆయన రాసుకున్న కవితలు తేటతెల్లం చేస్తాయి. ‘‘ఓ దేవుడా.. నన్ను సామాన్యుల గొంతు వినలేనంతగా ఎదగనివ్వకు.. నన్ను అంతలా దిగజారనివ్వకు..’’ అని కవితా రూపంలో ప్రార్థించారు. మరో సందర్భంలో ఆయన ‘‘ఓ దేవుడా నా జీవిత చరమాంకంలో కూడా నిన్ను ప్రార్థించే శక్తి ఇవ్వు’’ అనే మాటలు ఆయనకు సంప్రదాయాలపై ఉన్న విశ్వాసానికి నిదర్శనం.
భారతీయులు చిరకాలంగా గుర్తుంచుకునేలా, దీర్ఘకాలిక ప్రణాళికలతో దేశాభివృద్ధికి కృషి చేసి, అవినీతి రహిత నిజాయతీ పాలన అందించి దేశ ప్రజల మన్ననలు పొందిన అటల్‌జీని నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యున్నత భారతరత్న పౌరపురస్కారంతో గౌరవించింది. ఆయన జయంతి రోజైన డిసెంబర్ 25వ తేదీని ‘సుపరిపాలన దినోత్సవం’గా ప్రకటిం చింది. శతజయంతి సందర్భంగా ఇప్పుడే కాదు, మరో వంద సంవత్సరాలైనా ఆయన దేశాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలు ప్రజల మదిలో ఎల్లకాలం నిలిచిపోతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
‘వాజపేయి’ అంటే అర్థం – మహోన్నతం. యజ్ఞ, యాగాదులకు ప్రాధాన్యమిచ్చే భారతీయ హిందూ సనాతన ధర్మంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘సోమయాగం’లో ఏడో పక్రియ ‘వాజపేయ’ యజ్ఞం. సోమయాగంలో చేసే త్యాగాలను బట్టి ఫలితాలుంటాయి. ఇందులో భాగంగా ‘రాజసూయ యాగం’ చేసినవారు గొప్ప రాజు అయితే, ‘వాజపేయ యాగం’ చేసిన వారు సమ్రాట్. ప్రజాస్వామిక యుగం కాబట్టి వాజపేయి మనవరకు అంతే.
– శ్రీపాద