భారతావని త్రివేణి సంగమ పవిత్రభూమి. చతుర్వేదాల జన్మస్థలి. ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రాది మహనీయులు అవత•రించిన అవని. గీతామృతాన్ని పంచిన నేల. పుష్కరాలు, కుంభమేళాలతో శోభిల్లే పుణ్యప్రదాయిని. భారతదేశం ధర్మభూమి, కర్మభూమి. ధర్మాచరణ మన సంస్కృతిలో భాగంగా పరంపరగా వస్తోంది. అతి పురాతన ఈ జాతి చరితలో ప్రతిదీ ఆరాధనీయమే. చెట్టుకు మొక్కినా,పుట్టను పూజించినా, శిలను అర్చించినా…ఒకే భావన. అదే ఆధ్యాత్మికం. ఆ అపూర్వ, అపురూప చింతనాధార నుంచి పురుడు పోసుకున్నవే కుంభమేళాలు, పుష్కరాలు. ఇవి దేశంలోని భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకలు.ఆరాధన ఏదైనా జలంతో ముడిపడి ఉండడం అనివార్యం. నీటి బిందువు కేవలం దాహార్తి తీరడానికో, ఆహార దిగుబడికో పరిమితం కాక, అనేకానేక రూపాలలో వ్యక్తమయ్యే దైవం ద్రవీభవించి దర్శనం ఇచ్చే వనరుగా ఈ జాతి సంభావిస్తుంది. నీటిని శరీర ప్రక్షాళన కోసమే కాక, ఆత్మ అభ్యంగానికి సాధనంగా,  ప్రతిబిందువునూ సర్వాంతర్యామి నెలవుగా పరిగణిస్తుంది.

హిందూ మతంలో కుంభ మేళాకు ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది. పురాణయుగంలో ఇది వ్యాప్తి చెందింది. ప్రపంచంలోనే ఎక్కువ మంది యాత్రికులు, భక్తులు హాజరయ్యే ఆధ్యాత్మిక సంబరం. అలనాడు చిన్న ఆధ్యాత్మిక కార్యక్రమంగా ప్రారంభ మైన కుంభమేళా కాలక్రమేణ అతిపెద్ద ఉత్సవంలా మారింది. ఆధునిక భారతదేశంలో ఈ పర్వం అపూర్వ స్థాయికి చేరింది. ప్రజలలో నైతిక, ఆధ్యాత్మిక భావనల వృద్ధికి, జాతీయభావన పటిష్టతకు కుంభపర్వం ఉపకరిస్తుందని విజ్ఞులు అంటారు. ఆధ్యాత్మికత, సంప్రదాయాలతో కూడిన ఈ వేడుకల్లో దేశవిదేశీయులు కోట్లాది మంది పాల్గొంటారు.

 మధ్యయుగంలో మౌర్య, గుప్త రాజవంశాలు ఈ కుంభమేళాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయని చరిత్ర చెబుతోంది. హర్ష చక్రవర్తి కుంభమేళా సందర్భంగా ప్రయాగరాజ్‌ను సందర్శించి వ్యక్తిగత ఆస్తులను దానం చేసేవాడని, ప్రజలలో ధార్మిక భావన పెంపొందించేందుకు ఈ పర్వానికి ఎంతో ప్రోత్సాహాన్నిచ్చాడట. సాధారణ శకం 643 ఫిబ్రవరి-ఏప్రిల్‌ ‌జరిగిన కుంభమేళాలో ఆయన ధార్మిక పరిషత్తు నిర్వహించాడు. ఆయన కాలంలో జరిగిన పరిషత్తులలో అది ఆరవది అని చారిత్రక కథనం. నాటి కుంభమేళాకు దాదాపు రెండున్నర లక్షల మంది పాల్గొన్నారంటూ ఆ మహాపర్వాన్ని హ్యూయాన్‌ ‌సాంగ్‌ (644) ఈ ‌కళ్లకు కట్టినట్లు వర్ణించాడు. ప్రయాగను ‘మహత్తర దాన క్షేత్రం’గా అభివర్ణించాడు.

 తొమ్మిదో శతాబ్దంలో శంకరభగవత్పాదుల ప్రచారం కారణంగా, కుంభమేళాకు మరింత ప్రాచుర్యం లభించింది. వారి చొరవతోనే కుంభమేళా ప్రస్తుత రూపం సంతరించుకుందని చెబుతారు. ఆదిశంకరులు నాలుగు పీఠాలను, పది సాధు సంప్రదాయాలను స్థాపించారు. ఈ సాధువులంతా కుంభపర్వంలో సమావేశమై సమాలోచనలు జరపాలని, ప్రజలలో సమైక్యాన్ని, ఆధ్యాత్మికతను పెంపొందించాలని ఆదేశించారు. ఆ పరంపరలోనే హిమాలయ గుహలలో తపస్సు చేసుకునే మహాత్ములు, యోగులు, వివిధ సంప్రదాయాల గురువులు, ఆచార్యులు, తమ అనుయాయులకు, సమాజానికి ఆధ్మాత్మిక సందేశాలు ఇవ్వడం అనుశ్రుతంగా వస్తోంది. అన్ని పంథాల, పీఠాల అధిపతులు సమావేశమై గతం గురించి సమీక్షించి, భవిష్యత్‌ ‌గురించి చర్చించి, తరువాతి కుంభమేళాకు ప్రణాళికను రూపొందిస్తారు.

 హరికథలు, ధార్మికోపన్యాసాలు ఉంటాయి. పండిత సభలలో శాస్త్రార్థాలపై చర్చలు జరిగి క్లిష్ట విషయాలకు పరిష్కారం కనిపిస్తుంది. ప్రతి కుంభమేళాలో బృహత్తరమైన విద్వత్‌ ‌గోష్ఠులు జరుగుతాయి. వివిధ సంప్రదాయాల గురువులు, ఆచార్యులు తమ అనుయాయులకు, సమాజానికి సందేశాలను ఇస్తుంటారు.

కుంభమేళా ఆవిర్భావం

ప్రపంచంలోని ధార్మిక సమ్మేళనాలలో అగ్రగణ్యం కుంభమేళ. దేశంపై ఎన్ని ఆఘాతాలు వచ్చినా పరంపరగా కొనసాగుతూ వస్తున్న అతి ప్రాచీనం, అతి చైతన్యవంతమైన పర్వదినం. కుంభమేళా భారతీయ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అతి పెద్దది. కుంభమేళా భారతీయులకూ, విదేశీయులకే కాదు… దేవతలకూ పరమపావనమైనది. ఆ సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేయడం ముక్తి, మోక్ష మార్గమని చాలా మంది భక్తులు విశ్వసిస్తారు. కుంభ మేళాలో… ముఖ్యంగా త్రివేణీ సంగమంలో మునక వేసి, పునీతులు కావడానికి దేవతలు కూడా మానవ రూపంలో దిగివస్తారని పురాణ గాథ. కుంభమేళా పవిత్ర స్నానంతో మనస్సు, ఆత్మశుద్ధి అవుతాయని నమ్ముతారు.

వేదకాలం నాటి ఈ కుంభమేళా గురించి శ్రీమద్భాగవతం, మహాభారత, విష్ణు పురాణాలలో ఉంది. కుంభమేళ ఆవిర్భావానికి సంబంధించి గాథ ప్రకారం… అమృతం కోసం దేవదానవులు మంధర పర్వతం కవ్వం, అనంతనాగం తాడుగా పాలకడలిని మధించారు. ధన్వంతరి భగవానుడు అమృత కుంభంతో ప్రత్యక్షమయ్యాడు. అమృత సేవనంతో శాశ్వతత్వం పొందేందుకు దేవాసురులు పోటీపడ్డారు. సూర్య, చంద్ర, బృహస్పతి సాయంతో ఇంద్ర కుమారుడు జయంతుడు ఆ కుంభాన్ని అందుకొని అక్కడి నుంచి నిష్క్రమించాడు. దానవులు వెంటాడారు. ఆ పారువేటలో జయంతుడు ప్రయాగ, హరిద్వార్‌, ‌నాసిక్‌, ఉజ్జయినిలలో సేదదీరాడు. ఇదంతా మొత్తం 12 దినాలు (ఆ సమయాన్ని మానవ ప్రమాణంలో పన్నెండేళ్లుగా పరిగణిస్తారు) జరిగింది. అమృత కుంభ స్పర్శతో ఆయాస్థలాలు విశేష పవిత్రతను పొందాయి.మరో పాఠాంతరం ప్రకారం, దేవతాలు అమృతభాండాన్ని తీసుకువెళుతుండగా,అందులోని అమృతబిందువులు నాలుగు చోట్ల.. (ప్రయాగ్‌రాజ్‌, ‌హరిద్వార్‌, ‌నాసిక్‌, ఉజ్జయిని) పడి, ఆ ప్రదేశాలు కుంభమేళా నిర్వహించే పవిత్ర స్థలాలుగా మారాయి. ఆ సంఘటనను స్మరించుకుంటూ నిర్వహించేదే కుంభమేళా పర్వం. ఆ కాలంలో నదులు అమృత తుల్యమవుతాయని, ఆ సమయంలో ఆయా ప్రాంతాల నదుల్లో స్నానం చేయడం వల్ల ఆత్మశుద్ధి అవుతుందని, పునర్జన్మ చక్రం నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం. ‘ఒక పనిని సామూహికంగా చేపట్టడంలో అనిర్వచనీయం, అగణితమైన శక్తి ఆవిర్భవిస్తుంది. సామూహికంగా మంత్ర పఠనం చేసినప్పుడు వాటి ప్రభావం సహస్రాధికమవుతుంది. కుంభమేళా ఆ కోవకు చెందినదే’అని విజ్ఞులు, ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు.

 కుంభమేళా ఐదు రకాలుగా(మహాకుంభమేళా, పూర్ణకుంభమేళా, అర్ధకుంభమేళ, కుంభమేళా, మాఘ్‌ ‌కుంభ్‌ ‌మేళా) నిర్దేశిత ప్రదేశాలలో జరుగుతుంది. 1. మహా కుంభమేళా ప్రయాగలో (అలహాబాద్‌)‌లో మాత్రమే జరుగుతుంది. ఇది ప్రతి 144 సంవత్స రాలకు లేదా 12 పూర్ణ కుంభమేళాల తర్వాత వస్తుంది. ఈసారి మహాకుంభమేళా సమయాన్ని అధికారికంగా కచ్చితంగా ప్రకటించ•లేదు. త్వరలో ఉండవచ్చని అంచనా. 2. పూర్ణ కుంభమేళా పన్నెండేళ్లకు ఒకసారి అలహాబాద్‌, ‌హరిద్వార్‌, ‌నాసిక్‌, ఉజ్జయినిలో జరుగుతుంది. 3.అర్ధ కుంభమేళాను ఆరేళ్లకు ఒకసారి హరిద్వార్‌, అలహాబాద్‌లో నిర్వహిస్తారు.4. కుంభమేళా ఉజ్జయిని, అలహాబాద్‌, ‌నాసిక్‌, ‌హరిద్వార్‌లో జరుగు తుంది. 5. మాఘ్‌ (‌కుంభ్‌) ‌మేళా (మినీకుంభ్‌)‌ను సంవత్సరానికి ఒకసారి జనవరి-ఫిబ్రవరిలో 45 రోజుల పాటు అలహాబాద్‌లో మాత్రమే నిర్వహిస్తారు.

కుంభమేళా గ్రహాల స్థానంతో సంబంధం కలిగి ఉంటుంది. ఆయా రాశులలోకి బృహస్పతి, సూర్యచంద్రుల సంచారాన్ని బట్టే కుంభమేళాలు నిర్ధారితమవుతాయి. మాఘమాసంలో బృహస్పతి కుంభరాశిలోకి, సూర్యుడు మేషరాశిలోకి, లేదా సూర్యచంద్రులు కర్కాటకంలోకి ప్రవేశించినప్పుడు కుంభమేళా నిర్వహిస్తారు. దేవగురువు బృహస్పతి వృషభరాశిలో, గ్రహాల రాజు సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహిస్తారు. బృహస్పతి,సూర్యుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు నాసిక్‌లో గోదావరి వద్ద, బృహస్పతి సింహరాశిలోకి, సూర్యుడు మేష రాశిలోకి లేదా సూర్యచంద్రులు తులారాశిలో ప్రవేశించి నప్పుడు ఉజ్జయినిలో క్షిప్రానది వద్ద కుంభమేళా జరుగుతుంది. సూర్యుడు మేష రాశిలో, బృహస్పతి కుంభ రాశిలో ఉన్నప్పుడు హరిద్వార్‌లో గంగవద్ద కుంభమేళా నిర్వహిస్తారు.

కుంభపర్వం సమయంలో పవిత్ర జలంలో నక్షత్రాల సంగమం ఉంటుందని, ఈ సమయంలో స్నానాలు చేసిన వారికి చంద్రుడు తదితర గ్రహాల అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఆరోగ్యం సహా పుణ్య ప్రయోజనాలు దక్కుతాయని, మకర సంక్రాంతి వేళ చేసే దానధర్మాలతో శుభ ఫలితాలు సిద్ధిస్తాయని చాలా మంది నమ్ముతారు. దానధర్మాలకు పరిమితి అంటూ లేకపోయినా, శక్తిమేరకు చేస్తారు. కశ్మీర్‌ ‌మహారాజు 99,999 గుర్రాలను, శ్రీహర్షుడు భూములను, పశువులను, రత్నాలు, బంగారం, వెండి దానం చేశాడని గాథలు ఉన్నాయి. నువ్వుల నూనెతో స్నానం చేయడం, నువ్వులతో హోమం చేయడం, నువ్వులు కలిపిన నీరు తాగడం, నువ్వులతో తయారు చేసిన పదార్థాలను తినడం, నువ్వులను దానం చేయడం వల్ల మంచి ఫలితాలు సిద్ధిస్తాయని పురాణవాక్కు.

తీర్థరాజం ప్రయాగ

ప్రయాగ ‘త్రివేణి సంగమ’ పవిత్రభూమిగా వినుతికెక్కింది గంగ, యమున,సరస్వతులు సంగమించే ప్రదేశం ప్రయాగ రాజ్‌. ‌మొదటి రెండు నదులు మనకు భౌతికంగా దర్శనమిస్తే, మూడవది సరస్వతి అంతర్వాహిని. భరతభూమిపై ఒకనాడు గలగలమని ప్రవహించిన ఈ జీవనది కాలక్రమంలో క్షీణించి అంతర్వాహినిగా మారింది. సరస్వతీ తీరంలో కురుక్షేత్రం ఉండగా, దాని సమీపంలోని వినాశన అనే చోట అది అంతర్థానమైందంటారు. మూడు నదులు సంగమించడానికి ముందు గంగానది లోతు కేవల నాలుగు అడుగులే కాగా, యమున లోతు 40 అడుగులు కావడం విశేషం. ‘తీర్థరాజం’గా పేరుపొందిన ప్రయాగలో బ్రహ్మదేవుడు తన ప్రాకృష్ట యాగాన్ని నిర్వహించాడని మహాభారతం పేర్కొంటోంది. ‘ప్ర’ అంటే గొప్పది అని అర్థం. అందువల్ల దీనికి ‘ప్రయాగ’ లేదా ప్రయాగరాజ్‌ అనే పేరు వచ్చిందంటారు. ప్రళయ కాలంలో భూమి అంతా సముద్ర జలంతో మునిగిపోయినా ఈ క్షేత్రానికి ఎలాంటి ముప్పు ఉండదట. శ్రీ మహావిష్ణువు వటపత్రశాయి రూపంలో ఇక్కడ ప్రత్యక్షమై ఉంటాడని, సర్వ దేవతలు ఈ తీర్థాన్ని కాపాడుతూ ఉంటార•ని చెబుతారు. ప్రయాగ కుంభమేళ ప్రపంచ ధార్మికసమ్మేళనానికి తలమానికం పేరొందింది. ఇలా పవిత్ర నదుల సంగమ క్షేత్రంగా భారతీయ సంస్కృతిలో మహోన్నత మైన త్యాగభావనకు స్ఫూర్తి కేంద్రంగా నిలిచింది.

శతాబ్దాల చరిత గల కుంభమేళాలలో గత ఆరు దశాబ్దాల కాలంలో జరిగిన వాటిలో మేటి 1966 నాటి ప్రయాగ్‌ ‌రాజ్‌ ‌కుంభమేళ అని, అప్పటి దాకా ఎన్నడూ ఎరుగనంతటి కార్యక్రమని చరిత్ర చెబుతోంది. విశ్వహిందూ పరిషత్‌ ‌విరాట్‌ ‌రూపం దాల్చింది. ఆ మహా సంరంభంలో విశ్వహిందూ పరిషత్‌ ‌మహాసభ, గోహత్య నిషేధ ఉద్ఘాటన మైలురాళ్లుగా నిలిచాయి. విశ్వహిందూ పరిషత్‌ ‌విశ్వహిందూ సమ్మేళనం నిర్వహించగా, గోహత్యను నిషేధించాలని పట్టుబడుతూ సాధువులు ఉపవాస దీక్షబూనారు. ‘స్వరాజ్యానంతరం 19 సంవత్సరాలకూ గోహత్యను నిషేధించకపోవడం విచారకరం. హిందువులు అనైక్యంగాను, అకర్ముణ్యులుగానూ ఉన్నారు. అందువల్ల వారి మనోభావాలను ఏ మాత్రం లక్ష్యపెట్టడం లేదు’ అని అఖిల భారత గోరక్షా సమ్మేళనంలో పూజ్య గురూజీ ప్రభుత్వ తీరును నిశితంగా విమర్శించారు. ‘విశ్వమందలి హిందూ ప్రతి నిధులు,హైందవ గురుజనులు ఈ సమష్టి సమ్మేళనపు ఆజ్ఞానుమతు లతో విశ్వహిందూ పరిషత్‌ ఒక శాశ్వత సంస్థగా వెలుగొందింది. ప్రయాగ కీర్తి సార్థకమైంది. దాని క్షేత్రమహాత్మ్యం ఇనుమడించింది’ అని ‘జాగృతి’ సంపాదకీయం (జనవరి 31,1966) పేర్కొంది. ‘హిందూ సమాజమునందలి సమస్త పథీ•యులు, సమస్త సంప్రదాయ ఆచార్యవర్యులు, గురుజనులు ఒక్కచోట సమావేశమై, తమ జ్ఞాన సర్వస్వమును మధించి హిందూ సమాజమందలి ఏకత్వా మృతమును చవి చూపించిన సందర్భం ఇంతకు పూర్వం లేదు. కనుకనే సమ్మేళనంలో ప్రసంగించిన స్వాములొకరు ‘ఇంతవరకు సాగుతున్నది స్నానకుంభం… ఇది జ్ఞానకుంభం’ అని చమత్కరించడాన్ని సంపాదకీయం గుర్తు చేసింది.

‘ప్రపంచంలో మరే దేశంలోనూ ఒక ధార్మిక నిమిత్తంతో ఇంత భారీ సంఖ్యలో ఏకత్రితమైన సందర్భంలేదు’ అని కుంభమేళాను సందర్శించిన ఒక విదేశీ ప్రతినిధి బృందం వ్యాఖ్యానించిందని ‘జాగృతి’ (ఫిబ్రవరి 24,1966) పేర్కొంది. అప్పటి దేశ జనాభా దామాషా ప్రకారం 60 లక్షల మందికి ఏర్పాట్లు జరగగా, 70 లక్షల మంది వచ్చినట్లు నాటి మేళ కమిషనర్‌ ‌జెడీ శుక్లా ప్రకటించారు.


ప్రతిష్ఠాత్మకంగా కుంభమేళా

‘సనాతన ధర్మంలోకెల్లా అతిపెద్ద వేడుక కుంభమేళా. దీనిని ఘనంగా నిర్వహించేదుకు డబుల్‌ ఇం‌జిన్‌ ‌సర్కార్‌ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటి వరకు 20 వేలకు పైగా సన్యాసులు, సంస్థలకు స్థలాలను కేటాయించాం. 13 అఖాడాలు, దండివాడ, ఆచార్య వాడతో పాటు ప్రయాగవాల్‌ ‌సభ, ఖాక్‌ ‌చౌక్‌ లకు స్థలాలు కేటాయించాం. మిగతా వారికి కూడా త్వరలో స్థలాలు కేటాయిస్తాం. తొలి సారిగా పాంటూన్‌ ‌వంతెనల సంఖ్య 22 నుంచి 30కి పెరిగింది మేళా ప్రాంతంలో 250, నగరంలో 661 చోట్ల సైనేజ్‌లు ఏర్పాటు చేశాం.గంగానదిలో నీటి ప్రవాహం బాగుండేలా చూస్తున్నా. గతంతో పోలిస్తే ఈసారి గంగా, యమునా నదుల్లో నీటిమట్టం బాగుంది. ఈ నీరు శుభ్రంగా ఉంది. మురుగునీరు, పరిశ్రమల వ్యర్థాలు నదుల్లోకి చేరకుండా చర్యలు తీసుకుంటున్నాం. బయోరెమిడియేషన్‌, ‌జియోట్యూబ్‌ ‌పద్ధతుల ద్వారా నీటిని శుద్ధి చేస్తున్నాం’ అని ఎప్పటికప్పుడు ఏర్పాట్లను సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ‌వివరించారు.


భారీ ఏర్పాట్లు

ఈ పూర్ణాకుంభమేళాకు మరో ప్రత్యేకత ఉంది. అయిదు శతాబ్దాల తరువాత అయోధ్య ఆలయంలో రామచంద్రుడు కొలువుదీరిన ఏడాదికే కుంభమేళా రావడం కాకతాళీయం. భవ్యమందిర ప్రారంభ తరహాలోనే ఈ కుంభమేళా నిర్వహణకు ఉత్తర ప్రదేశ్‌ ‌ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. 40 కోట్ల మందికి పైగా వస్తారని భావిస్తున్న కుంభమేళాకు తగు ఏర్పాట్లుచేస్తోంది. ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళా ప్రాంతాన్ని ఆ ప్రభుత్వం కొత్త జిల్లాగా ప్రకటించింది. కుంభమేళా జిల్లాగా పిలిచే ఇది రాష్ట్రంలో 76వ జిల్లాగా అవతరించింది. కుంభమేళా సజావుగా సాగేందుకు, పరిపాలనా పనులను మెరుగ్గా నిర్వహించడం లక్ష్యంగా ఈ కొత్త జిల్లా ఏర్పాటైంది. భద్రతా చర్యల కింద 50 వేల మంది సిబ్బందిని మోహరిస్తున్నారు. కృత్రిమమేధ (ఏఐ) తో కూడిన 2, 700 సీసీ కెమెరాలతో 24 గంటలూ పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. వంద అడుగుల నీటి లోపలి వస్తువులను కూడా గుర్తించే సామర్థ్యం గల జలాంతర (అండర్‌ ‌వాటర్‌)‌డ్రోన్లను వినియోగించ నున్నారు.

ఈ మేళా కోసం రూ. 2100 కోట్ల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించి, తొలి విడతగా రూ.1050 కోట్లు అందచేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 కోట్లు ఖర్చు చేస్తోంది. యాత్రికుల సౌకర్యంలో భాగంగా అక్కడి రవాణా సంస్థ పెద్ద సంఖ్యలో (ఏడు వేలకు పైగా) బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటోంది. 350 షటిల్‌ ‌బస్సుల సేవలను రవాణా సంస్థ ప్రారంభించనుంది. వారణాసి రోడ్‌వేస్‌ 50 ‌ప్రత్యేక కుంభ్‌ ‌షటిల్‌ ‌బస్సులను కూడా సిద్ధం చేసింది. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే ఏడు మార్గాల్లో క్విక్‌ ‌రెస్పాన్స్ ‌టీమ్‌లను మోహ రిస్తామని.. ఇది అత్యవసర పరిస్థితుల్లో సహాయపడు తుందని రవాణా మంత్రి దయాశంకర్‌ ‌సింగ్‌ ‌తెలి పారు. ఈ బృందాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, రవాణా సంస్థ సాంకేతిక సిబ్బంది ఉంటారు.

ప్రమాదాలతో అప్రమత్తం

సుమారు శతాబ్దంన్నర కుంభమేళ చరిత్రలో తొక్కిసలాటతో పాటు గంగా జలం కలుషితం, అంటువ్యాధుల కారణంగా పెద్ద సంఖ్యలో యాత్రికులు చనిపోయారు. పుష్కరాలు, కుంభమేళాల సందర్భంగా అవాంఛనీయ సంఘటలకు ఆస్కారం సహజమే అయినా అప్రమత్తంగా ఉండాలి. గత దుర్ఘటనలను నమూనాగా విశ్లేషించుకుంటే… వాల్డెమార్‌ ‌హాఫ్‌కిన్‌ ‌కలరా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినప్పటికీ, బ్రిటీష్‌ ‌ప్రభుత్వం చాలా కాలం పాటు నిర్బంధ టీకా సూచనలను తిరస్కరించింది. అయితే వెల్లువెత్తిన ప్రజా నిరసనతో దిగివచ్చి, 1945 హరిద్వార్‌ ‌కుంభమేళాలో నిర్బంధ కలరా టీకాలు వేయాలని ఆదేశించింది. అదీ హరిద్వాలో పెద్ద సంఖ్యలో యాత్రికులు మరణించడంతో నిర్బంధ టీకా విధానాన్ని తెచ్చింది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు వివిధ కుంభమేళాల సందర్భాలలో ఒక్క హరిద్వార్‌లోనే పెద్ద సంఖ్యలో మరణించారు. 1783 కుంభమేళాలో 20 వేలకు మందికి పైగా, 1879లో కుంభమేళాలో 35,892 మంది, 1885లో 63,457 మంది, 1891లో 1,69,103 మంది, 1897 అర్ధ కుంభమేళాలో 44,208 మంది, 1903 కుంభమేళాలో 47,159 మంది, 1909 అర్ధ కుంభమేళాలో 21,823 మంది,1915 కుంభలో 90,508మంది, 1921 అర్ధకుంభమేళాలో 1,49,667 మంది,1933 అర్ధ కుంభమేళాలో 1915 మంది,1938లో కుంభలో 70,662 మంది, 1945 అర్ధ కుంభమేళాలో 7734 మంది అంటువ్యాధుల కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇలా పోల్చి చూస్తే స్వపరిపాలనలో ఆ మరణాల శాతం గణనీయంగా తగ్గిందనే చెప్పాలి.

ఇక తొక్కిసలాటకు సంబంధించి రెండు దశాబ్దాల కాలంలో వివరాల ప్రకారం, ఈ శతాబ్దంలో… జూలై 27, 2003 నుంచి అదే ఏడాది సెప్టెంబర్‌ 7 ‌వరకు జరిగిన నాసిక్‌ ‌మేళాలో 39 మంది (28 మహిళలు, 11 మంది పురుషులు) చనిపోగా 57 మంది వరకు గాయపడ్డారు. సాధువులు మొదట స్నానం ఆచరించేందుకు వీలుగా దాదాపు ముప్పయ్‌ ‌వేల మంది భక్తులను రామకుండ్‌ ‌వెళ్లే రోడ్డులో ఉంచి, బారికేడ్‌లను అడ్డంగా ఉంచారు. ఆ సమయంలో ఒక సాధువు కొన్ని వెండి నాణాలను విసరడంతో తోపులాట తొక్కిసలాటకు దారితీసింది.

ఏప్రిల్‌ 14, 1986 ‌నాటి తొక్కిసలాటలో దాదాపు నలభై ఏడు మంది చనిపోయారు. హర్‌ ‌కీ పౌరీకి వెళ్లడానికి పంత్‌ ‌ద్వీప్‌ ‌ద్వీపం సమీపంలోని వంతెన దాటే సమయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. పంత్‌ ‌ద్వీపం వద్ద కొందరు ముందుకు తోసుకురావడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జికి దిగడం ఆ దుర్ఘటనకు కారణమైంది. 2010 హరిద్వార్‌ ‌కుంభ మేళా తొక్కసలాటలో పది మంది చనిపోయారు. ఫిబ్రవరి 10, 2013న అలహాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాటలో కనీసం 36 మంది మరణించారు (26 మంది మహిళలు, 9 మంది పురుషలు, ఎనిమిదేళ్ల బాలిక ఉన్నారు). 39మంది గాయపడ్డారు. రైల్వే స్టేషనులో గల పాద వంతెన కూలిపోవడం తొక్కిసలాటకు కారణమైంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం రైల్వే స్టేషనులో అధికంగా వస్తున్న ప్రజలను అదుపు చేయడానికి రైల్వే పోలీసులు లారీలు ఝుళిపించడంతో యాత్రికుల తొక్కిసలాట జరిగింది. అంతకు ముందురోజు తొక్కిసటాలలో కూడా ముగ్గురు ప్రజలు మరొక తొక్కిసలాటలో మరణించారు. మరికాస్త వెనక్కి వెళితే సుమారు 265 ఏళ్ల క్రితం…1760లో శైవ గోసాయిలు, వైష్ణవ బైరాగిలు (సన్యాసులు) మధ్య హింసాత్మక ఘర్షణ చోటుచేసుకొని 18 వేల మంది బైరాగులు హతమయ్యారని భూగోళ శాస్త్రవేత్త కెప్టెన్‌ ‌ఫ్రాన్సిస్‌ ‌రేపర్‌ (1808) ‌కథనం. అయితే ఆ సంఖ్యలో అతిశయం ఉందని, మృతుల సంఖ్య 18 వందలు ఉండవచ్చని చరిత్రకారుడు మైఖేల్‌ ‌కుక్‌ అభిప్రాయపడ్డారు. సంఘటన తీవ్రతను నొక్కి చెప్పేందుకు రాపర్‌ అలా పేర్కొని ఉంటాడని అభిప్రాయపడ్డారు. 1796లో అలాంటి సంఘటనలు పునారావృతం కాకుండా ‘‘సాధారణం కంటే ఎక్కువ బలం’’ కలిగిన సాయుధ విభాగాన్ని మోహరించారని పేర్కొన్నారు.


నాటి కుంభమేళా ప్రచార వ్యయం రెండు పైసలే!

కనీవినీ ఎరుగుని రీతిలో ప్రయాగ్‌రాజ్‌ ‌మహా కుంభమేళా ప్రారంభం కాబోతున్నది. ఇందుకు అయ్యే వ్యయం రూ.7,500 కోట్లు. దాదాపు 40 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేస్తారని అంచనా. ఈ వ్యయం, స్నానాలు చేసిన భక్తులు ఎంత, ఎంతమంది? అవి తెలుసుకోవడం ఆసక్తి కలిగిస్తుంది.

1882లో కుంభమేళా జరిగింది. అప్పుడు 8 లక్షల మంది భక్తులు మౌని అమావాస్యకు స్నానాలు చేశారు. మొత్తం కుంభమేళాలో మౌని అమావాస్యకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అప్పటి దేశ జనాభా 22.5 కోట్లు. ఆనాటి వ్యయం రూ. 20,288. ఇప్పటి లెక్క ప్రకారం దాని విలువ రూ. 3.6 కోట్లు. మళ్లీ 1894లో జరిగినప్పుడు మొత్తం 10 క్షల మంది పుణ్యసాన్నమాచరించారు. అప్పటి జనాభా 23 కోట్లు. చేసిన వ్యయం రూ. 69,427. ఇప్పటి విలువ మేరకు లెక్కకడితే రూ.10.5 కోట్లు. 1906లో 25 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. వ్యయం రూ. 90,000. నేటి విలువ రూ. 13.5 కోట్లు. జనాభా 24 కోట్లు. 1918లో 30 లక్షల మంది వచ్చారు. నాటి జనాభా 25.2 కోట్లు. అప్పటి వ్యయం 1.4 లక్షలు. ఇప్పటి లెక్క ప్రకారం దాని విలువ రూ.16.4 కోట్లు.

1942లో కుంభమేళాకు నాటి గవర్నర్‌ ‌జనరల్‌ ‌లిన్‌లిత్‌గో వచ్చారు. ఆయన మదన్‌మోహన్‌ ‌మాలవీయతో కలసి ఈ మహా ఉత్సవాన్ని వీక్షించారు. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది వచ్చి స్నానాలు చేయడం అతడిని తీవ్ర విభ్రాంతికి గురి చేసిందట. ఈ ఉత్సవం గురించి ప్రచారం చేయడానికి అయిన ఖర్చు ఎంతని గవర్నర్‌ ‌జనరల్‌ అడిగాడు. అందుకు మాలవీయ చెప్పిన సమాధానం కేవలం రెండు పైసలని. అదెలా? మనకైనా అంతటి ఆశ్చర్యమూ కలుగుతుంది. అదే గవర్నర్‌ ‌జనరల్‌ అడిగాడు. మాలవీయ ఒక పంచాంగం తీసి చూపించారు. ఆరోజుల్లో దాని వెల రెండు పైసలు. ఈ విషయాన్ని చరిత్రకారుడు ప్రొఫెసర్‌ ‌యోగేశ్వర్‌ ‌తివారీ వెల్లడించారు. ఆ పంచాంగం చూసుకుని జనం వారంతట వారే వస్తారన్నమాట. అలాగే అక్కడి వచ్చిన వారిని కేవలం గుంపు అని అనలేమని వారంతా భక్తిప్రపత్తులతో వచ్చినవారేనని మాలవీయ గవర్నర్‌ ‌జనరల్‌కు చెప్పారు.


కుంభమేళా ఐక్యతకు నిదర్శనం

‘విభిన్న ప్రాంతాల వారు పాల్గొనే ప్రయాగ్‌ ‌రాజ్‌ ‌కుంభమేళా భిన్నత్వంలో ఏకత్వానికి చక్కటి నిదర్శనం. ఐక్యతా సందేశాన్ని ఇచ్చే ఈ కుంభ మేళాను ఈసారి ప్రపంచవ్యాప్త భక్తులు డిజిటల్‌ ‌ద్వారా వీక్షిస్తారు. కుంభమేళాల తొలిసారిగా ఏఐ చాట్‌ ‌సేవలు వినియోగిస్తున్నాం. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని 11 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమ సందేశంలో పేర్కొన్నారు.


ప్రముఖులకు ఆహ్వానాలు

ప్రయాగ్‌రాజ్‌ ‌కుంభమేళా కోసం అన్ని రాష్ట్రాల గవర్నర్లతో పాటు బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తోంది. వారికి ఆహ్వాన పత్రాలు అందచేసే నాయకులను కూడా ఎంపిక చేసింది.ఉదాహరణకు రెండు తెలుగురాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులను ఆహ్వానించే బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ‌ప్రసాద్‌ ‌మౌర్య, మాజీ మంత్రి సిద్ధార్థనాథ్‌ ‌సింగ్‌కు అప్పగించినట్లు సమాచారం.


తితిదే ఆలయం

ప్రయాగలో కుంభమేళను పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తోంది. సెక్టర్‌ ఆరులో దీనిని నెలకొల్పుతున్నారు.


కుంభమేళా- 2025 ప్రణాళిక

ఈ నెల (జనవరి) 13వ తేదీ పూర్ణమి తిథి నుంచి 26 ఫిబ్రవరి మహాశివరాత్రి వరకు పూర్ణ కుంభమేళా జరుగుతుంది. ఆ ప్రకారం కుంభమేళాలో ముఖ్యమైన తిథులు/తేదీలను విజ్ఞులు నిర్దేశించారు. జనవరి 13న పుష్య పూర్ణిమ, 14న మకర సంక్రాంతి (మొదటిపుణ్య స్నానం), జనవరి 29న మౌని అమావాస్య (రెండో పుణ్య స్నానం), ఫిబ్రవరి 3న వసంత పంచమి (మూడవ పుణ్య స్నానం) 4న అచల సప్తమి, 12న మాఘ పూర్ణిమ, 26న మహశివరాత్రి (చివరి పుణ్య స్నానం). 29వ తేదీనాటి అమావాస్యను మౌని అమావాస్య అని పిలుస్తారు. ఆ రోజున అతిపెద్ద స్నానోత్సవం జరుగుతుంది. అమావాస్య వేళ చేసే స్నానాలన్నింట్లో దీనిని ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ఆనాడు పూర్వికులను స్మరించుకుంటూ స్నానమాచరించి, దానం చేయడం వల్ల ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయని విశ్వాసం.

డా।। ఆరవల్లి జగన్నాథస్వామి

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE