ఇది కాకోరి చారిత్రక ఘట్టం శతాబ్ది / జనవరి 30 అమరవీరుల సంస్మరణ దినం
భారత స్వరాజ్య సమర చరిత్రలో కాకోరి కేసుకు ప్రత్యేక స్థానం ఉంది. చరిత్ర పాఠ్యపుస్తకాలలో తగిన చోటు లభించకున్నా, ఒక ఉత్తేజకర సంఘటనగా దేశభక్తులు భావిస్తారు. తీవ్ర జాతీయవాద పంథాకు ఇదొక కొండగుర్తు. తరువాత ఆ తరహాలో విప్లవ కార్యకలాపాలకు ప్రభుత్వం ధనాన్ని స్వాధీనం చేసు కోవడం మొదలయింది. 1925లో కాకోరి ఘటన జరిగింది. అంటే ఇది కాకోరి కుట్ర కేసు శతాబ్ది ఉత్సవాల సమయం.
లక్నోకు సమీపంలో కాకోరి ఉంది. బ్రిటిష్ ఇండియా మీద జరిపిన తిరుగుబాటులో భాగంగా హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ ఈ సాహసం చేసింది. తరువాత ఇదే హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీగా అవతరించింది. దేశ స్వాతంత్య్రం కోసం తీవ్ర జాతీయవాదం, హింసాయుత పంథాను అనుసరించిన సంస్థ ఇది. ఇదే సంస్థ సభ్యులు రామ్‌ప్రసాద్ బిస్మిల్, అష్పాఖుల్లాఖాన్ ఈ సాహసానికి వెనుక ప్రణాళికలో కీలక పాత్ర పోషించారు. తమ పోరాటానికి కావలసిన నిధుల కోసం, ఆయుధాలు కొనుగోలు చేయడానికి వారు ఈ సాహసం చేశారు. 1922లో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని హఠాత్తుగా నిలిపివేయడంతో దేశ యువతలో తీవ్ర నైరాశ్యం నెలకొన్నది. అదే తీవ్ర జాతీయవాదం రూపంలో బయటపడింది. గదర్‌పార్టీ పంథాను చాలామంది అనుసరించడం ఆరంభించారు. ఒకనాడు భారత జాతీయ కాంగ్రెస్‌లో పనిచేసిన వారు ఎందరో గాంధీజీ నిర్ణయాన్ని సహించలేక హింసాయుత పంథాలోకి వెళ్లిపోయారు. హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ స్థాపన కూడా అలాంటిదే.
షహరాన్‌పూర్ మార్గంలో వెళ్లే నంబర్ 8 రైలును ఆపి అందులో వెళుతున్న డబ్బును స్వాధీనం చేసుకోవాలని ఆగస్ట్ 8, 1925న విప్లవకారులు పథకం వేశారు. అన్ని రైల్వే స్టేషన్‌లలోను వచ్చిన డబ్బును లక్నో చేర్చడానికి గార్డు గదిలో దాచి పెట్టారు. దానిని మొత్తం తమ స్వాధీనం చేసుకున్నారు. రైలులో ఉన్న ప్రయాణికులకు హాని తలపెట్టడం విప్లవకారుల ఉద్దేశం కాదు. కానీ గార్డులకీ, విప్లవకారులకీ మధ్య జరిగిన కాల్పులలో అహ్మద్ అలీ ఒక ప్రయాణికుడు చనిపోయాడు. ఇతడు వేరే బోగీలో ఉన్న తన భార్యను చూడడానికి వెళుతూ తూటా తగిలి చనిపోయాడు. దీనితో ఈ కేసును హత్య కేసుగా నమోదు చేశారు. డబ్బును తమ పరం చేసుకున్న తరువాత విప్లవ కారులు లక్నో పారిపోయారు. రామ్‌ప్రసాద్ బిస్మిల్, అష్పాఖుల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి, చంద్రశేఖర్ ఆజాద్, స్వరణ్‌సింగ్, సచీంద్ర బక్షి, కేశవ్ చక్రవర్తి, మన్మథనాథ్ గుప్తా, ముకుందలాల్, బన్వరీలాల్, కుందన్‌లాల్, ప్రణవేశ్ ముఖర్జీ కలసి ఈ రైలులో డబ్బును స్వాధీనం చేసుకునే పథకం రచించారు. తరువాత ఇక వేట మొదలయింది. రామ్‌ప్రసాద్ బిస్మిల్‌ను షాజహాన్‌పూర్‌లో ఆ సంవత్సరం అక్టోబర్ 26న అరెస్టు చేశారు. డిసెంబర్ 7,1926న అష్పాఖుల్లాను అరెస్టు చేశారు. మే 21,1926న విచారణ మొదలయింది.
విప్లవకారుల తరఫున గోవిందవల్లభ్ పంత్, చంద్రభాను గుప్తా, గోపీనాథ్ శ్రీవాస్తవ, ఆర్‌ఎం బహదూర్‌జీ, కృపాశంకర్ హజేలా, బీకే చౌధురి, మోహన్‌లాల్ సక్సేనా, అజిత్‌ప్రసాద్ జైన్ వాదిం చారు. రామ్‌ప్రసాద్ బిస్మిల్ మాత్రం తన కేసు తానే వాదించుకున్నాడు. కాకోరి కుట్ర కేసు లేదా దోపిడీ కేసు లేదా కాకోరి కండ్‌కు సంబంధించి 40 మంది సమర యోధులను అరెస్టు చేశారు. వీరిలో చంద్రధర్ జోహ్రీ, శీతాల సాహి, జ్యోతిశంకర్ దీక్షిత్, భూపేంద్రనాథ్ సన్యాల్, దామోదర్ స్వరూప్‌సేథ్, రామ్‌నాథ్ పాండే, దేవదత్ భట్టాచార్య, యోగేశ్ చంద్ర చటర్జీ, గోపీ మోహన్, రామ్‌దత్ శుక్లా ఉన్నారు. జూలై 1927లో తీర్పు వెలువడింది. 28 మంది క్రియాశీలక సభ్యులను దోషులుగా చేర్చారు. సరైన సాక్ష్యాధారాలు లేనందున 15 మందిని నిర్దోషులగా విడిచిపెట్టారు. రామ్‌ప్రసాద్ బిస్మిల్, అష్పాఖుల్లా, ఠాకూర్ రోషన్‌సింగ్, రాజేంద్ర లాహిరిలకు మరణదండన విధించారు. సచీంద్ర బక్షీ, సచీంద్రనాథ్ సన్యాల్‌లను అండమాన్ జైలుకు పంపించారు. మన్మథనాథ్ గుప్తాకు 14 సంవత్సరాలు, రామ్‌కిషన్ ఖాత్రి, ముకుంద లాల్, రాజ్‌కుమార్ సింగ్, ఓవింద్ చరణ్‌కర్, యోగేశ్ చంద్ర చటర్జీలకు పదేళ్ల వంతున కారాగార శిక్ష విధించారు. సురేశ్ చరణ్ భట్టాచార్య, విష్ణు శరణ్ దబ్లిష్‌లకు ఏడేళ్లు వంతున జైలు శిక్ష పడింది. ప్రేమ్‌కృష్ణశర్మ, భూపేన్‌నాథ్ సన్యాల్‌కు ఐదేళ్లు వంతున శిక్ష పడింది. కేశబ్ చక్రవర్తికి 4 ఏళ్ల జైలు శిక్ష విధించారు. వీరిని వేర్వేరు జైళ్లకు పంపినప్పటికీ తమ పోరాట పటిమను వీడలేదు. తమకు మెరుగైన సదుపాయాలు ఉండాలని ఆందోళన చేశారు. మరణ దండన పడిన ఆ నలుగురిని 1927 డిసెంబర్ 17-19 తేదీల మధ్య ఉరి తీశారు.
కాకోరి ఉదంతం ఉత్తర భారతదేశంలో తీవ్ర జాతీయవాదులకు కొంత నిరాశను మిగిల్చింది. కానీ వారి ఆవేశాన్ని చల్లార్చలేకపోయింది. దీని తరువాత ఇదే పంథాలో బ్రిటిష్ ఇండియాలో చాలా దాడులు జరిగాయి. బిజయ్‌కుమార్ సిన్హా, శివవర్మ, జయదేవ్ కపూర్ (అంతా ఉత్తరప్రదేశ్‌వారు), భగత్‌సింగ్, భగవతి చరణ్ వోహ్రా, సుఖదేవ్ (పంజాబీలు) హిందుస్తాన్ రివల్యూషనరీ అసోసియేషన్ పునరుద్ధరిం చాలని నడుం కట్టారు. దీనికి చంద్రశేఖర్ ఆజాద్‌ను నేతను చేయాలని భావించారు. వీరిలో కొందరు సామ్యవాద సిద్ధాంతంపట్ల ఆకర్షితులయ్యారు కూడా. ఈ ఉద్దేశంతోనే 1928 సెప్టెంబర్ 9,10 తేదీలలో ఢిల్లీలోనే ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో సమావేశ మయ్యారు. అదే హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌గా అవతరించింది.
-జాగృతి డెస్క్