జనవరి 5న విజయవాడ హైందవ శంఖారావం చాలా ప్రత్యేకతలను సంతరించుకుంది. హిందూ సంస్థలు, సమాజం కంటే ఇతరులే ఈ సమ్మేళనం  గురించి విశేషంగా చెబుతున్నారు. అనూహ్యమని చాలా వెబ్‌ ‌చానళ్లు వ్యాఖ్యానించాయి కూడా. స్వాములు, సాధు సంతులు, విశ్వహిందూ పరిషత్‌ ‌నాయకులు ఇచ్చిన సందేశాలు జనంలోకి చాలా వేగంగా వెళ్లాయి కూడా. అందులో కీలకమైనది హైందవ శంఖారావం డిక్లరేషన్‌. ‌తొమ్మిది అంశాలతో ఉన్న ఈ డిక్లరేషన్‌ ‌హిందూధర్మ పరిరక్షణకు, ఆలయాల రక్షణకు మరొక అడుగు వేయించగలదనే చాలామంది విశ్వసిస్తున్నారు. మన దీక్ష ఆలయాలకు రక్ష అన్న నినాదంతో ఈ సమ్మేళనం జరిగింది.హిందూ సమాజంపై దాడులు, అణచివేతలు తొలగించాలనేవే డిక్లరేషన్‌లోని అంశాలు.

హైందవ శంఖారావం సభలో విశ్వహిందూ పరిషత్‌ ‌ప్రకటించిన డిక్లరేషన్‌ ‌హిందువుల గుండె చప్పుడును ప్రతిధ్వనిస్తోంది. వందల ఏళ్ల తరబడి ముస్లిం, క్రైస్తవ రాజ్యాల పాలనలో హిందూ ధర్మంపై దాడులు జరగడం, ఆలయాలను ధ్వంసం చేయడం, సంస్కృతిని నాశనం చేయడానికి ప్రయత్నించడం, బలవంతపు మత మార్పిడికై వేధింపులు, దాడులు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన సంఘటనలు మనల్ని ఇప్పటికీ బాధిస్తున్నాయి. వాటిని తట్టుకుని నిలబడిన హిందువులు తమ మతాన్ని కాపాడుకున్నారు. కాని ఇప్పుడు స్వాతంత్య్రం వచ్చినా ప్రభుత్వాలు తీరు మారలేదు. హిందూ ప్రార్థనా మందిరాలు, సంస్థలను ఆదాయ వనరుగా చూస్తున్నాయి. వాటిని పాలకమండళ్ల పేరుతో గుప్పిట్లో పెట్టుకుని దోపిడి చేయడం 75 ఏళ్లుగా చూస్తున్నాం. ప్రార్ధనామందిరాలపై ప్రభుత్వ పెత్తనం వల్ల అణచివేతకు గురౌతున్న హిందూ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ చర్యలు ఎట్టి పరిస్థితుల్లో కొనసాగరాదని కేసరపల్లి హైందవ శంఖారావం సభలో ఆగ్రహ రూపంలో వెలి బుచ్చాయి. ప్రభుత్వానికి తమ డిమాండ్లను డిక్లరేషన్‌ ‌రూపంలో ప్రకటించాయి.

డిక్లరేషన్‌లోని అంశాలివే :

దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించేలా చట్ట సవరణ చేయాలి. హిందూ సమాజం, ఆలయాలపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి. – హిందువుల పండగలపై ఆంక్షలు, ఆర్థిక భారాలు విధించకూడదు- ఆలయాల్లో , పాలక మండళ్లలో అన్య మతస్థులను తొలగించాలి- ధర్మకర్తల మండళ్లలో రాజకీయాలకు అతీతంగా ధార్మికభావాలు ఉన్నవారినే నియమించాలి- అన్యా క్రాంతమైన ఆలయాల ఆస్తులు, భూములను స్వాధీనం చేసుకోవాలి, తిరిగి ఆలయాలకు అప్పగించాలి- ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని హిందూ ధర్మ ప్రచారానికి, సేవా కార్యక్రమాలకే వినియోగించాలి. పూజ, ప్రసాద కైంకర్యాలను అత్యంత నాణ్యత, భక్తి శ్రద్ధలతో నిర్వహించాలి- ఆలయాల నిర్వహణపై ధర్మాచార్యులు రూపొందించిన నమూనా విధివిధానాలను అమలు చేయాలి. అధికారులు ఆంక్షలు విధించే ధోరణి సాగరాదు. శోభాయాత్రలపై అనవసర ఆంక్షలు విధించకూడదు.

ఈ డిమాండ్‌లు గొంతెమ్మ కోరికలు కాదు. ఎంతో సమంజసమైనవి. డిక్లరేషన్‌లో పేర్కొన్న ప్రతి అంశం హిందూధర్మానికి వ్యతిరేకంగా జరిగిన సంఘటనకు సమాధానంగా చూడగలిగేవే. వాటిని తొలగించాలని హిందూ సమాజం చేస్తున్న డిమాండ్లే డిక్లరేషన్‌ ‌రూపంలో ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చాయి. హిందూ ధర్మంపై, ఆలయాలపై జరిగిన దాడులు, ఆలయ ఆస్తుల అన్యాక్రాంతం, అవినీతి పరులైన పాలక మండళ్లు చేసిన దుర్మార్గాలు మన అనుభవంలో ఎన్నో చూశాం. ఈ డిక్లరేషన్‌ అమలు వల్ల వ్యక్తులకు, మతాలకు, ప్రభుత్వానికి ఎలాంటి నష్టం ఉండదు. అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. పైగా ఇందులో ఏవీ కూడా రాజ్యాంగానికీ, చట్టానికీ అతీతంగా చేసిన డిమాండ్లు కావు కూడా.

హిందువుల మనోభావాలను ఖాతరు చేయకుండా, ఆగమశాస్త్రాది సంప్రదాయ పంథాలను పాటించకుండా ఆలయాలను అధికారులు ఇష్టానుసారం శాసిస్తున్న సంగతి సర్వ విదితం. దీని మీద అర్చక సమాజం మౌనంగా లేదు. కానీ పట్టించుకున్న నాథుడు కూడా లేడు. చాలా అంశాలను ఆలోచించిన తరువాతే న్యాయ నిపుణులు, మాజీ ఐఏఎస్‌లతో చర్చించిన తరువాతే హిందువుల ఆలయాలను హిందూ సమాజానికి అప్పగించాలన్న డిమాండ్‌తో విశ్వహిందూ పరిషత్‌ ఈ ‌విస్తృత ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఆ ఉద్యమానికి సంబంధించిన తొలి బహిరంగ సభ విజయవాడ హైందవ శంఖారావం. దాదాపు మూడున్నర లక్షల మంది హిందువులు, 150 మంది వరకు సాధుసంతులు పాల్గొని ఈ డిక్లరేషన్‌ ఆమోదించారు. ఆలయాల విముక్తి కోసం ఆరంభించిన ఈ ఉద్యమంలో భాగస్వాములవుతామని, డిక్లరేషన్‌ను అమలులోకి తెచ్చే బాధ్యతను స్వీకరిస్తామని హిందువుల చేత సభ చివర పెద్దలు ప్రమాణం కూడా చేయించారు. ఇది దేశవ్యాప్త ఉద్యమం. చాలా రాష్ట్రాలలో హిందూ దేవాలయాల పరిస్థితి నిరాశాజనకంగానే ఉంది. వక్ఫ్ ‌వివాదాల నేపథ్యంలో హిందూ దేవాలయాల పరిస్థితి ఇంకాస్త డోలాయమాన స్థితికి వెళుతున్నది కూడా. దేవాలయం అంటే హిందువులకు కేవలం దేవుడిని ఆరాధించే స్థలం మాత్రమే కాదు. అది గ్రంథాలయం, వైద్యాలయం, అన్న ప్రసాద కేంద్రం, కళల పోషించే వ్యవస్థ. ఇన్ని ఉన్నా ప్రభుత్వాలు దేవాలయాలను కాపాడే ప్రయత్నం ఏమీ చేయడం లేదు. ఇది హిందువులను మరింత ఆగ్రహానికి గురి చేస్తున్నది. వారి మౌనరోదన హైందవ శంఖారావాల ద్వారా వ్యక్తం కాక తప్పదు. ఇవి ఇంకా జరపాలని కూడా వీహెచ్‌పీ నిర్ణయించిన సంగతి తెలిసినదే.

ప్రభుత్వ పెత్తనం వల్ల జరిగిన అవినీతి :

హిందూమత ప్రార్ధనా మందిరాలకు చెందిన సంస్థలపై ప్రభుత్వ పెత్తనం వల్ల మంచి కంటే చెడే ఎక్కువగా జరిగింది. ప్రభుత్వాల, ప్రభుత్వాధికారుల జోక్యంతో దేవస్థానాలు ఇంకాస్త బలహీనపడ్డాయి. ఇతర మతాల ప్రార్థనా మందిరాల మీద లేని అధికారం ఒక్క హిందూ దేవాలయాల మీదే ఉండడం ఈ దేశంలో సెక్యులరిజం ఎంత బూటకమో తెలియచేస్తోందన్న వాదన కూడా క్రమంగా బలపడుతున్నది. హిందూ ప్రార్ధనా మందిరాల సంస్థల నిర్వహణ ప్రభుత్వం నియమించిన అధికారులు (ఈఓ), పాలక కమిటి కూడబలుక్కుని అవినీతికి పాల్పడిన ఘటనలు, ఆస్తుల ఆక్రమణలు రాష్ట్రంలోని అన్ని హిందూ దేవాలయాల్లో జరిగాయి. అన్యమత ప్రచారాన్ని ఏ విధంగాను అడ్డుకోలేక పోయారు. కొన్ని పాలక మండళ్లు దీనికి ప్రోత్సహించిన వైనం అందరికీ తెలిసిందే. అలాగే ప్రభుత్వ పాలనలో ఆలయాలలో అవినీతి ఏమాత్రం తగ్గిందో చెప్పడానికి కూడా ఏమీ లేదు.

వైసీపీ వంటి హిందూమత వ్యతిరేక ప్రభుత్వ హయాంలో ఈ దోపిడి మరింతగా జరిగింది. నాటి తితిదే చైర్మన్లు, సభ్యులు, ప్రజాప్రతినిధులు అడ్డగోలుగా తమ అనుకూలురకు బ్రేక్‌, ‌శీఘ్రదర్శనాలు కల్పించారు. తితిదే చైర్మన్‌ ‌వై.వి. సుబ్బారెడ్డి తన పదవిని దుర్వినియోగం చేసి ఏడాదికి లక్ష చొప్పున నాలుగేళ్లపాటు 4 లక్షల బ్రేక్‌ ‌దర్శన టికెట్లు కేటాయించినట్లు, రోజుకు రూ.300 ల శీఘ్రదర్శనం టిక్కెట్లు 2 వేల నుంచి 3 వేల టిక్కెట్లు తమ కార్యాలయం నుంచి సిఫార్సు చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా ఒకే సామాజిక వర్గానికి చెందిన నాటి ప్రజాప్రతినిధులకు ఇష్టానుసారంగా సిఫారసు లేఖలపై దర్శన టిక్కెట్లు కేటాయించినట్లు తేల్చారు. కరుణాకర్‌రెడ్డి చైర్మన్‌గా ఉన్నప్పుడు అవసరం లేకున్నా ఇంజినీరింగ్‌ ‌పనులకు భారీగా నిధులు కేటాయించారని, దీనివల్ల తితిదే పై భారం పడుతోందన్న అంశంపై విజిలెన్స్ అధికారులు తమ నివేదిక పొందుపర్చినట్లు తెలుస్తోంది. నాటి తితిదే ఈఓ ధర్మారెడ్డి సైతం వీరికి వత్తాసు పలికినట్లు అందులో పేర్కొన్నారని సమాచారం. ప్రసాదాల కోసం వాడే సరుకుల కొనుగోళ్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. తితిదే ధర్మకర్తల మండలి కేంద్రంగా కమిషన్ల కోసం ఉన్న భవనాలను కూల్చివేసి కొత్తవి నిర్మించడం కూడా ఆరోపణలు వచ్చాయి. వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అం‌డ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు విచారణ పూర్తిచేసి ఇటీవలే ప్రభుత్వానికి నివేదించారు. ఇక పరకావణి నుంచి విదేశీ డాలర్లను దొంగిలిస్తూ పట్టుబడ్డ రవికుమార్‌ అనే వ్యక్తిని పోలీసు అధికారులు తప్పించిన వ్యవహారంపై హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

రాజకీయ పునరాస కేంద్రంగా మార్చినందువల్లే

అన్ని ప్రార్ధనాస్థలాల పాలకమండళ్లను రాజకీయ పునరావాస కేంద్రాలుగా పార్టీలు మార్చివేశాయి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ పార్టీకి చెందిన వారిని ఆయా దేవాలయాల పాలక మండళ్ల ఛైర్మన్లు, సభ్యులుగా నియమిస్తున్నారు. ఈ నియామకాల వల్ల తిరుమల వంటి ఆలయ పాలక మండలి ఛైర్మన్‌ ‌పదవికి ఎంతో పోటీ పెరిగింది. వైసీపీ ప్రభుత్వం తమ వెసులుబాటు కోసం పాలక మండలి సభ్యుల సంఖ్యను కూడా ఏకంగా రెట్టింపునకు పెంచింది. పైగా వారు ఎంపిక చేసిన సభ్యుల్లో కొందరికి నేరచరిత్ర ఉన్నట్లు ఆరోపణలు రావడం, న్యాయస్ధానం ప్రభుత్వ చర్యలను తప్పుపట్టి నేరచరిత్ర ఉన్నవారిని తొలగించాలని ఆదేశించడం తెలిసిందే.

వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీశైలం దేవస్ధానంలో అన్యమతస్తులకు ఆలయానికి చెందిన దుకాణాలను కేటాయించడం, ముస్లిం మతానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే సహాయంతో కాంట్రాక్టు పనులు చేజిక్కించుకోవడం, మాంసం తెచ్చే బుట్టలలోనే పూలు సరఫరా చేసినట్లు ఆరోపిస్తూ వీటిపై నిరసన తెలియచేసిన హిందూ కార్యకర్తలపై దాడులకు పాల్పడడం తెలిసిందే.

ఇదేం ప్రజాస్వామ్యం

ఇతర మతాలకు చెందిన ప్రార్ధనా సంస్థలను వదిలేసి, హిందూ ఆలయ సంస్థలను ప్రభుత్వ పరిధిలోని తీసుకువచ్చి వాటి నిర్వహణపై ప్రభుత్వం పెత్తనం చేయడం అనేది మన రాష్ట్రంలోనే చూస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. మనది లౌకిక రాజ్యం అన్నపుడు అన్ని మతాలను ఒకేలా సమానం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయోధ్య రామాలయం దేవస్ధానం నిర్వహణను హిందూ సంస్థలే చేస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అక్కడ పెత్తనం చేయడం లేదు. హిందూ మత సంఘాల నిర్వహణ వల్ల దేవాలయాకు అవసరమైన రక్షణ, భద్రత, ఆలయ అభివృద్ధి, భక్తులకు అవసరమైన సేవలు అన్ని లభిస్తాయి.

తురగా నాగభూషణం

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE