భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన రచన

ఒకరోజు మేరీ ఫోన్‌ ‌చేసింది. మామూలుగా ఆమె ఏదైనా విశేషముంటే తప్ప నన్ను టెలిఫోన్లో పలకరించదు. అయితే ఆమె నాకు కొన్నేళ్లబట్టి బాగా పరిచయస్తురాలు. నాకే కాదు. కొందరు ప్రసిధ్ధ, వర్ధమాన కవులందరూ ఆమెకు ఆత్మీయులే!

‘‘శివ్‌, ఎలా ఉన్నారు?’’ ఆప్యాయంగా, ఆంగ్లంలో పలకరించిందామె. నేను బదులిచ్చాను. ‘‘రెండు మూడు రోజులు మీ టైం కేటాయించగలరా?’’ అందామె. మళ్లీ ‘‘ఏం లేదు, జెర్మనీ నుంచి ఒక కవి వచ్చారు. ఆయనకు మీరు కంపెనీ ఇవ్వవలసుంటుంది. మీకు వీలై, ఇష్టమైతేనే!’’ అంది.

‘‘రోజులో ఎంత సమయం కేటాయించవలసుంటుంది?’’ అడిగాను.

‘‘రెండు, మూడు గంటలు సరిపోతుందను కుంటాను. అతను గాంధీనగర్లోని ఒక హోటల్లో దిగాడు. మన కవి సమ్మేళనానికి ఇంకా నాలుగు రోజులు టైముంది కదా! అతను ఇండియా చూడ్డానికి కొంచెం ముందుగానే వచ్చాడు. ఎవరైనా ఇంగ్లీషులో బాగా మాట్లాడే ఒక స్థానిక కవి మిత్రుణ్ణి పరిచయం చెయ్యమని అడిగాడు. వెంటనే మీరు గుర్తుకొచ్చారు. మీరు సరేనంటే, అతని ఫోన్‌ ‌నెంబర్‌ ఇస్తాను. మాట్లాడండి,’’ అంది. నేను సరేనన్నాను.

ఆ జెర్మనీ నుంచి వచ్చిన ఫ్రెంచ్‌ ‌కవి పేరు ఆల్బర్ట్. ‌మేరీ ఇచ్చిన నంబర్‌ ‌కు ఫోన్‌ ‌చేశాను. అది కలవలేదు. అప్పుడు నన్ను నేను క్లుప్తంగా పరిచయం చేసుకుంటూ, వాట్సప్‌ ‌మెసేజ్‌ ‌పెట్టాను. ఆ రోజు రాత్రి నాకు అతన్నుంచి ఫోనొచ్చింది. అతని మాతృ భాష ఫ్రెంచ్‌ అయినాకూడా, అతని ఆంగ్లం కాస్త నెమ్మదిగా, స్వచ్ఛంగా, ప్రత్యేకంగా వుంది.

‘‘సారీ మిస్టర్‌ ‌శివ్‌, ‌నేను మీ ఫోన్‌ ‌మెసేజ్‌కు వెంటనే స్పందించలేకపోయాను. ఆ సమయంలో నేను మీ ఊళ్లోని కనకదుర్గ గుడిలో ఉన్నాను,’’ అన్నాడు. ‘‘ఏం పర్లేదు మిస్టర్‌ ఆల్బర్ట్. ‌మేరీ మీగురించి చెప్పింది. మనం ఎప్పుడు కలుద్దాం?’’ అన్నాను. ‘‘రేపు ఉదయం నేనుండే హోటల్‌కు రాగలరా? తొమ్మిదిన్నర ప్రాంతంలో,’’ సూచించాడతను. తానుండే హోటల్‌ ‌పేరు చెప్పాడు.

మరునాడుదయం నేను ఆల్బర్ట్‌ను హోటల్‌ ‌లాబీలో కలిశాను. ఇద్దరం అతని రూంలోకి వెళ్లాం. రూం చాలా చిన్నగా ఉన్నా, శుభ్రంగా, పొందిగ్గావుంది. అతను ఆరడుగుల పొడవుతో, ఎరుపు, తెలుపు కలగలసిన శరీర ఛాయతో, బక్కపలుచగా, దృఢంగా వున్నాడు. అతని వయసు నేను అంచనా వెయ్యలేకపోయాను. ముప్పైకి పైన ఎంతైనా ఉండొచ్చనిపించింది. అయినా అతను అలాంటి భౌతిక, లౌకిక అంశాలకు అతీతంగా ఉన్నట్లు నాకు, అతనితో పెద్ద పరిచయం లేకపోయినా అనిపించింది. కొంచెం సేపయ్యాక నేను ‘‘బయటెక్క డన్నా కూర్చుని మాట్లాడుకుందామా?’’ సూచించాను. ‘‘తప్పకుండా,’’ అన్నాడు ఆల్బర్ట్. ‌లిఫ్ట్ ‌రావడం ఆలస్యమౌతూండడంవల్ల, మేము నెమ్మదిగా మెట్లు దిగుతున్నాము. రెండవ అంతస్తులోకి లిఫ్ట్ ‌రాగానే, ఆల్బర్ట్ ‌బయటకు నడిచాడు. అతన్ని నేననుసరించాను. అక్కడ కారిడార్లో, ఒక మూలగా, మెట్ల దారి పక్కన ఒక చిన్న బల్లవుంది. దాని మీద ఇద్దరు కూర్చోవచ్చు. అక్కడ నిశ్శబ్దంగా వుంది. ‘‘ఇక్కడ కూర్చుని మాట్లాడుకుందామా?’’ అడిగాడు ఆల్బర్ట్.

‌మా సంభాషణ ప్రారంభించాము. నా గురించి క్లుప్తంగా విన్న తర్వాత, తన గురించి చెప్పడం ప్రారంభించాడతను. ప్రస్తుతం జెర్మనీలో ఉంటున్నాడని, తన మాతృ భాష ‘ఫ్రెంచ్‌’ ‌లో కవిత్వం, రచనలు చేస్తాడని, తాను, ఇక్కడ పాల్గొనవలసిన ‘అంతర్జాతీయ బహుభాషా కవి సమ్మేళనం’ ప్రారంభమవ్వడానికి మూడు రోజుల సమయమున్నా, భారత దేశం మీద, ముఖ్యంగా, అమరావతి గురించి, కూచిపూడి నాట్యం గురించి, ఒక పుస్తకం రాయాలనే సంకల్పంతో ఉన్నందువల్ల, ముందుగా వచ్చానని చెప్పాడు. తాను పూర్తి సమయం రచనలు చెయ్యడంలోనే గడుపుతాడని, తన భార్య జెర్మనీలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూవుందని అన్నాడు. తాను స్విట్జర్లాండ్‌లో పుట్టాడనీ, స్కూల్లో మాతృ భాష ఫ్రెంచ్‌లో చదువుకున్నా, ఆంగ్లభాష కూడా నేర్చుకున్నాడట.

మేము కొంతసేపు మాట్లాడుకున్నతర్వాత, తనకు అమరావతి చూడాలనుందని, నేను తనతో వస్తే, సహాయకారిగా ఉంటానని చెప్పాడు. నేను కూడా ప్రస్తుతం నా పూర్తి సమయాన్ని రచనా వ్యాసంగంలోనే గడుపుతుండడం వల్ల అతని ప్రతిపాదనకు అంగీకారం తెలిపాను. కొద్దిసేపయ్యాక హోటల్లోంచి బయటపడ్డాము. ముందుగా తను ఏ.టి.ఎం లో కొంత నగదు తీసుకున్నాడు. దారిలో కొందరు టిబెట్‌కు చెందిన సన్యాసులు కనిపించారు. వాళ్లు నన్ను దగ్గరలో ఉండే శాకాహార హోటల్‌ ‌గురించి వాకబు చేశారు. ఆల్బర్ట్ ‌వాళ్లతో మాటలు కలిపాడు. తర్వాత మేము హోటల్‌కు తిరిగి వస్తుంటే, దారిలో రోడ్డు మీద ఒక చనిపోయిన సీతాకోకచిలుక శరీరం రెక్కలతో పాటు కనిపించింది. దాన్నతను ఎంతో జాగ్రత్తగా, అపురూపంగా, తన దగ్గరున్న డైరీ లాంటి పుస్తకంలో దాచుకున్నాడు. తర్వాత నన్ను చూసి చిన్నగా నవ్వాడు.

అమరావతికి మధ్యాహ్నం రెండున్నర గంటలకు బయల్దేరడానికి నిర్ణయించుకున్నాం. ఆల్బర్ట్‌ని మా ఇంటికి భోజనానికి పిలుద్దామనిపించింది. ఆ రోజు నా శ్రీమతికు సెలవు. ముందుగా ఆమెకు ఫోన్‌ ‌చేసి విషయం చెప్పాను. ఆమె కాస్త కంగారు పడినట్లుంది. ఒక అనుకోని అతిథి•ని, అదీ ఒక విదేశీయుణ్ణి ఉన్నట్లుండి ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తే ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో నేనర్థం చేసుకున్నాను. నా శ్రీమతి ‘‘అలాగే, ఆయన్ని మనింటికి తీసుకురండి. కానీ నాక్కొంచెం సమయమివ్వండి. అసలాయనకు ఏం చేసి పెట్టాలో నాకు అర్థం కావడంలేదు,’’ అంది. భోజనానికి ఆల్బర్ట్‌ను ఆహ్వానించగానే అతను

‘‘థాంక్యూ శివ్‌! ‌కానీ మీ శ్రీమతి ఇలా సడన్‌ ‌గా చెపితే కంగారు పడుతుందేమో కదా!’’ అన్నాడు. మళ్లీ ‘‘మీ ఆహ్వానానికి నా ధన్యవాదాలు, కానీ మీరేం తింటే, నాకదే పెట్టండి. ప్రత్యేకంగా నాకోసం ఏం చెయ్యక్కరలేదు,’’ అన్నాడు.

మేమిద్దరం, మరి కాస్త సమయం హోటల్‌ ‌లాబీలో గడిపాము. ఎన్నెన్నో విషయాలు మాట్లాడు కున్నాం. అతి తక్కువ సమయంలోనే, ఆల్బర్ట్‌కు, నాకు మధ్య, స్వేచ్ఛగా మాట్లాడుకునే చనువు కలిగింది. ఒంటిగంట ప్రాంతంలో నా స్కూటర్‌ ‌మీద మా ఇంటికి బయలుదేరాం. ఆల్బర్ట్‌కు ఇది మన దేశంలో మొదటి పర్యటన. నేను దారి వెంట మా ఊరి విశేషాలు వివరిస్తూ ఉన్నాను. అతను ఆసక్తిగా విన్నాడు. ఇంట్లో నా శ్రీమతి పద్మకు ఆల్బర్ట్‌ను పరిచయం చేశాను. రెండు చేతులూ జోడించి అతను చక్కగా ఆమెకు నమస్కారం చేశాడు. పరిచయాలయ్యాక ఆమె ఉద్యోగం గురించి, మా పాప గురించి వివరాలడిగాడు. ఆ సమయంలో మా అమ్మాయి స్కూల్లో ఉంది. పాపకోసం ఆల్బర్ట్ ఒక చాక్లెట్‌ ఇచ్చాడు. అది పుదీనా సువాసన, రుచి కలిగిన చాక్లెట్‌. ‌పద్మ ముందుగా అతనికి కప్పులో, తను చేసిన పాయసం ఇచ్చింది. అది ఎలా చేస్తారని అతనామెనడిగాడు. తర్వాత పద్మ ‘‘మీకు పిల్లలెంత మంది?’’ అని అతన్నడిగింది.

‘‘మాకు పిల్లల్లేరు. పుస్తకాలే నాకు పిల్లలతో సమానం,’’ అని చిన్నగా నవ్వాడు. ఆ సమాధానం నాలో ఒక సన్నని ప్రకంపనని కలిగించింది. పుస్తకాలంటే అతనికున్న ప్రేమ నాకర్థమయ్యింది. తర్వాత నా రచనా వ్యాసంగం గురించి వాకబు చేశాడు. నేను నా కవితా సంపుటిని అతనికిచ్చాను. ఆ సంపుటి పేరేంటని నన్నడిగాడు. తర్వాత దాని అర్థం అడిగాడు. నేను చెప్పిన సమాధానాన్ని శ్రధ్ధగా విన్నాడు. తర్వాత కొద్దిసేపట్లోనే, పద్మ మా ఇద్దరికీ భోజనం వడ్డించింది. అతి సాధారణంగా ఉన్న, మా శాకాహార పదార్ధాలను, వాటి గురించి వివరాలడుగుతూ తిన్నాడు. అదయ్యాక కొన్ని ఫొటోలు తీసుకున్నాము. చివరగా మేం హోటల్‌కు బయలుదేరే ముందు పద్మతో…

‘‘మీరు నాకు పెట్టిన పయసం (పాయసం) చాలా బాగుంది,’’ అన్నాడు. అప్పుడు పద్మ, ఒక చిన్న డబ్బాలో, కొంత పాయసాన్ని పెట్టి, అతనికందిం చింది. అతను మహదానందపడిపోయాడు. అతను ఇంట్లో ఉన్నంతసేపూ, నేను పద్మతో ఆంగ్లంలోనే మాట్లాడాను. మా ముగ్గురి సంభాషణ మొత్తం ఆంగ్లంలోనే జరిగింది. మన మాతృభాష తెలియని వ్యక్తి, అందులోనూ విదేశీయుడు మనతో ఉన్నప్పుడు తెలుగులో మాట్లాడుకుంటే, ముందు అతనికి అది అర్థంకాకపోగా, అతని గురించి మనమేదో వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నామనే అపోహకు దారి తీయవచ్చు. అందుచేత నేను జాగ్రత్త వహించి, అతని సమక్షంలో పద్మతో, ఆంగ్లంలోనే సంభాషించాను. నేను కొంతకాలం అమెరికా, ఐరోపా, ఇంకా ఇతర దేశాల్లో పనిచేసినందువల్ల, విదేశీయుల గురించి కొంత అవగాహన వుంది.

మధ్యాహ్నం ఆల్బర్ట్, ‌నేను కార్లో, అమరావతికి బయలుదేరాము. ప్రయాణం చేసినంతసేపూ, ఇద్దరం ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఈ మధ్య కాలంలో నేనెప్పుడూ అంతసేపూ ఏకధాటిగా మాట్లాడలేదు. కొంత కాలం క్రితం నేను ఇంజనీరింగ్‌ ‌కాలేజీలో పాఠాలు చెప్పేటప్పుడు తప్ప! అతనడిగే అన్ని ప్రశ్నలకు నేను నాకు తెలిసినంతవరకు సమాధానాలు చెప్పాను. అవి ఆషామాషీ ప్రశ్నలు కావు. మన సంస్కృతి గురించి, ప్రాంతాల గురించీ అతను అడుగుతూనేవున్నాడు. నేను స్పందిస్తూనే వున్నాను. అతనికి మన దేశం పట్ల ఉన్న ఆసక్తి, ప్రేమను చూసి, అతనంటే గౌరవ భావం పెరగసాగింది.

మేము మాటల్లో ఉండగానే, అమరావతి చేరుకున్నాము. ఆల్బర్ట్ ‌ముందుగా అక్కడి స్తూపాన్ని చూద్దామన్నాడు. ప్రవేశ ద్వారం వద్ద టికెట్లు తీసుకుని లోపలికి వెళ్లాం. ఆ ప్రాంతం పచ్చదనంతో కళకళలాడుతూ, ఒక ఉద్యానవనంలావుంది. డిసెంబర్‌ ‌మాసం కావడంతో వాతావరణం హాయి గొలుపుతూవుంది. ఆల్బర్ట్ ‌గబగబా స్తూపం దగ్గరకు వెళ్లాడు. అక్కడికి చేరుకోగానే అతని కళ్లలో ఒక మెరుపును చూశాను. తన దగ్గర ఉన్న కెమెరాతో, ఫోటోలు తీసుకుంటూ, శిలాఫలకాలపైనున్న అక్షరాలను చదువుతూ, మధ్యమధ్యలో నన్ను ప్రశ్నలడుగుతూ అతను ఆ పరిసరాలతో మమేకమై పోయాడు. అలా ఒక గంట గడిచింది. స్తూపం వృత్తాకారంలో చాలా పెద్దగా, ఒక వింత అనుభూతి, ఆసక్తి కలిగిస్తూవుంది. తను డైరీలో కొన్ని వివరాలు రాసుకున్నాడు.

‘మహాస్తూపం’గా పేరు పొందిన బౌధ్ధ స్తూపం స్థూపం బహుశా క్రీ.పూ మూడవ శతాబ్దానికి చెంది, ప్రస్తుతం శిధిలావస్థలో ఉంది. ఆ స్థలంలోని కొన్ని ముఖ్యమైన శిల్పాలు ప్రస్తుతం భారతదేశంలోని, విదేశీ, సందర్శనశాలల్లో ఉన్నాయి. స్తూపాన్ని ‘మహా చైత్యము’ అని కూడా అంటారు. పాశ్చాత్యుడైన మెకెంజీ మహాశయుడు 1796వ సంవత్సరంలో, శిథిలావస్తలో ఉన్న స్తూపం గురించి తెలుసుకుని, ఆ ప్రాంతంలో తవ్వకాలు కొనసాగించి, కొంత ముఖ్యమైన సమాచారాన్ని రాబట్టాడట. తర్వాత స్తూపం పునర్నిర్మాణానికి ఒక ప్రణాళిక తయారు చేశాడు. అక్కడి స్థానికులు స్తూపాన్ని ధ్వంసం చేసి, ఇటుకలు, సున్నపురాయి తీసుకుని తమకోసం ఇళ్లు నిర్మించుకున్నారు. అదే ఒక విదేశీయుడు శ్రమకోర్చి, దాని పునర్నిర్మాణాన్ని చేపట్టాడు! అతని చలవే ప్రస్తుతం మిగిలి ఉన్న స్తూపం. ‘ఎంత వైచిత్రి?’, ఆ తర్వాత నేను, ఆల్బర్ట్ ‌దగ్గరలోనేవున్న మ్యూజియం చూశాము.

ఆల్బర్ట్ ‌చాలా ఉత్సాహంగా, మ్యూజియంలో కలియ తిరిగాడు. ఫొటోలకు అనుమతి ఉన్న దగ్గర, తన కెమెరాను క్లిక్‌ ‌మనిపించాడు. తన పుస్తకంలో విరివిగా ముఖ్యమైన సమాచారాన్ని రాసుకున్నాడు. నన్ను కొన్ని సందేహాలడిగాడు. దాదాపు గంటసేపు అక్కడ గడిపిన తర్వాత మేమిద్దరం, అమరావతిలో కృష్ణా నది ఒడ్డునున్న అమరలింగేశ్వరుని ఆలయంలోకి ప్రవేశించాం.

చాలాసేపు గుడి ఆవరణలో కలియ తిరిగాము. ఆల్బర్ట్ ‌నాపై ప్రశ్నల వర్షం కురుస్తూనేవుంది. ఆ ఝడిలో నా బుర్ర తడుస్తూనే వుంది. అయితే అది విసుగును కాక, హాయిని కలిగిస్తూ వుంది. గుడిలోంచి బయటకు వచ్చి, కృష్ణానది ఒడ్డున కాసేపు విశ్రమించాము. ఆల్బర్ట్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. తాను విజయవాడలో కనకదుర్గమ్మ గుడికి వెళ్లినప్పుడు, అక్కడ ఒక పూజారి, ఇతనితో కాసేపు మాట్లాడాడట. ఇతనికి ఈశ్వర్‌ అని పేరు కూడా పెట్టాడట. ఆ పేరుకు అర్థం తెలుసుకున్న ఆల్బర్ట్ ‌నాతో ‘‘శివ్‌, ఇకనుంచి నన్ను ఈశ్వర్‌ అని పిలవండి ప్లీజ్‌. ఆ ‌పేరులో నాకేదో శక్తి ఉన్నట్లనిపిస్తోంది,’’ అన్నాడు.

నిజానికి నేను హేతువాదిని. నాకు దేవునిమీద కన్నా ఎక్కువగా, భక్తి సంగీతం మీద భక్తి, ఆసక్తి ఉన్నాయి. ఆ సంగీతంలో నాకు ఒక మాంత్రిక సంగీత శక్తి వినిపిస్తుంది. అందుకే నేను ఆ పాటలను బాగా ఇష్ట పడతాను. నేను కొన్నాళ్లు శాస్త్రీయ సంగీతం మా అమ్మాయితో బాటుగా నేర్చుకున్నాను కూడా! ఆల్బర్ట్ అలా అడిగినప్పటినుంచి నేను అతన్ని ‘ఈశ్వర్‌’ అనే పిలుస్తున్నాను. ఆ పేరు విని అతను పులకించిపోతున్నాడు. మేమిద్దరం నది ఒడ్డుకు వెళుతుంటే, ఒక బిచ్చగాడు ఎదురై చెయ్యి చాచాడు. నేను అతన్ని పట్టించుకోలేదు కానీ, ఈశ్వర్‌ అతనికి యాభై రూపాయల నోటిచ్చాడు. ఈశ్వర్‌ ‌నన్నడగకపోయినా, నేనతనితో ‘‘ఈ బిచ్చగాళ్లను ప్రోత్సహించకూడదు,’’ అన్నాను. ‘‘ఎందుకని?’’ అడిగాడు ఈశ్వర్‌.

‘‘‌వీళ్లేదైనా పని చేసుకుని బతకొచ్చుకదా! ఇలా సోమరిగా అడుక్కోకపోతే!’’ అన్నాను. అప్పుడు అతను ‘‘వికలాంగులు, రోగులు అయిన బిచ్చగాళ్ల విషయంలో కూడా అంతేనా?’’ అని యధాలాపంగా అడిగాడు. నేను సాధారణంగా బిచ్చగాళ్లకు డబ్బివ్వను. అనాథ శరణాలయాల్లో అప్పుడప్పుడూ, కొంత తృణమో, పణమో, పండ్లో, బట్టలో ఇస్తానుగానీ! అయితే ఈశ్వర్‌ ‌ప్రశ్న నన్నాలోచింప చేసింది. అప్పటికి చీకట్లు నెమ్మదిగా ముసురుకుంటున్నాయి. ఈశ్వర్‌ ‌గుళ్లోనూ బయటా, చాలా ఫోటోలు తీసుకున్నాడు. మా తరవాతి మజిలీ అమరావతిలోని బుధ్ధుని విగ్రహం.

అమరావతిలోని మరో ప్రధాన ఆకర్షణ, 125 అడుగుల ఎత్తు కలిగిన ధ్యాన బుద్ధుని విగ్రహం. అది 4.5 ఎకరాల స్థలంలో, ఎనిమిది స్తంభాల మీద నిర్మితమైవుంది. ఆ ఎనిమిది స్తంభాలూ, బుద్ధునిచే విముక్తి కోసం ప్రతిపాదితమైన ఎనిమిది మార్గాలకు ప్రతీకలు. విగ్రహానికి క్రింది భాగంలో, మూడు వరుసల్లో, ఒక సందర్శనశాల కూడా ఉంది. దీపాల వెలుగులో గౌతముడు అఖండమైన కాంతితో వెలిగిపోతున్నాడు. నేను, ఈశ్వర్‌ ‌చాలా సేపు, ఆ చల్లని, ప్రశాంత వాతావరణంలో గడిపి విజయ వాడకు తిరిగి వచ్చాము. ఆ తర్వాతి రోజు నేను ఈశ్వర్‌ను హోటల్లో కలిశాను. అతను ముందు రోజు మేము కొద్ది సేపు కూర్చుని మాట్లాడుకున్న స్థలాన్ని మేము మెట్లు దిగుతుండగా, తదేకంగా చూస్తూ

‘‘ఇక్కడే కదా శివ్‌, ‌మనం నిన్న కూర్చుని మాట్లాడుకుంది..’’ అని ఒక ఆరాధనా భావంతో అన్నాడు. తర్వాత కొంతసేపు మేము అతని గదిలో కూర్చున్నాము. నేను లోపల అతను చేసిన ఒక చిన్న ఏర్పాటు చూసి, సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను- కిటికీకి పక్కనున్న చిన్న బల్లమీద అతను దుర్గాదేవి పటం ఉంచాడు. దానికెదురుగా, కొన్ని పుస్తకాలు న్నాయి. వాటిలో, రవీంద్రుని గీతాంజలి, భగవద్గీత, ప్రక్కనే నా కవితా సంపుటి ఉన్నాయి. పోయిన సంవత్సరం జరిగిన కవి సమ్మేళనం సందర్భంగా ప్రచురితమైన వివిధ జాతీయ, అంతర్జాతీయ కవులకు చెందిన కవితలు ముద్రించిన పెద్ద పుస్తకం కూడా ఉది. నిజానికి, మేరీ నా గురించి అతనికి చెప్పిన తర్వాత, తన దగ్గరున్న ఆ పుస్తకంలోని నా కవితను చదివాడట. అది చదివిన ఈశ్వర్‌ ‌మేరీని నాగురించి మరిన్ని వివరాలడిగాడట. అది విన్న తర్వాత నాకు ఒకరకమైన పులకింత కలిగింది. అతను ‘గోడలు’ (ఔ••• అన్న శీర్షికతో ఉన్న నా ఆంగ్ల కవితను పుస్తకంలోంచి చదివి దాన్ని నా ముందు విశ్లేషించాడు. తను

‘‘వాల్స్’’ అన్న మీ కవితలో, మీరు మనుషులు తమంతకు తాము వివిధ రకాల పరిమితులను విధించుకుని, తమలోకి తాము కుంచించుకు పోవడం గురించి చాలా బాగా రాశారు. అలా కాకుండా, విశాలమైన దృక్పథం కలిగి, మనసుల మధ్య దగ్గరతనం ఉండాలన్న మీ సూచన, ఆలోచనా శైలి, నాకు నచ్చాయి,’’ అన్నాడు. ఆతర్వాత మేమిద్దరం కొంచెం సేపు భగవద్గీత గురించి చర్చించుకున్నాము. అతనికి భగవద్గీత మీద అపారమైఅన నమ్మకమున్నట్లు నాకు అతని మాటల ద్వారా నిర్ధారణయ్యింది.

నేను క్రితం రోజు నిర్విరామంగా ఈశ్వర్‌తో జరిపిన సంభాషణల వల్ల బొంగురుపోయిన నా గొంతుతోనే, రెండు శ్లోకాలు గీతలోంచి వినిపించాను. అవి ‘పార్థాయ ప్రతిబోధితాం’, నా కిష్టమైన, ‘దుఃఖేషు అనుద్విగ్నమన సుఃఖేషు విగత స్పృహః’ అన్నవి. తర్వాత వాటి అర్థాలు కూడా చెప్పి, ఘంటసాల పాడిన భగవద్గీతలోంచి, కొన్ని శ్లోకాలు ఆయన గొంతులోంచే, యుట్యూబ్‌లో వినిపించాను. అవి విన్న ఈశ్వర్‌ ‌చాలా ఆనందించాడు. తన పుస్తకంలో వాటి గురించి క్లుప్తంగా రాసుకున్నాడు కూడా! తను నిజానికి, రవీంద్రుని ‘గీతాంజలి’ చదివి, ఉత్తేజితుడై, మన దేశాన్ని సందర్శించాలన్న నిర్ణయం తీసుకున్నాడట. తర్వాత అతను ‘‘నేను మీకు ఒక పాట వినిపిస్తాను. వినిపించమంటారా?’’ అని కొంచెం మొహమాటంగా అడిగాడు. నేను ‘‘అలాగే,’’ అని ఆసక్తిగా నా అంగీకారం తెలిపాను.

అప్పుడు ఈశ్వర్‌ ‌తన సంచిలోంచి ఒక వేణువు తీశాడు. ముందుగా ‘ముద్దుగారే యశోద’ అనే అన్నమాచార్య కీర్తన, తర్వాత ‘సారే జహాసె అచ్ఛా హిందూసితా హమారా’ అన్న పాట, వేణువుతొ వినిపించాడు. నేను సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. నాకు కూడా ఫ్లూట్‌తో కొంత అనుబంధముంది. అయితే నేను వాయించేది, 6 లేక 7 రంధ్రాలున్న హిందుస్తానీ బాణీకి చెందిన బాన్సురి. ఈశ్వర్‌ ‌దగ్గరున్నది..8 రంధ్రాలు గల కర్ణాటిక్‌ ‌శైలికి చెందిన వేణువు. సంగీతం ఒకటే అయినా, రెండింటి నిర్మాణంలో, వాయించే సౌలభ్యంలో కొంత తేడా ఉంది. నేను అచ్చెరువొంది చూస్తుండగా ‘‘నేను జెర్మనీలో మా ఊళ్లో ఉన్న ఒక భారతీయ సంగీత విద్వాంసుడి దగ్గర వేణువాదన అభ్యసిస్తున్నాను,’’ అన్నాడు.

అది విన్న తర్వాత నా ఆనందాశ్చర్యాలకు అంతులేకుండాపోయింది. అతన్ని మనస్ఫూర్తిగా అభినందించాను. తర్వాత, ‘తాను ఒక కుర్తా కొనుక్కోవాలని, నాట్యశాస్త్రానికి సంబం ధించిన పుస్తకం కావాలని,’ అడిగాడు. నేనతన్ని ఏలూరు రోడ్డులోవున్న విశాలాంధ్రా బుక్‌హౌస్‌కు, తర్వాత ఒక ఖాదీ షాప్‌కు తీసుకెళ్లాను. తను కావలసినవి కొన్నాడు. బుక్‌ ‌షాపులో విశాలాంధ్ర వారు ప్రచురించిన నా అనువాద కథల సంపుటి ‘సుమాంజలి’ కూడా కొన్నాడు. నేనాశ్చర్యంగా చూస్తుంటే ‘‘మీ పుస్తకాన్ని నేను ఇక్కడ ఎవరైనా ఒకరికి బహుమతిగా ఇస్తాను. అది ప్రత్యేకంగా ఉంటుంది’’ అన్నాడు. నేను సంబరపడి పోయాను. మధ్యాహ్నం తను ఇంకొక స్థానిక మిత్రుడితో కూచిపూడి వెళుతున్నట్లు చెప్పాడు (కూచిపూడి నాట్యం మూలాలు, దాని పరిణామ క్రమం గురించి అవగాహన పెంచుకోవడానికి). అక్కడితో నేను అతని దగ్గర సెలవు తీసుకున్నాను.

రెండ్రోజుల తర్వాత నగరంలోని ఒక ప్రముఖ హోటల్లో అంతర్జాతీయ బహు భాషా కవి సమ్మేళనం ప్రారంభమయ్యింది. గత నాలుగు సంవత్సరాలుగా అది క్రమం తప్పకుండా జరుగుతోంది. దేశ, విదేశాలనుంచి నూటా యాభై మంది కవులు వచ్చారు. ‘మేరీ’ ఆ కార్యక్రమానికి ముఖ్యమైన సంధానకర్తగా వ్యవహరిస్తూ ఉంది. అది రెండురోజుల కవితల పండగ. బహు భాషా జాతీయ కవులు తమ కవితలను ఆ వేదిక మీదనుంచి వినిపించే ఒక అద్భుత కార్యక్రమం. అంతలో ఈశ్వర్‌ ‌నాదగ్గరకొచ్చాడు. అప్పుడతను రెండ్రోజుల క్రితం కొన్న తెల్లటి కుర్తా ధరించివున్నాడు. ఆ వస్త్ర ధారణలో అతను ఒక తేజస్సుతో వెలిగి పోతున్నాడు.

‘‘శివ్‌ ‌మీ సహాయం కావాలి, నేను హిందూ సంప్రదాయ పధ్ధతిలో బొట్టు పెట్టుకోవాలను కుంటున్నాను. ఒక కవయిత్రి నా నుదిటిమీద కుంకుమ బొట్టు పెడతానని ముందు చెప్పింది కానీ, తాను వివాహిత అయినందున ఆమె అలా చెయ్యకూడదని ఎవరో చెప్పారట. అందుకని ఆమె నాకు క్షమాపణ చెప్పింది. తను చెయ్యలేనంది,’’ అన్నాడు.

నేను వెంటనే నాకు బాగా తెలిసిన ఒక కవయిత్రినడిగితే, ఆమె ఒప్పుకుని, ఈశ్వర్‌ ‌నుదిటిమీద చక్కటి బొట్టు పెట్టింది. ఈశ్వర్‌ ‌దాని కోసం తన దగ్గర కుంకుం పొట్లాన్ని తయారుగా ఉంచుకున్నాడు కూడా! ప్రారంభ కార్యక్రమం తర్వాత కవి సమ్మేళనంలో ఈశ్వర్‌ ‌వంతు వచ్చింది. ఈశ్వర్‌ ‌వేదికపైకి వచ్చి, నేలమీద కూర్చున్నాడు. నాలో ఒకింత ఉత్కంఠ పెరిగింది.

అంతలో వేదిక మీదకు ఒక నర్తకి, లయబధ్ధమైన అడుగులతో వేంచేసింది. ఈశ్వర్‌ ‌ఫ్రెంచ్‌ ‌భాషలో రాగయుక్తంగా, తన కవితను చదువుతున్నాడు. ఆ నర్తకి, కూచిపూడి శైలిలో నృత్యం చేస్తూవుంది. ఆ కార్యక్రమం ఒక పది, పదిహేను నిమిషాలపాటు కొనసాగింది. మేమందరం మంత్ర ముగ్ధుల మైపోయాము. కార్యక్రమం పూర్తయ్యిం తర్వాత అందరం లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేశాం. అదొక అపూర్వ సందర్భం. ఫ్రెంచ్‌ ‌కవిత్వం, భారతీయ (కూచిపూడి) నృత్యం సంగమించి సృష్టిం చిన శ్రవణ, దృశ్య కావ్యం! అలా ఆ రెండు రోజులు అత్యద్భుతంగా, కళాత్మకంగా గడచిపోయాయి. వెళ్లే ముందు ఈశ్వర్‌ ‌నాతో ‘‘నన్ను మీకు తెలిసిన ఏదైనా అనాథాశ్రమానికి తీసుకు వెళ్లండి. నేను నిన్న నా భార్యతో మాట్లాడాను. మేము ఇక్కడి పాపను పెంచుకోవాలనుకుంటున్నాం,’’ అన్నాడు.

నేను అతన్ని నాకు తెలిసిన ఒక అనాథాశ్రమానికి తీసుకు వెళ్లాను. తను సరస్వతి అన్న పేరుగల ఒక నాలుగేళ్లమ్మాయిని దత్తత తీసుకోవడం కోసం ఎంపిక చేసుకున్నాడు. కొన్నిరోజులు పోయాక ఇండియా వచ్చి ఆ అమ్మాయిని తీసుకు వెళతానని ఆశ్రమ నిర్వాహకులకు చెప్పి జెర్మనీ వెళ్లిపోయాడు. కొంత కాలమయ్యాక, అన్నట్లుగానే వచ్చి ఆ పాపను తనతో తీసుకెళ్లాడు. అతను వచ్చేముందే, నేను పాస్పోర్ట్, ‌మిగతా కావలసిన పత్రాలను సిధ్ధం చేశాను. ఈశ్వర్‌ ‌నాతో ఫోన్లో సంభాషిస్తూ, ఇ మెయిల్స్ ‌పంపుతూ, చెయ్యవల్సిన ఏర్పాట్లు చేశాడు. తర్వాత కొంత కాలానికి, తాను ఫ్రెంచ్‌ ‌భాషలో, అమరావతి, కూచిపూడి నృత్యాల గురించి రాయాలనుకున్న పుస్తకం పూర్తయ్యిందని, త్వరలో ముద్రితమవుతుందని మెయిల్లో తెలిపాడు.

మా స్నేహబంధం సుగంధభరితంగా కొనసా గుతూవుంది. ఈశ్వర్‌ ‌గుర్తుకొచ్చినప్పుడల్లా – ‘జయహో భారతీయ సంస్కృతి’, ‘జయహో వసుధైక కుటుంబకమ్‌..’ ‌భావన నాలో మార్మోగు తూంటుంది. జయహో!!

– బీవీ శివ ప్రసాద్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE