సూర్యుడు ధనూరాశిలోకి ప్రవేశించిన తరువాత మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గళి’ మధ్యలో, ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందు వచ్చేదే ముక్కోటి /వైకుంఠ ఏకాదశి. ప్రతి ఏకాదశికి నిర్దిష్టమైన పేర్లు ఉన్నాయి. ఆర్ష సంప్రదా యంలో ఏకాదశి తిథి పరమపవిత్రమైనది. శ్రావణ, కార్తిక, మార్గశిర మాసాల్లోని ఏకాదశి తిథి మరింత విశేషమైనది. ధన్ముర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని ముక్కోటి పర్వదినంగా పాటిస్తారు. నాడు ముక్కోటి దేవతలతో పరివేష్టితుడైన శ్రీ మహావిష్ణువును ఉత్తరద్వారం నుంచి దర్శించుకుంటే మనోభీష్టాలు నెరవేరుతాయని, మోక్షం సిద్ధిస్తుందని విశ్వాసం.
నెలకు రెండు చొప్పున ఏడాదికి 24 ఏకాదశులు, అధికమాసంలో మరో రెండు వస్తాయి. ప్రతి ఏకాదశిని పవిత్రమైనదిగా భావిస్తారు. వాటిలో ముక్కోటి ఏకాదశి భిన్నమైనది. అన్ని ఏకాదశులను చంద్రమానం ప్రకారం గణిస్తే దీనిని సౌరమానంతో గణిస్తారు. దీనిని హరిఏకాదశి, మోక్ష ఏకాదశి, సౌఖ్య ఏకాదశి అనీ వ్యవహరిస్తారు. ధనుర్మాసన ఏకాదశి కొన్నిమార్లు మార్గశిరంలో, మరికొన్నిసార్లు పుష్య మాసంలో వస్తాయి. మార్గశిర శుద్ధ ఏకాదశి మోక్షదైకాదశి కాగా పుష్య మాస ఏకాదశి ‘పుత్రద/ఫలద’గా ప్రశంసలు అందుకుంది.
ఉత్తరాయణ పుణ్యకాలం కావడం వల్ల ఏకాదశి అత్యంత విశిష్ట దినమైంది. పురాణగాథను బట్టి దక్షిణాయనంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి (తొలిఏకాదశి) నాడు యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు, కార్తిక శుద్ధ ఏకాదశి (ఉత్థాన ఏకాదశి) నాడు మేల్కొని మార్గశిర శుద్ధ ఏకాదశి (ముక్కోటి/వైకుంఠ) నాడు సర్వాలంకార భూషితుడై శ్రీదేవి, భూదేవి సమేతంగా గరుడావాహనరూఢుడై ఉత్తర(వైకుంఠ)ద్వార దర్శనమిస్తాడు. ముఖ్యంగా సృష్టి నిర్వాహకులు 33 మంది (ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అష్టవసువులు, ఇద్దర అశ్వనీ దేవతలు) ముఖ్య పాలనాధికారి శ్రీమహావిష్ణువును దర్శించుకునేందుకు ఆనాడు భూలోకానికి వస్తారట. వారి రాకకోసం కేటాయించిన ప్రత్యేక మార్గమే ‘వైకుంఠ ద్వారం’ అని శాస్త్రవచనం. వారితో కలిసి విష్ణువును దర్శించుకునే వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. అందుకే ఆ దారికి ‘స్వర్గద్వారం’ అని వ్యవహారంలోకి వచ్చింది. వైకుంఠ ద్వారం సూర్యుని ఉత్తరాయణ ప్రవేశానికి సూచిక. ఈ దర్శనం ద్వారా ‘మోక్షం’ సిద్ధిస్తుంది కనుక ఈ ఏకాదశిని ‘మోక్షోత్సవ’ దివసమనీ వ్యవహరిస్తారు.ఉత్తర ద్వారం అంటే ఉత్తర దిక్కున ఉండే ద్వారమే కాదు…శరీరానికి ఉత్తరాన ఉన్నది శిరస్సు. అందులోని రెండు రెక్కలను తెరచి దైవాన్ని దర్శించడమే ఉత్తర ద్వార దర్శనమని విజ్ఞులు అభివర్ణించారు.
మరో గాథ ప్రకారం, శ్రీమహావిష్ణువు చేతిలో హతులైన రాక్షసులు మధుకైటభులు శాప విమోచనంతో దివ్యరూపాలు పొంది, ‘మాకు నిజరూపాలు కలిగిన ఈరోజు చరిత్రలో నిలిచేలా వైకుంఠంలాంటి మందిరాన్ని నిర్మించి ఈ రోజున ఉత్తర ద్వారంలో నిన్ను దర్శించి, అర్చించే వారికి వైకుంఠప్రాప్తి ప్రసాదించు’ అని ప్రార్థించారు.
ఒక మన్వంతరంలో వికుంఠ అనే మహిళకు విష్ణువు కుమారుడిగా జన్మించడం వల్ల ఆయనకు వైకుంఠుడు అనే పేరు వచ్చిందని అమరకోశం పేర్కొంటోంది. ‘కుంఠ’అనే మాటకు మొక్కపోవడం అనే అర్థమూ ఉంది. మహావిష్ణువు మనలోని అరిషడ్వార్గాలను నిర్వీర్యం (వికుంఠం) చేస్తాడని చెబుతారు. మురాసుర సంహారానికి వైకుంఠం నుంచి వచ్చిన తిథి కనుక వైకుంఠ ఏకాదశి అని పురాణ కథనం.కురుకుల పితామహుడు భీష్ముడు, తండ్రి శంతనుడు ప్రసాదించిన ‘స్వచ్ఛంద మరణం’ వరంతో ఉత్తరాయణం ప్రవేశించిన తరువాతనే దేహత్యాగం చేశాడు. దక్షిణాయనంలో మొదలైన కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి బాణాహతుడైన ఆయన అంపశయ్యపై పరుండి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం నిరీక్షించాడు. ఈ మధ్యకాలం ధర్మరాజాదులకు విష్ణు సహస్రనామం ఉపదేశించారు.
శ్రీరంగం,తిరుమలలో వైకుంఠ ఏకాదశిని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శ్రీరంగ క్షేత్రంలో ఈ రోజు (ముక్కోటి) నుంచి 21 రోజులు పగలు (పగల్ పాథ్), రాత్రి (ఇరుల్ పాథ్) అని రెండుగా విభజించి విష్ణునామ సంస్మరణతో దర్శనభాగ్యం కలిగిస్తారు. శ్రీవైష్ణవాళ్వారులతో ఒకరైన నమ్మాళ్వార్ ఈ తిథి నాడే పరమపదించడం వల్ల వారు దీనికి విశేష ప్రాధాన్యమిస్తారు.
ఏకాదశికి ముందువచ్చే మంగళవారం తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరు మంజనం నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం, స్వర్ణరథోత్సవం ఉంటుంది. కోనేటిరాయుడు ఉభయ దేవేరులతో మాడ వీధులలో దర్శనమిస్తాడు. ఉత్సవాల అనంతరం స్వామి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. చక్రత్తాళ్వార్‌కు ఏటా నాలుగు సందర్భాలలో నిర్వహించే స్నానాలలో మార్గశిర శుద్ధ ద్వాదశి నాటిది ఒకటి. పుణ్య తీర్థాలు సూక్ష్మ రూపంలో స్వామి పుష్కరిణిలో ప్రవేశిస్తాయని, సకల దేవతలు అక్కడ ఆవహిస్తారని పెద్దల మాట. అందుకే చక్రస్నానానికి అంత విశిష్టత.
శ్రీమహావిష్ణువు అలంకార, సామగానలోల ప్రియుడు. ‘వైకుంఠ ఏకాదశి నాడు ఆలయంలో కానీ, ఇంటి వద్ద కానీ విగ్రహాలు/చిత్రపటాలను పూలమాలలతో అలంకరించాలి. పూజకు ప్రధానంగా తామరపూవులు, తులసి వినియోగించి, మధుర పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. అష్టాక్షరీతో పాటు స్తోత్రాలు మననం చేస్తూ, అర్చన, జపం,ధ్యాన సాధానాల ద్వారా వైకుంఠపతి అనుగ్రహం కలుగుతుంది’అని పెద్దలు చెబుతారు.
‘‘మంగళం భగవాన్ విష్ణు: మంగళం గరుడధ్వజా
మంగళం కమలాకాంతమ్ త్రైలోక్యం మంగళమ్ కురు’
– స్వామి