మన ఆలయాలను మన సంప్రదాయం ప్రకారమే నిర్వహించుకుందామని విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వరశర్మ పిలుపునిచ్చారు. ‘‘దేవాలయాల వంశపారంపర్య ధర్మకర్తలు, అర్చకులు, అక్కడి భక్తులు కలసి ఉమ్మడిగా సహకార భావంతో, భక్తితో ఆలయాలు నిర్వహించు కుంటాం. అందులో ప్రభుత్వ జోక్యం ఉండనక్కరలేదు, దానికి అయోధ్య దేవాలయమే ఓ ఉదాహరణ’’ అని వివరించారు.
రోజుకు రెండున్నర లక్షల మంది భక్తులకు దర్శనాలు సాఫీగా అయోధ్యలో జరుగుతుంటే అలాంటి వ్యవస్థను మన ఊళ్లో మన ప్రజలు, మన భక్తులు కలసి ఎందుకు ఏర్పాటు చేసుకోలేము అని ఆయన ప్రశ్నించారు. ప్రతీ దేవాలయానికీ తనదైన ఆగమశాస్త్రం, సంప్రదాయం ఉన్నాయి. ఆ పద్ధతుల్లో గుడులను నిర్వహించాలి. ఆ పద్ధతిలో దేవాలయాల నిర్వహణ స్వతంత్రంగా జరగాలన్నారు.
ప్రభుత్వాల నుంచి తీసుకుని దేవాలయాలను ఎవరు నిర్వహిస్తారనీ, వీహెచ్‌పీయా, ఆర్‌ఎస్‌ఎస్ వారా అంటూ కొందరు ప్రశ్నించడాన్ని ఆయన తప్పు పట్టారు. ఆలయాలను హిందూ సమాజమే ఐక్యంగా నిర్వహిస్తుందని, హిందూ సమాజానికి ఆ శక్తి ఉందని స్పష్టం చేశారు. ధనానికి లోటు లేదు. నిర్వహణా సామర్థ్యానికి లోటు లేదు. హిందువుల్లో అన్ని రకాల శక్తియుక్తులు కలిగినవారు ఉన్నారన్నారు.
ఈస్టిండియా కంపెనీ, తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చట్టాల ద్వారా ఆలయాల నిధుల దుర్విని యోగం ప్రారంభమైందని ఆయన చెప్పారు.ఆ తర్వాత తమిళనాడు, దాని ఆధారంగా ఆంధప్రదేశ్ దేవాదాయ శాఖలు ఏర్పడ్డాయి. అప్పట్లోనే సుప్రీం కోర్టు ఎండో మెంట్స్ చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టంగా చెప్పాయన్నారు. ‘‘ఆ మూడు దేవాలయాలు (అయోధ్య, మధుర, కాశీ) ఇవ్వకపోతే 30 వేల దేవాలయాలు తీసుకుంటాం అని 34 సంవత్సరాల క్రితమే హిందూ సమాజం నినదించింది. దేశమంతా దేవాలయాలను రాజకీయ పార్టీల, ప్రభుత్వాల కబంధహస్తాల నుండి విముక్తం చేయడానికి తొలి ప్రయత్నమే ఈ హైందవ శంఖారావం’’ అని చెప్పారు కోటేశ్వరశర్మ. ‘‘నిజానికి ఈ శంఖనాదం ఈనాటిది కాదు. 1987లోనే చల్లా కొండయ్య కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా చినజీయర్ స్వామి నిరాహారదీక్ష చేసిననాడే మొదలైంది. కమలానంద భారతీ స్వామి పాదయాత్ర చేసి రాష్ట్రంలోని అన్ని దేవాలయాల ఆస్తుల వివరాలు, వాటిలో అన్యాక్రాంత మైన ఆస్తుల వివరాలూ సేకరించారు. ఆలయాల్లో ఆస్తుల వివరాలతో బోర్డులు పెట్టించింది ఆయనే. అలా ఈ ఉద్యమానికి ఎప్పుడో పునాది పడింది. చల్లా కొండయ్య నివేదికలో అర్చకులు, ట్రస్టుబోర్డులు, ఉద్యోగులు దేవాలయాల ఆస్తులను భ్రష్టుపట్టిస్తున్నా రని, అవినీతికి పాల్పడు తున్నారనీ పేర్కొన్నారు. కానీ నేటివరకూ ఆ అక్రమాలను నిరూపించలేక పోయారు, అన్యాక్రాంతమైన భూములను అప్పగించలేకపోయారు. చల్లా కొండయ్య కమిషన్ దేవాలయాలపై పెత్తనాన్ని ప్రభుత్వాధి కారులకు అప్పజెప్పింది. దానివల్ల అన్యమతస్తులు దేవాలయాల్లో ఉద్యోగులు అయ్యారు. పూజలపై ఆంక్షలు విధించారు. హిందూసమాజం సాధుసంతుల మార్గదర్శనంతో దేవాలయాల నిర్వహణ సమర్ధంగా చేసుకోగలదు’’ అని అన్నారు. ఆ పని స్థానికంగా ఉన్న ధార్మిక ట్రస్టుల ద్వారా జరగాలని తెలిపారు. దేవాలయ నిర్వహణలో ఆనువంశిక ధర్మకర్తలు, అర్చకులు, భక్తుల పాలుపంచుకోవాలని చెప్పారు. ఆ క్రమంలో ప్రభుత్వ జోక్యం లేకుండా ప్రతీ దేవాలయానికి తనదైన ఆగమశాస్త్రం, ఆచారాలు, సంప్రదాయాలను అనుసరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అర్చకుల హక్కులు కాలరాస్తూ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆరోజు జీయరుస్వామి, పెజావర్ స్వామి ప్రారంభించిన దీక్షను హిందూ సమాజం సరిగ్గా అర్ధం చేసుకోలేదని, తర్వాత తిరుపతిలో మార్పు చేర్పుల మీద చినజీయర్ స్వామి పెద్ద ఉద్యమం ప్రారంభించారని, ఆ ఉద్యమం సఫలం కాలేదనిపించిందని, అందరూ కలసి చేద్దామనుకున్నా సాధ్యం కాలేదన్నారు. తర్వాత కమలానంద భారతి స్వామీజీ రంగప్రవేశం చేసారు. ఊరూరా జనజాగృతి చేశారని, రథయాత్రతో రాష్ట్రంలో ప్రతీ దేవాలయం గురించి వివరాలు సేకరించారన్నారు. ప్రతీ దేవాలయాల ఆస్తుల వివరాలు, వాటిలో అన్యాక్రాంతం అయిన వివరాలు సేకరించారు. దేవాలయాల్లో ఆస్తుల వివరాలతో బోర్టులు పెట్టించింది ఆయనేనని కోటేశ్వరశర్మ తెలిపారు. అలా ఈ ఉద్యమానికి ఎప్పుడో పునాది పడింది. వీహెచ్‌పీ ఆవిర్భావ సమయం నుంచే దేవాలయాల విముక్తి గురించి ఉద్యమాల నిర్మాణం ప్రారంభించిందని గుర్తు చేశారు. దేవాలయ రక్షణకు ఉద్దేశించిన ఒక కొత్త చట్టం నమూనాను తాము ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందచేశామని శర్మ తెలియచేశారు. తరువాత అయినా ప్రభుత్వం తన అధీనంలోని ఆలయాలను హిందూ సమాజానికి అప్పగిస్తుందని ఆశిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.