భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన రచన
రచయిత్రి పరిచయం
– రమాదేవి కులకర్ణి
M. A. (litt) B. Ed M. A. (hindi) M. A.( psy) H. PT
పుట్టింది, పెరిగింది : మెదక్, హైదరాబాద్.
వృత్తి : స్కూల్ ప్రిన్సిపాల్
ప్రవృత్తి: రచన, కవిత్వం, మోటివేషనల్ స్పీకర్,
అభిరుచులు: పుస్తకాలు చదవడం, యోగ, కవితలు, కథలు సామాజిక అంశాలతో కూడిన వ్యాసాలు, గజల్స్ రాస్తాను. ఢిల్లీలో శిఖరం ఆర్ట్ థియేటర్స్ ఆది లీల ఫౌండషన్స్ Apj Abdul kalam ఎక్సలెన్సీ అవార్డు ఇచ్చారు. ITAP tutors pride వారిచే PRINCIPAL OF THE YEAR -2018 తీసుకున్నాను. చాలా రాయించింది జీవితం. ఇంకా చదవాల్సింది నేర్చుకోవాల్సింది బోలెడు ఉంది. తృతీయ బహుమతి ప్రకటించినందుకు ధన్యవాదాలు.
‘‘ఇతి తృతీయోధ్యాయః సమాప్తం. బోలో శ్రీ రమాసహితవీర వెంకట సత్యభగవాన్‌కి జై’’ పురోహితుల వారితో సమంగా అక్కడున్న భక్తులందరూ ‘‘జై’’ అన్నారు.
కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చారు. పురోహితుడు నాల్గవ అధ్యాయం ప్రారంభించారు.
‘‘ఇంకేందే అమ్మా… నీ పెద్ద కొడుకు కూడా సొంతిల్లు కట్టుకున్నాడు. నువ్ ఖుష్ అయినవా’’ అడిగాడు రాఘవ, తల్లి భారతమ్మను.
‘‘నువ్వు కట్టుకున్నప్పుడు, తమ్ముడు కట్టుకున్నప్పుడు కూడా ఖుషి అయిన, ఇప్పుడు కూడా అయితున్నరా’’ అన్నారు ఆవిడ.
హైదరాబాద్ లోని బాలాపూర్ చౌరాస్తా నుండి ఎడమ వైపునకు వెళితే బడంగ్పేట్ ఉంటుంది. గ్రామ పంచాయితీ అది. రియల్ ఎస్టేట్ విపరీతంగా విస్తరించిపోయిన హైదరాబాద్ మహానగరంలోని భాగమైపోయాయి చ••ట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఊర్లన్నీ.
200 గజాలలో మూడు గదులున్న ఇల్లు కట్టుకున్నాడు రఘుపతి. ముందంతా కొంత స్థలం వదిలాడు. ప్రహరి గోడపక్కన ఒక చిన్న షట్టర్ వేశాడు. అందులో చిన్న బడ్డీ కొట్టు పెట్టే ఉద్దేశం ఉంది అతనికి. నారాయణగూడలో అద్దె ఇంట్లో ఉండేవాళ్లు. ఇప్పుడు ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేస్తున్నారు.
‘‘చిన్నోడు ఏడిరా.. కానొస్తలేడు, పొద్దున్నుంచి’’ అడిగారు భారతమ్మ గారు.
‘‘నిన్నటి నుండి ఈడనే ఉండే గదనే, బిడ్డకు ఏదో డ్రాయింగ్ పరీక్ష ఉందంట. రాపిచ్చుకొని వస్తడు, నీకు చెప్పుమన్నడు’’ అన్నాడు రాఘవ. ‘‘మంచిది’’ అన్నారు ఆవిడ.
ఐదు అధ్యాయాలు పూర్తయిన సూచనగా మహా నైవేద్యం చేసి హారతి ఇస్తున్నారు.
కొందరు మహిళలు ‘‘శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా.. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా…’’ అంటూ మంగళ హారతి పాడుతున్నారు.
అందరూ ప్రసాదం తీసుకున్నారు.
రఘుపతి దంపతులు, పిల్లలు కలిసి తల్లి పాదాలకు నమస్కరించారు.
‘‘ప్రసాదం చాలా రుచిగా ఉందండి’’ అంటున్నారు ఎవరో రఘుపతి వసుంధరతో… ‘‘హా.. మా అమ్మ చేసింది, ఆమె చెయ్యి అటువంటిది’’ గొప్పగా అన్నారు ఆవిడ.
అమ్మ చేతులు అద్భుతంగా వండుతాయి. కానీ అది భగవంతుని నివేదనగా మారి, ప్రసాదమైతే ఆ రుచి అమృతం అవుతుంది, అందుకే ప్రతి దేవాలయంలోను, పూజలు వ్రతాలు చేసిన చోట ఆహారాన్ని ప్రసాదం అంటారు. అంత రుచిని పొందుతుంది.
* * *
‘‘ఇప్పుడు అమ్మ మా దగ్గర ఉండాలి ఈ మూడు నెలలు కానీ కొత్త ఇల్లు సర్దుకుంటున్నాంరా. నువ్వు తీసుకపో.. నీవంతు వచ్చినప్పుడు నేను తీసుకొస్తా ’’అన్నాడు రఘుపతి తన పెద్ద తమ్ముడు రాఘవతో.
‘‘అట్లనే చేయన్నా.. ఏం పర్వాలేదు ఒకసారి నా భార్యకు చెప్తా’’ అన్నాడు రాఘవ.
ఇంతలో రఘుపతి చిన్న కొడుకు మనీష్ అందరికీ కూల్డ్రింక్స్ తీసుకొని వచ్చాడు డాబా పైకి.
‘‘గృహప్రవేశం చాలా బాగా జరిగింది. ఇల్లు కూడా మంచిగా ఉంది’’ మెచ్చుకుంటున్నాడు రఘుపతి వాళ్ల మేనమామ పరంధాములు.
‘‘అంత మీ ఆశీర్వాదం మామ’’ అన్నాడు రఘుపతి.
‘‘దాందేముందిరా?.. మీరు ముగ్గురు అన్న దమ్ములు ప్రయోజకులైనారు. మీ అమ్మ కష్టం గట్టెక్కింది’’ అన్నారు ఆయన
‘‘రాజయ్య.. ప్రియ పరీక్ష మంచిగా రాసిందా?’’ అడిగారు భారతమ్మ చిన్న కొడుకు రాజారామ్‌ను.
‘‘చాలా బాగా రాశాను నానమ్మ’’ అంటూ ప్రియ జవాబు చెప్పుతూ వచ్చి, నానమ్మ పక్కన కూర్చొని ఆమె ఒడిలో చేయి పెట్టింది.
‘‘అమ్మ పొద్దుగాల ఇంటికి పోదాం రెడీగా ఉండవే’’ రాఘవ వాళ్ల అమ్మతో అన్నాడు.
‘‘మా ఇంటికి ఎప్పుడు వస్తావ్ నానమ్మ’’ అడిగింది ప్రియా.
‘‘మూడు నెలలు అయినంక’’ చెప్పింది ఆవిడ.
* * *
కరీంనగర్ దగ్గర సిరిసిల్లలో చేనేత కార్మికుడు రాజలింగం. భార్య భారతి. ముగ్గురు కొడుకులు ఒక కూతురు.
వడతీరం నూలు మగ్గం మీద వడికి, వడికి మణికట్టు అరిగిపోయింది. చేనేత బట్టకట్టి బతకలేక మరుగున పడిపోతుంటే.. తమ బతుకు ఎట్ల ఈడ్వాలో తెలువక మనాది పడిపోయిండు రాజలింగం. భార్య బలవంతం మీద హైదరా బాదుకు మకాం మార్చారు. అక్కడ దొరికిన పని చేస్తూ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించడం మొదలుపెట్టింది భారతి. భారతి భారతమ్మ అయ్యింది రోజు సాయంత్రం జొన్న రొట్టెలు, మక్క రొట్టెలు చేసేది. పొద్దున్న ఒక ఇడ్లీ బండి దగ్గర పని చేసేది.
పట్టు బట్టలు నేసిన చేతులు, మసి బట్టలు ముట్టలేకపోయిండు రాజలింగం. దిగులు పడి మంచం పట్టి ఒక సంవత్సరం లోపల కాలం చేశాడు.
నలుగురు పిల్లలు, గుండె ధైర్యం చేసుకుంది భారతమ్మ. కొన్నాళ్లు తన తల్లిని తీసుకొచ్చుకుని తోడుగా పెట్టుకుంది. తమ్ముడు పరంధాములు ఆత్మ స్థైర్యాన్ని ఇచ్చాడు. రాత్రనకా పగలనకా కష్టపడింది. తానే సొంతంగా ఇడ్లీ బండి పెట్టింది. నలుగురు పిల్లల్ని ఒకదారికి తెచ్చింది.
రాజలింగానికి గాంధీ గారు అంటే చాలా భక్తి. చేనేత వడికిన దేవుడు అంటాడు ఆయనను. గాంధీగారిమీద భక్తితో ముగ్గురు కొడుకులకు రఘుపతి, రాఘవ,రాజారాం అని, కూతురికి స్వరాజ్యం అని పేర్లు పెట్టాడు.
స్వరాజ్యం పదవ తరగతి అయిపోగానే తమ్ముడు కొడుకు రమేష్‌కి ఇచ్చి పెళ్లి చేసింది భారతమ్మ. రమేష్ కరీంనగర్‌లో గవర్నమెంట్ టీచర్.
పెద్ద కొడుకు రఘుపతి ఐటిఐ పూర్తి చేసి ఒక కంపెనీలో ఫిట్టర్‌గా పని చేస్తూ ఉన్నాడు. అతని భార్య వసుంధర. వీళ్లకి ఇద్దరు పిల్లలు. రెండవ కొడుకు రాఘవ తల్లి మార్గంలో నడిచి, ఆమె పేరునే ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాడు. ‘‘భారతమ్మ టిఫిన్ సెంటర్’’ అంటే ఆ ప్రాంతంలో చాలా మంచి పేరు ఉంది. అమ్మ వంటకాల పద్దతిని అనుస రించాడు. రాఘవ భార్య గీత, ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తూ ఉంది. వీళ్లకి కూడా ఒక కొడుకు కూతురు ఉన్నారు
మూడవ కొడుకు రాజారామ్. బీటెక్ దాకా చదివి, డెలాయిట్‌లో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. నవ్య అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వీళ్ల కూతురు ప్రియ.
భారతమ్మకు ఇప్పుడు 72 సంవత్సరాలు. కాయకష్టం చేసిన శరీరం ఆరోగ్యంగానే ఉంది. ముగ్గురు కొడుకులు తమ ఉద్యోగాల దృష్ట్యా వేరువేరు చోట కాపురాలు పెట్టారు. అన్నదమ్ములందరూ మంచివాళ్లే. కలిసిమెలిసే ఉంటారు. భారతమ్మను తలా నాలుగు నెలలు పోషిస్తూ ఉన్నారు.
‘‘అత్తమ్మ మీ బట్టలన్నీ జాగ్రత్తగా పెడుతున్న మీ సూటికేసుల, ఉడ్ వర్క్ చేయిస్తున్నాము. రేపు మరిది రాఘవ ఇంటికి పోతున్నారు కదా!’’ అన్నది పెద్ద కోడలు వసుంధర.
‘‘ఆ అట్టనే తీ’’ అన్నారావిడ కుర్చీ మీద నుండి కదలకుండా.
* * *
‘‘పూరీ మాస్టర్ రాలేదా.. బాగా ఎక్కువైంది పైసలు ఉట్టిగొస్తయా టైంకు రానే రారు చెప్పిన మాట వినరు’’ అరుస్తున్నాడు రాఘవ.
‘‘ఏమైందిరా’’ అడిగారు భారతమ్మ కౌంటర్ మీద కూర్చొని ఉన్నారు ఆవిడ.
‘‘టైంకు నాగా పెడతారు. పూరీలు చేసే భానుగాడు రానేలేదు, మినిమం 300 పూరీలు కావాలి మనకు’’ తలబాదుకుంటున్నాడు రాఘవ.
‘‘కౌంటర్ మీద నుంచి దిగి కిందికి వచ్చింది భారతమ్మ.
‘‘ఒరేయ్ రాఘవ ఒక పని పెట్టుకున్నమంటే పనోల్ల మీదనే ఆధార పడొద్దు, ఆ పని మనకు గుడ్క అచ్చి ఉండా’’ అనుకుంటూ చీర దోపి కిచెన్ లోకి వెళ్లింది.
‘‘ఏ గీ వయసుల నువ్వేం జేత్తవ్ తియ్, నేను జేసుకుంట అన్నాడు రాఘవ.
‘‘ఏంరో నూలు వడికిన శేతులు ఇవి నడువ్ నడువ్’’ అన్నదావిడ.
భారతమ్మ, రాఘవ కలిసి 300 పూరీలు చేసేసారు.
ప్రతి ఆదివారం రాఘవ కొడుకు, ఆదిత్య కూడా హోటల్‌కి వస్తాడు.
నాన్నమ్మ అలా గబగబా పూరీలు చేస్తూ ఉండడం వాడు శ్రద్ధగా గమనించాడు.
ఆరోజు రాత్రి నానమ్మ పక్కన పడుకొని అడిగాడు ఆదిత్య.
‘‘నాన్నమ్మ ఎంత బాగా చేశావు పూరీలు. అమ్మ అయితే చేతులు నొప్పి అంటుంది. నీకు ఇంత బలం ఎలా వచ్చింది’?’ అడిగాడు.
‘‘చిన్నప్పటినుంచి మీ తాత నేను బట్టలు నేసినం రా. మగ్గం మీద బట్టలు నేసేడు చానా కష్టం పని. కానీ చాలా బాగుంటది కొడుకా. తాతగూడ అదే చేసేటోడు. అందుకే బలమొచ్చింది.’’ నవ్వుతూ చెప్పింది ఆవిడ.
‘‘నానమ్మ ప్రతి శనివారం స్కూల్లో ప్రాజెక్టు వర్క్ ఉంటుంది. ఈ వారం నేను ‘‘మా నాన్నమ్మ తాతయ్యల బట్టలు నేయడం’’ అని ప్రాజెక్ట్ చేస్తాను నాకు చెప్తావా అడిగాడు ఆదిత్య.
‘‘నానమ్మ నోట్ చేసుకుంటాను ప్రాసెస్ చెప్పు’’
ఆదిత్య గబగబా వెళ్లి నోటుబుక్కు, పెన్ను తెచ్చుకొని నానమ్మ ముందు కూర్చున్నాడు.
‘‘చేనేత బట్ట ఎలా మీరు చేసేవారు నాన్నమ్మ? మిషన్స్ మీదనా?’’ అడిగాడు వాడు
‘‘లేదు బిడ్యా. అట్ల మిషన్లు అచ్చినంకనే ఆగం అయిపోయినం.మగ్గం మీద చేతితోనే నెయ్యాలే
‘‘రాత్రి 9:00 అవుతుంది వాడి శ్రద్దని చూస్తే ఆవిడకి ముచ్చటేసింది.
రాఘవ చదువుకోలేదు కానీ వాడి కొడుకు ఆదిత్య చాలా బుద్ధిమంతుడు.
తరగతిలో ఎప్పుడు ఫస్ట్ వస్తాడు.
‘‘ముందుగాల నూలు తయారు వెట్టుకోవాలి, నూలును వడపోస్తము. ముందు, నూలు మంచిగుందో లేదో చూస్కోవాలి, అదే క్వాలిటీ అంటరు
‘‘రాసుకుంటా… మొత్తం చెప్పు నాన్నమ్మ’’ అడిగాడు ఆదిత్య.
ఒక రెండు క్షణాలు కళ్లు మూసుకుంది భారతమ్మ. ఒక ట్రాన్స్‌లోకి వెళ్లినట్టుగా కళ్లు మూసుకొని చెప్పడం ప్రారంభించింది.
‘‘చేనేత కళాకారులంతా మార్కండేయుని బిడ్డలు. ఆ స్వామి భక్తులు ఇంటిల్లి పాది కలిసి చేతితో నేసేయి చేనేత వస్త్రాలు.
ముందుగాల నూలు తెచ్చి, దాని మైల తీస్తరు. మొగ్గంలోని బాగాలు సట్టర్ నాడిలో కండెను బిగించి వస్త్రం నేస్తడు చేనేత కళాకారుడు. అదొక పెద్ద పూజ లెక్క బిడ్యా… తపస్సు జేసినట్టు.
ఈ కండెల నిలువుంగ ఉండే దారాన్ని పడువు అంటరు.అడ్డం దారాన్ని పేక దారం అంటరు.
కుటుంబం మొత్తం కష్టం, ఒక అందమైన వస్త్రం తయ్యారవ్వుడంటే!
ముందుగాల నూలును పడువుగా తయారు జేసి మైల తీస్తరు, సరిచేసి దానికి గంజి పెట్టి ఎంటు లాగా మారుస్తరు.
వాటిని అచ్చుకు అతుకుతరు. దానిని కొలుకులు అంటరు. కొలుకులు అన్నింటిని అతికి, అచ్చును బేరింపు తీసి మొగ్గం పైకి ఎక్కిస్తరు. ఇట్ల నిలువు దారం తయారైతది. నెయ్యడానికి పేక దారం తయారుజెయ్యాలి. గీడనే డిజైన్స్ అన్నీ గ్రాఫ్ మీద ఏస్కోని ఒక ఆసు యంత్రంపైన, ఉన్న కొయ్యల మీద ఎన్ని కొలుకులు కావాలనో అన్నీ పోసి ఆటికి రంగులు అద్ది రాట్నం పైన కండె నేసి ఆడోల్లు,మొగోళ్లకు ఇస్తరు. భార్య పని ఆసు పోసుడు, డిజైన్ వేసుడు, దానికి రంగు అద్ది చిటికినీ నాడాలో పెట్టి, ఒక్కొక్కదారాన్ని కలుపుతూ మొగ్గం పైన నేస్తడు మొగాయిన. చీర తయారయ్యాక దోనకు సుట్టుకుంటది. ఇట్ల అయిదున్నర గజాల చీరను ఎప్పటికప్పుడు అచ్చేసి, మడతపెడతడు, దానిని గడపట్టడం అంటరు.
ఇట్ల గడపట్టిందాన్ని మంచిగ ఫోల్డ్ చేసి అమ్మేటోళ్లకు ఇస్తరు. మనింట్ల మొగోళ్లు చేసే పని గడ చేసే నేనే చేత్తుంటి, మీ పెద్దనాయిన, అత్త చిన్నపిల్లలు అయినా ఆళ్లు గుడ ఆసరయిదురు. మీ నాయిన, రాజు కాక పూర్తిగ పసోళ్లు. తాతకు మణికట్టు ఖరాబ్ అయిపోయిండే, పూర్తిగా పానమే మంచిగ లేకపోయిండే, దేవునసొంటి మనిషి ‘‘… చాలా ఆర్ద్రతతో ముగించారు భారతమ్మ గారు.
రెండు నిమిషాల్లో తేరుకుని ‘‘రాసుకున్నావురా ఆదిత్య అని అడిగింది’’ గాంభీర్యం ఆమె నిజమైన ఆభరణం.
అదే ఆమెను, ఆమె పిల్లల్ని కాపాడుతూ వస్తుంది.
ఆదిత్య నోట్ బుక్‌లోంచి తలపైకెత్తి…
నాన్నమ్మ దగ్గరికి వచ్చి మెడ చుట్టూ చేతులు వేసే బుగ్గ మీద ముద్దు పెట్టుకుని అన్నాడు. ‘‘నాన్నమ్మ నేను తప్పకుండా మగ్గం నేస్తాను, నీకు ఒక మంచి చీర నేసిస్తాను నాన్నమ్మా’’ మార్కండేయల మీద ప్రామిస్ అన్నాడు.
అంత గంభీరమైనమనిషి భారతమ్మ కళ్ల నుంచి నీళ్లు కారాయి.
‘‘సల్లగ బతుకు కొడుకా..!’’ అని దీవించింది.
* * *
‘‘అత్తమ్మ నవ్యకు, వీకెండ్స్ హాలిడేస్ కదా. రాజారామ్ బిజీగా ఉన్నారంట, శనివారం పొద్దున కార్ తీసుకొని వస్తా అన్నది, వాళ్ల ఇంటికి మిమ్మల్ని తీసుకువెళ్లడానికి’’ చెప్పింది గీత, భారతమ్మకు చాయ్ అందిస్తూ.
‘‘అట్లనే’’ అంది ఆవిడ
‘‘త్వరగా వచ్చెయ్ నాన్నమ్మ’’ అన్నాడు ఆదిత్య.
‘‘ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు…’’
అరుస్తుంది ఆదిత్య చెల్లెలు ఆరుషి.
* * *
‘‘అత్తయ్య మీ వస్తువులు అన్ని ప్రియా గదిలో పెట్టుకోండి’’ చెప్పింది నవ్య.
‘‘వాడు అచ్చినంక సాయంత్రం పెడ్తడు తీయమ్మ’’ అంది ఆవిడ అక్కడే సోఫాలో కూర్చొని.
‘‘మీకు కాఫీ కావాలా అత్తయ్య’’ అడిగింది నవ్య
‘‘జరంత అల్లం యేసి చాయి ఇయ్యు’’ అన్నారు ఆవిడ.
‘‘ఓకే అండి అంటూ ఆవిడ ఫోన్ అందుకుంది ‘జెప్టో ‘లో టీ పౌడర్ ఆర్డర్ పెట్టడానికి.
రాత్రి రాజారాం వచ్చాక అంది ఆవిడ.
‘‘ఒరేయ్ రాజు అన్నలు ఇద్దరినీ రేపు ఆదివారం ఈడికి రమ్మను. నేను మాట్లాడాలి’’ అన్నారు
‘‘అదేంది అమ్మ, ఈరోజే వచ్చావు కదా? చిన్నన్న ఇంటి నుంచి, మళ్లీ అంత అర్జెంట్ ఏముంది అన్నాడు రాజారామ్.
‘‘చెబ్తా’’ అంది ఆవిడ.
‘‘ఇగో అక్కను బావను కూడా రమ్మను’’ ఇంకా ఇలా అన్నారావిడ.
* * *
ఆ ఆదివారం అన్నదమ్ములు ముగ్గురు, వాళ్ల అక్క స్వరాజ్యం, బావ రమేష్ అందరూ రాజారామ్ ఇంట్లో కలిశారు.
ఆడవాళ్లందరూ వంటల హడావిడిలో పడ్డారు. పిల్లలందరూ ఆడుకుంటున్నారు.
తల్లి-ముగ్గురు కొడుకులు టిఫిన్లు ముగించి ముచ్చట్లు పెడుతున్నారు. ఇంటి అల్లుడు రమేష్ కూడా ఉన్నాడు.
‘‘అమ్మ ఏంటి అందరినీ రమ్మన్నావు?’’ అడిగాడు పెద్దకొడుకు రఘుపతి తల్లిని.
‘‘అవున్రా మీతోని చానా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనుకుంటున్న. చాలా రోజుల నుంచి నాకు కష్టం అయితాంది. ఎందుకో మనసుకు నచ్చుత లేదు. మూడు నెలలుగాంగనే ఇల్లిల్లు తిరుగుడు. నా మనసుకు నాకు బిచ్చపామె లెక్క గొడ్తుంది….’’
మధ్యలోనే అందుకున్నాడు రాఘవ ‘‘ఏం మాటలే అవి బిచ్చపామె అంటున్నవ్ నువ్వు మా దేవతవు’’ అన్నాడు.
‘‘ఒరేయ్ రగ్గా…నువ్వు లొల్లి జేయకు నన్ను మొత్తం మాట్లాడనీ..’’ అన్నదావిడ.
‘‘అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు’’ అన్నాడు రాజారామ్.
‘‘ఇగో ఇనుండి…! నా బతుకంతా రెక్కలు ముక్కలు జేసుకొని, ఓ దారిల పడేసిన మిమ్మల్ని. గిప్పుడుగీ వయసుల ఇల్లిల్లు తిరుగుడు నా తోని గాదు,’’ అంది.
‘‘అమ్మ..! మేము ఏమన్నా గొడవ పడి విడిపోయినమా.. ఇది లోకంలో ఉన్నదే కదా! ఎందుకంత పరేషాన్ అయితవ్’’ అన్నాడు పెద్ద కొడుకు.
‘‘లోకం ఎట్లున్న నాకు ఫర్క్ పడదురా. అయ్యాలట్నుంచి గూడ నేను ఎవల్ల మీద ఆధారపడలేదు. మీ నాయిన మంచోడే కానీ మీ నాయినను గూడ నేనే ఆసరైన. ఇప్పుడు గీ వయసుల గిట్ల తిరుగలేను, ఏడున్నా.. నా ఇల్లు అనిపిస్తలేదు, మీ ఇండ్లళ్లకు మీ అత్తమ్మలు మామలు వస్తరు, మీ బామ్మర్దులు సుత వస్తపోతుంటరు , మీ ఇండ్లపొంటి, ఒక సుట్టం లెక్క బస్త పట్టుకొని తిరుగలేను. ఇంటి అల్లుడు అని నీకు కూడా చెప్తున్నా రమేషు…!’’ అంది ఆవిడ.
‘‘ఏం చేద్దాం అంటావు అత్తమ్మ మా ఇంటికి వస్తావా మరి’’. అడిగిండు రమేష్.
‘‘మీ ఇంటికి నేను సుట్టం లెక్క రావాలి బిడ్డె! ఇంట్ల అచ్చి ఉండగూడదు. నేను ఒకటి ఆలో చించుకున్న’’ చెప్పిందావిడ.
‘‘ఏమి ఆలోచించినవే’’ ఆసక్తిగా అడిగారు అందరూ.
‘‘కళావతి అత్తమ్మ యాదికుందా..’’ అడిగిందావిడ కొడుకుల్ని.
‘‘అవ్ కళావతి అత్తమ్మ.. ఏం చేత్తాంది’’ అనుకుంటూ వచ్చింది అక్కడికి కూతురు స్వరాజ్యం అప్పుడే..!!
‘‘కళావతి అత్తమ్మ, కొడుకు కోడలు అమెరికాల ఉన్నరంట. ఆమె ఒక్కతే ఈడ నారాయణగూడ దగ్గర మొగుడు కట్టించిన సొంతం ఇండ్ల ఉన్నది. ఇంటి ముందర బండి వెట్టుకొని జొన్న రొట్టెలు ఇడ్లీలు అమ్ముకుంటున్నది. మొన్న నాకు అనుకోకుండా గీతతోని నల్లకుంట శంకర మఠంకు పోయినప్పుడు కనవడ్డది’’ చెప్పారు ఆవిడ.
‘‘అయితే… ఏంటిప్పుడు..??’’ అన్నారు
‘‘ఏం లేదు… మీరందరూ కలిసి నాకు ఒక సొంత ఇల్లు కట్టిచ్చియ్యండి, నేను బతికినన్నినాళ్లు నా ఇంట్ల నేను ఉంట. మీరే అచ్చి సూసి పోతా ఉండండి. నాకు నెలకి పైసలు పంపాలె. ఇల్లు కట్టే దాకా నేను కళావతక్క దగ్గర ఉంట. ఆమెకి పనిల ఆసరైత.’’ చెప్పింది ఆవిడ తన నిర్ణయం.
‘‘ఇప్పుడు కొత్త ఇల్లు కట్టిస్తే, నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావమ్మా? నీకు కష్టమవుతుంది.’’ రాజారామ్ అన్నాడు
నవ్వుతూ అంది తల్లి ‘‘ఒంటరిగా ఉండుడు నాకు అలవాటే అయినా. మీరంతా, నాలుగు నెలల వంతు వెట్టుకుని నా దెగ్గరికి రండ్రి ఈడికెల్లి’’ ఇది విన్న అందరూ స్థాణువులయిపోయారు.
ఆ సాయంత్రం ఎందరు వద్దని బతిమాలిన వినకుండా భారతమ్మ తన మనవళ్లు, మనవరాళ్లు అందరినీ ముద్దాడి, వాళ్ల చేతుల్లో తలా ఒక వంద రూపాయలు పెట్టి కళావతి ఇంటికి వెళ్ళిపోయింది.
* * *
ముగ్గురిళ్లలో రామాయణ- మహాభారత యుద్ధాలు, ప్రపంచ యుద్ధాలు, మౌన పోరాటాలు – రకరకాల విషయ విశ్లేషణలు చాలా జరిగాయి…
శివరాకరున… కొడుకులంతా కలిసి తీర్మానించు కున్నారు.
‘‘హృదయం ఉన్న కొడుకు ఎప్పుడు కూడా తల్లి కష్టంను అర్థం చేసుకుంటాడు అంటారు అది నిజమే’’
* * *
ఆరునెలల వ్యవధిలో… నారాయణగూడ, కేశవ మెమోరియల్ స్కూల్ వెనుక భాగంలో ఒక సందులో ఒక పాత ఇల్లు అమ్మకానికి ఉందని తెలిసి అది తల్లి కోసం ముగ్గురు కొడుకులు కలిసి కొనేశారు. కళావతి ఇంటికి దగ్గరగా ఉండడం కూడా పరిగణలో పెట్టుకున్నారు.
ఆరోజు భారతమ్మ ఇంటి గృహప్రవేశం. కొంతమంది దగ్గర బంధువులతో జరుగుతుంది. తమ్ముడు పరంధాములు కూడా కుటుంబంతో కలిసి వచ్చాడు. ‘‘అక్క..! నిజంగా నువ్వు మొండిదానివి, గొప్ప దానివి’’ కాళ్ల మీద పడ్డాడు. ఇంటి ముందు అందంగా ఇంటి పేరు రాయించారు ‘‘మగ్గం’’ అని. అది చూసి ఎందుకో పరంధాములుకు కన్నీళ్లు ఆగ లేదు.
వచ్చేవారం కథ..
జయహో
– బీవీ శివ ప్రసాద్