ప్రభుత్వాలకు విజయవాడ హైందవ శంఖారావం డిమాండ్… జాతీయ, ధార్మిక పోరుకు వీహెచ్‌పీ పిలుపు
హిందూ దేవాలయం అంటే భగవంతుడి నివాసం. హిందూధర్మానికి ఆధారం, ఆలంబన ఆలయమే. కాబట్టి హిందూ దేవాలయాలను ప్రభుత్వ అజమాయిషీ నుంచి తప్పించి, వాటి నిర్వహణ బాధ్యత హిందువులకు అప్పగించాలంటూ ప్రతిజ్ఞ చేసింది విజయవాడ హైందవ శంఖారావం. మన దీక్ష-ఆలయాల రక్ష నినాదంతో జరిగిన సమ్మేళనం చరిత్రాత్మకమే. ఆ మూడు హిందూ దేవాలయాలను అప్పగించమంటున్నాం, అప్పగించకుంటే మా ముప్పయ్‌వేల ఆలయాలను మేం స్వాధీనం చేసుకుంటాం అని మూడున్నర దశాబ్దాల క్రితమే విశ్వహిందూ పరిషత్ చేసిన ప్రతిజ్ఞ ఈ మహా సమ్మేళనంలో ప్రతిధ్వనించింది. దాదాపు 150 మంది సాధుసంత్‌లు, పీఠాధిపతులు, ఆధ్యాత్మిక మేరువులు; మూడు లక్షల మంది హిందూ బంధువులు ఈ ప్రాంగణంలో అక్షరాల గుడుల స్వేచ్ఛ కోసం సమర శంఖం పూరించారు. ఆ భీషణ, భీష్మ ప్రతిజ్ఞకు జైశ్రీరామ్ అంటూ ముక్తకంఠంతో ఆమోదం ప్రకటించారు. ఈ మేరకు చట్ట సవరణలు జరగాలని సమ్మేళనం ప్రభుత్వాలన కోరింది. గుడులన్నీ మన పూర్వికులు నిర్మించినవి. వాటిని నిర్వహించే హక్కు, అర్హత మనవేనని పీఠాధిపతులు అక్షరాలా గర్జించారు. అన్యాక్రాంతమైన దైవమాన్యాలను సుప్రీంకోర్టు తీర్పు మేరకు తిరిగి అప్పగించాలని ఈ మహా సమ్మేళనం కోరింది. చట్టాలూ నిబంధనలు అంటూ అర్చకులను అధికారులు అవమానిస్తే, ఆచారాలను శాసిస్తే సహించేది లేదని హెచ్చరించింది. ధర్మకర్తల మండళ్లలో, ఆలయ పాలనా వ్యవస్థలలో అన్యమతస్థులను, నాస్తికులను, ఎడారి మతాల, హిందూ వ్యతిరేకులను జొప్పించి, హిందూధర్మాన్నీ, సంప్రదాయాన్నీ భంగపరిచే ప్రయత్నాలు ఇక సాగబోవని ప్రకటించింది. ఇప్పటికే తిష్ట వేసి ఉన్నవారిని తొలగించాలని ప్రభుత్వాలను కోరామని తెలియచేసింది. దసరా, వినాయక చవితి వంటి పండుగలపై ఆంక్షలు, శోభాయాత్ర కదలికల మీద నియంత్రణ సహించేది లేదని కూడా ప్రకటించింది. అన్నింటికి మించి, హిందూ ఆలయాల ఆదాయాలను ధర్మ పరిరక్షణకే వినియోగించాలని సమ్మేళనం నినదించింది. మన దేవాలయాల మీద బానిస సుల్తాన్ల ఉన్మాదాన్ని నిరోధించాం, మొగల్ పాదుషాల విధ్వంసం నుంచి కాపాడుకున్నాం.భారతీయ ధార్మిక కేంద్రాలను రక్షించుకున్నాం! కానీ, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు గడిచిపోతున్నా, హిందూ దేవాలయాలకు మాత్రం ఎందుకు స్వేచ్ఛ ఇవ్వడం లేదని ప్రతి సాధువు, ప్రతి పీఠాధిపతి, ప్రతి ఆధ్యాత్మికవేత్త ప్రభుత్వాలను నిలదీసిన ప్రతిసారి లక్షలాది హిందూ బంధువులు జైశ్రీరాం అని నినదిస్తూ వారికి సంఘీభావం ప్రకటించారు. సర్వేజనాః సుఖినోభవంతు అని దీవించే హిందూ దేవాలయాలకు ఎందుకీ బందిఖానా? అని సాధు సమాజం ప్రశ్నించింది. విజయవాడ హైందవ శంఖారావం వేదిక నుంచి వెలువడిన తొమ్మిది సూత్రాల ప్రకటన ముమ్మాటికీ ధర్మరక్షణ పోరాటానికి మోగిన యుద్ధభేరి.
జనవరి 5, 2025, ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్విరామంగా సాగింది శంఖారావం కార్యక్రమం. సాంస్కృతిక కార్యక్రమాల తరువాత మధ్యాహ్నం 12.30లకు వేద పఠనంతో శంఖారావం ఆరంభమైంది. జ్యోతి ప్రజ్వలనం, శంఖారావాలతో పాటు పూర్తి సంప్ర దాయ పంథాలో మూడుసార్లు ఓంకారం జపించారు. తరువాత యంవైదికా మంత్ర దృశః పురాణ అన్న శ్లోకం పఠించారు. ఆపై అయోధ్య రాములవారిని స్మరించుకుంటూ 13 పర్యాయాలు శ్రీరామ జయరామ జయజయ రామ అన్న మంత్రాన్ని అంతా కలసి ఉచ్చరించారు.
విజయవాడకు సమీపంగా, గన్నవరం విమానాశ్రయానికి చేరువలో ఉన్న కేసరపల్లి ఈ చారిత్రక ఘట్టానికి వేదికైంది. గంటగంటకు హిందూ బంధువుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. అందరి లోనూ సారూప్యంగా ధర్మరక్షణ దీక్షకు సంసిద్ధత స్ఫుటంగా కనిపించింది. వృద్ధులు పెద్ద సంఖ్యలో సమ్మేళనానికి ఓపికగా వచ్చారు. ఉదయం చలి, మధ్యాహ్నం ఎండ. అయినా సమ్మేళనం అదే ఉత్సా హంతో దిగ్విజయంగా సాగింది. ఉర్రూతలూగించే సాధువుల, పీఠాధిపతుల, ఆధ్యాత్మికవేత్తల ఉపన్యా సాలు, వాటికి ఉప్పొంగిన జనసందోహం జైశ్రీరామ్ అంటూ స్పందించిన తీరు అపూర్వం. ధర్మానికి జరుగుతున్న అపచారాల గురించి స్వాములు ఏకరువు పెడుతుంటే ఆవేశంతో భారత్ మాతాకీ జై వినిపించిన ఘోష అనిర్వచనీయం. హిందువులలో ఐక్యమత్యానికి మించి ఏర్పడుతున్న ఏకత్వానికి ఈ ముక్తకంఠంతో వెలువడిన నినాదాలు సాక్ష్యం పలికాయి. కాషాయ వస్త్రధారులు కొందరైతే, కాషాయ పతాకధారులు కొందరు. కాషాయ తలపాగా లతో మరికొందరు. అన్ని లక్షల మంది హాజరైనా గందరగోళం లేదు. నిర్వాహకులు ముందే విన్నవించి నందుకు కాబోలు, ఎక్కడా అపరిశుభ్ర వాతా వరణమూ కనిపించలేదు. ఇంతమందికి నిరంతరం మంచినీళ్లు అందించడం మరొక విశేషం. ఇవికాక మజ్జిగ, చిరుతిళ్లు కూడా నిర్వాహకులే స్వచ్ఛంద సేవకుల ద్వారా అందించి ప్రశంసలు మూటగట్టు కున్నారు. అక్షయపాత్ర వారి భోజన వసతి గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. అటు శాస్త్రీయ మూలాలు ఉన్న కళారూపాలు, జానపద ప్రదర్శనలు, గిరిజన నృత్యాలు, విచిత్రవేషాలు, డప్పుల వాద్యాలు కార్యక్రమాన్ని మరింత శోభాయమానం చేశాయి. మట్టివాసనతో ప్రాంగణం గుబాళించేటట్టు చేశాయి. ప్రాంగణమంతా ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ తెరలతో ప్రతివారు సంతృప్తి చెందారని అనిపిస్తుంది. స్వచ్ఛంద సేవకులే స్వయంగా వచ్చి, అందరి నొసట గంగ సిందూరం అలంకరించారు.
ముందురాత్రి నుంచి ప్రాంగణానికి హిందూ బంధువులు చేరుకోవడం కనిపించింది. ఆంధప్రదేశ్ అన్ని జిల్లాల నుండి దాదాపు మూడు లక్షల మందికి పైగా హిందువులు పాల్గొన్నారని అంచనా. కొందరు ఆరులక్షలని అంచనా వేశారు. అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి శ్రీ గోవిందదేవ్ గిరి మహరాజ్ ముఖ్య అతిథిగా వేంచేశారు. విశ్వహిందూ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు గోకరాజు గంగరాజు సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ముఖ్యవక్తగా శ్రీ శ్రీమన్నారాయణ త్రిదండి చిన్నజీయర్ స్వామి పాల్గొన్నారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి, శ్రీ కమలానందభారతి సహా 150కి పైగా సాధుసంతులు వేదికను అలంకరించారు. అందుకే ఉప్పొంగిన కాషాయ అలలా ఉన్న ఆ వేదికకు ఎందరో దూరం నుంచే ప్రణామాలు చేయడమూ కనిపించింది. విశ్వహిందూ పరిషత్ అఖిల భారత అధ్యక్షులు శ్రీ అలోక్ కుమార్, అఖిల భారత సంస్థాగత కార్యదర్శి శ్రీ మిలింద్ పరాండే, అఖిల భారతీయ సంయుక్త కార్యదర్శి శ్రీ కోటేశ్వరశర్మ, పాల్గొ న్నారు. వీహెచ్‌పీ కేంద్రీయ కార్యకారిణి సదస్యులు వై.రాఘవులు, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సినీ గేయరచయిత అనంత్ శ్రీరామ్, కొండవీటి జ్యోతిర్మయి, వీ హెచ్‌పీ ఆంధప్రదేశ్ నాయకులు తనికెళ్ల సత్యరవికుమార్ సాధుసంతులకు, శంఖారావానికి విచ్చేసిన అశేష హిందూ బంధువులకు ఘనస్వాగతం పలికి, సభను నిర్వహించారు.
మధ్యాహ్నం 12.30కు ప్రారంభమై సాయంత్రం ఐదుగంటల వరకు స్వామీజీలు సందేశాలు వినిపించారు. తరువాత హైందవ శంఖారావం డిక్లరేషన్‌ను వేదిక నుంచి వినిపించారు. దీనికి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వినిపించాయి. తరువాత భరతమాతకు హారతి ఇచ్చి, సభను ముగించారు.
శంఖారావం డిక్లరేషన్ హిందూ సమాజ ఆత్మ గౌరవానికి సంబంధించిందని వేరే చెప్పనక్కరలేదు. చరిత్ర సాక్షిగా శతాబ్దాలుగా హిందూ దేవాలయాల మీద, ధర్మం మీద, హిందువుల మీద సాగుతున్న దాడులు, వివక్ష, జరుగుతున్న అన్యాయాలు ఇకపై సాగవని డిక్లరేషన్ సెక్యులర్ ప్రభుత్వాలను హెచ్చ రించింది. అందుకే ఇది చరిత్రాత్మకం. అయోధ్య ఆలయం కోసం పోరాడాం. న్యాయపోరాటంలో గెలిచి భవ్యమందిరం కట్టుకున్నాం. ఇప్పుడు అద్భుతంగా నిర్వహించుకుంటున్నాం. కాబట్టి మిగిలిన ఆలయాలను కూడా మనమే నిర్వహించుకోవాలి. మనం కట్టుకున్నాం వాటిని, మనమే నిర్వహించు కుందాం అని ప్రకటించింది డిక్లరేషన్. ఇది హిందువులను మరొక ఆత్మ గౌరవ పోరాటం దిశగా వేగంగా అడుగులు వేయించగలిగిన స్ఫూర్తిని అందించేదే.
తొమ్మిది అంశాలు ఇవి
1.హిందూ దేవాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలి.
2. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చే విధంగా చట్ట సవరణ చేసే లోగా, దేవాలయా లలో పూజ, ప్రసాద, కైంకర్య సేవలను అత్యంత భక్తిశ్రద్ధలతో నాణ్యతతో నిర్వహించేలా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి.
3. హిందూ దేవాలయాలలో, ఆ ఆలయాలు నిర్వహిస్తున్న సేవా సంస్థలలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను తక్షణం తొలగించాలి.
4.హిందూ దేవాలయ ట్రస్టు బోర్డులలో, హిందూ ధర్మంపై శ్రద్ధా భక్తులతో ధర్మాచరణ చేసే రాజకీయేతర ధార్మిక వ్యక్తులను మాత్రమే నియమించాలి.
5.హిందూ దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడడం, ఇప్పటికే అన్యాక్రాంతమైన ఆస్తులను స్వాధీనం చేసుకుని, ఆలయాలకు అప్పగించే బాధ్యత ప్రభుత్వం తీసుకుని, వెంటనే చర్యలు చేపట్టాలి.
6.హిందూ దేవాలయాల ఆదాయాన్ని హిందూ ధార్మిక ప్రచారానికి, హిందూ సమాజ సేవలకు, ధార్మిక సేవలకు మాత్రమే ఉపయోగించాలి. ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించరాదు.
7.హిందూ సమాజంపై, దేవాలయాలపై, ఆస్తు లపై, వ్యవస్థలపై వివిధ పద్ధతులలో అన్యాయంగా, చట్టవిరుద్ధంగా దాడులు చేస్తున్న వారికి ప్రభుత్వం ,ప్రజా ప్రతినిధులు, పోలీసులు రక్షణ కల్పించే ప్రయత్నాలు చేయకూడదు. దాడులు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకొని, శిక్ష పడేలా చూడాలి.
8.వినాయక చవితి, దసరా, హనుమజ్జయంతి వంటి ఉత్సవాలపై ప్రభుత్వం అక్రమ ఆంక్షలు, ఆర్థిక భారాన్ని విధించరాదు. ఈ ఉత్సవాలకు ముందుగా ప్రభుత్వం హిందూ సమాజ ప్రతినిధులైన హిందూ ధార్మిక పెద్దలతో, ధార్మిక సంస్థలతో కలిసి కూర్చుని మాట్లాడి ఉత్సవాల నిర్వహణపై నిర్ణయాలు చేయాలి.
9.హిందూ దేవీదేవతల ఊరేగింపులు, శోభా యాత్రల మార్గాలు, సమయాలు, తేదీలు, విధానాలపై ప్రభుత్వం అక్రమ ఆంక్షలు విధించరాదు.
బ్రిటిష్ ఇండియా కాలంలో మసీదుల ముందు బాజాలు మోగించరాదని, శుక్రవారాలలో మసీదుల ముందుగా హిందువులు ఊరేగింపులు జరపరాదని ముస్లింలు ఆంక్షలు విధిస్తే దానికి ప్రభుత్వ సమర్థన ఉండేది. స్వతంత్ర భారతదేశంలో అంతకు మించి హిందువులు మతం విషయంలో, హక్కుల విషయంలో వివక్షను ఎదుర్కొంటున్నారు. కోర్టులు కూడా కొన్ని వివాదాలలో హిందువులకు న్యాయం చేయలేదన్న అపవాదును నెత్తిన వేసుకున్నాయి. గర్భగుడిలో ఎలాంటి సేవలు జరగాలో చెప్పడానికి సెక్యులర్ ప్రభుత్వ ప్రతినిధి ఎవరు? ఎలాంటి ప్రసాదాలు నైవేద్యం పెట్టాలో వాళ్లెలా చెబుతారు? హిందూ దేవతలను నిరంతరం దూషిస్తూ, ప్రసాదాలు తాకడానికీ ఇష్టపడని ఎడారి మతాల వారికి హిందూ దేవాలయ పాలక వ్యవస్థలో, దుకాణాలలో ఎందుకు చోటిస్తున్నారు? ధర్మకర్తల మండళ్లను రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఎందుకు మార్చేశారు? ప్రతి హిందూ దేవాలయాన్ని వ్యాపార కేంద్రంగా ఎందుకు మలిచేశారు? పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు లతో పాటు దేశంలోని చాలాచోట్ల ప్రభుత్వాలు మైనారిటీలను సంతృప్తి పరచడం కోసం హిందువుల ధార్మిక జీవనం మీద ఆంక్షలు విధిస్తున్న మాట దాచేస్తే దాగని సత్యం. మత కల్లోలాలు జరిగితే హిందూ దేవస్థానాలకు ఎందుకు తాళాలు వేశారు? సంభాల్‌లో కదలిన డొంక చెబుతున్న వాస్తవాలు ఇవే కదా! పశ్చిమ బెంగాల్‌లో, కేరళలో కొన్నిచోట్ల భారత శిక్షాస్మృతిని సవాలు చేస్తూ షరియా అమలవుతున్న సంగతి ఎవరు దాచగలరు? పశ్చిమ బెంగాల్‌లో హిందువుల పండుగ, మైనారిటీల పండుగ వస్తే మైనారిటీలకు పెద్ద పీట, హిందువులకు ఆంక్షలు ఒక నిజం కాదా? రంజాన్‌లకు ప్రభుత్వాలు విందులు ఇస్తాయి. మక్కా యాత్రకు డబ్బులు పెడతాయి. కానీ ఆదాయానికి మూలం మాత్రం మెజారిటీలు. అంటే హిందువులు. ఈ దేశంలో అంతఃకరణ మేరకు మతాంతరీకరణలు జరగడం లేదన్నదీ నిజమే. విదేశాల మీద ప్రేమను పెంచు తున్నారు. భారతీయత మీద ద్వేషం పెంచుతున్నారు. దేశ విభజనకు వాతావరణం సృష్టిస్తున్నారు. ఆలయాల మీద దాడులు, హిందువుల మనోధైర్యాన్ని, నిబ్బరాన్ని పడగొడుతున్నారు. ఇది ఆగాలి. అది ఆలయాల రక్షణతో ఆరంభం కావాలి. ఆలయాలు మా పూర్వి కులు నిర్మించారు. ఇప్పుడు మేం నిర్వహించుకుంటాం అని చెబుతున్న హిందూ సమాజం. దీనికి ప్రభుత్వాలు అంగీకరించాలి. దశల వారీగా హిందూ సమాజం కోరికను తీర్చే ప్రయత్నం ఆరంభించాలి. అయోధ్యలో హిందువుల పోరాటం, విజయం కూడా చరిత్రాత్మ కమే. అలాంటి మరొక చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేయడానికి చరిత్ర పుటలు తొందరపడు తున్నాయి. విజయవాడ డిక్లరేషన్ ఇదే గుర్తు చేస్తున్నది. హిందూ బంధువులు ఈ డిక్లరేషన్‌ను నిత్యం స్మరించు కోవాలి. ఇందుకోసం జరుగుతున్న, జరగబోయే పోరాటాలలో భాగస్వాములు కావాలి.
– డా. గోపరాజు నారాయణరావు
డా. ఆరవల్లి జగన్నాథ స్వామి
గుడి హిందూ జీవనాడి
ముఖ్య అతిథి, అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి, గోవింద దేవగిరి మహరాజ్
నేను సభా ప్రాంగణంలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఛత్రపతి శివాజీ నాటకం ఒక వేదికపై ప్రదర్శిస్తున్నారు. ఈ దేశ సమస్యలను శివాజీ మనకు ఇచ్చిన స్ఫూర్తితో సాధించడం సులభమే. ఆయన రణ, పాలనా చాతుర్యాలు ఆయన కోసం కాదు. దేశ కల్యాణం కోసం. అంటూ ఉపన్యాసం ప్రారంభిం చారు, శంఖారావం ముఖ్య అతిథి, అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి శ్రీ గోవిందదేవ్ గిరి మహరాజ్. తేజస్సు తూర్పు నుంచి వస్తుంది. అదే భారతదేశం ప్రపంచానికి అందించిన జ్ఞానజ్యోతి. శాస్త్రాలు, సాధువులు, గోమాత, తీర్థయాత్రలు, దేవాలయాలు అనే ఐదు అంశాల ఆధారంగా ఏర్పడింది అని అన్నారు. దేవాలయం భగవంతుడి నివాసం. మన సంస్కృతికి మూలస్తంభం. జ్యోతి వెలుగులో అక్కడ భగవంతుడిని దర్శిస్తాం మనం. కాబట్టే అది కేవలం దేవాలయం కాదు. సాంస్కృతిక కేంద్రం. అందుకే మన దేవాలయాలను రక్షించి తీరాలని ప్రతిజ్ఞ చేయడం కోసం మనం ఇక్కడకు వచ్చాం అని చెప్పారు. దేవాదాయ శాఖను రద్దు చేయాలని స్వామి గోవింద్ దేవ్ గిరిజీ మహరాజ్ నిర్ద్వంద్వంగా ప్రకటించారు. భారత్ భద్రతను భౌగోళిక శ్రేయస్సుతో అనుసంధానం చేస్తున్న హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. వెలుగు తూర్పు దిక్కునే ప్రభవిస్తుంది. ఆ వెలుగే భారత్.. దానికి ఆధ్యాత్మికత జీవనాడి. అందుకు ఆధార భూతమైన, భగవంతుడి నివాసమైన ఆలయం మన సంస్కృతికి మూలాధారం. దేశంలోని ఆలయాలు దేదీప్యమానంగా వెలిగేందుకు వాటిపై ప్రభుత్వ పెత్తనం పోవాలి. ఒకనాడు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రాలుగా విలసిల్లిన ఆలయాలు, వాటి పాలక మండళ్లు రాజకీయ పునరావాస కేంద్రాలు కావడం శోచనీయం. ఆ విధానానికి స్వస్తి పలకాలి. వాటిపై ప్రభుత్వ అజమాయిషీ రద్దయి, హిందూ ధార్మిక సంస్థలు, ధర్మాచార్యుల పర్యవేక్షణ కిందికి రావాలి. అయోధ్య భవ్య రామ మందిరం అందుకు నమూనా. ఆలయ వ్యవహారాలలో ప్రభుత్వ జోక్యం లేదు. అర్చకుల ఎంపిక నుంచి అర్చనలు, ఉత్సవాలు పూర్తి పారదర్శకంగా జరుగుతూ అయోధ్య విశ్వ సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లుతోంది. రోజుకు సగటున 2.50 లక్షల మంది భక్తులు బాలరాముడిని ప్రశాంతంగా దర్శించుకుంటున్నారు. ఆ తరహాలో హైందవులు భక్తి శ్రద్దలతో ఆలయాలను నిర్వహించుకొనే వాతావరణం ఏర్పడాలి. విశ్వకల్యాణం కోసం పాటుపడే భారత్ సుభిక్షంగా,సురక్షితంగా ఉంటేనే ప్రపంచం సుఖశాంతులతో ఉంటుంది. వాటికోసం అహరహం ఉద్యమించిన చైతన్యదీప్తి ఛత్రపతి శివాజీ మహరాజ్. ఆయన వీరత్వం, సాధుత్వం, చాతుర్యం, లోకకల్యాణ అభిలాష భావితరాలకు స్ఫూర్తిదాయకం కావాలంటూ సనాతన ధర్మం,ఆలయ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేద్దాం అన్నారు దేవ్‌గిరి మహరాజ్.
ప్రభుత్వ పెత్తనం ఏమిటి?
ప్రధానవక్త చిన జీయర్‌స్వామి ప్రశ్న
మహారాజులు, జమీందార్లు దేవాలయాలు నిర్మించి, లక్షల ఎకరాల భూములిచ్చి, లక్షల విలువైన ఆభరణాలిచ్చి ఆలయాల పోషణకు వ్యవస్థలు ఏర్పాటు చేసారు. ఆలయాలు ఎండోమెంట్స్ విభాగం చేతిలోకి వెళ్ళిపోయాక అవన్నీ కరిగిపోయాయి. ఒక్క ఆంధప్రదేశ్‌లోనే 15లక్షల ఎకరాల భూములకు గాను 4.5లక్షల ఎకరాలు మాత్రం మిగిలాయి. ఆలయాలకు సంబంధించి నిర్ణయాలు ఎవరు చేయాలి? అది అడగడానికే మీరు వచ్చారు. అది ఎవరిని అడగాలో తెలియడానికే విశ్వహిందూ పరిషత్ ఈ సభ ఏర్పాటు చేసింది అని అన్నారు ప్రధాన వక్త శ్రీమన్నారాయణ త్రిదండి చిన జీయర్ స్వామి. పూజ వ్యవధి పైనా, ప్రసాదం పరిమాణం పైనా ప్రభుత్వాధికారుల ఆంక్షలు దారుణం. వారి వ్యవహారశైలి వల్లే హిందువులు ఇతర మతాల్లోకి మారిపోతున్నారు. మన గుడులు నిర్వహించుకోవడం మనకు చేతకాదా? ఆలయ నిర్వహణ ఆలయ సంప్రదాయాన్ని బట్టి, విధానాన్ని బట్టి, స్థానిక ఆచారాలు, కట్టుబాట్లను బట్టి జరగాలి. ఆలయ సంప్రదాయాలను పాటించని అధికారులను పక్కకు తొలగించవలసిందే. దేవాలయాల ఆస్తులను వెనక్కు తిరిగి ఇప్పించాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తక్షణం అమలు చేయాలి అన్నారు. స్థానికులు/ప్రజలు, దాతల సహకారంతో నిర్మితమైన ఆలయాలపై ప్రభుత్వ అజమాయిషీ తీవ్ర అభ్యంతరకరం. దేవుడికి అర్చన వేళలు, అర్చన విధానం, ప్రసాదాలు వంటి వాటి నిర్ణయంలో ప్రభుత్వ అధికారుల పెత్తనం కూడదు. అది అతి పెద్ద ఆలయం తిరుమల కావచ్చు.. చెట్టు కింద అమ్మవారి గుడి కావచ్చు. ఆలయ ప్రతిష్ఠాపన నిర్వహించిన ధర్మాచార్యుల సలహా సంప్రదింపుల ప్రకారమే అర్చనాదులు జరగాలి. వారు తీసుకొనే నిర్ణయాలను అధికారులు తమ పరిధికి లోబడి అమలు చేయాలి. అలాంటప్పుడు దేవాదాయ శాఖ ఉనికి పట్ల అభ్యంతరం ఉండదు. ఆలయాల నిర్వహణకు సంబంధించి నిర్ణయాలు ఎవరు చేయాలి? అని ఈ శంఖారావం స్ఫూర్తితో నిగ్గదీయాలి. అన్యాక్రాంతమైన భూములను, ఇతర ఆస్తులను సుప్రీంకోర్టు తీర్పు మేరకు తక్షణం ఆయా ఆలయాలకు అప్పగించాలి. ఏ ఇతర మతంలోనూ లేని ధార్మిక వ్యాపారం ఆలయాలలోకి చొచ్చుకు వచ్చింది. దైవ దర్శనంలో ధనిక, సామాన్యుల విషయంలో వ్యత్యాసం చోటు చేసుకుంటోంది. తిరుమల లాంటి క్షేత్రాలలో అతి ప్రముఖులు, ప్రముఖులకు దర్శనం సులువుగా దక్కుతుండగా, సామాన్యులు రోజుల తరబడి ఎదురు చూడవలసిన పరిస్థితి. ఈ తీరుతెన్నులతోనే ఇతర మతాలలోకి చేరికలు పెరుగుతున్నాయి అని విమర్శించారాయన.
హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్‌తో దేశ వ్యాప్తంగా చేపట్టిన ఉద్యమంలో భాగంగా విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద మొదటి బహిరంగ సభను హైందవ శంఖారావం పేరుతో విశ్వహిందూ పరిషత్ నిర్వహించింది. మహనీయులైన సాధుసంతులు, పీఠాధిపతులు, వీహెచ్‌పీ నేతలు ఇందులో తమ డిమాండ్‌ను స్ఫుటంగా వినిపించారు. అందుకు హేతువులను కూడా ఘాటుగానే సభ దృష్టికి అదే సమయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఇవి మనం నిర్మించుకున్న దేవాలయాలు, మనమే నిర్వహించుకుందాం, ఆలయాల మీద ప్రభుత్వ అజమాయిషీని సహించం అన్నదే అందరి ఉపన్యాసాల సారాంశం. ఇవి కొత్త సాంస్కృతికోద్యమానికి వెలుగు ధారలు అవుతాయంటే అనుమానం ఉండనక్కరలేదు. స్వాముల వారి గుండె లోతుల్లోనుంచి వచ్చిన ఆ మాటలు ప్రతి హిందూ బంధువును చేరాయనే అనుకోవాలి కూడా. హైందవ శంఖారావం వేదిక మీద నుంచి పలువురు దివ్య పురుషులు ఇచ్చిన సందేశాలను క్లుప్తంగా జాగృతి పాఠకులకు అందిస్తున్నాం.