సంభాల్‌ ‌పరిణామాలతో దుఃఖితులైన ఒక వర్గం ఉన్న మాట నిజం. ఆ వర్గమే హిందువులు. ప్రస్తుతం చరిత్ర పుటలలో నిక్షిప్తమై ఉన్న ఒక నివేదిక ప్రకారం సంభాల్‌లో బాధితులు హిందువులే. ఈ నివేదిక 2024లో, జామా మసీదు సర్వే అనంతర పరిణామాల నేపథ్యంలో తయారయిందని అనుకోవద్దు. అది వందేళ్ల క్రితం1924లో రూపొందింది. నివేదిక రూపకర్తలు హిందూ నాయకులని అలవాటు ప్రకారం అనుకోవద్దు. సంభాల్‌లో బాధితులు హిందువులేనని ఆ నివేదిక ద్వారా తేల్చినది సాక్షాత్తు జవాహర్‌లాల్‌ ‌నెహ్రూ.

దాదాపు శతాబ్దానికి ముందు సంభాల్‌లో జరిగిన మత కల్లోలాలు దేశ వ్యాప్తంగా నాడు చర్చనీయాంశమయ్యాయి. మహాత్మా గాంధీనీ, భారత జాతీయ కాంగ్రెస్‌ను కూడా అవి కలవరపెట్టాయి. అందుకే ఆనాడు సంభాల్‌లో పరిస్థితిని అధ్యయనం చేసి రావలసిందని గాంధీజీ నెహ్రూను సంభాల్‌ ‌పంపించారు. నిజ నిర్ధారణ కోసం వెళ్లిన నెహ్రూ 13 పేజీల నివేదికను గాంధీజీకి ఇచ్చారు. సంభాల్‌లోను, చుట్టుపక్కల వారే అధికంగా ఉన్న కారణంగా, కొన్ని ఇతర కారణాల వల్లను ముస్లిందే అక్కడ పై చేయి అని నెహ్రూ తేల్చారు. సెప్టెంబర్‌, 1924‌లో ఈ నివేదికను గాంధీకి నెహ్రూ అందచేశారు. ఎంపిక చేసిన నెహ్రూ రచనలలో గాంధీకి రాసిన ఉత్తరంలో ఈ అంశాలు ఉన్నాయి. ఆ లేఖ పక్కనే నెహ్రూ నివేదిక కూడా ప్రచురించారు. హిందువులకీ ముస్లింలకీ మధ్య రాజీ కుదర్చాలని తనను కోరడం, తనకి అలాంటి ఉద్దేశం లేదని తాను చెప్పిన మాట కూడా అందులో నెహ్రూ ఉటంకించారు. ఈ సందర్భంలోనే నెహ్రూ రాసిన మాటలు చాలా లోతైనవి. తీవ్రంగా ఆలోచింపచేసేవే కూడా. సంభాల్‌ ‌పర్యటన తరువాత నెహ్రూ గాంధీజీకి రాసిన లేఖలోనే ఈ విషయాలు కూడా ఉన్నాయి. ‘‘నేను ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు! హిందువులు నన్ను ఆమోదించడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ముస్లింలు ఎందుకు ఆమోదించాలి? తమ విధేయుడు నెహ్రూ’’ అన్న మాటలు ఆ లేఖలో ఉన్నాయి.
గాంధీజీ సూచన మేరకు సెప్టెంబర్‌ 8, 1924‌న నెహ్రూ సంభాల్‌ ‌చేరుకున్నారు. ఆయన వెంట నిజ నిర్ధారణ సంఘం సభ్యునిగా బారాబంకీకి చెందిన షేక్‌ ‌బద్రుజ్జామాన్‌ ఉన్నారు. సహాయ నిరాకరణో ద్యమంలో చేరడానికి షేక్‌ 1920‌లో అలీగఢ్‌ ‌ముస్లిం యూనివర్సిటీ చదువును వదిలి వచ్చారు. మొహర్రంతో పాటే, సంభాల్‌లో మరొక వార్షిక ఉత్సవం రావడంతో అక్కడ మత కల్లోలాలు జరిగాయి. తరువాత మూడురోజులు నెహ్రూ ఆ పట్టణంలోనే ఉండి ప్రభుత్వ అధికారులు, దుకాణ దారులు, పురోహితులు, సాధుసంతులతో మాట్లాడారు.
నెహ్రూ సందర్శించిన 1924 నాటికీ, 2024 నాటికీ సంభాల్‌ ‌పట్టణంలో వచ్చిన మార్పులు చెప్పుకోదగినవేమీ లేవు. పరిస్థితి యథాతథంగానే ఉంది. ఇప్పుడూ ముస్లిం జనాభాయే ఎక్కువ. మతానికి సంబంధించి ఎవరు ఉత్సవం నిర్వహించు కున్నా అన్ని వర్గాలను ఘర్షణల భయం వెంటాడుతూనే ఉంది. నాడూ నేడూ కూడా వివాద కేంద్ర బిందువు జామా మసీదే.
1924 నాటి ఘర్షణల గురించి నెహ్రూ అటు ముస్లింలు, ఇటు హిందువుల వాదనలను తన నివేదికలో పొందుపరిచారు. సంభాల్‌తో పాటు లక్నో, అమేథీలలోని మత ఉద్రిక్తతల గురించి కూడా ఆ నివేదికలో నమోదు చేశారు. హిందువులు, ముస్లింల మధ్య చర్చలకు వాతావరణం ఏర్పడిందని, హిందువులకు క్షమాపణలు చెప్పడానికి ముస్లింలు సిద్ధపడ్డారని, కానీ క్షమాపణతోనే హిందువులు తృప్తి పడే విధంగా లేరని ఆ లేఖలో నెహ్రూ స్పష్టం చేశారు.
ఇంతకీ ఘర్షణకు మూలం ఏమిటి? సంభాల్‌ ‌పట్టణంలో ఏటా ఒక మేళా నిర్వహించేవారు. ఆ తేదీలలోనే మొహర్రం కూడా వచ్చేది. 1923లో హిందువులు, ముస్లింల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. మొహర్రం సమయంలో మేళా నిర్వహించబోమని హిందువులు హామీ ఇచ్చారు. కానీ తరువాతి సంవత్సరం ఆ హామీని అమలు చేయలేదు. ఆగస్ట్ 9, 1924‌న మొహర్రం ఊరేగింపు జరిగింది. పాత అలవాటు మేరకు కొందరు హిందువులు కూడా ఇందులో పాల్గొన్నారు. కానీ ఆగస్ట్ 11‌న ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. హిందువులు తమ ఆలయాలలో వాద్యాలు మోగించడం ముస్లింలకు నచ్చలేదు. రాత్రి 9 కంటే ముందు వాద్యాలు వాయించవద్దని గుళ్ల నిర్వాహకులను ముస్లింలు ఆదేశించారు. అయినా వాద్యాలు ఆగలేదు. దీనితో రెండు గంటల పాటు ఘర్షణలు జరిగాయి. 17 మంది హిందువులు గాయపడ్డారు. రెండు దేవాల యాలపై దాడి జరిగింది. ప్రాథమిక నివేదికలను బట్టి హిందువులే బాధితులని అర్ధమవుతుందని నెహ్రూ అంచనాకు వచ్చారు. రెండు హిందూ దేవాలయాలను అపవిత్రం చేశారు. హిందువులే బాగా దెబ్బలు తిన్నారు. ఆ దెబ్బలు ఇంకా తగ్గలేదు కూడా. అయితే ఒక్క మహమ్మదీయుడు కూడా గట్టిగా గాయపడిన దాఖలాలు లేవు. కొందరికి మాత్రం చిన్న చిన్న గాయాలు తగిలాయి అని నెహ్రూ గాంధీకి రాసిన లేఖలో వివరించారు. అయినా, హిందువులు ముస్లింల అఘాయిత్యాల గురించి కొన్ని అతిశయోక్తులు చెప్పారని, తమను దాడి చేసే విధంగా హిందువులే ప్రేరేపించారని ముస్లింలు చెప్పారని నెహ్రూ రాశారు. సంభాల్‌ ‌పురాణ ప్రసిద్ధమైన నగరమని, కల్కి ఇక్కడే జన్మిస్తాడని నమ్ముతారని నెహ్రూ కూడా ఆనాడే పేర్కొన్నారు. మొరాదాబాద్‌లో కూడా నిరంతరం హిందూ ముస్లింల మధ్య ఉద్రిక్త వాతావరణమే ఉంటుందని కూడా నెహ్రూ ప్రస్తావించారు. జామా మసీదును పృథ్వీరాజ్‌ ‌నిర్మించిన అందమైన ఆలయమని నెహ్రూ వ్యాఖ్యా నించడం గమనించదగినది. ఇటీవల వినిపిస్తున్న కథనాల ప్రకారం ఆ ఆలయాన్నే సంభాల్‌ ‌పట్టణంలో ముఖ్య మసీదుగా మార్చారని కూడా నెహ్రూ రాశారు.
ఈ నివేదికలో నెహ్రూ చాలా నిజాయతీగా పలు అంశాలను నమోదు చేశారని అనిపిస్తుంది. మత విశ్వాసాలు ప్రజలను హింసకు పురిగొల్పుతున్న తీరు పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులే తమ ఆలయాలను అపవిత్రం చేసుకుని, విగ్రహాలను పగలకొట్టారని ముస్లింలు చెప్పడం అసలు నమ్మదగి నదిగా లేదని నెహ్రూ రాశారు. దీనిని నమ్మాలంటే చాలా పెద్ద రుజువులు కావాలని కూడా వ్యాఖ్యా నించారు. ఆ రాత్రి (దాడులు జరిగిన రాత్రి) హిందువులు తమ ఇళ్లలోకి వెళ్లిపోయి తలుపులు బిడాయించుకుని, ఎప్పుడు తెల్లవారుతుందా అని బిక్కు బిక్కుమంటూ ఎదురు చూశారని పేర్కొన్నారు. మొరాదాబాద్‌ ‌కూడా హిందూ ముస్లిం ఘర్షణలక పుట్టినిల్లని నెహ్రూ రాశారు. అందుకే ఇక్కడ ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్‌ ‌బలపడలేదని కూడా అంగీకరించారు.
ఇది 13 పేజీల నివేదికే అయినా చాలా అంశాలను నెహ్రూ విశదీకరించారు. సంభాల్‌లో 1919-1920 ప్రాంతంలో హిందూ మహాసభ శాఖ ఏర్పడిందని, జనంపై దాని ప్రభావం నామమాత్రమని నెహ్రూ పేర్కొన్నారు. అది అఖిల భారత స్థాయిలో అల్లర్లు రేపే స్థాయిలో లేదని కూడా అంగీకరించారు. అయితే మహాసభ కార్యకలాపాలు ముస్లింలను గణనీయంగానే చీకాకు పరిచి ఉంటాయని పేర్కొన్నారాయన. అప్పటికే ముస్లింలకీ, హిందువులకీ మధ్య సరిహద్దుల గొడవలు, ఆలయాల ఆస్తుల వివాదాలు, శ్మశాన సరిహద్దుల సమస్యలు ఉన్నాయి. తాను రూపొందించిన సంభాల్‌ ‌నివేదికను నెహ్రూ సెప్టెంబర్‌ 12, 1924‌న గాంధీజీకి అందించారు. సంభాల్‌, అమేథీ, కోహత్‌, ‌గుల్బర్గాలలో హిందూ ముస్లిం ఐక్యతను ఆకాంక్షిస్తూ గాంధీజీ ఆ సెప్టెంబర్‌ 17‌న నిరాహార దీక్ష ప్రారంభించారు. 21 రోజుల పాటు ఈ నిరశన వ్రతం జరిగింది. అప్పటికి అల్లర్లు శాంతించాయి.
సందర్భం వచ్చింది కాబట్టి చరిత్రలో దారుణమైన సంఘటనగా చెప్పదగిన కోహత్‌ ‌మత ఘర్షణల గురించి ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇది నీఫా ప్రాంతంలో ఉంది. 1924లో సెప్టెంబర్‌ 9 ‌నుంచి 11 వరకు అక్కడ మత ఘర్షణలు జరిగాయి. కృష్ణాష్టమికి ఎవరో కృష్ణుడిని తూలనాడుతూ కవిత రాశారు. దానికి సమాధానంగా సనాతన ధర్మ సభకు చెందిన జీవన్‌దాస్‌ ‌భజనల సంకలనం విడుదల చేశాయి. అందులో జమ్మూకు చెందిన ఒక కవి రాసిన భజన కీర్తన కూడా ఉంది. దాని ప్రకారం ముస్లింలందరినీ అరేబియా తోలేయడం మంచిదని రాశారు. అలాగే కాబాలో విష్ణు దేవాలయాన్ని నిర్మించాలని కూడా రాశారు. దీనితో చెలరేగిన అల్లర్ల వల్ల కోహత్‌ ‌పట్టణాన్ని మొత్తం హిందువులు రెండు రోజులలో ఖాళీ చేయవలసి వచ్చింది.

– ‌జాగృతి డెస్క్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE