ఆంధ్రశాఖను ప్రారంభిస్తూ కామకోటి పీఠాధిపతుల సందేశం
‘‘సేవ చేయడం మహాభాగ్యం. దీనజన సేవయే భగవంతుని సేవ. మనస్సులో ఈ ఆర్ద్రత ఉన్నవారు విశ్వహిందూ పరిషత్‌లో చేరాలి. ప్రపంచంలో హిందువులు ఎక్కడెక్కడ ఉన్నా వారికి మన సేవ అందించాలి. గ్రామ గ్రామాన పరిషత్ శాఖలు స్థాపించాలి. పదిమంది హిందువులుంటే అక్కడ ఒక పరిషద్ శాఖ ప్రారంభించాలి.’’
అని విశ్వహిందూపరిషత్ ఆంధ్రశాఖకు ప్రారంభోత్సవం చేస్తూ జగద్గురువులు కంచి కామకోటి పీఠాధిపతులు ప్రజలకు సందేశం ఇచ్చారు. ఉత్సవం రాజమండ్రిలో హిందూ సమాజం ఆవరణలో సెప్టెంబర్ 17వ తేదీ సాయంత్రం జరిగింది.
స్వామివారు తమ ప్రసంగంలో ఇలా అన్నారు :
‘‘సేవ చేయడం మహాభాగ్యం. ‘పుట్టాము, పెరిగాము. దేవుడు సంకల్పించినపుడు పోతాము’ అంటే లాభం లేదు. మనం జీవించడానికి భూదేవి సస్యములు ఇస్తోంది. సూర్యభగవానుడు వర్షం కురిపిస్తున్నాడు. భగవత్కృపవల్ల మనం జీవిస్తున్నాం. కనుక తినడం, చనిపోవడం సరికాదు. సేవచేసే భాగ్యం దొరకాలి. సేవ చేయడానికి ఎంతోమంది ఉంటారు. కష్టాలకు, అవమానాలకు గురవుతూన్న, దారిద్య్రంతో బాధపడుతూన్న ప్రజలకు, దీనులకు సేవచేయడం అవసరం.
ప్రపంచంలోని ఎన్నో దేశాలలో నేడు హిందు వులు అవమానాలు. హింసలు పొందుతున్నారు. దేశ విభజన సమయంలో ఎందరో హిందువులు ఎన్నో యాతనలు అనుభవించారు. ఆఫ్రికాలో, సింహళంలో, బర్మాలో మన హిందువులు ఎన్నో బాధలు చెందుతున్నారు. దీనులు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకుని తమ కష్టాలను లెక్క చేయకుండా వారికి ఉడతాభక్తిగా సేవచేయడం మన కర్తవ్యం.
ఏయే దేశాలలో హిందువులున్నారో తెలుసు కోవాలి. మన కుటుంబాలలోనివారే నేడు భిలాయ్‌లో, రూర్కెలాలో దూరప్రాంతాలలో పనిచేస్తున్నారు. వారి యోగక్షేమాలు మనం విచారిస్తాం. అదేవిధంగా విదేశాలలోని హిందువులకు ఒక సంఘం. ఇక్కడ ఒక సంఘం. వారి సేవకు తగు ఏర్పాట్లు ఇవన్నీ జరగాలి.
పెద్దవాళ్లే సేవచేయడానికి అర్హులని కాదు. ఎవరైనా సేవ చేయవచ్చు. దీనికొక చిన్నకథ ఉన్నది. ఒక చిన్న కాలువలో మర్రి ఆకుమీద ఉన్న ఒక చీమను ఒక కోయిల రక్షిస్తుంది. చీమ ఆ ఉపకారానికి ప్రత్యుపకారం చేస్తానంటుంది. దానికా పక్షి ‘నీవు నాకేం సహాయం చేయగలవు’ అని ఫక్కున నవ్వింది. ఒక బోయవాడు ఆ పక్షిమీదకు తన బాణం గురిపెట్టాడు. ఆ చీమ అతనిని కుట్టింది. బాణం గురి తప్పింది; ‘శక్తి లేనివాడు సేవ చేయడానికి వీలు లేదు అని నేనన్నది చాలా పొరపాటు’ ఆని ఆ పక్షి చీమతో అన్నది.
హిందువులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారంతా మన కుటుంబం. హిందువులు ఎక్కడెక్కడ ఉన్నా వారందరికీ మన సేవ అందించాలి. మనస్సులో ఆర్ద్రత ఉన్నవారు విశ్వహిందూపరిషత్‌లో చేరాలి. ప్రతి గ్రామంలో పరిషద్ శాఖలు స్థాపిం చాలి. 10మంది హిందువులు ఉన్నచోట విశ్వ హిందూపరిషత్ శాఖ స్థాపించాలి.
సేవ చేయని రోజు పనికిరానిరోజు దీనజనసేవయే భగవంతుని సేవ. ఆఫ్రికా ఖండంలో, మారిషస్‌లో, సింగపూర్‌లో, మలయాలో హిందువులున్నారు. అమెరికాలో, కెనడాలో హిందువులున్నారు. వారందరికీ మన సేవ అందాలి.
ఆంధప్రాంత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన సంఘటన ఇది. కొన్ని శతాబ్దాల తర్వాత హిందూ సమాజం గురించి ఆలోచించడం దాని ప్రగతిని గురించి నిర్ణయాలు తీసుకోవడం నేడు జరుగుతోంది.