‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన

ఆమె ‘‘నాకెందుకో మాధురి పెళ్లి చేసుకొని వెళిపోతోందంటే బాధగా ఉంది. పెళ్లి అయిపోతే పూర్వం అంతా ఫ్రీగా ఉండలేము.. నిజం చెప్పాలంటే మాధురి నా అనుంగు నేస్తం. 6వ తరగతి నుంచి ఇద్దరం కలసి చదువుకున్నాము. ఇద్దరం ఒకే బెంచీలో కుర్చునేవాళ్లం. కలిసి భోజనం చేసేవాళ్లం.
మా అమ్మకి కూడా మాధురంటే ప్రాణం. మా ఇద్దర్నీ కవలలనీ పిలిచేవారు.. అటువంటిది పెళ్లి చేసుకొని వెళ్లిపోతుందన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నాను’’ అంది చెమర్చిన కళ్లను తుడుచుకుంటూ…
‘‘నాకూ బాధగా ఉంది.. ఇన్నాళ్లు నా ఆనందాల్ని, బాధల్ని చెప్పుకునేటందుకు సమీర ఉండేది. దానిని చూస్తే చాలు నాకు ఎక్కడలేని ధైర్యం వచ్చేస్తుంది. నేనేమో పెళ్లి చేసుకొని వెళ్లిపోవటం, ఇదేమో చదువు కోసం అమెరికా వెళుతుండటం..ఇవి మా మధ్య దూరం పెంచటానికే వచ్చినట్లున్నాయి. నేను దానితో చెప్పలేదు కానీ అది అమెరికా వెళ్లడం నాకు సుతరామూ ఇష్టం లేదు. దానికి నాలాగ ఆర్థిక సమస్యలూ, కుటుంబ సమస్యలూ ఏమీ లేవు. అదిక్కడే హాయిగా చదువుకుంటే బాగుంటుందనీ నా కోరిక. ఈ కోరికలోను స్వార్థం ఉంది. అది దూరంగా వెళ్లిపోతే నేను తట్టుకోలేను. అది నెల రోజుల్లో అమెరికా వెళుతుందని తెలిసిన దగ్గర్నుంచి ఏం చెయ్యాలో తోచటం లేదు. ఒంటరినైపోతానన్న బెంగ ఎక్కువవుతోంది’’ అంది మాధురి;
మాధురి మాటల్లో నాకు వేదన ధ్వనించింది. ఆమె వైపు చూడగానే నాకాశ్చర్యం వేసింది. ఆమె కళ్లల్లో నీళ్లు. దుఃఖాన్ని బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నాన్ని కళ్ల నీళ్లు బయటకొస్తూ వమ్ము చేస్తునాయి.
‘‘మాధురీ… బాధపడకు… జీవితాన్ని పడవ ప్రయాణంతో పోలుస్తారు.. అది మనం అనుకున్న తీరం చేరదు. దానికి ఎదురు గాలి, ప్రవాహ వేగం, తెరచాప… ఇలా ఎన్నో కారణాలు. అందుకే జీవిత ప్రస్థానాన్ని ఏటికెదురీదడం లాంటిదంటారు. మరీ ముఖ్యంగా స్త్రీ జీవితాన్ని నదితో పోలుస్తారు. కొండల్లో పుట్టి, లోయల్లో ఉరికి, మైదానాల్లో గంభీరంగా, వరదల్లో ఉరుకుతూ, కడలిలో కలిసి దాని ప్రస్థానం ముగుస్తుంది. ఇసుకు తిన్నెలెదురైనా, గిరులు తిరిగిపొమ్మన్నా, లోయల్లో దిగిపోయినా, పాయలుగా విడిపోయినా సాగర సంగమం వరకూ దాని గమనం ఆగిపోదు. స్త్రీ జీవితం కూడా అంతే.అది మన చేతిలో లేదు.కాకపోతే మనుషుల మధ్య బంధాలు మనల్ని కట్టిపడేస్తాయి. వాటి నుంచి అంత త్వరగా బయట పడలేము’’ అనీ ఆమెను ఓదారుస్తూ చెప్పాను.
నా మాటలకు ఇద్దరూ కాసేపు మౌనం దాల్చేరు… ఆ తరువాత మాధురి ‘‘వంశీ! మొదట్లో సమీర నీతో ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు నాకు ఎవరైనా ఏమనుకుంటారేమోనని బాధపడేదాన్ని. మగవాళ్లతో స్నేహం మంచిది కాదనీ నా కనిపించేది. కానీ నీతో 5 సంవత్సరాల స్నేహం ఆ నమ్మకం తప్పని రుజువు చేసింది. నిజంగా నీలాంటి ఆత్మీయుడైన వ్యక్తి చాలా అరుదుగా ఉంటారు. కల్మషం లేని మనస్తత్వం, వెనుకడుగు వేయని వ్యక్తిత్వం, ఇతరులకు సహాయపడాలనే ధృక్పథం. ఇవన్నీ మాకు నిన్ను ఆత్మీయుడిని చేశాయి. అందుకే నీతో మాట్లాడితే ఆనందం, ధైర్యం కలుగుతాయి. నీ గురించి తెలిసిన వారెవ్వరూ తప్పు పట్టుకోరు. అంత గొప్పది నీ వ్యక్తిత్వం. నువ్వు, సమీర నా పెళ్లికి రావడం నాకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది.’’అంది నవ్వుతూ…
ఆమె మాటలు నన్ను కదిలించాయి. ఎప్పుడు మౌనంగా, ముగ్ధలా ఉండే మాధురి ఈ రోజు ఇంత ధైర్యంగా మాట్లాడుతుంటే ఆనందం కలిగింది.ఇంతలో చీకటి పడటంతో ఇంటి దారి పట్టాము..
ఆ రాత్రి 12 గంటలకు మాధురి పెళ్లయ్యింది. ఊళ్లో జనాలు బాగా వచ్చారు. సమీర మాధురి పక్కనే కూర్చొని ఆ వివాహ కార్యక్రమాలను మనస్ఫూర్తిగా ఆస్వాదించింది.. ఆ మర్నాడు మేము ఇంటికి వచ్చేసాము…
నెలరోజుల తరువాత సమీర అమెరికా వెళ్లి కాలిఫోర్నియో దగ్గర ఏదో ప్రైవేట్‌ ‌యూనివర్సిటీలో ఎమ్‌ఎస్‌లో చేరింది. శ్రీరామ్‌, ‌మధు కూడా అమెరికాలో ఏవో యూనివర్సిటీల్లో సీట్లు వస్తే వెళ్లిపోయారు. మా స్నేహితుల్లో నేను మాధురే ఇండియాలో ఉండిపోయాము.
నేను కూడా ఆంధ్రాయూనివర్సిటీలో ఎమ్‌టెక్‌లో చేరాను. ఐఐటీలో సీటొచ్చినా అమ్మనాన్నలకు దూరంగా వెళ్లడం ఇష్టం లేక విశాఖలోనే చేరాను. అక్కడే ఒక స్టడీ సెంటర్లో సివిల్స్ ‌కోచింగ్‌ ‌తీసుకోవడం మొదలు పెట్టాను…
సమీర అమెరికా వెళ్లిన తరువాత అక్కడ విషయాలన్నీ తెలియబరుస్తూ మెయిల్‌ ‌పెట్టింది. వారానికోసారి నాతో మాట్లాడుతోంది. అక్కడ యూనివర్సిటీలో చదువు చెప్పే పద్ధతి వేరనీ, ఎక్కువగా మనమే ప్రొఫెసర్లతో ఇంటరాక్ట్ అయి చదువుకోవాలనీ, అది కొంచెం కష్టంగా ఉందనీ చెప్పింది.
నేను హాస్టల్లో చేరాను. సాయిల్‌ ‌మెకానిక్స్ ‌ప్రొఫెసర్లు అప్పుడప్పుడు వచ్చి పాఠాలు చెబుతున్నారు. క్రితం సంవత్సరం ముగ్గురు ప్రొఫెసర్లు పదవీ విరమణ చెయ్యడంతో ఫాకల్టీ తగ్గిపోయారు. అందుకే చాలా క్లాసులు జరగడం లేదు. ఒకరోజు మా బాచ్‌లోని ఐదుగురం హెడ్డుగారిని కలిసి కోర్సు సరిగ్గా నడవడం లేదనీ, సెమిస్టరు దగ్గర పడుతోందనీ చెబితే తాత్కాలికంగా ప్రొఫెసర్లను నియమిస్తామనీ చెప్పారు కొన్ని క్లాసులను ఆయనే స్వయంగా తీసుకోవడం మొదలుపెట్టారు.
సాయంత్రాల పూట సివిల్‌ ‌సర్వీసెస్‌ ‌కోచింగ్‌కి వెళ్లడం మొదలు పెట్టాను. నేను ఇంజనీరింగ్‌ ‌కాకుండా తెలుగు సాహిత్యాన్ని ఆప్షనల్‌గా తీసుకున్నాను. ఇంజనీరింగ్‌ అయితే చాలా చదవవలసి ఉంటుంది. రోజూ గ్రంథాలయానికి వెళ్లి తెలుగు సాహిత్యం చదవటం మొదలు పెట్టాను. వాటితో పాటు బీటెక్‌ ఇం‌జనీరింగ్‌లో చదివిన పుస్తకాలను మళ్లీ చ•దవటం మొదలు పెట్టాను. ఎందుకంటే ఒక పేపరు పూర్తిగా సివిల్‌ ఇం‌జనీరింగ్‌ ‌మీద ఉంటుంది.. ప్రతీ శనివారం నాడు మా ఊరు వెళుతున్నాను. నాన్నగారి ఆరోగ్యం రాను రాను క్షీణించసాగింది. ఒకసారి విశాఖపట్నం తీసుకు వచ్చి అపోలో హాస్పిటల్లో చూపిస్తే కొన్ని మందులు రాసిచ్చేరు.. అతను, సమీర వాళ్ల నాన్న అంటే మా మేన మామ ఇద్దరూ రెండు సంవత్సరాల క్రితమే పదవీ విరమణ చేసారు. పూర్వం నాన్నగారు పొలానికి వెళుతుండేవారు. కానీ ఇప్పుడు ఆరోగ్యం సరిగ్గా లేక ఇంటి పట్టునే ఉంటున్నారు. నేను దసరా శలవులకు వచ్చినపుడు రోజు పుస్తకాలను మా పొలానికి తీసికెళ్లి చెరువు గట్టు మీద చింతచెట్టు కింద కూర్చొని చదువుతుండేవాడిని. అప్పుడు నాకు సమీర గుర్తుకు వస్తుండేది.
నేనూ, సమీర పదేళ్లు కలిసి చదువుకోవడం వల్ల బాగా చనువు ఏర్పడటం వల్ల ఈ మధ్య నేను ఎక్కడికి వెళ్లినా ఆమే గుర్తుకు వస్తోంది. మా ఇంజనీరింగ్‌ ‌కాలేజీలోని లేబొరేటరీ పక్కన చెట్టు కింద బెంచీలను చూసినా, బీచ్‌కి వెళ్లినా, మా ఊరు ఏటి•, పొలానికి..ఇలా ఎక్కడికి వెళ్లినా ఆమె గుర్తుకు వస్తున్నది. అప్పుడు నా మనసు భారంగా అయిపోతుంటుంది. ఆ మధ్యనే కాంటీన్‌కు వెళితే సమీర గుర్తుకు వచ్చి టీ తాగబుద్ధి కాలేదు. బీటెక్‌ ‌చదివినపుడు వారానికి రెండు రోజులు మేమిద్దరం అదే కాంటీన్లో టీ తాగుతూ కబుర్లు చెప్పుకునే వాళ్ళం. బీచ్‌కు వెళ్లి సముద్ర కెరటాలను చూస్తే సమీర కెరటాలతో ఆడుకున్న దృశ్యం వెంటాడుతున్నది. సమీరకు సముద్రం, ప్రకృతి, జలపాతాలంటే ఎంతో ఇష్టం- ముఖ్యంగా నీటిని చూస్తే చాలు ఆమె తనను తాను మరచిపోతుంది… మా ఊరు ఏటి ఒడ్డున మేమిద్దరం ఎన్నోసార్లు చీకటి పడేదాకా కబుర్లు చెప్పుకునే వాళ్లం. కానీ ఇప్పుడు ఆమె నాకందనంత, కనిపించనంత దూరంలో ఉంది. ఆమె అక్కడ, వేల మైళ్ల దూరంలో నేనిక్కడ..మళ్లీ కలుస్తామా? నాకైతే నమ్మకం లేదు. ఒకసారి అమెరికా వెళ్లిన వాళ్లు తిరిగి రారనీ అంటారు. సమీర కూడా అంతేనా?… వాళ్ల నాన్న అక్కడే ఏ తెలుగు కుర్రాడినో చూసి పెళ్లి చేసేస్తాడు. మళ్లీ ఇక్కడికొస్తే నేనామె పెళ్లి చెడగొడతానేమోనని అతని బెంగ…
నేను ఒంటరిగా ఉన్నప్పుడు సమీర గుర్తుకు వచ్చినప్పుడల్లా కృష్ణశాస్త్రి విరహ గీతం గుర్తుకు వస్తుంటుంది…
‘‘నీవు వచ్చు మధురక్షణమేదో కాస్త
ముందు తెలిసెనా?
అందముగా నీ కనులకు విందులుగా
వాకిటనే సుందర మందార కుంద
సుమదళములు పరవనా!
దారి పొడవునా మంచున తడిసిన
పారిజాత సుమములపై నడిచిన
నీ అడుగుల గురుతులె నిలిచె నా కోసము’’ అనీ మనసు ప్రశ్నిస్తుంటుంది; నేను కూడా ఆమె వచ్చే రోజు కోసం నిరీక్షిస్తున్నాను. అయినా రాదేమోనన్న నిరాశ. వచ్చినా కలవలేనేమోనన్న మీమాంస. విరహము కూడా సుఖమే కాదా అన్నాడో కవి. అది తీయని బాధ.
రెండు సంవత్సరాలు గడిచాయి. ఆ మధ్య కాలంలో చాలా సంఘటనలు జరిగిపోయాయి. నాన్నగారు అనారోగ్యంతో మంచం పట్టి మమ్మల్ని వదలి వెళ్లిపోయారు. నా ఎం.టెక్‌ ‌చదువు పూర్తైంది. జియో టెక్నికల్‌ ఇం‌జనీరింగ్‌ ‌మీద అమెరికా లోని మెసచూట్స్ ఇనిస్ట్యిట్యూట్‌ ఆఫ్‌ ‌టెక్కాలజీలో సెమినార్‌ ఉం‌దనీ, దానికి తాను వెళ్లలేకపోతున్నాననీ, నన్ను వెళ్లమని మా ప్రొఫెసర్‌ ‌రాఘవరావుగారు చెప్పడంతో వెళ్లా? వద్దా? అన్న ఆలోచనలో పడ్డాను.

– గన్నవరపు నరసింహమూర్తి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE