స్వతంత్ర భారత విదేశాంగ విధాన రూపశిల్పిగా ప్రథమ ప్రధాని నెహ్రూ పేరు స్థిరపడి ఉండవచ్చు. కానీ, భారత విదేశ వ్యవహారాలు స్వాతంత్య్రం పోరాటకాలం నుంచి రూపుదిద్దుకుంటూ వచ్చినవే. మనకు మనమై ఇతర దేశాల మీద మొదటిగా దాడికి దిగకపోవడం అనే విధానం కూడా అందులో భాగమైంది. అందుకే విదేశాంగ విధానం మౌలిక సూత్రాలను నెహ్రూ తరువాత ఎవరూ సమూలంగా మార్చే ప్రయత్నం చేయలేదు. కానీ 1947 తరువాత ప్రపంచం పెనుమార్పులు చూసింది. ఆ క్రమంలోనే మౌలికతకు భంగం కలుగకుండా దేశ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ విదేశాంగ విధానానికి మార్పులు తీసుకువచ్చిన వారిలో రెండు పేర్లు ప్రధానంగా వినిపిస్తాయి. అవి-జనతా పార్టీ కాలంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన అ•ల్ బిహారీ వాజపేయి, కాంగ్రెస్ నాయకుడు పీవీ నరసింహారావు.
వాజపేయి జనసంఘ్ కాలం నుంచి విదేశ వ్యవహారాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన నాయకుడు. అందుకే ఆయనకు జనతా పార్టీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ఆ బాధ్యత అప్పగించారు. అటల్ విదేశాంగ మంత్రిగా రెండేళ్లే పనిచేసినా ఆ శాఖకు నవ్యతను తెచ్చారు. ఆయన విదేశ వ్యవహారాలను 1977-79 ఒక దశగాను, 1998-2004 వరకు మరొక దశగాను పరిశీలించవలసి ఉంటుంది.
జనతా పార్టీ హయాంలో ప్రచ్ఛన్న యుద్ధ పీడిత ప్రపంచంలో వాజపేయి విదేశ వ్యవహారాలను నిర్వహించారు. ప్రధానిగా ఏకధ్రువ ప్రపంచంలో విదేశ వ్యవహారాలను రూపొందించారు. ఇక్కడ కీలకం భారత్‌కు అనుకూలంగా ఉన్న సోవియెట్ రష్యా, భారత్‌కు ప్రతికూలంగా ఉండే అమెరికా మరొక వైపు. ఈ పరిస్థితిని గొప్ప దౌత్య ప్రతిభతో వాజపేయి అధిగమించారంటారు విశ్లేషకులు. 1977లో ఇందిర ఓడిపోయారు. ఇది సోవియెట్ రష్యా ఊహించలేదు. కొన్ని రోజులు కమ్యూనిస్టు రష్యా మీడియా ఇందిర ఓటమి వార్తను కూడా నిలిపివే
సింది. అవన్నీ ఎలా ఉన్నా సోవియెట్ రష్యాతో సంబంధాలు కొనసాగక తప్పదు. అక్కడే వాజపేయి తన ప్రతిభను చూపారు. అందుకు మొదటి మెట్టుగా వాజపేయి చేసిన పని, కాంగ్రెస్ ప్రభుత్వం నియ మించిన రాయబారిని ఐకే గుజ్రాల్‌ను కొనసాగించాలని నిర్ణయించారు. ఆయన పట్ల సోవియెట్ రష్యాకు విశ్వాసం ఉంది. అదే సమయంలో నాటి విదేశాంగ మంత్రి అండ్రీ గ్రొమైకోకు భారత్ ఆహ్వానం పలికింది. భారత్‌లో ప్రభుత్వాలు మారినా ప్రజల అంతరంగం ఆనాటిదేనని ఈ విధంగా స్పష్టం చేశారు ఇది సోవియెట్ రష్యాకు పెద్ద ఊరట.
నిజమే, మొదట నెహ్రూ విదేశాంగ విధానాన్నే వాజపేయి అనుసరించారు. అది నాటి అనివార్యత. నెహ్రూ అనుసరించిన ‘సైద్ధాంతిక’ విదేశాంగ విధానంలో మొదటగా మార్పులు తెచ్చి, ఆచరణశీల దృక్పథంతో వ్యవహరించడం పీవీ నరసింహారావు హయాంలో ప్రారంభమైంది. విదేశాంగ విధానంలో పీవీ పార్టీలకు అతీతంగా అటల్‌బిహారీ వాజపేయి మద్దతు తీసుకున్నారు. పీవీ విదేశాంగ విధానాన్ని కార్యసాధకంగా మలచిన ఘనత అటల్ బిహారీ వాజపేయిదే!
1998 నాటి అణుపరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయం, పొరుగుదేశాలతో సన్నిహిత సంబంధాలు నెరపడం, ఫిబ్రవరి 20,1999న పాకిస్తాన్‌తో చారిత్రక లాహోర్ ఒప్పందం, 2003లో చైనా సందర్శన, ఇరుదేశాల మధ్య సరిహద్దు సమస్య పరిష్కారానికి ప్రత్యేక ప్రతినిధుల సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించడం, భారత్-అమెరికా సన్నిహిత సంబంధాలకు కృషి వంటివి సాధారణ పౌరులకు మామూలుగా అనిపించవచ్చు. కానీ ఆయన అనుసరించిన విదేశాంగ విధానం, రాజనీతిలో వ్యూహాత్మకమైన ‘వాస్తవిక బహుత్వవాదం’ ఇమిడి ఉంది. ఆ విధంగా భారత విదేశాంగ విధానం ఆయన నేతృత్వంలో మరింత పద్ధతిగా, కార్యసాధకంగా
రూపొందింది. ఆయన అనుసరించిన విధానం 19వ శతాబ్దంలో గొప్ప యూరోపియన్ వ్యూహకర్తలు ప్రిన్స్ మెటర్నిక్, క్యాస్టలెరిఘాలను గుర్తుకు తెస్తుంది. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా భారత్‌కు ఒక గుర్తింపు, ప్రత్యేకత రావడం ప్రారంభ మైంది అటల్‌జీ హయాం నుంచే.
మూడు అంశాలకు ప్రాధాన్యం
వాజ్‌పేయి తాను అనుసరించే విధానాల్లో ముఖ్యంగా మూడు అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు. 1. జాతీయ భద్రతను మరింత దృఢతరం చేసేందుకు బలీయమైన జాతీయశక్తిగా దేశాన్ని మలచడం, 2. ప్రాంతీయ, ఉప-ప్రాంతీయ గ్రూపులకు అతీతమైన శక్తిగా మెలుగుతూ ఆర్థికాభివృద్ధి, వ్యూహాత్మక అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగడం. 3. సాఫ్ట్ పవర్ కార్డును బలమైన రీతిలో ప్రయోగిం చడం. ఈ మూడు విధానాలను అనుసరించడం ద్వారా నాలుగు ఫలితాలను సాధించడం ఆయన ప్రధాన లక్ష్యం. అవి 1. జాతీయ భద్రత, హిందూ జాతీయశక్తిని మరింత విస్తరింపజేయడం, 2. పొరుగు దేశాలతో సన్నిహిత సంబంధాలు, ప్రాంతీయ, ఉప-ప్రాంతీయ గ్రూపులతో సన్నిహితంగా మెలుగుతూ దేశ అర్థిక, వ్యూహాత్మక మరియు సామాజికాభివృద్ధి అజెండాను మరింత వేగవంతం చేయడం.
వాస్తవికవాదులు ఎప్పుడూ అధికారాన్ని దేశప్రయోజనాలకు అనుగుణంగానే నిర్వచిస్తారు. దేశాన్ని బలోపేతం చేయడం, విస్తరించడం, శత్రుసంహారం రాజు ప్రధాన బాధ్యత అని చాణక్యుడు అర్థశాస్త్రంలో చెప్పాడు. నిజానికి భారత్, పశ్చిమ దేశాల్లో అధికార భావన అనేది బలీయమైన చోదకశక్తిగా పనిచేస్తోంది. ఇతరుల అభిప్రాయాలను మనకు అనుకూలంగా మలచుకునేలాగా చేయడమే జాతీయశక్తికి నిర్వచనం. వాస్తవికవాదిగా అటల్‌జీ అంతర్జాతీయ సంబంధాలు ఏవిధంగా ఉండాలనే దానిపై ఒక స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్లారు. ఈ శక్తి ప్రభావం రాజ్యం ఇతర దేశాలపై తన పలుకుబడిని వివిధ స్థాయిలో ప్రసరింపజేసి, సానుకూల రాజకీయ ఫలితాలను ఇచ్చింది. ఈ జాతీయశక్తిని వినియోగించుకునే సామర్థ్యం, ఈ శక్తి ప్రభావంపైనే విదేశాంగ విధానంలో సాఫల్య, వైఫల్యాలు ఆధారపడి ఉంటాయి.
మన విదేశాంగ విధానాన్ని వాజపేయి ‘సైద్ధాంతికవాదం’ నుంచి ‘కార్యసాధక దిశ’కు సమూలంగా మళ్లించారు. ఆ విధంగా అత్యంత సాహసంగా వ్యవహరించారనే చెప్పాలి. వాజపేయి అనుసరించిన ‘వాస్తవికత’ను నిజానికి ‘వాస్తవిక బహుత్వవాదం’ అనవచ్చు. ఈ విధానంలో మొత్తం నాలుగు కారకాలుంటాయి. 1. హార్డ్ పవర్ 2. సాఫ్ట్‌పవర్, 3. బహుళ కూటముల్లో కొనసాగడం, 4.ఏ కూటమిని ఏర్పాటు చేయకపోవడం. 2001లో ఒక సందర్భంలో వాజపేయి, ‘నూతన ప్రపంచ క్రమం విజయవంతం కావడమనేది బహుత్వవాద ప్రజాస్వామ్య వ్యవస్థల విజయంపైనే ఆధారపడి ఉంది. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న మతాంధత, పగ-ద్వేషాలతో కూడిన సైద్ధాంతిక పోకడలను అంతం చేయడానికి ఇది చాలా అవసరం’ అన్నారు.
తిరుగులేని నిర్ణయం
1995లో అమెరికా నాయకత్వంలోని దేశాలు అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ)ని ముందుకు తెచ్చాయి. కానీ ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వాన్ని కలిగిన పి-5 దేశాలకు దీన్నుంచి మినహాయింపునిచ్చే ఈ ఒప్పందంపై భారత్ సంతకం చేయడానికి నిరాకరించింది. ఈ నేపథ్యం లో పి-5 దేశాలు ‘సమగ్ర అణు పరీక్షల నిరోధక ఒప్పందాన్ని’ (సీటీబీటీ) ముందుకు తెచ్చాయి. చైనా ఒత్తిడితో దీనిపై ప్రతిదేశం తప్పనిసరిగా సంతకం చేయాలన్న నిబంధన విధించారు. దీన్ని కూడా భారత్ తిరస్క రించింది. ఒకవేళ 1999 నాటికి భారత్ దీనిపై సంతకం చేయకపోతే, యు.ఎన్. విధించే వాణిజ్యపరమైన ఆంక్షలను ఎదుర్కొనక తప్పదని ఆ దేశాలు హెచ్చరించాయి. 1998 నాటికి మనదేశంలో అటల్‌జీ నేతృత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది.ఎన్‌పీటీ లేదా సీటీబీటీ ఒప్పందాలు వివక్షతో కూడిన వని మనదేశం నిశ్చితాభిప్రాయం. ఇప్పుడు భారత్ ముందున్నవి రెండే అవకాశాలు. ఒకటి అణ్వస్త్రాన్ని వదులుకోవడం లేదా పొందడం. 1998లో అటల్‌జీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.
అణుపరీక్షలు
1998 మే 11, 13 తేదీల్లో పోఖ్రాన్‌లో మనదేశ రక్షణరంగ శాస్త్రవేత్తలు ఐదు అణ్వస్త్రాలను పరీక్షించారు. వీటిల్లో ఒకటి థర్మో న్యూక్లియర్ ఆయుధం. 1974 అణ్వస్త్ర పరీక్షలు జరిపినప్పుడు భారత్ వీటిని కేవలం శాంతియుత ప్రయోజనాలకే ఉపయోగిస్తామని వాగ్దానం చేసింది. కానీ ఇప్పుడు భారత్ ఆ హామీనుంచి బయటకు వచ్చింది. ఏప్రిల్ 6, 1998న పాకిస్తాన్ ఘోరీ క్షిపణిని ప్రయోగించడమే భారత్ నిర్ణయానికి కారణం. ఆటంబాంబుల తయారీ మన దేశానికి అవసరమని ఆర్‌ఎస్‌ఎస్ రెండో సరసంఘచాలక్ పరమ పూజనీయ గురూజీ ఏనాడో చెప్పారు. ఈ అణ్వస్త్ర పరీక్షల ద్వారా వాజపేయి ఆయన కలను నిజంచేసే దిశగా అడుగు ముందుకు వేశారు. అంతేకాదు చైనానుంచి మన దేశానికి వ్యూహాత్మకంగా ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలోనే ఈ అణు పరీక్షలు నిర్వహించక తప్పలేదని ప్రధాని వాజపేయి, నాటి అమెరికా అధ్యక్షు డు బిల్ క్లింటన్‌కు స్పష్టంగా చెప్పారు. ఆవిధంగా భారత్‌ను హార్డ్ పవర్‌గా ప్రపంచానికి వెల్లడిచేస్తూ, రెండో వైపు చైనా, పాక్‌లతో సంబంధాలకు ఆయన కృషిచేశారు. నిజం చెప్పాలంటే వివేచన, నిగ్రహం అనే రెండు అంశాల మధ్య సున్నితమైన సమతుల్యతను సాధిస్తూ తన విదేశాంగ విధానాన్ని నడిపారు. తర్వాత ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత నేపథ్యంలో, అణ్వస్త్రాన్ని మొదటిసారి ఉపయోగించబోమని, ఇక ముందు అణ్వస్త్ర పరీక్షలు భారత్ నిర్వహించదని ఆయన స్పష్టం చేశారు. ఇదే ఆయన అనుసరించిన వాస్తవికతతో కూడిన వ్యూహాత్మక వ్యవహశైలి. అంతేకాదు, అణ్వస్త్ర ప్రయోగంపై తగిన నిర్ణయం తీసుకోవడానికి ‘నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజరీ బోర్డును (ఎన్‌ఎస్‌ఏబీ)’ని కూడా ఏర్పాటు చేశారు.
సహనమే ఆయుధం
1999 కార్గిల్ యుద్ధం సమయంలో అటల్‌జీ ఎంతో సహనాన్ని ప్రదర్శించారు. కార్గిల్ నుంచి పాక్ మూకలు ఖాళీచేయనంతవరకు కాల్పుల విరమణ సాధ్యంకాదని స్పష్టం చేస్తూనే, భారత వైమానిక దళానికి, నియంత్రణరేఖను దాటవద్దని కచ్చితమైన ఆదేశాలిచ్చారు. కార్గిల్ యుద్ధం (1999), 2001లో పార్లమెంట్‌పై ఉగ్రదాడి, ఆగ్రా సదస్సు విఫలం వంటివి జరిగినా పాక్‌తో స్నేహహస్తాన్ని చాచడానికి వెనుకాడలేదు. ఇందుకోసం తెరవెనుక దౌత్యం నడిపిన కారణంగా నవంబర్ 3, 2003న పాకిస్తాన్ నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ప్రతిపాదనను ముందుకు తీసుకురాగా అందుకు భారత్ అంగీకరించింది. అదేవిధంగా 1998లో అణ్వస్త్ర పరీక్షలు జరిపినందుకు చైనా గుర్రుగా వున్నప్పటికీ, 2003లో వాజపేయి ఆ దేశంలో పర్యటించారు. ఆయన పర్యటనకు రెండు ప్రధాన కారణాలు. 1.చైనా ప్రధాన భూభాగంలో టిబెట్ స్వతంత్ర ప్రతిపత్తిగల ప్రాంతంగా గుర్తించడం, 2. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రతినిధుల యంత్రాంగాన్ని ఏర్పాటుచేయడం.
సాఫ్ట్ పవర్‌గా ఎన్.ఆర్.ఐ.లు
1990 దశకంలో అమెరికాకు చెందిన ఒక తత్వవేత్త ఎస్.నై జూనియర్ సాఫ్ట్ పవర్ అనే పదాన్ని మొట్టమొదటిసారి ప్రాచుర్యంలోకి తీసుకువచ్చాడు. ‘‘ఏదైనా ఒక దేశం తాను కోరుకున్న విధంగా ఇతరదేశాలు పనిచేసేలా చేయడమే’’ సాఫ్ట్‌పవర్ అని అయన అన్నాడు. అయినా ఇందులో కీలకం ఆర్థిక, సాంస్కృతి ప్రభావమే. వాజపేయి ఉద్దేశంలో ఇతరుల ప్రవర్తనను మూడు పద్ధతుల్లో తనకు అనుకూలంగా మలచుకోవచ్చు. 1.నిర్బంధం లేదా దండన (స్టిక్స్) 2. చెల్లింపులు (తాయిలాలు), 3. ఆకర్షణ (సాఫ్ట్ పవర్). ఇక హార్డ్ పవర్ కేవలం ‘దండన’ లేదా ‘నిర్బంధం’ పైనే ఆధారపడుతుంది. శశిథరూర్ మాటల్లో చెప్పాలంటే ‘‘సాఫ్ట్‌పవర్‌లేని హార్డ్‌పవర్ వల్ల భావోద్వేగాలు, శత్రువులు పెరుగుతారు. అదే హార్డ్‌పవర్‌లేని సాఫ్ట్‌పవర్‌ను బలహీనతగా చూస్తారు’’. ఇప్పుడు వాజపేయి తన సాఫ్ట్‌పవర్‌ను ఎంతటి విజ్ఞతతో ప్రయోగించారో పరిశీలిద్దాం. అణు పరీక్షలు జరిపిన తర్వాత అమెరికాతో పాటు మరో 14 దేశాలు మన దేశంతో పాటు పాకిస్తాన్‌పై కూడా ఆంక్షలు విధించాయి. జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, స్వీడన్, కెనడా, డెన్మార్క్ వంటి దేశాలు ఇందులో ఉన్నాయి. ఫలితంగా ఇతరదేశాలనుంచి పెట్టు బడులు, ఇతరత్రా వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. ద్వైపాక్షిక సంబంధాలు కూడా నిలిచిపోవడంతో దేశం ఒక విధంగా ప్రపంచ సమాజంలో ‘ఒంటరితనం’ అనుభవించింది. కానీ పశ్చిమదేశాల ఆధిపత్య ధోరణికి ఎంతమాత్రం భారత్ తలొగ్గలేదు. ఈ సవాలును స్వీకరించడానికే నిర్ణయించుకుంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి ముందుగా భారత్ విదేశాల్లో నివసించే భారతీయులకు (ఎన్‌ఆర్‌ఐలకు) ‘రీసర్జంట్ ఇండియా బాండ్స్’ను అమ్మడం మొదలుపెట్టింది. వీటి అమ్మకాల ద్వారా 4బిలియన్ యు.ఎస్. డాలర్ల ఆదాయం సమకూరింది. ఫలితంగా 1998 ఏప్రిల్ నాటికంటే 1998 అక్టోబర్‌లో విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరిగాయి. నిజంగా యు.ఎస్. ఆంక్షల నేపథ్యంలో దేశాన్ని ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా కాపాడిన ఘనత ఎన్.ఆర్.ఐ.లదేనని చెప్పక తప్పదు. ఆపత్కాలంలో అండగా నిలిచినందుకు కృతజ్ఞతగా ‘ప్రవాసీ భారతీయ దివస్’ను (పీబీడీ) నిర్వహిస్తామని వాజ్‌పేయి ప్రకటించారు. 2003, జనవరి 9న దీన్ని నిర్వహించారు. అప్పటినుంచి ఏటా ఇదే తేదీన పీబీడీని నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఆవిధంగా ఇండియా విదేశాంగ విధానంలో ఎన్‌ఆర్‌ఐలు సాఫ్ట్ పవర్ భాగస్వాములుగా మారారు. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ ఏదేశానికి వెళ్లినా అక్కడి భారత సంతతి వారితో తప్పని సరిగా సమావేశమ వడం వెనుక ఇంతటి నేపథ్యం ఉంది. అంతేకాదు భారతీయ సాంస్కృతిక, నాగరికత లోని సమున్నతత్వం, ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ, స్వతంత్ర న్యాయవ్యవస్థ, స్పందనశీలక సమాజం… ఇవన్నీ భారత సాఫ్ట్‌పవర్‌లో ముఖ్యమైన భాగాలే. ఆసియా, మధ్యప్రాచ్యం, యూరప్ దేశాల్లో భారత్ పలుకుబడిని మరింత విస్తరించడంలో ఎన్.ఆర్.ఐ.ల పాత్ర విస్మరించలేనిది. 1990 ప్రాంతంలో కేవలం ఆగ్నేయాసియా దేశాల్లో నివసించే భారత సంతతి 6.7 మిలియన్లు. అణు పరీక్షల తర్వాత క్రమంగా అమెరికాతో మనదేశ సంబంధాలను మెరుగుపరచి, నేటి స్థాయికి తీసుకు రావడంలో అక్కడి భారత సంతతి ప్రజల పాత్ర మరువలేనిది! అంతేకాదు ఉగ్రవాదం వల్ల కలుగుతున్న కష్టనష్టాలను ఎదుర్కొనేం దుకు వివిధ వర్గాలను ఏకతాటిపై నడపడంలో భారత్ ప్రజాస్వామ్యాన్ని సాఫ్ట్‌పవర్‌గా ఉపయోగిస్తున్నది. కేవలం సాఫ్ట్ పవర్ కారణంగానే భారత్, బహుపాక్షిక ప్రజాస్వామ్య ప్రోత్సాహక సంస్థల్లో సభ్యురాలు కాగలిగింది. ఇందులో 2000లో ఏర్పాటైన ‘కమ్యూనిటీ ఆఫ్ డెమోక్రసీ’కి భారత్ వ్యవస్థాపక సభ్యురాలు!
బహుళ కూటములు-అలీన విధానం
ప్రచ్ఛన్నయుద్ధం తర్వాత యు.ఎస్. మాత్రమే సూపర్‌పవర్‌గా మిగిలింది. రష్యా, చైనా, జపాన్, భారత్ వంటి దేశాలు ప్రపంచంలో కీలక దేశాలుగా వున్నప్పటికీ, బలీయమైన బహుళ ధ్రువాత్మక ప్రపంచ క్రమాన్ని ఏర్పరచలేక పోవడానికి ప్రధాన కారణం ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా! ఈ నేపథ్యంలో భారత్ తెలివిగా అభివృద్ధి చెందిన, వర్థమాన దేశాలతో వివిధ స్థాయుల్లో సంబంధాలను ఏర్పరచుకొని ఉమ్మడి ప్రయోజనాల సాధన కోసం కృషిచేసింది. ఇందుకోసం భారత్ బహుళకూటమి వ్యూహాన్ని అమలు చేసింది. దీన్నే ప్రస్తుత విదేశాంగ మంత్రి డా।।జయశంకర్ మాటల్లో చెప్పాలంటే ‘‘భారత రాజకీయ, వ్యూహాత్మక ఆలోచనలకు అనుగుణంగా భాగస్వామ్య దేశాలు వ్యవహరించేలా చేయడం’’. ఈ బహుళకూటమి వ్యూహాన్ని అమలుచేసే పక్రియలో భాగంగా వాజపేయి తరచుగా విదేశీ పర్యటనలు జరిపారు. ఫలితంగా యు.ఎస్, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా, వంటి దేశాలు, యూరోపియన్ యూనియన్, ఐబీఎస్‌ఏ, ఆసియన్ గ్రూపులతో మన ప్రయోజనాలకు అనుగుణంగా సంబంధాలు ఏర్పడి క్రమంగా బలపడ్డాయి. అణుపరీక్షల తర్వాత 1998 నుంచి 2000 మధ్యకాలంలో నాటి మన విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ అప్పటి యుఎస్ విదేశాంగ మంత్రి స్ట్రోబ్ టాల్‌బొట్‌తో 9రౌండ్ల సమావేశాలు జరపడం, ఆ దేశంతో సంబంధాలకు వాజపేయి ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యతనిచ్చిందో తెలియజేస్తుంది. 2000 సంవత్సరంలో అప్పటి యు.ఎస్. అధ్యక్షుడు బిల్ క్లింటన్ మనదేశం లో పర్యటించినప్పుడు ‘‘ఇండియా రిలేషన్స్: ఎ విజన్ ఫర్ ది ట్వంటీఫస్ట్ సెంచరీ’’ ఒప్పందంపై పరస్పరం సంతకాలు చేయడం వాజపేయి విదేశాంగ విధానంలో సాధించిన గొప్ప విజయం. రెండు దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలన్నది ఈ ఒప్పందం సారాంశం. ఈ ఒప్పందం తర్వాతి కాలంలో యు.ఎస్-ఇండియా ఫైనాన్షియల్ అండ్ ఎక నామిక్ ఫోరమ్, యు.ఎస్-ఇండియా కమర్షియల్ డైలాగ్, యు.ఎస్- ఇండియా వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ట్రేడ్ వంటి పలు యంత్రాంగాలు ఏర్పాటు కావడానికి దోహదం చేసింది. మనదేశంలో క్లింటన్ పర్యటన తర్వాత, 2000 సెప్టెంబర్‌లో వాజపేయి అమెరికాలో పర్యటించారు. ఈవిధంగా క్రమంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటం, ద్వైపాక్షిక వాణిజ్యంపై సానుకూల ప్రభావం చూపింది. 2002లో అమెరికాకు భారత్ ఎగుమతులు 11.7 బిలియన్ డాలర్లకు చేరుకోగా, మనదేశానికి అమెరికా దిగుమతులు 3.7బిలియన్‌గా కొనసాగాయి. 2024 నాటికి ఇరుదేశాల సంబంధాలు రక్షణ, వాణిజ్య, సాంకేతిక పరిజ్ఞాన రంగాలకు విస్తరిం చాయి. తర్వాత యు.ఎస్.లో జరిగిన ఎన్నికల్లో జార్జ్ బుష్ అధికారంలోకి వచ్చారు. ఆయన హయాంలో ఆ దేశ భద్రతా సలహాదారుగా పనిచేసిన కండోలిజా రైస్, చైనాను ఎదుర్కోవడంలో భారత్ ప్రాధాన్యతను గుర్తించారు. ఇక అ ప్పటినుంచి యు.ఎస్.తో మన సంబంధాలు మరింత పటిష్ట మవుతూ వచ్చాయి.
రష్యా చమురు క్షేత్రంలో వాటా
ఇక రష్యా విషయానికి వస్తే సుదూర తూర్పు రష్యా ప్రాంతంలోని షకాలిన్-1 చమురు, సహజ వాయు క్షేత్రంలో 20% వాటాను పొందడం వాజపేయి ప్రభుత్వ దౌత్యవిజయంగా చెప్పాలి. ఈ క్షేత్రంలో భారత్ 17 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. విదేశాల్లో అతిపెద్ద భారత్ పెట్టుబడిగా ఇది నిలిచింది. ఆ విధంగా దేశ ఇంధన భద్రతకోసం వాజపేయి అనుసరించిన వ్యూహాన్నే ఇప్పటికీ చురుగ్గా అనుసరిస్తున్న కారణంగా, ప్రస్తుతం భారత్ 20దేశాల్లో ఈ రంగంలో తన ఉనికిని ప్రదర్శిస్తున్నది. 2001లో వాజపేయి-పుతిన్‌ల మధ్య ‘మాస్కో డిక్లరేషన్’పై సంతకాలు జరిగాయి. ఇది ఇరుదేశాల మధ్య భద్రత వర్తక సంబంధాలను మరింత బలోపేతం కావడానికి దోహదం చేసింది. వాజపేయి హయాంలోనే 2000 సంవత్సరంలో ఈయూ-భారత్ సదస్సు జరిగింది. యూరోపియన్ దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుకోవడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. తర్వాతి కాలంలో ఇది వార్షిక సదస్సుగా మారింది. దీని తర్వాత జర్మనీ, ఫ్రాన్స్, యు.కె.లతో మన సంబంధాలు మరింత బల పడ్డాయి. పొరుగు దేశాలకు ప్రాధాన్యత విధానానికి వాజపేయి బీజం వేశారు. పి.వి. నరసింహారావు హయాంలో ప్రారంభించిన లుక్ ఈస్ట్ పాలసీకి వాజ్‌పేయి మరింత మెరుగులు దిద్ది ముందుకు తీసుకెళ్లారు. మొదట్లో ఈ విధానం ఆసియన్ దేశాలతో వాణిజ్యం, పెట్టుబడులపై మాత్రమే దృష్టిపెట్టింది. అయితే వాజపేయి దీని నిర్వచనాన్ని మరింత విస్తృతం చేసి ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియాలతో కూడా సంబంధాలను పెంపొందించే దిశగా వ్యూహాన్ని అమలు పరచారు. ఈ నేపథ్యంలోనే ‘సీ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్’ (ఎస్‌ఎల్‌ఓసీ) ఏర్పాటుతో పాటు ఉగ్రవాదాన్ని నిరోధించడంలో పరస్పరం సహకరించుకోవడానికి కూడా ఈ దేశాలు అంగీకారా నికి వచ్చాయి. అంతేకాకుండా ‘బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ సైంటిఫిక్, టెక్నొలాజికల్ అండ్ ఎకనామిక్ కొఆపరేషన్ (బిమ్‌స్టిక్), మెకాంగ్ గంగా కొఆపరేషన్ (ఎంజీసీ) ఏర్పాటుకు వాజపేయి విధానాలే దోహదం చేశాయి. ఎంజీసీలో సభ్యులుగా కంబోడియా, లావోస్, మయన్మార్, థాయ్‌లాండ్, వియత్నాం, భారత్‌లు సభ్యులు! సభ్య దేశాల మధ్య భద్రత ఆర్థిక సహకారం కోసం ఈ గ్రూపు ఏర్పాటైంది.
(జమలాపురపు విఠల్‌రావు, సీనియర్ జర్నలిస్ట్)