జమలాపురపు విఠల్‌రావు, సీనియర్ జర్నలిస్ట్
జనవరి 26, 1950న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 106 సవరణలు జరిగాయి. ప్రపంచంలో అత్యధిక సార్లు సవరణ జరిగింది కూడా భారత రాజ్యాంగానికే! ఇప్పటివరకు పరిశీలిస్తే సగటున రెండేళ్లకోమారు మన రాజ్యాంగాన్ని సవరించారు. రాజ్యాంగ సవరణకు పార్లమెంట్‌కు ఎటువంటి అధికారం ఉన్నదనేది ఈ సవరణల నేపథ్యంలో ఉదయించే సహజమైన ప్రశ్న. మొత్తం మూడురకాల సవరణలను పేర్కొన్నారు. మొదటిది సాధారణ మైనది కాగా, 2,3 రకాల సవరణలను 368వ అధికరణం వివరిస్తుంది.
– మొదటి రకం రాజ్యాంగ సవరణను పార్లమెంట్ ఉభయ సభలు సాధారణ మెజారిటీతో చేపట్టవచ్చు. లోక్‌సభ, రాజ్యసభల్లో సీట్ల సంఖ్యలో మార్పులు, రాష్ట్రాల పేర్లు మార్చడం వంటివి ఈ రకం కిందికి వస్తాయి.
– రెండో రకం సవరణను పార్లమెంట్ ఉభయ సభలు ‘ప్రత్యేక మెజారిటీ’ (2/3వవంతు)తో ఆమోదించాలి. ప్రాథమిక హక్కులకు సవరణ, ఆదేశిక సూత్రాల్లో మార్పులు, ప్రభుత్వ నిర్మాణంలో మార్పులు ఈ తరహా సవరణ కిందికి వస్తాయి.
– ఇక మూడో రకం సవరణలకు పార్లమెంట్‌లో ‘ప్రత్యేక మెజారిటీ’ (2/3 మెజారిటీ)తో పాటు కనీసం 50శాతం రాష్ట్రాల ఆ మోదం తప్పనిసరి. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో మార్పులు, రాష్ట్రాల అధికారాల్లో మార్పుల చేపట్టడానికి ఈ తరహా సవరణ అవసరం. అయితే ప్రజల సార్వభౌమత్వం, రూల్ ఆఫ్ లా, అధికారాల విభజన, న్యాయ సమీక్ష, సమాఖ్య విధానం, ప్రజాప్రభుత్వ ధర్మం (Rవజూబపశ్రీఱషaఅఱంఎ), సెక్యులరిజం, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అనే రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని మార్చడానికి పార్లమెంట్‌కు హక్కు లేదు. దీంతో పాటు, రాజ్యాంగ సవరణ విషయంలో పార్ల మెంట్‌కు కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ప్రభుత్వం తన పదవీకాలాన్ని పెంచుకోవడానికి లేదా తగ్గించుకోవడానికి వీలుగా రాజ్యాంగ సవరణ చేయడానికి వీల్లేదు. అదే విధంగా రాష్ట్రపతి, సుప్రీంకోర్టులను రద్దు చేసే విధంగా రాజ్యాంగ సవరణను పార్లమెంట్ చేపట్టడానికి వీల్లేదు.
ఇప్పటివరకు 40సార్లు మూడోరకం రాజ్యాంగ సవరణలు చేశారు.పార్లమెంట్ ఉభయసభల్లో 2/3వ వంతు మెజారిటీతో పాటు 50శాతం రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి అయినప్పటికీ ఈ సవరణలు జరగడమే విశేషం.
జూన్ 18,1951న మన రాజ్యాంగానికి మొట్ట మొదటి రాజ్యాంగ సవరణ చేపట్టారు. ఇందులో సవరించిన ప్రధాన అధికరణలు 15, 19తో పాటు, 85,87,174,176, 341,342,372, 376. వీటికి అదనంగా 31ఎ, 31బి అధికరణలను రాజ్యాంగంలో చేర్చారు. ఆ తర్వాత రాజ్యాంగానికి వరుసగా సవరణలు చేపట్టడం జరుగుతూ వచ్చింది. తర్వాతి కాలంలో 42, 44 సవరణలు అత్యంత కీలకమైనవి. ఇక ఇటీవలి కాలానికి వస్తే, సెప్టెంబర్ 23, 2023న లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 1/3వంతు సీట్లను కేటాయిస్తూ 239ఎ అధికరణను పార్లమెంట్ సవరించడం అత్యంత కీలకమైన సవరణగా పేర్కొనవచ్చు. అయితే 42వ రాజ్యాంగ సవరణ పెద్ద వివాదాన్నే సృష్టించింది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్నే మార్చేసిన సవరణ ఇది. తర్వాత అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందులో మార్పులు చేసింది.
42వ రాజ్యాంగ సవరణ
42వ రాజ్యాంగ సవరణను అత్యవసర పరిస్థితి సమయంలో (1976) ఇందిరాగాంధీ ప్రభుత్వం చేపట్టింది. దీన్నే మినీ రాజ్యాంగం అనికూడా వ్యవహరిస్తారు. ఇందులో పౌరుల ప్రాథమిక హక్కులను రద్దుచేయడమే కాకుండా ప్రాథమిక విధులను జోడిరచారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల కాలపరిమితిని పెంచారు. అంతేకాదు ‘‘సోవరిన్ సెక్యులర్ సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్’’గా పేర్కొనడం ద్వారా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో మార్పు తీసుకొచ్చారు. అయితే 1980లో సుప్రీం కోర్టు 31సి, 368 అధికరణాలకు చేసిన సవరణలు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయంటూ‘మినర్వా మిల్లిస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసు విచారణ సందర్భంగా కొట్టివేసింది.
సవరణకు నేపథ్యం
1970 సంవత్సరం నుంచి దేశంలో రాజకీయ, సామాజిక అస్థిరతలు కొనసాగాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలు ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. రాయబరేలీ నుంచి తన ఎన్నికను కొట్టివేస్తూ అలహాబాద్ హైకోర్టు తీర్పు నివ్వడం, దానిపై సుప్రీంకోర్టు షరతులతో స్టే ఇవ్వడం నేపథ్యంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించారు. 1976లో రాజ్యాంగంలో కేంద్రానికి ఎక్కువ అధికారాలు వచ్చేలా మార్పులు చేయడానికి వీలుగా అధ్యయనానికి స్వరణ్‌సింగ్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. 42వ రాజ్యాంగ సవరణకు ఈ కమిటీ ఇచ్చిన నివేదికే ఆధారం. ఈ రాజ్యాంగ సవరణ ప్రధాన ఉద్దేశం కేంద్రానికి మరిన్ని అధికారాలు దఖలు పరచడం, న్యాయవ్యవస్థ ప్రభావాన్ని తగ్గించడం. ఈ సవరణ మనదేశ సమాఖ్య వ్యవస్థపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని కలిగించింది. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు, స్వేచ్ఛకు అశనిపాతమైందంటే అతిశయోక్తి కాదు. కేంద్ర అధికారాలు మరింత బలోపేతమయ్యాయి. ఒకరకంగా ఇది ఏక కేంద్ర ప్రభుత్వానికి దారితీసింది. అంతేకాదు కేంద్ర`రాష్ట్ర సంబంధాల్లో కూడా మార్పులు జరిగాయి. పాలనాపరమైన నియంత్రణ తగ్గిపోవడంతో, అధికార పరిధి విషయంలో కేంద్రం`రాష్ట్రాల మధ్య కీచులాటలు మొదల య్యాయి. ముఖ్యంగా స్థానిక సమస్యలను లేవనెత్తి అధికారంలోకి వచ్చే ప్రాంతీయ పార్టీల ఉనికికే ఈ సవరణ సవాలు విసిరింది.
44 రాజ్యాంగ సవరణలు
1975-77 మధ్యకాలంలో విధించిన అత్యవసర పరిస్థితి సమయంలో చేపట్టిన 42వ రాజ్యాంగ సవరణ (1976)ద్వారా, భారతీయ చట్టాల్లో అనేక మార్పులు చేశారు. ఈ రాజ్యాంగ సవరణ దేశంలో అమలవుతున్న సమాఖ్య వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిందనే చెప్పాలి. ఫలితంగా ఈ సవరణకు జనసమ్మతి లభించలేదు. ముఖ్యంగా పౌర హక్కుల ఉల్లంఘన, పోలీసులు మానవహక్కుల హననానికి పాల్పడటంతో దేశవ్యాప్తంగా ఈ చట్టంపై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. అనంతరం అధికారం లోకి వచ్చిన జనతా ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ చేపట్టి, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టంలో అమల్లోకి తెచ్చిన కొన్ని మార్పులను రద్దుచేసింది. ఆవిధంగా దేశంలో సమాఖ్య వ్యవస్థ మళ్లీ దారిన పడిరది. 44వ రాజ్యాంగ సవరణ 356 అధికరణం పరిధిని కుదించడం మరో సానుకూల పరిణామం. ఇందులో ‘ఏడాది’ అనే పదం స్థానంలో ‘ఆర్నెల్లు’ అనే పదాన్ని చేర్చారు. ఫలితంగా అత్యవసర పరిస్థితిని కేంద్రం ప్రకటించిన రోజునుంచి ఆర్నెల్ల కాలంలోగా పార్లమెంట్ అనుమతి పొందాలి. ఆర్నెల్ల కాలం ముగిసిన ప్రతిసారి పార్లమెంట్ అనుమతి తప్పనిసరి. 44వ రాజ్యాంగ సవరణద్వారా 356 అధికరణానికి 5వ క్లాజును జతచేశారు. ఒక రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రజా స్వామ్య పరిపాలన పునరుద్ధరణకు అవసరమైన కనీస కాలవ్యవధిని నిర్ణయించడం ఈ సవరణ ప్రధాన ఉద్దేశం. అంతేకాదు దేశంలో పాలనను మరింత ప్రజాస్వామ్యయుతం చేయడం కోసం 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రభుత్వం రాజ్యాంగంలో మరిన్ని మార్పులు చేసింది. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన పరిపాలనకు ఈ రాజ్యాంగ సవరణ మరింత విస్తృత నిర్వచనం ఇచ్చింది. తర్వాతి కాలంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై నియమించిన సర్కారియా కమిషన్ 356వ అధికరణాన్ని అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే ప్రయోగించాలని తన సిఫారసుల్లో స్పష్టం చేసింది. ఇక పూంచి కమిషన్ అత్యవసర పరిస్థితిని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేయాలని, అదికూడా మూడు నెలలకు మించి కొనసాగించరాదని సిఫారసు చేసింది. దీన్నే ‘లోకలైజ్డ్ ఎమర్జెన్సీ’ అని పేర్కొంది.
ఎస్.ఆర్.బొమ్మై వర్సెస్ భారత ప్రభుత్వం (1994)
ఎస్.ఆర్.బొమ్మై వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో 356 అధికరణానికి సంబంధించి తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఒక చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 356 అధికరణ పరిధిని ఈ తీర్పు మరింత విస్తృతంగా వివరించింది. అప్పటివరకు ఇష్టం వచ్చిన రీతిలో రాజ్యాంగ విరుద్ధంగా అత్యవసర పరిస్థితి విధించే కేంద్రం ప్రభుత్వాల ప్రవృత్తికి అడ్డుకట్టవేయడమే కాదు సమాఖ్యవ్యవస్థ సజావుగా కొనసాగడానికి దోహదం చేసింది. రాజస్థాన్ వర్సెస్ ఇండియా కేసులో ఇచ్చిన తీర్పును తిరస్కరించింది కూడా.
ఏయే రాష్ట్రాల్లో ఎన్నెన్ని సార్లు…
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో విధించిన రాష్ట్రపతి పాలన వివరాలీవిధంగా ఉన్నాయి. ఎక్కువసార్లు రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం మణిపూర్. ఆంధ్ర రాష్ట్రం (1), ఆంధ్రప్రదేశ్(2), అరుణాచల్ ప్రదేశ్(2), అస్సాం (4), బిహార్(8), ఢల్లీి(1), గోవా(3), గోవా, డామన్Êడయ్యు (2), గుజరాత్(5), హర్యానా(3), హిమాచల్‌ప్రదేశ్(2), జమ్ముÊకశ్మీర్ రాష్ట్రం(8), జమ్ముÊ కశ్మీర్(కేంద్రపాలిత ప్రాంతం`1), జార్ఖండ్(3), కర్ణాటక(6), కేరళ(6), మధ్యప్రదేశ్ (3), మహారాష్ట్ర(3), మణిపూర్(10), మేఘాలయ(2), మిజోరం(3), నాగాలాండ్(4), ఒడిశా(6), పాటియాలా ఈస్ట్ పంజాబ్ స్టేట్ యూనియన్ (1), పుదుచ్చేరి(7), పంజాబ్(8), రాజస్థాన్(4), సిక్కిం(2), తమిళనాడు(3), ట్రావన్‌కూర్`కొచ్చిన్(1), త్రిపుర(3), ఉత్తర ప్రదేశ్(9), ఉత్తరాఖండ్ (2), పశ్చిమబెంగాల్ (5)సార్లు రాష్ట్రపతిపాలన విధింపునకు గురయ్యాయి. ఆవిధంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చిననాటినుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మొత్తం 134సార్లు ఇదే అధికరణాన్ని ప్రయోగించి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేసింది.
సెక్యులరిజం, సోషలిజం పదాలు
42వ రాజ్యాంగ సవరణ దేశంలో చాలా ప్రతికూల మార్పులకు దోహదం చేసింది. అందుకు కారణం 1976 నాటి ఆ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికను మార్చడానికి ఉద్దేశించినది. దీనితో సెక్యులరిజం, సోషలిజం అన్న పదాలను అత్యవసర పరిస్థితిలో అత్యవసరంగా చొప్పించారు. ఇందిరాగాంధీ తెచ్చిన ఈ సవరణ, తద్వారా వచ్చిన సెక్యులరిజం పదం రాజ్యాంగ నిర్మాతల ఆశయానికి విరుద్ధంగా చేరినవే. ప్రథమ ప్రధాని నెహ్రూ, రాజ్యాంగ ముసాయిదా సంఘ అధ్యక్షుడు డా. బీఆర్ అంబేడ్కర్ సెక్యులర్ అన్న పదాన్ని చేర్చడానికి విముఖత వ్యక్తం చేశారు. నవంబర్ 15, 1948న రాజ్యాంగ పరిషత్‌లో జరిగిన చర్చలో ప్రొఫెసర్ కేటీ షా సెక్యులర్ అన్న పదాన్ని పీఠికలో చేర్చాలని సూచించారు. అయితే విభజన తరువాతి భారతదేశం సెక్యులరిజంతోనే ఉందని రాజ్యాంగ పరిషత్ సభ్యులు అభిప్రాయపడి ఆ పదాన్ని చేర్చలేదు.