ఈశాన్య లద్దాక్‌ ప్రాంతంలోని భారత్‌కు చెందిన భూభాగాలను తనవిగా చూపుతూ చైనా తాజాగా రెండు కౌంటీలను ఏర్పాటు చేయడమే కాకుండా, వీటికి సంబంధించిన ఒక మ్యాప్‌ను విడుదల చేయడంతో భారత్‌-చైనాల మధ్య మరో వివాదం రాజుకుంది. భారత్‌ దీనిపై తీవ్ర అభ్యంతరం తెలపడంతో చైనా తన నక్కజిత్తుల వ్యవహారశైలిలో దీన్ని తక్కువగా చూపి, పెద్దగా భయపడాల్సిందేమీ లేదంటూ సుద్దులు చెబుతోంది. విదేశాంగ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ అంశం విషయంలో చైనాకు దౌత్యమార్గాల ద్వారా తీవ్ర నిరసన తెలిపామని వెల్లడిరచారు. హోటన్‌ నగర పాలన కింద ఏర్పాటు చేసిన ఈ రెండు కౌంటీల ఏర్పాటుకు చైనా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ ఆమోదముద్ర వేసింది. ఐదేళ్లుగా నిలిచిపోయిన ఇరుదేశాల మధ్య ప్రతినిధుల స్థాయి సరిహద్దు చర్చలు తిరిగి ప్రారంభమైన ఒకరోజు తర్వాత ఈ విధంగా మ్యాప్‌ను చైనా విడుదల చేయడం దాని నక్కజిత్తుల వ్యవహారశైలికి నిదర్శనం. ముఖ్యంగా ఆక్సాయ్‌ చిన్‌ ప్రాంతంలో తన నియంత్రణను క్రమంగా పెంచు కుంటూ వస్తున్నదనేది ఈ చర్యద్వారా స్పష్టమవుతోంది.

ఇకముందు దౌత్యచర్చల్లో భారత్‌ ఈ ప్రాంతాలను తనవిగా చెప్పుకోవడానికి వీల్లేని విధంగా చైనా ఈ విధంగా వ్యవహరిస్తోంది. ఈవిధంగా ఆక్సాయ్‌చిన్‌ ప్రాంతంపై పాలనాపరంగా పూర్తి పట్టును సాధించాలన్నది చైనా వ్యూహం. ఈ ప్రాంతంలో రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలను వృద్ధి చేయడమే కాదు, పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ తేలిగ్గా ఎక్కడికైనా చేరుకునేందుకు వీలుగా వీటి నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నది ఉపగ్రహ చిత్రాల ద్వారా స్పష్టమవు తోంది. ఈ నేపథ్యంలో భారత్‌ నిరసనలకే పరిమితం కావడం వల్ల ప్రయోజనం ఉండటం లేదు. చైనా తన పని తాను కానిచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పనులను ఆపేవిధంగా భారత్‌ చర్యలు తీసుకుంటే తప్ప చైనాను అడ్డుకోవడం కష్టం. చర్యలు తీసుకోవడమంటే సంఘర్షణకు దిగడమే! ఇక్కడ చైనా, ఒకపక్క ప్రత్యక్ష సైనిక సంఘర్షణను నిలిపేస్తున్నట్టు కనిపిస్తూనే, సరిహద్దు వివాదంపై ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన అంగీకారానికి రాకుండా ‘‘ఫ్రోజెన్‌ కాన్‌ఫ్లిక్ట్‌’’ (స్తంభిత సంఘర్షణ) వైఖరిని అనుసరిస్తోంది. ఎట్లా అంటే వివాదాస్పద ప్రాంతాలను తమవిగా మ్యాపుల్లో చూపడం లేదా తమ దేశపు పేర్లు పెట్టడం, గుట్టు చప్పుడు కాకుండా నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు చేపట్టడం ఇతరదేశాల భూభాగాలను కబ్జా చేయడానికి చైనా అనుసరిస్తున్న విధానం. పంచశీల సిద్ధాంతం నేపథ్యంలో నాటి ప్రధాని నెహ్రూ చైనాను అతిగా నమ్మిన ఫలితంగా 1962లో ఆకస్మిక దాడికి పాల్పడి మన భూభాగాలను ఆక్రమించుకోవడం ఈ వ్యూహంలో భాగమే. అప్పటినుంచి భారత్‌`చైనాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోలేదు.

ఫలితమివ్వని భారత్‌ నిరసనలు

లద్దాక్‌ చైనా అక్రమ ఆక్రమణలను భారత్‌ ఎన్నడూ ఆమోదించలేదు. ఈ ప్రాంతంపై సార్వభౌమాధికారం తమదేనని భారత్‌ నొక్కి చెప్పడమే కాదు,  బలవంతంగా, చట్టవిరుద్ధమైన రీతిలో చైనా ఆక్రమించుకున్న ఈ ప్రాంతాన్ని ఆ దేశానికి చెందినదిగా తామెన్నడూ అంగీకరించలేదని మన విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. జిన్‌ జియాంగ్‌ యూఘిర్‌ స్వతంత్ర పాలిత ప్రాంతంలో ‘హియాన్‌’ ‘హెకాంగ్‌’ పేరుతో రెండు కౌంటీలు ఏర్పాటయ్యాయి. భారత్‌కు చెందిన కేంద్రపాలిత ప్రాంతం లద్దాక్‌లోని కొన్ని భాగాలను కలుపుకొని ఈ రెండు కౌంటీలకు చెందినవిగా చూపుతూ చైనా ఈ మ్యాప్‌ను విడుదల చేసింది. భారత్‌కు చెందిన ఆక్సాయ్‌చిన్‌ ప్రాంతాన్ని 1950లో చైనా అక్రమంగా ఆక్రమించింది. 1962లో ఆక్సాయ్‌చిన్‌ పశ్చిమ కొసన రెండు దేశాల మధ్య భీషణ యుద్ధం జరిగింది.

తాజాగా రెండు దేశాల మధ్య సంఘర్షణకు డెప్సాయ్‌చింగ్‌ కేంద్రంగా మారింది. ఇది ఆక్సాయ్‌ చిన్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ అతిపెద్ద డ్యామ్‌ నిర్మించాలన్నది చైనా వ్యూహం. 2024, డిసెంబర్‌ 25న చైనా ఒక ప్రకటన చేస్తూ 137 బిలియన్‌ డాలర్ల (ఒక ట్రిలియన్‌ యువాన్లు) వ్యయంతో హిమాలయ ప్రాంతాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్‌ను నిర్మించబోతున్నట్టు వెల్లడిరచింది. ప్రస్తుతం చైనాలో అతిపెద్ద డ్యామ్‌గా పరిగణిస్తున్న త్రీ గోర్జెస్‌ డ్యామ్‌ కంటే కూడా ఇది పెద్దది. దీన్ని యర్లాంగ్‌ సాంగ్‌పో నది (బ్రహ్మ పుత్ర)పై టిబెట్‌ స్వతంత్ర పాలిత ప్రాంతంలో నిర్మించబోతున్నట్టు చైనాకు చెందిన అధికారవార్తా సంస్థ జిన్హువా తెలిపింది. ఈ నిర్మాణం వల్ల అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాం ప్రాంతాల్లో పర్యావరణపరమైన సమస్యలతో పాటు బంగ్లాదేశ్‌ కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్‌గా చెబుతున్న చైనా దీని నిర్మాణాన్ని బ్రహ్మపుత్ర నది అరుణాచల్‌ ప్రదేశ్‌లోకి ప్రవేశించడానికి ముందు ‘యు’టర్న్‌ (పూర్తి వంపు) తిరిగే ప్రదేశంలో చేపట్టబోతున్నది. ఈ డ్యామ్‌ నిర్మాణం వల్ల బ్రహ్మపుత్ర నదీజలాలపై చైనాకు పూర్తి నియంత్రణ వస్తుంది. ఫలితంగా దిగువన ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాంలకు ఆకస్మిక వరదముప్పు ఎల్లప్పుడూ పొంచి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక ‘నీటి బాంబ్‌’! వర్షాలు లేని సమయంలో దిగువకు నీటిని వదలదు. వరదల కాలంలో ఒకేసారి నీటిని విడుదల చేయడం వల్ల దిగువ ప్రాంతాలు కొట్టుకుపోతాయి. అంతేకాదు మన దేశంపై కక్ష తీర్చుకోవాలనుకున్నప్పుడు కూడా,  మామూలు రోజుల్లో కూడా డ్యామ్‌లో నిల్వవున్న నీటిని ఒకేసారి దిగువకు వదిలినా వరదముప్పు తప్పదు.

చైనా బుకాయింపులు

అయితే ఈవిధంగా బ్రహ్మపుత్ర నదిపై మెగా ప్రాజెక్టుల నిర్మాణం చేయడం తగదంటూ ఎప్పటి కప్పుడు భారత్‌ దౌత్య మార్గాల ద్వారా స్పష్టం చేస్తూ వస్తోంది. ఈవిధంగా ఎగువ బ్రహ్మపుత్ర ప్రాంతంలో చైనావైపు మెగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం వల్ల దిగువ పరీవాహక ప్రాంతంలోని భారత్‌, బంగ్లాదేశ్‌ లకు ఇబ్బందులు కలుగుతాయని కూడా ఎప్పటికప్పుడు చైనాకు తెలుపుతోంది. అంతేకాదు బ్రహ్మపుత్ర నది పరీవాహక ప్రాంతానికి దిగువన ఉన్న దేశంగా తనకు కొన్ని హక్కులుంటాయని ఈ నేపథ్యంలో ఒకవేళ చైనా ఖాతరు చేయకపోతే, అందుకు తగినవిధంగా వ్యవహరించే హక్కులను వినియోగించుకుంటామని భారత్‌ హెచ్చరిస్తోంది. కానీ తాము చేపట్టే ప్రాజెక్టుల నిర్మాణంవల్ల దిగువ దేశాలకు ఎటువంటి నష్టం వాటిల్లదని చెబుతూ భారత్‌ లేవనెత్తుతున్న అభ్యంతరాలను తక్కువగా చూపడానికి చైనా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా రెండు టెక్టానిక్‌ ఫలకాలు కలిసే హిమాలయ ప్రాంతంలోని ఈ ప్రదేశంలో భూకంపాలు అధికంగా ఏర్పడే ప్రమాదం ఉన్నందున, ఇక్కడ డ్యాం నిర్మాణం చేపట్టడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నకు చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్‌ సమాధాన మిస్తూ, ఈ ప్రాంతంలో గత పదేళ్లుగా లోతైన అధ్యయనాలు చేసిన తర్వాతనే ఏ ప్రమాదం లేదని నిర్ధారణకు వచ్చాక డ్యాం నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పడం బుకాయింపు తప్ప మరోటి కాదు. భారత్‌, బంగ్లాదేశ్‌లకు ఈ నిర్మాణం వల్ల ఎటువంటి ప్రమాదం ఉండబోదని పైకి నంగనాచి కబుర్లు చెబుతున్నప్పటికీ దాని అంతర్గత ఆలోచన మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. దాని వ్యవహారశైలి తెలిసిన ఎవరికైనా ఇందులో దాగిన కుచ్చిత నీతి ఇట్టే అర్థమవుతుంది.

ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం

 నిజం చెప్పాలంటే లద్దాక్‌లో ఆక్రమించిన ప్రాంతంలో మెగా డ్యామ్‌ను నిర్మించడానికి చైనా నిర్ణయించడం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు మళ్లీ విఘాతం కలిగించే యత్నమే! సరిగ్గా రెండు నెలల క్రితం రెండు దేశాలు వాస్తవాధీన రేఖ వెంట సైన్యాలను ఉపసంహరించాలని అంగీకారా నికి వచ్చాయి. తర్వాతి కాలంలో క్రమంగా అన్ని పరిస్థితులు మామూలుగా మారిపోతున్నాయన్న అభిప్రాయాన్ని కలిగించే విధంగా చైనా వ్యవహ రించింది. ముఖ్యంగా భారత్‌తో ఇప్పుడు వాణిజ్యం ముఖ్యం. అమెరికా నుంచి ఆంక్షలు, ఆ దేశంతో వ్యాపారం దెబ్బతినే పరిస్థితి నెలకొనడంతో ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్‌ ఇండియాతో ఘర్షణాత్మక వైఖరి తనకే నష్టమని గ్రహించి సైన్యం ఉపసంహరణకు అంగీకరించింది తప్ప చైనాలో నిజమైన చిత్తశుద్ధి లేదన్న సంగతి మరోసారి స్పష్టమైంది. సరిహద్దు వద్ద నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయే ప్రక్రియ కొనసాగుతున్నదన్న అభిప్రాయంతో భారత్‌ ఉంది. కానీ చైనా వ్యవహార శైలి పరిస్థితిని మరింత సంక్లిష్టం చేయడానికే ముందుకెళుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే చైనా నిర్మించబోయే అతిపెద్ద జలవిద్యుత్‌ ప్రాజెక్టు వల్ల దిగువన ఇండియా, బంగ్లాదేశ్‌లకు చెందిన మిలియన్ల కొద్దీ ప్రజలపై తీవ్ర ప్రతికూల ప్రభావం కలిగిస్తుంద నడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఇందుకోసమే భారత్‌ మొదట్నుంచీ సంబంధాల విషయంలో పారదర్శకత అవసరమని పదేపదే మొత్తుకుంటోంది. పర్యావరణవేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తరుణంలో చైనా ప్రతినిధి డ్యాం వల్ల ఏవిధమైన ప్రమాదం రాదని చెప్పడం హాస్యాస్పదం. హిమాల యాలు భౌగోళికంగా సున్నిత ప్రదేశాలు కావడంవల్ల తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే.

 రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యకు ఇంకా పరిష్కారం లభించనప్పుడు, తాను ఆక్రమించిన లద్దాక్‌ భూభాగాలను కలుపుకొని రెండు కౌంటీలను ఏర్పాటు చేయడం చైనా దుందుడుకు చర్య కాకపోతే మరేంటి? దశాబ్దాలుగా లద్దాక్‌ ప్రాంతంలో సరిహద్దు సమస్యకు పరిష్కారం దొరకలేదు. ప్రస్తుతం చైనా వ్యవహారశైలి, భారత్‌ అభిప్రాయానికి విలువనివ్వడం లేదని స్పష్టం చేస్తున్నది. తన సైన్యాన్ని ఆధునీక రించడం, అసాల్ట్‌ వెహికిల్స్‌, స్టెల్త్‌ యుద్ధ విమానాలను తయారు చేసుకుంటున్నామన్న ధైర్యంతోనే చైనా ఈవిధంగా వ్యవహరిస్తున్నదని భావించాలి. ఈ నేపథ్యంలో పెదవులపై నవ్వును, నొసటిపై వెక్కిరింతను ప్రదర్శించే చైనా గుంటనక్క వ్యవహార శైలిపై భారత్‌ ఒక స్పష్టమైన వైఖరిని అవలంబించక తప్పదు. నెహ్రూ కాలం నుంచే చైనా ద్వంద్వ వైఖరితో మనదేశాన్ని ఎప్పటికప్పుడు వంచిస్తూనే ఉంది. ఈ వంచనకు ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. ఇదిలావుండగా కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖ నాయకుడు పవన్‌ ఖేరా చైనా వైఖరిని తీవ్రంగా తప్పుపట్టడమే కాదు, కేవలం దౌత్యపరంగా నిరసనలకే పరిమితం కావడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండబోదని, అంతకు మించి కఠినచర్యలు తీసుకోవా లని కోరడం సహేతుకమైనప్పటికీ, కాంగ్రెస్‌ అధినాయకత్వానికి చైనా పట్ల ఉన్న సానుకూల వైఖరికి ఆయన ఏం సమాధానం చెబుతారు? తన విదేశాంగ విధాన వైఫల్యం కారణంగానే పాకిస్తాన్‌, చైనాలతో మనకు ఇప్పటికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న సంగతిని కాంగ్రెస్‌ మరచిపోకూడదు.

సంఘర్షణ`సహకారం

చారిత్రకంగా పరిశీలిస్తే ఇరుదేశాల మధ్య సంబంధాలు సంఘర్షణ, సహకారం అనే ఒక సంక్లిష్ట విధానంలో కొనసాగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ప్రాదేశిక వివాదాలు, సైనిక సంఘర్షణలు ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి. నిరంతరం కొనసాగించిన దౌత్యపరమైన చర్చల ఫలితంగా   వాస్తవాధీన రేఖ నుంచి రెండు దేశాలు సైనికులను ఉపసంహరించుకోవడానికి గత ఏడాది అక్టోబర్‌ నెలలో అంగీకరించడం, దాన్ని అమలు జరగడంతో సంబంధాలు మెరుగయ్యాయన్న వాతావరణం కనిపించింది. దీనివల్ల గత నాలుగేళ్లుగా సంబంధాల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ఒక పరిష్కారం లభించిందన్న అభిప్రాయం ఏర్పడిరది.

2019 తర్వాత తొలి సారి 2014లో రష్యాలోని కజాన్‌లో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సమావేశమై, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. ఆర్థికంగా ఒకరిపై మరొకరు ఆధార పడివున్న సంగతి ఇరుదేశాల నేతలు గుర్తించడమే ఇందుకు ప్రధాన కారణం. తయారీ రంగానికి కావలసిన ఎలక్ట్రానిక్‌ వస్తువులపై భారత్‌ చైనాపై అధికంగా ఆధారపడుతోంది. ఇదే సమయంలో చైనా మనదేశాన్ని అతిపెద్ద మార్కెట్‌గా పరిగణిస్తోంది. భౌగోళిక, సైనిక పరంగా ఎన్ని సమస్యలున్నా, పైరెండు అంశాలు ఇరుదేశాల మధ్య సంబంధాలు కొనసాగడానికి ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. అంతేకాదు భౌగోళిక వాణిజ్యంలో అమెరికా`చైనాల మధ్య నెలకొన్న సంఘర్షణాత్మక వైఖరి నేపథ్యంలో చైనా మనదేశ మార్కెట్‌ను విస్మరించలేని పరిస్థితి నెలకొంది.

తాజాగా అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్‌ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత, భారత్‌` చైనాల మధ్య సంబంధాలు ఇబ్బందులకు లోనయ్యే అవకాశమున్న నేపథ్యంలో భారత్‌ సమతుల్యంగా జాగరూకతతో ఈ రెండు దేశాలతో దౌత్యనీతిని నెరపాల్సిన అవసరం ఏర్పడిరది. దక్షిణాసియాలో ముఖ్యంగా భూటాన్‌తో పాటు ఇతర ప్రాంతీయ హాట్‌స్పాట్‌లు ఇరుదేశాల దౌత్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపక మానవు. ఇప్పుడు లద్దాక్‌లో తాను ఆక్రమించిన భూభాగాలతో కలిపి కౌంటీలను ఏర్పాటుచేసి, దీనికి సంబంధించిన మ్యాప్‌ను విడుదల చేయడం, బ్రహ్మపుత్ర నదిపై అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దులో అతిపెద్ద డ్యాం నిర్మాణం చేపట్టాలని చైనా తీసుకున్న తాజా నిర్ణయం కచ్చితంగా రెండు దేశాల సంబంధాలను దెబ్బతీయక మానదు. చారిత్రకంగా ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఒకవైపు, ఆర్థిక సంబంధాలు, పరస్పర ప్రయోజనాలు మరోవైపు, భౌగోళిక`సైనిక సంఘర్షణలు మరోవైపు ఇరుదేశాల సంబంధాలను శాసిస్తున్నాయనడంలో సందేహం లేదు.

గుంటనక్క వ్యవహారశైలి

చైనా గుంటనక్క వ్యవహారశైలి అది టిబెట్‌ను స్వాధీనం చేసుకున్న దగ్గరి నుంచి మనకు బాగా అనుభవంలోకి వస్తున్నదే. కడుపులో విషం దాచుకొని పైకి ఏమీ ఎరగనట్టు నటించే ఆ దేశ కమ్యూనిస్టు నాయకులకు ఇప్పటికీ భూకాంక్ష వీడకపోవడం వారి ప్రాచీన, మధ్యయుగాల ఆలోచనా  సరళికి నిక్కచ్చి నిదర్శనం. వారి ఈ కుత్సిత వైఖరి కారణంగానే చుట్టుపక్కల 13 దేశాలతో చైనాకు శత్రుత్వం ఏర్పడిరది. కమ్యూనిస్టు పాలన వచ్చిన తర్వాత చైనాను ఏ దేశం నమ్మే పరిస్థితిలేదు. వారి విధానాలే అటువంటివి! ప్రపంచంలో నేడు చైనాకు విశ్వసనీయ మిత్రుడుగా వ్యవహరించే దేశం ఏదైనా ఉన్నదా అంటే భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఎంతసేపూ ఒక దేశాన్ని ఇబ్బందిపెట్టి తాను లాభపడ దామన్న ఆలోచనే తప్ప, పరస్పర సహకారంతో విజయపథంలో ముందుకెళదామన్న ఉద్దేశం కమ్యూనిస్టు పాలకులకు ఉండదు! కాలాన్ని బట్టి విధానాలను మార్చుకునే దేశాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం! చైనా విషయంలో ఇదే జరిగింది. మూర్ఖపు పిడివాదపు కోరలనుంచి మార్కెట్‌ ఎకానమీకి మారినప్పుడే దాని అభివృద్ధి శరవేగంగా జరిగింది. అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాల వెన్నుదన్నుతో ప్రపంచ తయారీకేంద్రంగా ఎదిగింది. అయినప్పటికీ ప్రపంచ మార్కెట్లను గుప్పిట్లో పెట్టుకొని, ఆర్థిక దన్నుతో చుట్టుపక్కల దేశాలను బెదిరించి పబ్బం గడుపు కోవడం ప్రస్తుతం చైనా అనుసరిస్తున్న రాజనీతి! ఇటువంటి నైజంవల్ల  సైద్ధాంతికంగా కమ్యూనిజాన్ని అనుసరించే రష్యా కూడా చైనాను పూర్తిగా నమ్మదు! ఎందుకంటే చైనా బుద్ధే అంత!

– విఠల్‌రావు

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE