‘‘శ్రీమద్రమా రమణీ మణీర మణీయ సరస చిత్తా బ్జంభర। పరాకు।’’
ఓ శ్రీహరీ నీవు రమణీ కమనీయ సరస చిత్తా బ్జంభర పరాకు అని భక్తుడు చెప్పడంతో రమణితో సరససల్లాపాలు ఆడటానికి నీకు ఇది సమయం కాదు కనుక వెంటనే వచ్చి శత్రువును తుదముట్టించాలని పైన ప్రస్తావించిన పద్యంలో కోరుతున్నాడు కవి. శ్రీవరాహలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం విశాఖపట్నంలో సింహాచలంలో కొలువై ఉంది. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో ఒరిస్సాకు చెందిన తూర్పు గంగరాజు నిర్మించాడు. లాంగుల నరసింహదేవ కళింగవాస్తు శిల్పం ప్రకారం కట్టించాడు. 1268లో అతని కుమారుడు భానుదేవ దేవాలయాన్ని ప్రతిష్టించాడు.
ఇతిహాసం ప్రకారం, రాక్షసరాజు హిరణ్య కశిపుడు విష్ణువుకు బద్ధ శత్రువు. అతడి కుమారుడు ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణుభక్తుడు. కుమారుడిలో విష్ణువు పట్ల భక్తి లేకుండా చేయడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తాడు రాక్షసరాజు. అయినా కానీ విఫలమైపోతాడు. ఎక్కడ నీ విష్ణువు? అని కుమారుని అడుగుతాడు. విష్ణువు అంతటా ఉంటాడని తండ్రికి చెప్తాడు ప్రహ్లాదుడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా? అని దాన్ని పగలగొడతాడు రాక్షసరాజు. వెంటనే విష్ణువు ఉగ్రుడైన నరసింహస్వామి రూపంలో స్తంభం నుంచి వెలుపలకు వస్తాడు. ప్రహ్లాదుని కాపాడుతాడు. హిరణ్యకశిపుని హతమారుస్తాడు. అలా సింహా చలంపై వెలిసిన ఆ ఉగ్రమూర్తిని శాంతింప జేయడానికి 364 రోజులు చందనం పూత వేసి ఉంచుతారు. ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే భక్తులకు స్వామి నిజరూప దర్శనమిస్తారు.
ఆలయంలో లభించిన శాసనాల ప్రకారం.. ఈ దేవాలయాన్ని తూర్పు గాంగులు, రెడ్డిరాజులు, గజపతులు దర్శించుకున్నారు. భారీగా విరాళాలు సమర్పించుకున్నారు. సా.శ. 1438, 1441 సంవత్సరాల్లో శ్రీకృష్ణదేవరాయలు తన భార్యలు చిన్నాదేవి, తిరుమలదేవితో కలిసి దేవదేవుని దర్శించుకున్నాడు. దేవాలయానికి అనేక గ్రామాలను దానంగా ఇచ్చాడు. గజపతులు పతనమైన తరువాత కుతుబ్‌షాహి వంశానికి చెందినవారు దేవాలయ సంపదను కొల్లగొట్టారు. అయితే క్రీ.శ. 1604లో పద్మనాయక కులుడు, సర్వప్ప ఆశ్వరాయుడు స్వామికి నిత్యం ధూపదీపనైవేద్యాల కోసం నరవ అనే గ్రామాన్ని దేవాలయానికి రాసి ఇచ్చారు.
కూచిమంచి తిమ్మకవి (1690-1757), కట్టమూరి కామేశ్వర కవి (1830-1890) సింహాచల మహాత్మ్యం – శ్రీలక్ష్మీనరసింహ చరిత్ర పేరుతో ప్రబంధాలు రాశారు.
పింగళి సూరన కళాపూర్ణోదయములో..
‘‘సింహాచలాదీశ సేవా విశేషలీ
లలను జన్మము నలంకరించి’’ అని రాశాడు.
ఈ సింహాచలం కళింగ దేశంలో ఉండేది. 3వ అనంగ భీముడు సింహాచలం బాగోగులు చూసుకునేవాడు. 7వ శతాబ్దంలో చైనా యాత్రికుడు హ్యువాన్‌త్యాంగ్ భారతదేశానికి వచ్చేనాటికి అంటే క్రీ.శ. 635 నుంచి 652 వరకు సింహాచలం కొండ భాగం నిర్మితమైంది. శ్రీనాథుడు, ఎఱ్ఱాప్రగడ, అల్లసాని పెద్దన, పింగళి సూరన తమ కృతులలో సింహాచలాన్ని ప్రస్తావించారు.
గోగులపాటి కూర్మనాథ కవిసింహాద్రి నారసింహ శతకాన్ని రాశాడు. ఇది వ్యంగ్య రచన. విజయ నగరానికి దగ్గర్లోని రామతీర్థంలో ఆయన నివసించేవారు. సింహాచల దేవస్థానంలో ఉద్యోగిగా పనిచేశారు. రామతీర్థంతో పాటు, పద్మనాభం, సింహాచలం, శ్రీకూర్మం, తదితర ప్రాంతాల్లో కూర్మనాథ కవి నివసించినట్టు తెలుస్తోంది. సింహాద్రి నారసింహ శతకం స్వామిని ఎత్తి పొడుస్తుంది. హెచ్చరికలు చేస్తుంది. ఆర్తి, ఆవేశాలతో ‘‘వైరి హర రంహ సింహాద్రి నారసింహ’’ అనే మకుటంతో శతకాన్ని రాశాడు కూర్మనాథ కవి. ఈయన శతకానికి ఆగ్రహించిన స్వామి, తన గుడిపై దాడికి దిగిన తురుష్కులను గండు తుమ్మెదల రూపంలో వెంబడించాడు. విశాఖపట్నంలో తుమ్మెదల మెట్ట వరకు వారిని తరిమి తరమి అంతమొందించినట్టు స్థలపురాణం చెబుతోంది.
కూర్మనాథ కవి శతక రచనకు పూనుకోవడానికి ఓ బలమైన కారణమే ఉంది. సా.శ. 1753లో దక్కన్ సుబేదార్ సలబత్ జంగ్ ఉత్తర సర్కారులను ఫ్రెంచ్ గవర్నర్ బుస్సీకి కౌలుకిచ్చాడు. బుస్సీ కౌలు సంస్థానాలను స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం మచిలీపట్టణంలో ఉన్న మారిసన్ అనే ఉద్యోగిని రాజమహేంద్రవరం, శ్రీకాకుళం సర్కారులకు పంపించాడు. కానీ శ్రీకాకుళంలో ఫౌజుదారుగా వ్యవహరిస్తున్న జఫరల్లీ ఖాన్‌కు ఇది నచ్చలేదు. అందుకని బలవంతుడైన విజయరామ గజపతితో సంధి చేసుకొని, ఆయన సాయంతో శ్రీకాకుళం, రాజమహేంద్రవరం సర్కారులను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలాలనుకున్నాడు జఫరల్లీ ఖాన్.
అయితే ఈ విషయాన్ని ముందుగానే కనిపెట్టిన మారిసన్ వెంటనే విజయరామ గజపతితో సంధి చేసుకున్నాడు. ఇది తెలుసుకున్న జఫరల్లీ ఖాన్ ప్రాణ భయంతో శ్రీకాకుళం వదిలి పారిపోయాడు. అదే సమయంలో విజయరామ గజపతిపైన, ఫ్రెంచ్ వారిపైన ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అందుకోసం అప్పటికే ఫ్రెంచ్ వారితో యుద్ధం చేస్తున్న నాగపూర్ పురాధీశ్వరుడైన రఘోజీని ఆశ్రయించా లనుకున్నాడు.
అలా జఫరల్లీ ఖాన్ నాగపూర్‌కు వెళుతుండగా దారిలో అతడికి సైన్యంతో ముందుకు సాగుతున్న రఘోజీ కుమారుడు కనిపించాడు. అయితే తనకు సాయంగా మైదానమార్గంలో కాకుండా కొండల మీదుగా రమ్మని రఘోజీ కుమారుడ్ని జఫరల్లీ కోరాడు. వారికి దారి చూపడానికి పాచిపెంట జమీందార్ వీరప్ప దొరను కూడా పంపించాడు. ఆ సమయంలో ఒకవైపు మరాఠా సైనికులు గ్రామాలను కొల్లగొడుతుంటే, మరోవైపు తురుష్కులు దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు. అంతంత మాత్రపు సైన్యంతో వారిని ఎదుర్కొన్న విజయరామరాజు వైరి సైన్యాలతో యుద్ధం చేయలేక తిరుగు ముఖం పట్టాడు.
ఎట్టకేలకు జాఫరల్లీ సైన్యం సింహాచలం చేరుకుంది. విషయం తెలుసుకున్న దేవాలయ ఉద్యోగి కూర్మనాథ కవి తోటి ఉద్యోగి ఆదుర్తి హరిహర నాథునితో కలిసి స్నానం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ గర్భగుడిలోకి వెళ్లారు. తలుపులు బిగించుకున్నారు. స్వామిపై ఆశువుగా శతక పద్యాలను చెబుతుంటే, అంతే స్థాయిలో ఆయన తోటి ఉద్యోగి వాటిని రాయసాగాడు. స్వామిపైన తిట్లు, తిరస్కారాలతో మొదలైన ఆ శతకం.. చివరకు క్షమాపణలతోనూ, ప్రార్థనలతోనూ ముగిసింది.
ఈ శతకంలో 101 పద్యాలను కూర్మనాథ కవి ‘‘వైరిహర రంహ, సింహాద్రి నారసింహ’’ అనే మకుటంతో రాశాడు. ‘‘వైరిహర రంహ’’ అంటే ‘‘శత్రువులను వేగంగా సంహరించేవాడా’’ అనే అర్థం వస్తుంది. శత్రువుల రూపంలో తురుష్కులు గుడిపైన దాడి చేస్తున్నారు.. వెంటనే వారిని మట్టుపెట్టు.. లేకపోతే నిన్ను నీవు రక్షించుకోలేనివాడివి.. మమ్మల్ని ఎలా కాపాడుతావు? అని స్వామిని శతకంలో ఎద్దేవా చేశాడు కూర్మనాథ కవి.
గర్భగుడిలో ఇలా ఉంటే.. కొండపైకి ఎక్కిన జఫరల్లీ సైన్యం గుడి ఆవరణలోకి చొరబడింది. గోపురాన్ని కూల్చసాగింది. ఆవరణలో రాతి రథానికి చెక్కిన గుర్రాలను చొరబాటుదారులు ధ్వంసం చేశారు. ఈలోగా ప్రధాన ఆలయంలోకి అడుగుపెట్టడానికి పూనుకుంటున్న ముష్కరులపైకి ఎక్కడ్నుంచో వచ్చిన ఓ గండు తుమ్మెదల గుంపు దాడి చేసింది. తురుష్కులను తుమ్మెదల మెట్ట వరకు తరిమి తరిమి మరీ తుదముట్టించింది.
అంతలో కావలసినంత సైన్యాన్ని సమకూర్చుకున్న విజయరామ గజపతి అనకాపల్లికి దగ్గర్లోని తుమ్మపాల వద్ద శత్రుసైన్యాన్ని ఎదుర్కొన్నాడు. వారిని ఓడించాడు. సైన్యసమేతంగా సింహాచలం చేరుకున్నాడు.
అలా సింహాచలానికి వస్తున్న దారిలో ఆయనకు చచ్చిపడున్న తురుష్కులు, గుర్రాల మృతదేహాలు కనిపించాయి. ఇదంతా గర్భగుడిలో చేరి, స్వామిపై శతక రచన చేసిన ఆ ఇద్దరి ఘనత అని తెలుసుకున్నాడు. కూర్మనాథుడికి రామతీర్థం అగ్రహారాన్ని, హరిహరనాథుడికి నిమ్మలపాలెం అగ్రహారాన్ని ఆనందంతో రాసి ఇచ్చాడు.
ఇప్పటికీ సింహాచలంలో కొన్ని విరిగిపోయిన విగ్రహాలు కనిపిస్తాయి. గుడి ఆవరణలో అద్భుతమైన శిల్ప సంపదను తురుష్కులు పాడు చేశారు. కూర్మనాథుడి కోరిక మేరకు ఆక్రమణదారులపై ఆగ్రహించిన స్వామి.. గండు తుమ్మెదల రూపంలో ముష్కర మూకపై దాడి చేశాడు. తుమ్మెదల ధాటికి సైనికుల్లో చాలా మంది కొండలపైన నేలరాలారు. పారిపోతున్నవారిని విశాఖపట్నంలో తుమ్మెదల మెట్ట వరకు తరమి కొట్టి మరీ చంపాయి తమ్మెదలు. కనుక ఇదంతా కథ కాదు నిజంగా జరిగిందే అని భావించాల్సి ఉంటుంది.
కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు