ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాకారం చేయదలుచుకున్న స్వర్ణాంధ్ర-2047కు విశాఖపట్నం సాగర తీరాన ప్రధాని నరేంద్రమోదీ బుధవారం, జనవరి 8, శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి అన్నట్టుగా కనీవినీ ఎరుగని రీతిలో ఆంధప్రదేశ్‌కు పెట్టుబడులు వెల్లువెత్తడానికి నాందీవాక్యం పలికారు. పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు, ఉద్యోగావకాశాలకు తలుపులు తెరిచారు. రాష్ట్రం కలలు కంటున్న 2.5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాకారానికి రంగం సిద్ధం చేశారు.
కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీయే కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత మొదటిసారిగా రాష్ట్రానికి విచ్చేసిన ప్రధాని, తన ఒక రోజు పర్యటనలో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా ఆయా ప్రాజెక్టులను వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేశారు.
ప్రాజెక్టుల వివరాలు:
- విశాఖపట్నంకు దగ్గర్లోని పూడిమడక వద్ద నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో భాగంగా అత్యంత అధునాతన పరిజ్ఞానంతో, రూ.1,85,000 కోట్ల వ్యయంతో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌కు చెందిన గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన. కేంద్ర ప్రభుత్వం 2023లో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ను చేపట్టింది. 2030 నాటికి 50 లక్షల మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదన లక్ష్యంగా పెట్టుకుంది. మిషన్‌లో తొలి విడతగా దేశంలో రెండు గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లను నెలకొల్పాలని సంకల్పించింది. మొట్టమొదటి హబ్‌కు విశాఖలో శంకుస్థాపన జరిగింది. రోజుకు 1,500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్, రోజుకు7,500 టన్నుల గ్రీన్ మిథనాల్, గ్రీన్ యూరియా, విమాన ఇంధనం లాంటి గ్రీన్ హైడ్రోజన్ ఉపఉత్పత్తుల ఉత్పాదక సామర్థ్యంతో ఈ హబ్ నిర్మితం కానుంది. మొదటగా ఎగుమతుల మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకునే హైడ్రోజన్ హబ్ రాష్ట్రంలో పారిశ్రామికీకరణకు ఊతమిస్తుంది. పెద్ద ఎత్తున ఉపాధి కల్పన, ఉద్యోగవకాశాలకు దారి తీస్తుంది.
- రూ.1,877 కోట్లతో అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి సమీపంలో బల్క్ డ్రగ్ పార్కుకు శంకుస్థాపన. విశాఖపట్నం-చెన్నయ్ ఇండస్ట్రియల్ కారిడార్ (వీసీఐసీ), విశాఖపట్నం-కాకినాడ పెట్రోలియం, కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్‌లకు చేరువలో ఏర్పాటవుతున్న ఈ బల్క్‌డ్రగ్ పార్కు దేశంలో ఆర్థిక వృద్ధికి ఊతమిస్తుంది. వేలాదిగా ఉద్యోగాలను కల్పిస్తుంది.
- రూ.19,500 కోట్లతో విశాఖపట్నంలో దక్షిణ కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయానికి శంకు స్థాపనతో పాటుగా రాష్ట్రంలో పలు రైలు, రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం. దక్షిణ కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపనతో ప్రత్యేక రైల్వే జోను కావాలంటూ స్థానికులు చిరకాలంగా చేస్తున్న డిమాండ్ సాకారం కావడానికి మార్గం పడింది. ఈ ప్రాంతంలో వ్యవసాయం, వాణిజ్య కార్యకలాపాలు గణనీయమైన విస్తరణకు నోచుకుంటాయి. పర్యాటకం, స్థానిక ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయడంలో కొత్త అవకాశాలు వచ్చిపడతాయి.
- చెన్నయ్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా తిరుపతి జిల్లాలో రూ.2,139 కోట్లతో కృష్ణపట్నం ఇండస్ట్రియల్ ఏరియాకు (కేఆర్‌ఐఎస్ సిటీ) శంకుస్థాపన. ఇది నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ పోగ్రామ్ కింద తొలి గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా రూపుదిద్దు కోనుంది. తయారీ రంగంలో దాదాపు రూ.10,500 కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తోంది. అంతేకాకుండా అటు ప్రత్యక్షంగా, ఇటు పరోక్షంగా దాదాపు ఒక లక్ష ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కల్పనకు కేఆర్‌ఐఎస్ సిటీ ఊతమిస్తోంది. అక్కడి ప్రాంతపు పురోగతికి మార్గం చూపిస్తుంది. స్థానికుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది.
ఉర్రూతలూగించిన విశాఖ రోడ్‌షో
విశాఖపట్నం పురవీధుల్లో ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన రోడ్‌షోకు నగరవాసులు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. ప్రధాని మోదీ బుధవారం, జనవరి 8, సాయంత్రం 4.20 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన నగరంలోని వీఐపీ రోడ్డులో ఉన్న వెంకటాద్రి వంటిల్లు ప్రాంతానికి చేరుకు న్నారు. అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో చేరుకున్న విశాఖవాసుల మధ్య రోడ్‌షోను మోదీ ప్రారంభిం చారు. నగరం నడిబొడ్డు నుంచి ఆరంభమైన ఈ రోడ్‌షో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓపెన్‌టాప్ వాహనంలో ప్రధాని మోదీ నిలుచుండగా ఆయనకు ఇరువైపులా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్ ఉన్నారు. అదే వాహనంపై ముగ్గురు నేతలకు వెనుకగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి నిలుచున్నారు. అభివాదం చేస్తున్న ప్రధానమంత్రిని నేరుగా చూడటానికి ప్రజలు ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఆయనపై అడుగడుగునా పూలవర్షం కురిపించారు. నరేంద్ర మోదీ ప్రధాన ఆకర్షణగా దాదాపు 45 నిమిషాల పాటు సాగిన రోడ్‌షోలో మహిళలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం. ప్రధాని సభా వేదిక ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌కు చేరు కోవడంతో రోడ్‌షో ముగిసింది.
– జాగృతి డెస్క్