భువనేశ్వరీ పీఠాధిపతి కమలానంద భారతి

దేవాదాయ ధర్మాదాయ చట్టం రద్దు మన ప్రథమ, ప్రధాన డిమాండ్‌ అని భువనేశ్వరీ పీఠాధి పతులు స్వామి కమలానంద భారతి పిలుపునిచ్చారు. అటు చెణుకులు, ఇటు అగ్గిరవ్వల సమ్మేళనంగా ఆయన ఉపన్యాసం ఇలా సాగింది.
‘‘ఇంతకాలం ఉపేక్షించిన ప్రజలలో ప్రశ్నించే తత్వం ఈ శంఖా రావం నుంచే బలపడాలి. రాజులు, జమీందారులు కట్టించిన గుళ్లూ గోపురాలపై ప్రభుత్వ పెత్తనం ఏమిటి? చట్టం పేరులోనే లోపం ఉంది. ‘హిందూ’ శబ్దంతో చట్టాన్ని ఉచ్చరించడానికి ప్రభుత్వానికి మనస్కరించడంలేదు. దేవాలయాల స్వయం ప్రతిపత్తిని తిరిగి పొందేందుకు హిందూ బంధువుల మధ్య ఐక్యత అవసరం. అవగాహనా లోపంవల్లనే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఆలయ వనరులు దోపిడీ, దుర్వినియోగ మవుతున్నాయి. భాగ్యనగరం శివారు శంషాబాద్‌ ‌ప్రాంతంలో వేలాది ఎకరాలు దేవుడి మాన్యాలు ఆక్రమణల పాలు కావడం ఒక ఉదాహరణ. ఆ కేసును ప్రభుత్వం అటకెక్కించింది. దేవుడి దర్శనం, ప్రసాదాల కోసం టికెట్లను సినిమా టికెట్ల తరహాలో విక్రయించడం దారుణం. పురాణాలపరంగా పరిశీలిస్తే, శ్రీమహా విష్ణువు దశావతారాలలో ఏడు ఆంధప్రదేశ్‌కు సంబంధించినవే. కనుక ప్రభుత్వం రాష్ట్రాన్ని ‘దేవ భూమి’గా ప్రకటించి,ఆధ్యాత్మికతను పటిష్టపరచాలి. దక్షిణాన తిరుపతి నుంచి ఉత్తరాన శ్రీకూర్మం దాకా ఆధ్యాత్మిక కారిడార్‌ను ఏర్పాటు చేయాలి. దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనాలను సహించబోం’’ అని స్వామి కమలానంద భారతీ స్పష్టం చేశారు. హిందూ సమాజం అంతా కృష్ణ పరమాత్మ సుదర్శన చక్రం అవ్వాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం అన్ని చోట్లా దేవాలయాల ఉనికి కనిపిస్తూనే ఉందన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా హిందువులందరూ అయోధ్య కరసేవకి కదిలారని గుర్తు చేశారు.
ప్రభుత్వం నుంచి దేవాలయాలను విముక్తి చేయాలని విజయవాడకి లక్షలాది మంది హైందవులు కదిలివచ్చారని, ఇందుకు కొందరు కుతకుత లాడిపోతున్నారని, దీనికి విజయవాడే నిదర్శనమని పేర్కొన్నారు. దేవాదాయ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో దేవాలయ బోర్డులపై హిందూ అన్న పదం తీసేశారని, దీనిపై వెంటనే ప్రభుత్వాలను నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రజల అవసరాల విషయంలో ధర్ణాలు, నిరసనలు చేస్తున్నారని, కానీ.. దేవాలయాల విషయంలో ఎన్ని తప్పులు జరిగినా సమాజం నిలదీయడం లేదన్నారు. దేవాలయంలో జరుగుతున్న తప్పులపై ప్రభుత్వాలను నిలదీయాలని, ఇది వెంటనే ప్రారంభం కావాలని సూచించారు.
షామీర్‌పేటలోని రాముడి దేవాలయ భూములను అమ్మేస్తే… అందరూ ఉద్యమం చేశారని, దీనిపై జస్టిస్‌ ‌వెంకట్రామిరెడ్డి కమిషన్‌ ‌వేశారన్నారు. కానీ.. దానికి సంబంధించిన రిపోర్టులను ఇంకా బయటపెట్టలేదన్నారు. దేవాలయ భూముల్లో అనేక నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టిందని విమర్శించారు. దేవాలయాల్లో హుండీ సంస్కృతిని ప్రభుత్వం ప్రోత్సహించి, డబ్బులను లాగుతోందన్నారు. దీనిపై హిందువులు ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు.

ఆలయాలను హిందువులే కాపాడుకోవాలి -గణపతి సచ్చిదానంద స్వామీజీ

దేశంలో ప్రతి ఆలయం గొప్ప గొప్ప దాతలు కట్టించినదేనని, అలాంటి ఆలయాలను మన తరం రక్షించుకోవాలని మైసూరు దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ పిలుపునిచ్చారు. హిందూ సంస్కృతికి 5120 సంవత్సరాల చరిత్ర ఉంది. హిందూరాష్ట్రం దేవలోకం అని విదేశీయులే చెబుతుంటారన్నారు. ఎన్నో పుణ్య నదులు, పర్వతాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టే దేవుడే అవతారాలు దాల్చడానికి ఈ భూమిని ఎంచుకున్నాడు. ఇక్కడ పుట్టడం మన అదృష్టమని అన్నారు. హైందవ ధర్మం ఇచ్చిన ఈ పిలుపు దిగంతాలకు చేరాలని, మన ప్రార్థన పరమాత్ముడికి చేరాలని ఆకాంక్షించారు. ఒక్క నినాదం శక్తి ఆ ప్రాంతంలో దశాబ్దాల పాటు నిలిచి ఉంటుందని ప్రకటించారు.
‘‘పతన దిశలో పయనిస్తున్న సంప్రదాయాలను పరిరక్షించుకోవడం మన సమష్టి బాధ్యత. ఎందరో రాజులు, దాతలు అందించిన ఆలయాలను కాపాడుకోవాలి. సంప్రదాయ వేడుకలను విస్మరిస్తూ, ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం, కేక్‌ ‌కోయడం, జన్మదిన వేడుకల సందర్భంగా కొవ్వొత్తులను ఊదడం (ఆర్పడం) తగదు. ఆలయ పరిరక్షణ లక్ష్యంతో విశ్వహిందూ పరిషత్‌ ‌శంఖారావం చేసింది. శంఖం అంటేనే విజయం. సనాతన ధర్మపరిరక్షణ లక్ష్యంతో చేపట్టిన ఈ మహోద్యమం విజయవంతం కావాలి. అవుతుంది’’ అన్నారు దత్త పీఠాధిపతి. మన ధర్మాన్ని మనమే పాలించుకోవాలని, మన ఆకాంక్షలను దత్తాత్రేయుడు నెరవేర్చుగాక అంటూ ఆశీర్వాదాలు అందించారు.

గోవును జాతీయప్రాణిగా గుర్తించాలి -శైవ పీఠాధిపతి శివస్వామి

సనాతన ధర్మంలో గోవుకు విశిష్టస్థానం ఉందని, గావో విశ్వస్య మాతరః. విశ్వానికే తల్లి గోవు అని శైవపీఠం శివస్వామీ అన్నారు. వేదాలలో 1331 సార్లు గో ప్రస్తావన వస్తుందని, క్షీరసాగర మథనంలో గోవు ఆవిర్భవించి పంచగోవులుగా మారి ఆ కామధేనువే భూమి మీద గోమాతగా జన్మ నిస్తుందని పేర్కొన్నారు.
హిందూధర్మంలో గోవుకు విశేషమైన ప్రాధాన్యం ఉందని, శ్రీకాకుళం నుంచి చెన్నై వరకూ ఎంతో గోవధ జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని రక్షించడానికి గోసంరక్షకులు ప్రయత్నించి నప్పుడు ఎన్నో నాటకాలు మొదలవుతాయని, ఫిర్యాదు చేసినవారిపైనే కేసులు పెడుతున్నారని మండి పడుతున్నారు. ఈ హైందవ శంఖారావం వేదిక మీద నుంచి ఒక సంకల్పం చేసుకుందాం.. గోవును జాతీయప్రాణిగా ప్రకటించాలని సంకల్పం చేద్దామని, అఖండభారత నిర్మాణమే ధ్యేయంగా ప్రయత్నం చేద్దామని శివస్వామీ పిలుపునిచ్చారు. గోమాత దేవాలయ మంత పవిత్రమైంది. లోకకల్యాణం, మానవ మనుగడ కోసం నిర్వహించే యజ్ఞాలు, గృహ సంబంధిత శుభకార్యాలలో గోవు ప్రధాన పాత్ర పోషిస్తోంది. నేడు ఈ గోవుకే రక్షణ లేకుండా పోతోంది. అనేక ప్రధాన ఆలయాలకు అనుబంధంగా ఉన్న గోశాలల నిర్వహణ లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. వీటిపై ఫిర్యాదు చేసినా బాధ్యులపై చర్యలు శూన్యం. గోరక్షణకు ప్రభుత్వం ఇకనైనా దృష్టి సారించాలి. గోసేవకు, గోసంరక్షణకు ప్రతి ఆలయానికి కనీసం అయిదు ఎకరాల స్థలం కేటాయించాలి. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి అని కోరారు.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE