అయోధ్యలో రామమందిర నిర్మాణంతోనే నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని, 1947లో రాలేదని ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత డా.మోహన్‌భాగవత్‌ ‌చెప్పడం అక్షర సత్యం. కాంగ్రెస్‌ ‌చెబుతున్నట్టు అది దేశద్రోహం ఎలా అవుతుందో దేశానికి అర్ధం కావడం లేదు. అటు రాజ్యాంగం గురించి, ఇటు చరిత్ర గురించి కనీస అవగాహన లేని రాహుల్‌ ‌గాంధీకే దేశద్రోహం కింద తగిన శిక్షపడాలి. విదేశాలలో కూడా దేశానికి విరుద్ధంగా రాహుల్‌ ‌చేసిన వ్యాఖ్యలు కోకొల్లలు. ఇలాంటి అవాకులు చవాకులు వాగడం, చీవాట్లు, మొట్టికాయలు, తినడం; బాబాకు కొత్తేమీ కాదు. అసంబద్ధ ప్రేలాపనలో ఇతగాడు మొనగాడు అన్న ముద్ర ఇదివరకే నమోదు అయింది. కొత్తగా రాజధాని నగరంలో కాంగ్రెసు భవనం ఇందిరాగాంధీ పేరిట వెలిసింది. ఆ సందర్భంలో రాహుల్‌ ‌చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా నిరసనకు ఏకైక లక్ష్యంగా మారింది.
ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బీజేపీలతో పాటు భారత రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడతానని లోక్‌సభలో విపక్ష నేత నూతన కార్యాలయంలో కాంగ్రెస్‌ ‌కార్యకర్తల సభలో చెప్పడం విడ్డూరం. రాముడు తప్ప కృష్ణుడు, నానక్‌, ‌బుద్ధుడు, ఎవరైనా ఫరవా లేదట. రామరాజ్యం అన్నా, రాముడి పేరు విన్నా, రాహుల్‌కి గిట్టదన్న మాట. రామరాజ్యం రావాలని గళమెత్తిన మొదటి వ్యక్తి గాంధీజీ. జీవితాంతం రఘుపతి రాఘవ రాజారాం అంటూ భజన చేసినది బాపూజీ. అలాంటి రామరాజ్యాన్ని కాంగీయులు వ్యతిరేకించడం దేశద్రోహమే కాదు ఆత్మద్రోహం కూడా.
ఆగష్టు 15, 1947న అర్థరాత్రి స్వాతంత్య్రం అర్థాంతరం అని, సమైక్యతకు శరాఘాతం అని, మత రాజకీయానికి నెహ్రూ విధేయులు తీసిన తెర అని ప్రపంచానికి తెలుసు. ఐకమత్యంగా, సత్యాగ్రహం ఆయుధంగా, స్వాతంత్య్ర సమరంచేసి గెలిచి, నిలిచిన బాపూజీ హత్యకు గురికావడానికి నెహ్రూ భజనరాయుళ్లే అసలైన కారణం. దేశాన్ని మత ప్రాతిపదికన విభజించవద్దని, అంతకన్నా తనను రెండు ముక్కలుగా నరకమని మహాత్ముడు విలపించాడు. ఎవరూ వినిపించుకోలేదు. నెహ్రూను ప్రధానిగా చేయడమే ఏకైక లక్ష్యంగా ఉద్యమం ఊపందుకున్నది. తొలి స్వాతంత్య్ర దినోత్సవంలో గాంధీజీ లేకపోవడం, మత కలహాలతో అట్టుడికి పోతున్న శ్రీరామ్‌పురానికి (పశ్చిమ బెంగాల్‌) అం‌తకు ముందే తరలిపోవడం తెలిసిందే.
దేశ ప్రగతికి, సురాజ్య స్థాపనకు, ఐకమత్యమే ప్రధానం. ఈ ప్రాథమిక సూత్రాన్ని కాంగీయులు విస్మరించారు ఆనాడే. పదవీ వ్యామోహం, అధికార దాహం, అంటకుండా జాతీయ కాంగ్రెస్‌ను రద్దు చేయాలని జాతిపిత ఆదేశించాడు. ఎవరూ పట్టించుకోలేదు. చివరిసారి 1948లో మతకల్లోలా లకు నిసనగా నిరాహారదీక్ష చేపట్టాడు బాపూజీ. ఆయన త్యాగం బూడిదలో పోసిన పన్నీరే అయింది. ఆ తర్వాత, రెండూ వారాలకు మృత్యువు వరించింది. అది హత్య కాదు; ఆత్మహత్య! ఆత్మీయులు, గాంధీయులు, అనుకున్నవారు ఏకమై ఆనాడు రోమన్‌ ‌సెనేటర్లు సీజర్‌ను హత్య చేశారు. ‘‘యూ టూ బ్రాటన్‌’’ అం‌టూ సీజర్‌ ‌కన్ను మూశాడు. విభజన జరగకపోయి ఉంటే, గాంధీ హత్యకు గురుకావలసిన పరిస్థితి ఎదురు అయ్యేది కాదు. ఐకమత్యం కోసమే ఆయన ప్రాణాలు ధారపోశాడు. రామనామంతోనే ప్రాణాలు అనంతంలో కలిసి పోయాయి. ఈనాడు రామమందిరంవెలిసి రామ రాజ్యం కల సాకారం చేసింది. ఆ రోజే రామ విగ్రహ ఆవిష్కరణ- దేశానికి నిజమైన స్వాతంత్య్ర దినం అవుతుంది.
26.1.2025న భారత్‌ అమృత కాల మహోత్సవం జరుగుతుంది. అఖండ భారత్‌కు శ్రీకారం కాబోతున్నది. రాజ్యాంగబద్ధంగా, పన్నెండవ నిబంధన ప్రకారం భారత్‌ ‌రాష్ట్రం అవుతుందిగాని, అమెరికాలా సంయుక్త రాష్ట్రం కాదు, రాష్ట్రాల సమాహారం సంయుక్త రాష్ట్రం- రెండింటికి తేడా ఉన్నది. కేంద్రం మణిహారంలో నాయకమణి, రాష్ట్ర ప్రభుత్వాలు మణిపూసలు. పూసలలో దారంలాంటి కేంద్ర ప్రభుత్వం సార్వభౌమత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలు సామంతం నెరపాలి. ఆర్థిక, సామాజిక, రాజకీయ, నిర్ణయాలు, దేశభద్రత, విదేశీ వ్యవహారాలు కేంద్రం నిర్వహించాలి.
ఇటీవలి కూటమిగా ఏర్పడిన కొన్ని రాష్ట్రాలు కేంద్రం మిథ్య అని, ఇష్టారాజ్యం నెరపాలని ప్రయత్ని స్తున్నాయి. కేంద్రానికి, రాష్ట్రానికి, వేరు వేరు అధికారాలతోపాటు ఏకీభావ అధికారాలను రాజ్యాంగం కేంద్రానికి ఇచ్చింది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టుగా, తమ తమ పరిధిలో పరిపాలన సాగిస్తూ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను రాష్ట్రాలు గౌరవించాలి. దేశ అభ్యుదయానికి, సమైక్య రాష్టప్రగతికి, దోహదం చేసే ప్రణాళికలను, పథకాలను అమలుపరిచి సహకరించాలి. గణతంత్రం రాజకీయ కుతంత్రానికి సాయపడే యంత్రాంగం కాకూడదు. భిన్నత్వంలో ఏకత్వానికి భారత రాజ్యాంగం నిదర్శనం.
ఏడు దశాబ్దాలు ఏదో రకంగా రాజ్యం ఏలాలను కున్న కాంగ్రెస్‌ ‌నెహ్రూ హయాంలో అనూహ్యమైన రాజ్యాంగ సవరణలు చేపట్టింది. ఓటు బ్యాంకు రాజకీయానికి అనుగుణంగా సోషలిస్టు, సెక్యూలర్‌ అనే పదజాలాన్ని ప్రవేశపెట్టింది. సమైక్యత, మత సామరస్యం, దెబ్బతినేలా, రాజకీయ చదరంగం చలాయించింది. ప్రచ్ఛన్నంగా శత్రు దేశాలతో చేతులు కలిపి దేశాన్ని విచ్ఛిన్నం చేసి బలహీనపరిచే చర్యలు ఇటీవల వెలుగులోనికి వచ్చాయి. చైనాతో రాహుల్‌, ‌సోనియాగాంధీలు చేసుకున్న ఆ రహస్యపు ఒప్పందం ఏమిటో ఇప్పటికి తేటతెల్లం కాలేదు. గతంలోపే విపక్ష నాయకుడు మాతృదేశానికి విరుద్ధంగా ప్రవర్తించలేదు. బాధ్యతా రహితంగా ప్రవర్తించడం వల్ల కాంగ్రెస్‌ అనూహ్యంగా ఎన్నికలలో దేశవ్యాప్తంగా దెబ్బతింటున్నది. దశాబ్దాలుగా సాగిన అవినీతి; కుల,మత వర్గ, విభేదాలకు ప్రతిఫలంగా పరపతిని, పరువు ప్రతిష్ఠలను, పోగొట్టుకుంటున్నది. తిరిగి అధికారాన్ని దక్కించుకోవడానికి ఎంతటి సాహ సానికైనా తెగబడుతున్నది. అంభి, జయచంద్రులను తనదన్నేలా చర్యలు చేపడుతున్నది.
భారత రాజ్యాన్ని విరోధించడం అంటే పాలు తాగి తల్లి రొమ్ము గుద్దడమే. బీజేపీ ప్రజలు ఎన్నుకున్న పాలకవర్గం. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రజా సాంస్కృతిక జీవితాన్ని సంరక్షించే సామాజిక వ్యవస్థ. వీటితోపాటు భారత్‌ను విరోధించడం అంటే ఏ పాటి రాజకీయ వ్యూహ రచనో అర్థం కాదు.
1947లో స్వాతంత్య్రం సాధించిన బాపూజీ సాక్షిగా దేశానికి స్వాతంత్య్రం రాలేదనే చెప్పుకోవాలి. దేశానికి ఆర్థిక స్వాతంత్య్రం వచ్చినప్పుడే స్వరాజ్యం పూర్ణ స్వరాజ్యం అవుతుందని, స్వాతంత్య్రం అర్థవంతం అవుతుందని నిర్మొహ మాటంగా గాంధీజీ ప్రకటించాడు. ఆ మాటనే డా. మోహన్‌ ‌భాగవత్‌ ‌పునరుద్ఘాటించారు. బాపూజీ కల సాకారం కాబోయే అవకాశాన్ని ప్రార్థించాడు.
రాజ్యాంగం చెల్లుబాటు కాదని భాగవత్‌ అనలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌కు త్రివర్ణపతాకం అంటే గౌరవం లేదని రాహుల్‌ ఎం‌దుకు అనుకుంటున్నాడో అంతుపట్టదు. త్రివర్ణపతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య ఒక దేశభక్తుడు. రాజ్యాంగాన్ని పట్టుకుని ప్రతిపక్ష నాయకుడిగా ప్రమాణం చేసిన రాహుల్‌కు రాష్ట్రాన్నే పణంగా పెడతానన్నందుకు సీతారామన్‌ ‌తగిన సమాధానమే చెప్పారు.
– నిరామయ

About Author

By editor

Twitter
YOUTUBE