తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, సహచర విద్యార్థుల ప్రభావం కూడా విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని పెంచుతుందని గమనించాలి. పరీక్షల్లో తాహతుకు మించి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న యువతలో ‘పరీక్షల ఆందోళన’ తారస్థాయికి చేరి ఫలితాలను మరింత ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. గత పరీక్షల్లో పొందిన మార్కులు లేదా ర్యాంకుల కంటే కొంతైనా మెరుగైన ఫలితాలను సాధించాలనే ఆచరణయోగ్య లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. మన శక్తి సామర్థ్యాలకు మించి మార్కులు లేదా ర్యాంకులు రావాలని ఆశపడడం వల్ల మన చదువులపై ప్రతికూల ప్రభావాలు పడడంతో పాటు గతం కన్న తక్కువ స్థాయిలో ఫలితాలు వస్తాయి.
ఆందోళనల లక్షణాలు
పరీక్షలు అనవసర ఆందోళనలు మన శారీరక, భావోద్వేగ ప్రతికూలతలకు దారితీస్తాయి. తల్లి తండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలపై అతిగా ఆశలు పెట్టుకోవడం, సహచరుల ఫలితాలను చూసి ఆత్మన్యూనతకు గురి కావడం సాధారణంగా జరుగుతుంది. ప్రతికూల ఒత్తిడి పెరిగిన యువతలో ఏకాగ్రత సడలడం, ఆందోళనలు పెరిగి ఎక్కువ సమయం చదవకపోవడం జరుగుతుంది. పరీక్షలంటే భయం పెరిగిన యువతలో శారీరకంగా అతిగా చెమటలు పట్టడం, వాంతులు, జీర్ణ సంబంధ సమస్యలు, గుండె వేగం పెరగడం, శ్వాస మంద గించడం, తల నొప్పి, కోపం పెరగడం, అధిక బీపీ, ప్రతికూల ఆలోచనలు వెంటాడడం, భయ దాడి (పానిక్ అటాక్) లాంటి అవలక్షణాలు కనిపిస్తాయి. భావోద్వేగ ఆందోళన వల్ల అభద్రతా భావం, తన శక్తి మీద నమ్మకం తగ్గడం, నిస్సహాయ స్థితి, ఏదో తెలియని లోపం వెంటాడడం, ప్రతికూల స్వయం భావనలు, అనవసర ఆలోచనలు వెంటాడడం, నిరాశ నిస్పృహలు మేలుకొనడం లాంటి మానసిక ప్రతికూల లక్షణాలు బయటపడతాయి. వీటికి తోడుగా ఏకాగ్రతకు భంగం కలగడం, చంచలత్వం, వాయిదా వేసే ప్రవృత్తి పెరగడం, ఇతర సహచరులతో అనవసరంగా పోల్చుకోవడం, నిద్ర లేమి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంది.
ఒత్తిడిని జయించడం ఎలా?
కొన్ని జాగ్రత్తల ద్వారా మనం ఒత్తిడిని జయించే అవకాశం ఉంది.
. రాబోయే పరీక్షలకు ముందుగానే ప్రణాళికలు తయారు చేసుకొని చదవడం ప్రారంభించాలి. పరీక్షా ఫలితాల పట్ల అనవసర ఆలోచనలు మన ఏకాగ్రతను మింగేస్తాయి. దీనిని అధిగమించాలి.
. సబ్జెక్టుల వారీగా ప్రణాళికలు రాసుకొని ప్రాధాన్యతాక్రమంలో చదవడం మంచిది. చదివిన పాఠాలు ఎంతవరకు గుర్తు ఉన్నాయో తెలుసుకొనడానికి స్వయం పరీక్షలు రాయాలి.
. చదువుతున్న సమయంలో గంట లేదా రెండు గంటకు ఒకసారి స్వల్ప విరామం తీసుకోవడం, దీర్ఘ శ్వాసలు తీసుకోవడం ఏకాగ్రతను మెరుగు పరుస్తాయి.
. గత పరీక్షలో పొందిన మార్కుల కన్న ఎక్కువ రావాలనే లక్ష్యాలు మంచి ఫలితాలను ఇస్తాయి. నిన్నటి కన్న నేడు మెరుగైతే మనం ప్రగతి బాటన నడిచినట్లే అని నమ్మాలి. మన మీద మనకు నమ్మకం ఉండాలి.
. మనం చదివే చదువుపై అనవసర ప్రతికూల ఆలోచనలకు స్వస్తి పలకాలి. నా శక్తివంచన మేరకు చదువుతున్నాను, నేను మంచి ఫలితాలను సాధించగలను, నేను అనుకున్న ఫలితాలు పొందకపోయినా రానున్న పరీక్షల్లో మెరుగు పరుచుకోగలనులాంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఆశావహ ఆలోచనలు మన ప్రతిభను పెంచుతాయి.
. దినచర్యను నిర్ణయించుకొని, మధ్య మధ్య పాలు లేదా పళ్లరసం వంటివి తాగుతూ మానసిక ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలి. చక్కెర అధికంగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండండి.
. చదవడాన్ని వాయిదా వేయవద్దు.
. మధ్య మధ్య ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి.
. చదువుతున్న పాఠంలోని ముఖ్య అంశాలను అండర్‌లైన్ చేసుకోవడం మంచిది. గ్రాఫ్‌లు, లెక్కలు, డయాగ్రమ్స్, సూత్రాలు, సమీకరణాలు లాంటి అంశాలను చదివే సందర్భంలో రాసుకుంటూ చదవడం మంచిది. ఒకసారి రాస్తే పది సార్లు చదివినట్లే అని తెలుసుకోవాలి.
. కఠినమైన అంశాలంటూ పక్కన పెట్టడం మంచిది కాదు. ప్రతిరోజు కొన్ని నిమిషాలు శారీరక వ్యాయామానికి కేటాయించండి.
. అవసరమని భావించినపుడు మీకు ఇష్టమైన టీచర్ లేదా సలహాదారుతో మాట్లాడండి.
పరీక్ష రోజు, తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు
పరీక్ష రోజున కనీసం 15-30 నిమిషాల ముందు పరీక్ష కేంద్రానికి చేరే విధంగా ప్రణాళిక వేసుకోవాలి. పరీక్షకు వెళ్లే ముందు అతిగా తినడం మంచిది కాదు. ప్రోటీన్లు అధికంగా ఉన్న నట్స్, గింజలు, చేపలు లాంటి ఆహారం పరిమితంగా తీసుకొండి.
అవసరమనించినపుడు కొద్దిపాటి నీరు తాగండి. పరీక్షకు ముందురోజు సమయానికి నిద్రపోవాలి. సమయానికి చేరలేమేమో అనే ఆందోళనలు మన ఏకాగ్రతకు భంగం కలిగిస్తాయి. పరీక్ష హాలుకు తీసుకుపోవలసిన హాల్ టికెట్, పెన్నులు, పెన్సిల్‌లు, ఇతర సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్ష హాల్‌లోకి అనుమతించరని గుర్తుంచుకోవాలి. పరీక్ష హాల్‌లో ఒత్తిడి పెరిగినట్లు అనిపిస్తే ఒకటి రెండు నిమిషాలు కళ్లు మూసుకొని, నిశ్శబ్దం పాటించి, దీర్ఘశ్వాసలు కొన్ని తీసుకొని వదలడం చేసిన తర్వాత మళ్లీ రాయడం మొదలు పెట్టండి.
సమాధానాలు రాస్తున్నపుడు సమయపాలన పాటించండి. చివరి నిమిషాల్లో ఆందోళనలు పెరిగే పనులు చేయవద్దు. పరీక్షల్లో రాసేటప్పుడు ఇతర సహచరుల వైపు చూడవద్దు. మార్కులను బట్టి ఏ ప్రశ్నకు ఎంత సమయం కేటాయించాలో నిర్ణయించు కొండి. కనీసం 10-15 నిమిషాల ముందు రాయడం పూర్తి చేసి, ఏం రాశామో, ఎలా రాశామో పేపర్‌ను తిరగేసి పరిశీలించండి. ఒకటి రెండు చిన్న ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా రాయకపోయినా దాని గురించి అనవసర ఆందోళన చెందితే రాబోయేపరీక్షలపై దాని ప్రతికూల ప్రభావం పడుతుందని మరువరాదు. నీపై నీకు నియంత్రణ ఉండే విధంగా చూసుకోవాలి. పరీక్ష పూర్తి అయిన తర్వాత ఎలా రాశామో అంచనా వేయవచ్చుగాని, అతిగా దాని గూర్చి ఆలోచించవద్దు.
తల్లితండ్రుల పాత్ర
పరీక్షల పట్ల ఆశావహ ఆలోచనలు మెరుగైన ఫలితాలను అందిస్తాయని, నేను బాగా రాయగలను, ఉత్తమ ఫలితాలను సాధించగలను అనే ఆలోచనలు మన ప్రతిభకు ఊతం ఇస్తాయి. శక్తివంచన మేరకు కృషి చేయడం, పరీక్షలను చక్కగా రాయడం, ఫలితాల పట్ల ముందే అతిగా ఆశలు పెట్టుకోవడం మానండి. ఆత్మవిశ్వాసం పెంచే విధంగా మన మీద మనకు నమ్మకం కలిగి ఉండాలి. తల్లితండ్రులు పిల్లలను అనవసర ఆందోళనలకు గురి చేయవద్దు. శక్తికి మించిన భారాన్ని మోపవద్దు. సమతుల ఆహారం ఇవ్వండి. ఇతర పిల్లలతో పోల్చడం మానేయండి. ప్రేరణాత్మక వాతావరణం కల్పించండి. మార్కులు అతిగా రావాలని ఇబ్బంది పెట్టకండి. ఉత్తమ పుస్తకాలు, చదివే వాతావరణం, కుటుంబ ప్రశాంతత, ఏకాగ్రత పెంచే సౌకర్యాల కల్పన చేయడం మరువరాదు. మన పిల్లల శక్తిసామర్థ్యాలను తెలుసుకొని వారికి మార్గనిర్దేశనం చేయడండి.
పరీక్షలు అంటే బ్రహ్మ విద్య కాదని, నీ జ్ఞాపక శక్తికి ఒక పరీక్ష అని, దానితోనే జీవితం ముడిపడి ఉందనే భావనలను చెరిపేస్తూ, జీవితాంతం ఒకదాని తర్వాత మరొక పరీక్ష ఉంటుందని తెలుసుకోవాలి. పరీక్షలే జీవితం కాదని, జీవితంలో పరీక్షలు ఒక చిన్న భాగమని పిల్లలకు ధైర్యం నూరిపోద్దాం. వారి ఎదుగుదలకు మన చేయూతను అందిద్దాం.
-డా. బుర్ర మధుసూదన్ రెడ్డి