పశ్చిమాసియాపై పట్టుకోసం తహతహలాడుతున్న అమెరికా, ఇజ్రాయిల్‌ ‌ముసుగులో అక్కడ వాలిపోయింది. సిరియా అధ్యక్షుడు బషార్‌ అల్‌ అస్సాద్‌ ‌ప్రభుత్వాన్ని కూలదోసి, ఒకనాడు తామే తీవ్రవాది అంటూ ముద్రవేసి, అతడి తలపై 10 మిలియన్ల బహుమానం ఉంచిన, ఇస్లామిక్‌ ‌స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ ‌మొలక సంస్థ హయత్‌ ‌తహ్రీర్‌ అల్‌- ‌షామ్‌ (‌హెచ్‌టిఎస్‌) ‌నాయకుడు అబూ మహమ్మద్‌ అల్‌- ‌జలోనీ ఆ దేశానికి తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నా, కిమ్మనకపోవడానికి వెనుక ఉన్న కారణం ఆ దేశాన్ని అంతఃసంక్షోభంలోకి నెట్టడమే అన్నది నిర్వివాదం. కాగా, తమ దృష్టి జిహాద్‌ ‌మీదకన్నా జాతీయవాదం మీద ఉంటుం దంటూ జలోనీ ప్రకటించడం ద్వారా అమెరికా అజెండాను తాను అనుసరించబోమని చెప్పకనే చెప్పాడు. కాగా, సిరియాకు సంబంధించిన ఈ చదరంగంలో రకరకాల శక్తులు జోక్యాన్ని కలిగి ఉన్నా, గెలుపు ఎవరిదో స్పష్టత రావడానికి సమయం పడుతుంది. కేవలం పదిహేను రోజులలో మొత్తం ఈ పాలనా మార్పిడి జరిగిపోయినప్పటికీ, దానికి విత్తులు మాత్రం అక్టోబర్‌ ఏడవ తేదీన ఇజ్రాయెల్‌ ‌దాడితో పడ్డాయని రాజకీయ విశ్లేషకుల భావన.

ఇ‌జ్రాయెల్‌లో జరుగుతున్న నోవా మ్యూజిక్‌ ‌ఫెస్టివల్‌పై అక్టోబర్‌ 7, 2023‌న హమాస్‌ ‌నాయకుడు సిన్వర్‌ ‌ప్రారంభించిన దాడితోనే అస్సాద్‌ ‌కూలదోసేం దుకు శ్రీకారం చుట్టడం జరిగిందని పశ్చిమాసియా వ్యవహారాల నిపుణులు అంటున్నారు. ఈ ఘటనతో ప్రపంచం స్తంభించిపోయింది. ఈ పరిణామాలు ఒక ఏడాది అనంతరం అస్సాద్‌ ‌ప్రభుత్వ కూల్చివేతకు దారి తీస్తాయని ఆ సమయంలో ఎవరూ ఊహించ లేదు కానీ భౌగోళిక రాజకీయ ఎత్తుగడలు ఇలాగే ఉంటాయన్నది వాస్తవం. అయితే, లెబనాన్‌ ‌నుంచి ఇజ్రాయెల్‌కు ఉత్తర సరిహద్దుల్లో యుద్ధం ప్రారంభించాలని అస్సాద్‌కు సన్నిహితుడైన హెజ్బొల్లా నేత నస్రల్లా నిర్ణయించి, తప్పులో కాలువేశాడు. ఎందుకంటే, ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇజ్రాయెల్‌ ‌ప్రతిఘటన కేంద్రం (రెసిస్టెన్స్ఆక్సిస్‌) ‌కీలక నాయకుడైన నస్రల్లాను హతం చేయాలని నిర్ణయిం చడంతో కథ అడ్డం తిరిగింది. దీనితో అస్సాద్‌ ‌కుడి భుజం విరిగినట్టైంది.
సిరియాలో యుద్ధం ప్రారంభమైన తర్వాత, తన సైన్యం తనకోసం యుద్ధంచేసే స్థితిలో లేదని అస్సాద్‌కు అర్థమైంది. 2011లో అంతర్యుద్ధ నేపథ్యంలో యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌సహా ఇతర పాశ్చాత్య దేశాలు విధించిన అంతర్జాతీయ ఆర్ధిక ఆంక్షలు ప్రతాపం చూపడం ప్రారంభం కావడంతో, అతడు సైనికులకు వేతనాలు చెల్లించే పరిస్థితి కూడా లేకపోయింది. సైన్యంలో ఉన్నవారితో సహా ప్రజల జీవనప్రమాణాలు క్షీణించడం ప్రారంభమైంది. దీనితో నాటి వరకూ సైన్యంలోనూ, నిఘాలోనూ కీలక పాత్ర పోషించిన షియాల్లో ఒక తెగ అయిన అలావీలను కాదని, అస్సాద్‌ ఇతర షియా గ్రూపులు, ఇరాన్‌పై ఎక్కువ ఆధారపడడంతో దేశంలోని 75శాతమున్న సున్నీ జనాభా అతడికి దూరం కావడం ప్రారంభించిందని, షియా గ్రూపులు, ఇరాన్‌ ‌తమ ప్రభావాన్ని విస్తరింపచేయడం వారికి నచ్చలేదన్నది నిపుణుల మాట.
ఈలోగా ఇజ్రాయెల్‌ ‌హిజ్బుల్లాను అణచివేసి, ఆ ప్రాంతంలో ఇరాన్‌ ‌ప్రభావాన్ని ధ్వంసం చేయాలని నిర్ణయించడంతో, టర్కీ తెరపైకి వచ్చింది. ఒక వ్యూహం ప్రకారం, అస్సాద్‌ ‌తిరస్కరిస్తాడని తెలిసే కుర్దులకు వ్యతిరేకంగా పోరాడుదామంటూ టర్కీ నాయకత్వం బహిరంగంగానే అస్సాద్‌కు సమాచారం పంపింది. తాము రాజీ ధోరణిలో ఉన్నామే తప్ప డమాస్కస్‌కు వ్యతిరేకంగా పోరాడేం దుకు సిద్ధంగా లేమని అస్సాద్‌ను నమ్మించేందుకు చేసిన ప్రయత్నమది. దీనితో ప్రతిపక్షాలు ఇద్లిబ్లిద్‌లో దాడులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయంటూ నిఘా వర్గాల సమాచారాన్ని అస్సాద్‌ ‌విస్మరించారు.
మాస్కోలో తన కుమారుడి గ్రాడ్యుయేషన్‌ ‌వేడుకలకు అస్సాద్‌ ‌హాజరైన సమయంలో డిసెంబర్‌ 2‌న అలెప్పోపై దాడి ప్రారంభమైంది. హెచ్‌టిఎస్‌ ‌నేతృత్వంలోని సిరియా సాయుధ దళాలు అలెప్పోపై దాడి చేసేందుకు టర్కీ వారిని సిద్ధం చేసిందన్నది భౌగోళిక రాజకీయ విశ్లేషకుల భావన. సిరియాలోని రెండవ అతిపెద్ద నగరంపై సాయుధ దళాలు తేలికగా పట్టు సాధించడం ఆశ్చర్యం.
అది అంత తేలిక ఎలా అయింది?
సిరియా సైన్యంలో అధికార వర్గం జీతం నెలకు 30 అమెరికన్‌ ‌డాలర్లట. నిర్బంధన సైనిక సేవలో ఉన్నవారి పరిస్థితి మరీ అధమం, వారి వేతనం 10 డాలర్లు. తమ వేతనాలను వసూలు చేసుకుని, కుటుంబాన్ని నడిపేందుకు వీలుగా తమ దిగువ సిబ్బంది ఇంట్లో ఉండి పని చేసేందుకు సీనియర్‌ అధికారులు అనుమతించారు. దీనితో, సైన్యం అంతర్గతంగా బలహీనపడి, కొద్దిమంది మాత్రమే పోరాడేందుకు మిగిలారు. ఇక అలెప్పోలో స్థావరం కలిగి ఉన్న హెజ్బొల్లా సైనికులు లెబెనాన్‌లో ఇజ్రాయెల్‌ ‌చేస్తున్న దాడుల నుంచి కాపాడుకునేందుకు అక్కడ తమవారికి సహాయం చేయడంలో మునిగి ఉన్నారు. ఇరాన్‌, ఇరాక్‌ ‌తిరుగుబాటు గ్రూపులు 2017 నుంచే తిరుగుముఖం పట్టాయి. అందుకే, డిసెంబర్‌ 2‌వ తేదీన దాడి జరిగినప్పుడు అలెప్పో నగరాన్ని కాపాడేందుకు సైనికులే లేకుండా పోయారు. టర్కీ తనతో చర్చలు నిర్వహిస్తుందనే నమ్మకంతో అస్సాద్‌ ‌కొంత అలసత్వం వహించాడు. కాగా, ఇదంతా ఒక ప్రణాళికలో భాగమని ఊహించకుండా, టర్కీ ఉద్దేశ్యాలను సరిగా అంచనా వేయకపోవడం అస్సాద్‌ ‌చేసిన పొరపాటని నిపుణుల భావన. ఈ క్రమంలో పుటిన్‌ను సాయం చేయవలసిందిగా అస్సాద్‌ ‌కోరాడని, అయితే సిరియా సైన్యమే నిబద్ధతతో లేని సమయంలో ఉక్రెయిన్‌ ‌యుద్ధం నుంచి కొంత సేనలను మినహాయించి అక్కడకు పంపడానికి పుటిన్‌ ఇష్టపడలేదనే వార్తలు వచ్చాయి. డమాస్కస్‌లో ఉన్న ఇరాన్‌ ‌విదేశాంగ మంత్రి నుంచి కూడా అదే సమాధానం వచ్చింది. తర్వాత తిరుగుబాటు సేనలు రాత్రి వేళలోనే కీలక నగరాలైన హమా, హోమ్‌పై దాడి చేసి తమ పట్టు సాధించాయి. దీనితో అస్సాద్‌కు దేశం విడిచి రష్యా పారిపోవడం తప్ప మరొక మార్గం లేకపోయింది.
సిరియా సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్‌ ‌దాడులు
అటు అస్సాద్‌ ‌దేశాన్ని విడిచిపారిపోవడం ఏమిటి, ఇటు సిరియాలో వ్యూహాత్మక సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెలీ వైమానిక దళం దాడులు ప్రారంభిం చింది. అరాచక శక్తుల చేతుల్లో ఆయుధాలు పడకుండా ఉండేందుకే ఈ దాడులు చేస్తున్నట్టు ఇజ్రాయెల్‌ ‌తన పనిని సమర్ధించుకుంటోంది. దీనితో పాటుగా, యోమ్‌ ‌కిప్పర యుద్ధానంతరం ఇరు దేశాలకూ మధ్య బఫర్‌ ‌జోన్‌గా గోలన్‌ ‌హైట్స్‌ను చేస్తూ 1974లో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి, అక్కడ తన సేనలను ప్రవేశపెట్టింది. ఇది కేవలం భద్రతా కారణాలతో తీసుకున్న తాత్కాలిక చర్య అంటూ సిరియా విదేశాంగ మంత్రి గిడియాన్‌ ‌సార్‌ ‌సమర్ధించుకున్నారు. మరొకవైపు నుంచి మధ్య సిరియాలో గల ఇస్లామిక్‌ ‌స్టేట్‌ ‌లక్ష్యాలపై అమెరికా సెంట్రల్‌ ‌కమాండ్‌ ‌కూడా దాడులు ప్రారంభించి, ఐఎస్‌ఐఎస్‌ ‌కమాండర్లు, కార్యకర్తలు, శిబిరాలు సహా దాదాపు 75 స్థావరాలను ధ్వంసం చేసినట్టు ప్రకటిం చుకుంది. అస్సాద్‌ ‌పదవీచ్యుతుడు అయిన తర్వాత ఇక్కడ ఇస్లామిక్‌ ‌శక్తులు విజృంభించకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు అమెరికా సమర్ధించుకుంది. సిరియాపై వైమానిక దాడులలో టర్కీ కూడా జోక్యం చేసుకుని, తమకు ఏ దేశ భూభాగాన్నీ అక్రమించుకునే ఉద్దేశ్యం లేదని, కేవలం ఉగ్రవాద దాడుల నుంచి తమ దేశాన్ని కాపాడుకు నేందుకు మాత్రమే ఈ దాడులు చేశామని ప్రకటించు కుంది.
సిరియాలో ప్రభుత్వ మార్పుతో
భారత్‌పై ప్రభావం?
భారత్‌, ‌సిరియాల మధ్య సన్నిహిత సంబంధాలు చాలాకాలంగా కొనసాగుతున్నాయి. అస్సాద్‌ను పాలస్తీనా స్టేట్‌ ‌విషయం, గోలన్‌ ‌హైట్స్ ‌వంటి కీలక అంశాలపై అంతర్జాతీయ వేదికలపై భారత్‌ ‌సమర్ధించగా, మరోవైపు అస్సాద్‌ ‌కశ్మీర్‌ అం‌శంలో భారత్‌ను సమర్ధిస్తూ వచ్చాడు. సిరియా తిరిగి అరబ్‌ ‌లీగ్‌లో చేరిన తర్వాత ద్వైపాక్షిక సంబంధాలను భారత్‌ ‌పునరుద్ధరించడమే కాదు, కొవిడ్‌ ‌మహమ్మారి కాలంలో మానవతాకారణాలతో సిరియాపై ఆంక్షలను సడలించాలని కోరింది. కాగా, సిరియాలో ప్రభుత్వ మార్పుతో భారత్‌-‌గల్ఫ్-‌సూయెజ్‌ ‌కెనాల్‌- ‌మెడిటరేనియన్‌/ ‌లెవాంత్‌- ‌యూరోప్‌ ‌కారిడార్‌ అభివృద్ధిలో భారత్‌ ‌పెట్టుబడులు నిలిచిపోవచ్చని కొందరు విశ్లేషకుల భావన. ఇందులో సిరియా కీలక వాటాదారుగా ఉండవలసింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు సానుకూలంగా ఉంటే పశ్చిమాసియా రాజ్యాల్లోకి భారత్‌ ‌తన ఆర్ధిక సంబంధాలను విస్తరించేందుకు అవకాశం కలిగి ఉండేదని వారి భావన.
భారత్‌ ‌పెట్టుబడులు సిరియాలో భారీగా అనిపించకపోవచ్చు కానీ, కీలక రంగాల్లో ఉన్నాయి. పలు థర్మల్‌ ‌విద్యుత్‌ ‌కేంద్రాల విస్తరణకు 240 మిలియన్‌ ‌డాలర్ల లైన్‌ ఆఫ్‌ ‌క్రెడిట్‌, ‌స్టీల్‌ప్లాంట్ల ఆధునీకరణ, జౌళి ఎగుమతులు నిలిచిపోయిన నేప థ్యంలో కొంతకాలం ఈ భావనకు రావడం సహజమే అని వారంటున్నారు. అలాగే, సిరియా విద్యార్ధులు భారత్‌లో చదువుకునేందుకు స్కాలర్‌షిప్‌ ‌లను, 2023లో సంభవించిన తీవ్ర భూకంపం సందర్భంగా ఆపరేషన్‌ ‌దోస్త్‌లో భాగంగా మానవతా సాయం వంటి తోడ్పాటును భారత్‌ అం‌దించింది. 2020-2023 మధ్య కాలంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం 100 మిలియన్‌ ‌డాలర్ల మేరకు ఉండగా, అది 2024లో 80 మిలియన్లకు క్షీణించింది.
సిరియాలో 2011లో చోటు చేసుకున్న అంతర్యుద్ధ సమయంలో అరబ్‌ ‌లీగ్‌ ‌సిరియా సభ్యత్వాన్ని సస్పెండ్‌ ‌చేసిన కాలంలో తమ రాయబార కార్యాలయాన్ని ఉపసంహరించడం కానీ మూయడం కానీ చేయమన్న భారత్‌ ఇచ్చిన హామీ వారికి మరింత అపురూపంగా కనిపించింది. వాస్తవానికి సంక్షోభ నివారణకు సిరియా నేతృత్వంలో సమ్మిళిత రాజకీయ పక్రియలను, సైనికేతర పరిష్కారాన్ని భారత్‌ ‌ప్రతిపాదించింది. ఇప్పుడు బషార్‌ అల్‌ అస్సాద్‌ ‌పదవీచ్యుతుడు కావడం అన్నది ఆ ప్రాంతంలో భారత్‌ ‌రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాలకు గంభీరమైన సవాళ్లను విసురుతోంది. ముఖ్యంగా, హెచ్‌టిఎస్‌ ‌డమాస్కస్‌పై పట్టు సాధించడం వల్ల ఐఎస్‌ఐఎస్‌ (‌దాయిష్‌), అల్‌ఖైదాతో గల చిన్న ఫ్యాక్షన్లు పునరు జ్జీవనం అయ్యే అవకాశం ఉందంటూ భారత్‌ ‌విదేశాంగ కార్యదర్శి వ్యక్తం చేసిన ఆందోళనలో నిజం లేకపోలేదు.
కాగా, అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాల ఆధారంగా స్థానిక, ప్రాంతీయ భాగస్వాములతో కలిసి భారత్‌ ‌తన ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నం చేయవచ్చన్నది విశ్లేషకుల అంచనా. ప్రధానంగా, సిరియా నేతృత్వంలో శాంతి పక్రియ ఉత్తమ ప్రత్యామ్నాయంగా కనిపించినప్పటికీ, అక్కడ పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఏదైనా నిర్దిష్టంగా చెప్పడం కష్టమని పశ్చిమాసియా అధ్యయన వేత్తలు అంటున్నారు. ముఖ్యంగా, సిరియాకు 60 శాతం ఆదాయాన్ని, 15శాతం ఎగుమతులను కలిగిన ముడి చమురు గనులు అభివృద్ధి లేకుండా పడి ఉన్న నేపథ్యంలో ఇరాక్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న అమెరికన్‌ ‌కార్పొరేట్‌ ‌సంస్థలు ఇక్కడ దిగిపోయే అవకాశం కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా, హెచ్‌టిఎస్‌ ‌రష్యా, ఇజ్రాయెల్‌, ‌జోర్డాన్‌, ‌లెబెనాన్‌లతో వెనుక దారి నుంచి చర్చలు ప్రారంభించి, ప్రాంతీయ చర్చలకు తాము సిద్ధమనే సంకేతాను ఇస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే, భారత్‌తో దాని వైఖరి ఎలా ఉండనుందనే విషయం స్పష్టం కాలేదు. సిరియా ప్రస్తుతం తీవ్రమైన, నాటకీయ పరివర్తనకు లోనవుతోంది. ఇక్కడ అధికార గతిశీలత నిర్ధిష్టంగా లేని నేపథ్యంలో, వారితో అధికారిక దౌత్యపరమైన చర్చలను ఆచితూచి చేయాల్సి ఉంటుందని వారు అంటున్నారు. ఈ ప్రాంతంలో ఇరాన్‌, ‌టర్కీ, రష్యా కీలక భాగస్వాములు అయిన నేపథ్యంలో అందరితో సానుకూల సంబంధాలను కలిగి ఉండడం ద్వారానే న్యూఢిల్లీ పురోగతిని సాధించవచ్చు.
ఒకవేళ సిరియా ఆఫ్ఘన్ల బాటలో నడిచినా, భారత్‌కు తాలిబన్లతో ఎలా వ్యవహరించాలో అనుభవం ఉంది. అయితే, జలోనీ తానేమీ అతివాద ఇస్లామిజాన్ని దేశంపై రుద్దబోనంటూ ప్రకటనలు చేస్తున్న క్రమంలో అతడు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటాడని ఆశించవచ్చు. అయితే, హెచ్‌టిఎస్‌ ‌రాజకీయ జిహాదీలు. వారు కార్యసాధక, ఆచరణాత్మకమైన వారే తప్ప సలాఫీ జిహాదీల సిద్ధాంతాన్ని పట్టుకు వేళ్లాడరు. ఏమైనా, జాగ్రత్తగా ఉండక తప్పదని నిపుణులు చేస్తున్న సూచన పరిగణనలోకి తీసుకోవలసిందే.

- జాగృతి డెస్క్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE