జార్ఖండ్ ఫలితం ఇండీ కూటమికి దక్కింది. ప్రజాతీర్పును గౌరవిస్తూనే ఆ రాష్ట్రంలో వాస్తవిక పరిస్థితుల గురించి కూడా మాట్లాడాలి. ఆ పని బీజేపీ చేసింది. అక్కడ గిరిజన జనాభా తగ్గి మైనారిటీలు పెరగడం ప్రమాదకరంగా పరిణమించింది. అన్ని రాజకీయ పక్షాల కంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక ఓట్లు సంపాదించుకుంది. అధికారం దక్కించుకోకపోయినా ఓట్ల శాతం పరంగా అగ్రస్థానంలో నిలిచి జార్ఖండ్ ప్రజల ఆదరణ చూరగొంది. చిన్నా చితక పార్టీలతో జట్టు కట్టినప్పటికీ పూర్తిగా సొంత బలంపైనే ఆధారపడిన బీజేపీ 33.18 శాతం ఓట్లు దక్కించుకుంది. మొత్తం 59,21,474 ఓట్లు కమలానికి పడ్డాయి. దీంతో 81 సీట్ల జార్ఖండ్ బీజేపీ 21 స్థానాలు కైవసం చేసుకొంది.
ఎన్‌డీఏ మిత్రపక్షాలైన ఆల్ జార్ఖండ్• స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ), జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), లోక్ జనశక్తి పార్టీ (రాంవిలాస్ పాశ్వాన్) (ఎల్జేపీ (ఆర్వీ) తలా ఒక్కొక్క సీటు గెలుచుకున్నాయి. అంటే జార్ఖండ్‌లో ఎన్డీఏ కూటమి మొత్తం 24 స్థానాలు దక్కించుకుంది. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేతృత్వంలోని ఇండీ కూటమి 56 స్థానాలతో అధికారాన్ని నిలబెట్టుకుంది. ఈ కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించిన జేఎంఎం 34 సీట్లు దక్కించుకుంది. జేఎంఎం మిత్రపక్షం కాంగ్రెస్ 30 స్థానాల్లో పోటీ చేసి16 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఈ కూటమిలోని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) 4, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ (సీపీఐ(ఎంఎల్) 2 చోట్ల విజయం సాధించాయి. మరో ప్రాంతీయ పార్టీ జార్ఖండ్ లోక్‌తాంత్రిక్ కాంతికారీ మోర్చా (జేకేఎల్‌ఎం) 1 సీటు సాధించింది. నవంబర్ 13, 20న రెండు దశల్లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగగా నవంబర్ 23న ఫలితాలు వెలువడ్డాయి.
సానుకూలంగా సానుభూతి
సాధారణంగా భారతీయులది జాలి గుండె. బద్ధ విరోధికైనా సరే కష్టమొస్తే అయ్యో పాపం అని జాలి చూపించే సంస్కృతి మనది. ఇక ఎన్నికల్లో సానుభూతి ప్రభావం ఉంటుందనడానికి అనేక ఉదాహరణ లున్నాయి. అవినీతి కేసుల్లో జైలుకెళ్లిన వారు ఎన్నికల్లో గెలిచి అందలమెక్కిన దృష్టాంతాలు మన భారతదేశంలో అనేకం ఉన్నాయి. ఈ జాబితాలో ప్రస్తుత జార్ఖండ్ ఎన్నికను కూడా చేర్చేందుకు సందేహించాల్సిన పని లేదు. మనీ లాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టు కావడం ఈ ఎన్నికల్లో జేఎంఎంకు కలిసొచ్చింది. మీడియా, సోషల్ మీడియాను ఉపయోగించుకొని చట్ట ప్రకారం జరిగిన హేమంత్ సోరెన్ అరెస్టును రాజకీయ ప్రేరేపిత చర్యగా జేఎంఎం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. ముఖ్యంగా అప్పటివరకూ ఇంటి పట్టునే ఉన్న హేమంత్ సతీమణి కల్పానా సోరెన్‌ను రోడ్డెక్కించారు. తన భర్తను అన్యాయంగా అరెస్టు చేశారంటూ ఆమె కన్నీరు కార్చడం, అక్రమ కేసులు బనాయించారంటూ ఏడుపులు వంటి చర్యలన్నీ ప్రజల్లో సానుభూతిని కూడగట్టేందుకు దోహద పడ్డాయి. కల్పానా సోరెన్ ప్రచారం ముఖ్యంగా మహిళల మద్దతును సంపాదించిపెట్టినట్టు తెలుస్తోంది. దీనికి తోడు ప్రస్తుతం అమల్లోఉన్న మెయ్యా సమ్మాన్ యోజన కింద 18-50 ఏళ్ల వయసున్న మహిళలకు ప్రతి నెలా ఇస్తున్న రూ.1000 సాయాన్ని తిరిగి అధికారంలోకి వస్తే రూ.2500కు పెంచుతామని హామీ ఇవ్వడం ప్రభావం చూపింది. ఇది గిరిజన మహిళలను, యువతులను భారీ ఎత్తున ఆకర్షించింది. మొదటి నుంచీ ముస్లిం, క్రిస్టియన్‌తో పాటు ఆదివాసీల్లోనూ పట్టున్న జేఎంఎంకు మహిళల మద్దతు సానుకూలంగా మారింది. దీనికి తోడు ‘గ్యారెంటీ’లతో ప్రజలను మభ్యపెట్టడం అలవాటైన ఇండీ కూటమి జార్ఖండ్‌లోనూ 7 గ్యారెంటీల కార్డును ప్రయోగించింది. ఓట్ల కోసం అలవికాని హామీలు గుప్పించింది. గ్యారెంటీల అమలులో తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలను నిరక్షరాస్యత, వెనకబాటుతనం, గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న జార్ఖండ్ ప్రజలు గుర్తించలేక పోయారు. అదీ కాక అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ కన్నా జేఎంఎం ప్రభావమే ఎక్కువగా ఉంటుందని భావించి ఆ పార్టీపై నమ్మకం పెట్టుకున్నారు. ఫలితంగా 7 గ్యారెంటీల హామీలు కూడా అంతో ఇంతో ప్రభావం చూపించి ఉంటాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
ఓట్లశాతంలో బిజెపిదే అగ్రస్థానం
పార్టీ సాధించిన సీట్లు పోలైన ఓట్లు ఓట్ల శాతం
బీజేపీ 21 5,921,474 33.18
జేఎంఎం 34 4,183,281 23.44
కాంగ్రెస్ 16 2,776,806 15.56
గెలుపు పతనానికే
ప్రస్తుతం వామపక్షాలకు పశ్చిమ బెంగాల్, కేరళ తప్పిస్తే అధికారంలోకి రాగలిగే రాష్ట్రాలు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. కారణం ఆ పార్టీ తమ గెలుపు కోసం కన్నా, తమ ప్రత్యర్థుల ఓటమి కోసం పని చేయడమూ ఒక కారణం. జాతీయవాదాన్ని, సెక్యులర్ ముసుగులో హిందుత్వను ఓడించాలన్న మిషలో పడ్డ వామపక్షాలు తాము గెలవాలన్న సోయిని మరిచాయి. ఇప్పుడు ఉనికి కోసం ఆరాటపడే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ కనిపించడం లేదు. జార్ఖండ్‌లో తమ కూటమి అధికారంలోకి వచ్చిందన్న సంతోషంలో తాము కూర్చొన్న కొమ్మను నరుక్కుంటు న్నామన్న విషయం మరచిపోయారు. దేశంలో 125 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ ఇప్పుడు సహాయక పాత్రకే పరిమితమైంది. జార్ఖండ్ లోనూ కాంగ్రెస్ ప్రధాన పార్టీ జేఎంఎంకు అనుచర పార్టీనే. వచ్చిన ఆ కొన్ని సీట్లు కూడా సొంత బలం కన్నా జేఎంఎం చలవ వల్లే అనడంలో అతిశయోక్తి లేదు. అధికారంలో భాగమైనా బీజేపీపై కాంగ్రెస్ పైచేయి సాధించలేకపోయింది. జేఎంఎంను పక్కకుపెడితే ఈ ఎన్నికల్లో చేయి గుర్తుపై కమలానిదే పైచేయి. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ తర్వాత జరిగే ఎన్నికల్లో అధికారానికి రాగలుగు తుంది. ఇప్పుడు సహాయ పాత్రకు పరిమితమైన కాంగ్రెస్ రేపు అధికారం కోల్పోతే ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది. ఒకప్పుడు అనేక పర్యాయాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో హస్తం పార్టీ ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. జమ్ముకాశ్మీర్ నుంచి మొదలు పెడితే ఉత్తరప్రదేశ్, బిహార్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధప్రదేశ్ వరకు అనేక ఉదాహరణలు మన కళ్ల ముందున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఝార్ఖండ్ కూడా చేరిపోయింది.
ఓటమి పాఠాలు
గత లోక్ సభ ఎన్నికల్లో దెబ్బతిన్న మహారాష్ట్రలో లోపాలను సరిదిద్దుకొని అసెంబ్లీ ఎన్నికల్లో పుంజుకున్నట్టే జార్ఖండ్ ఫలితాల నుంచి బీజేపీ నేర్చుకోవాల్సింది ఉంది. ఈ ఫలితాలు చూస్తే ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోక పోవడంలో వైఫల్యం కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా పైనే ఎక్కువగా ఆధారపడడంతో బలమైన స్థానిక నేత లేని లోటు కనిపించిందన్న విశ్లేషణ లున్నాయి. బాంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు, అవినీతి వంటి వాటిపై భారీగా ప్రచారం చేసినప్పటికీ… స్థానిక అంశాలను ప్రజల్లో మెరుగ్గా తీసుకెళ్లలేక పోవడం ప్రభావం చూపింది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడమూ బీజేపీకి ప్రతికూలంగా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏమైనప్పటికీ గుణపాఠాలను నేర్చుకొని తప్పులను త్వరగానే సరిదిద్దుకుని బీజేపీ భవిష్యత్తులో జార్ఖండ్‌లోనూ మెరుగైన ఫలితాలు సాధించి, అధికారంలోకి వస్తుందని ఆశిద్దాం.
– భువన
ఓట్లు రాని వ్యూహకర్త
ఏ ఎన్నికలలో అయినా విజయం సాధించడం ఎలా? అన్న అంశం మీద కోట్ల రూపాయలు తీసుకుని సలహాలు ఇస్తారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. ఆయన కూడా జన్‌సురాజ్ పార్టీ పేరుతో ఒక పార్టీని ఇటీవలే లాంఛనంగా ప్రారంభించారు. ఇది రెండేళ్ల నుంచి జనం మధ్యలో పని చేస్తున్నా, పార్టీగా రిజిస్టర్ కాలేదు. ఆ పని ఈ అక్టోబర్ 2న చేశారాయన. ఇంతకీ బిహార్‌లో ఇటీవల నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అన్ని స్థానాలకు ప్రశాంత్ కిశోర్ తన అభ్యర్థులను నిలిపారు. ఇందులో ముగ్గురికి డిపాజిట్ కూడా దక్కలేదు. ఆ పార్టీ ఎన్నికలలో పోటీ చేయడం ఇదే మొదటిసారి. అయితే 2025లో జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 243 స్థానాలకు కూడా తమ పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. మా పార్టీ స్థాపించి నెల కూడా కాలేదు. మాకు పార్టీ గుర్తు కూడా పది రోజుల క్రితమే వచ్చింది, అందుకే ఈ ఓటమి అన్నట్టు చెప్పారాయన. అయినా మేం పోలైన మొత్తం ఓట్లలో 10 శాతం సాధించామని తెలియచేశారు.