సంజవేళ, గోధూళి రామ వరం వీధుల్లో చెలరేగి, మళ్లి పోతూన్న సూర్యుని అరుణకాంతిని కప్పేస్తోంది. శీతాకాలపు చల్లగాలికి చెట్లు విచారంతో ఊగిసలా డుతూ పండుటాకుల్ని రాలుస్తున్నాయి. పల్లెటూరవడం వల్ల, క్రొత్తకోడళ్లు బెదురు చూపుల్తో వాకిళ్లూడుస్తు న్నారు. అది పార్వతమ్మగారిల్లు. శుక్రవారం ప్రొద్దు అవడంచేత పెందరాళే దీపాలు పెడుతున్నారు ఇంట్లో. పార్వతమ్మగారి కూతుళ్లు ఇల్లు శుభ్రం చేస్తున్నారు. చూస్తూంటేనే ఘడియలు దొర్లిపోతూన్న ట్లుంది. చీకటి ఎప్పుడొద్దామా అని తొంగి చూస్తోంది. పెద్ద ముత్తయిదువు పార్వతమ్మగారు దేవుడు గూడు దగ్గరకెళ్లి ప్రమిద శుభ్రంచేసి దీపం పెట్టింది. వెలిగేవెలిగే దీపానికి ఒత్తిని న•లుపుతూ ఆవు నేతిని పోసి ఆ కాంతిలో దేవతా ప్రతిమలనీ, చిత్రపటాలనీ చూసి తన్మయురాలౌతోంది. ఇంతలోనే వీధిలో చెలరేగిన ఉప్పెనగాలి లాంటి పెద్ద గాలితెర చటుక్కున ఇంట్లోకో విసురు విసిరింది. దేదీప్యమానంగా వెలుగుదా మనుకొనే దీపం గొంతు హఠాత్తుగా పిసికినట్లు గుప్పున ఆరిపోయింది. పార్వతమ్మగారు అర్చనకు పైకెత్తిన జేగంట అలానే దిగజారిపోయింది. ఆమెకు గుండెలో రాయిపడింది. హఠాత్తుగా దీపం ఆరిపోవడం ఆమెలో ఉప్పెనను రేకెత్తించింది. పిల్లలు భయపడతారని ఏమీ పైకనలేదు.

రాత్రి 8 గంటలకి రామారం అంతా మారుమోగుతోంది. పిడుగులాంటి వార్త.. గాంధీజీ హత్య గావింపబడ్డారని. శుక్రవారం పూట ఎలాంటి వార్త విన్నానా అని పార్వతమ్మగారు ఆరాటపడ సాగింది. రాజవీధిలో పెద్దలందరూ దాన్నే చర్చిస్తూ న్నారు. పిల్లలను పెందరాళే పడుకోమని తాను గూడ ఏదో ఆలోచిస్తూ మేను వాల్చింది.

కాని ఆమెకు నిద్రపట్టలేదు. మహాత్ముని హత్య ఆమె గుండెలను ద్రవింపచేసే విషయం. గాంధీజీని దేవునిలా పూజించుకొనే ఆమెకు దుఃఖం ఆగలేదు. సాయంత్రం దీపం ఎందుకు ఆరిపోయిందో చూచాయగా పోల్చుకోగలిగింది. ఏవో ఆలోచనలు ఆమెను కలచేస్తున్నాయి. అప్పటికి సరిగా ఆరు నెలల క్రితం ఒక్కగానొక్క కొడుకు, సంఘ ప్రచారానికని రాష్ట్రీయ స్వయంసేవక సంఘం కోసం తను తిడుతున్నా బ్రతిమాలుతున్నా వినక ప్రచారానికి పోవడం, తన పెనిమిటికి దేహారోగ్యం చెడిపోవడం, తమ ఇంటిలో లేచి తిరిగే మగదిక్కు లేకపోవడంవల్ల గ్రామంలో అంతా తమను తేలికగా చూడడం… ఇంకా ఇంకా ఎన్నో గడచిన సంఘటనలకు చెందిన ఊహలు ఆమె మనస్సులో చెలరేగుతున్నాయి. కొత్త గోదావరి పొంగు సుడిగుండాల వరదలా ఉంది ఆమె హృదయం. సరిగా నిద్రపట్టలేదు, పీడకల వచ్చింది, ఎక్కడో ఎవళ్లో తన కొడుకుని తలపై కొట్టినట్లు, నెత్తురు నేలకు ఏకధారగా కారినట్లు కలగన్నది, రాత్రిల్లా అవేదనే ఆమెకు.

2

మరునాడు తన మనస్సులో కల్లోలం పిల్లలకు తెలియనీయలేదు. ఆఖరికి భర్తకి గూడా చెప్పలేదు. ఆయన ఏదో దర్శించడానికి ఊళ్లోకి వెళ్లిపోయారు. పార్వతమ్మగారు పంతులుగారబ్బాయి కిష్టప్పని తీసుకురమ్మని చిన్నమ్మాయి సీతని బడి పంతులు గారింటికి పంపింది. కిష్టప్పకి 12 ఏళ్లుంటాయి. వచ్చాడు, పార్వతమ్మ గారు నాలుగు రూపాయలు తీసి కిష్టప్పకిచ్చి ‘కిష్టప్పా! నాలుగు నెల్ల నుంచి మా వెంకటేశ్వర్లు దగ్గర నుంచి ఉత్తరాలు రావడంలేదు; మనస్సేమిటో కుదురు లేదు. కాస్త కాకినాడ వెళ్లి ఆ సంఘంవాళ్ళెవరేనా కనబడితే దర్యాప్తు చేసుకురా నాయనా!! అని చెప్పి పంపింది. కిష్టప్ప ఆవాళే కాకినాడ వెళ్లాడు. పార్వతమ్మగారు అలా పంపడం భర్తకిష్టం లేదు. ఆయన ‘ససేమిరా’ వాడు నా గుమ్మం తొక్కడానికి వల్లగాదన్నంత కోపంగా ఉన్నాడు. కాని, పాపం! తల్లి ప్రాణం గనక ఉండబట్టలేకపోయింది ఆ ఇల్లాలు. మర్నాడు సాయంత్రం ఎంచేతనో కిష్టప్ప రాలేదు. ఆమెకు ఆవేదన ఎక్కువైంది. దీనికి తోడు గాలివార్తలా రామారానికి గూడా పొక్కింది గాంధీగారిని సంఘంవాడే చంపాడని. ఈ వార్త ఆమె దుఃఖాన్ని మరింత ఎక్కువ చేసింది. రెండో నాడు కిష్టప్ప వచ్చాడు. ఆత్రుతతో ప్రశ్నించింది పార్వతమ్మగారు. కిష్టప్ప ఇలా చెప్పాడు ‘అత్తయ్య గారూ! కాకినాడంతా మ్రోగిపోతోంది. సంఘంవాళ్లే గాంధీగార్ని చంపారట మీ వెంకటేశ్వర్లుని గురించి తెలుసుకోవడం బహు కష్టమైపోయింది. వెంకటేశ్వర్లూ యింకా వేలాది సంఘం వాళ్లూ నిన్న బెజవాడలో పెద్ద సమావేశం జరిపారట. కమ్యూనిస్టులకూ, వాళ్లకి యుద్ధం జరిగిందట. మీ వెంకటేశ్వర్లు తలపగిలి నెత్తురు కాల్వకారిందట. కాకినాడలో ప్లీడరుగారబ్బాయి సుబ్బారావు కూడా వెళ్లాడట అక్కడికి. కానీ, ఎలానో రాత్రికి రాత్రికి వచ్చిపడ్డాను ఇంటికి. చాలా దురంతం జరిగిందట. మరి వెంకటేశ్వర్లెలావున్నాడో! భర్త ఇంటికి రాగానే ఎంతో దుఃఖంతో పార్వతమ్మగారు ఆయన్నొకసారి బెజవాడ వెళ్లి చూసిరమ్మంది. తను వెళ్లనన్నారు. కొడుకుమీద కోపం తగ్గలేదు. పార్వతమ్మగారిది వట్టి బేల మనసు. వచ్చిన వార్త పుకారో, యథర్థమో గుర్తించలేకపోయింది.  కంటికీ మంటికీ ఒకటే  దుఃఖం.

మఱునాటి నుంచి పార్వతమ్మగారికి అన్నీ నమ్మలేని వార్తలే వస్తున్నాయి. కొందరు తన కొడుక్కేమీ ఇబ్బంది కలగదంటారు. మఱికొందరు ఏమో! ఆసుపత్రి లోనే తనువు చాలించాడేమో అంటున్నారు. కొందరు అబ్బే! ఆ సుబ్బారావు గూడా కమ్యూనిస్టేనట! అతడు చెప్పింది వట్టి అబద్ధమేనట అంటున్నారు. రోజులు గడుస్తున్నా వెంకటేశ్వర్లు దగ్గరి నుంచి ఉత్తరమైనా రాలేదు. పార్వతమ్మగారికి మతి చలించేటంత స్థితి గలిగింది. ఇంట్లో  భర్తా, పిల్లలూ ఎన్ని చెప్పినా ఆమెకు శాంతి లేదు.

ఇలాఉండగా పులి మీద పుట్ర అన్నట్లు ఇంకో అఘాయిత్యం. సంఘం వాళ్లందరినీ జైళ్లలో పెట్టారని ఊరూరా పొక్కిపోయింది. సామాన్య సంఘ సభ్యులనే జైళ్లలో ఉంచితే ప్రచారానికెళ్లిన పార్వతమ్మగారి కొడుకుని ఖైదు చెయరూ? అన్నీ దుఃఖాలే కనపడు తున్నాయి ఆ ఇల్లాలికి. తన కొడుకు బతికున్నాడా? బతికుంటే ఎక్కడున్నాడో? కాకపోతే ఖైదులో ఉన్నాడా? ఎవరు చెపుతారీ ప్రశ్నలకు సమాధానం ఈ అమ్మకి? రెండు మూడుసార్లు కాకినాడ వెళ్లినా, ఎవర్ని సంఘాన్ని గూర్చి అడిగినా ఏమీ మాకు తెలియదన్నారు, ఆమెకు ఏమీ పాలుపోవడంలేదు. ఈవిడిలా ఉంటే భర్త మరోవంక భీష్మించుకొని కూర్చున్నాడు. వెంకటేశ్వర్లును గురించి ఎక్కడ నుంచీ ఏ ఉత్తరమూ, పత్తరము  లేనే లేదు.

3

పిచ్చిపిచ్చి ఆలోచనలతోనూ, పీడకలలతోనూ రోజులు మళ్లుతున్నాయి ఆ తల్లికి. పిల్లలిద్దరికీ ఒంట్లో సుఖంలోదు. భర్తకు ఆవరతని వ్యాధి, తనకు మనోవ్యాధి, ఏది ఎలా ఉన్నా రోజులూ, పండుగలూ ఆగవుగా! ఉగాది వెళ్లిపోయింది. ఇంట్లో పండుగ చేసుకోలేదు. ఊళ్లో అంతా ముక్కు మీద వేలేసు కున్నారు. చవితి వెళ్లిపోయింది. అంతా ‘కామోసు’. కాకపోతే కొడుకు లేకుండా పండుగేం చేసుకుంటా రన్నారు. వస్తోంది  విజయదశమి. పిల్లలకు ఒంట్లో కొంచెం నిమ్మదించింది. పిల్లవాడి మీద మమకారం కొద్దీ పార్వతమ్మగారు ఒక సంచీ, చొక్కా సిద్ధంచేసి విజయదశమినాడు కిష్టప్పకి కట్టబెడదామనుకొంది. చిన్నమ్మాయి సీత ‘ఏమే? అమ్మా! దసరాకీ పరికిణీ కుట్టించవే’ అంది. కాదమ్మా! అన్నయ్య లేకుండా  ఇబ్బందిపడుతూ మనం పండుగ చేసుకోవచ్చా?’ అని ఓదార్చింది తల్లి.

ఆవేళ మహర్నవమి. రాత్రి ఊరంతా మాటుమణగింది. పార్వతమ్మగారొక్కతే మెలకువగా ఉంది ఇంట్లో. వీధి వసారాలో మంచాలేసుకొని భర్త దీక్షితులుగారూ, సీతా, మారమ్మలూ పడుకొన్నారు. పెరటివాకిట్లో మంచం వేసుకొని పార్వతమ్మగారు పడుకొంది. ఓ రాత్రివేళ పెరటి తలుపు చప్పుడ య్యింది. చీకటి; ముసుగు పట్టబోతోందా అనిపి స్తోంది. కారుమబ్బులతో ఉండే ఆకాశం, అక్కడక్కడ ఉరుములూ, మెరుపులూ చిటపటలాడిస్తూన్నాయి. మళ్లీ తలుపు చప్పుడయింది.

‘అమ్మా!’ అనే పిలుపు వినిపించింది. పార్వతమ్మ గారికి ఒళ్లు ఝల్లుమంది. ఎండి బీటలువారిన భూగర్భానికి తొలకరి వానచినుకు ఆ పిలుపు. వెంటనే తలుపు తెరచింది. యువకుడు తల్లి పాదాల మీద వ్రాలి కన్నీళ్లతో కడిగి వేశాడు. మాతృచరణ కమలాల్ని. కోడెదూడ తల్లి పొదుగులో తలదూర్చి తోక ఎత్తుకొన్న ట్లుంది అతని సంతోషం. ఒక్క క్షణం ఇరువురూ మాట్లాడలేదు. ఆమె వేడి కన్నీళ్లు అతనిని చకితుణ్ణి చేశాయి. ‘నాయనా? వెంకూ!’ అంటూ బిడ్డని అక్కున చేర్చుకుంది మాతృశ్రీ. తల్లీ కొడుకుల సమాగమం ఎంత శోభాదాయకం! – వెంటనే లోపలికి తీసుకెళ్లి కాళ్లూ చేతులూ కడుక్కోమని తర్వాత పెరుగూ అన్నం కలిపి తినిపించింది  అప్యాయంగా వెంకటేశ్వర్లుకి పార్వతమ్మగారు. ఆ క్షణంలో స్వర్గాన్ని మించిన ఆనందం సుతుణ్ణి ఉన్మత్తుణ్ణి చేసింది.

భోజనం చేసి పెరటి చావడిలోనే పడుకొన్నా రిద్దరూ. గాంధీగారి హత్య మొదలుకొని విజయదశమి వరకు సాగిన నాటకమంతా పూసగుచ్చినట్లు రహస్యంగా చెప్పాడు కొడుకు తల్లికి. తర్వాత ‘సంఘం’ నిషేధంలో ఉంది. తన కోసం పోలీసులు కంచు కాగడాలతో వెతుకుతున్నారు. ఏ మాత్రం ఉప్పు దొరికినా మూడేళ్లు కఠిన శిక్ష’ అంటూ వెంకటేశ్వర్లు చెబుతూంటే పార్వతమ్మకి గుండెలు తటపట లాడాయి. ‘అమ్మా! రేపే నే వెళ్లిపోవాలి. విజయదశమి నాటి రాత్రికి విజయవాడలో ఉండాలి, తప్పదు’ అన్నాడు. మరునాడు తాను సిద్ధం చేసిన కొత్తబట్టలు కట్టబెట్టింది కొడుక్కి తల్లి. దీక్షితులు గారు పైకి బింకంగా ఉన్నా లోపల బతికి బయటపడ్డ కొడుకుని చూడ్డం అన్నది ఆనందంగానే ఉంది. ఇంక సీతా, మారమ్మల సందడి చెప్పనక్కరలేదు. అసలు అతని రాకే పండుగైపోయింది. విజయదశమి విజయవంతంగా సాగింది ఆనాడు. ఊళ్లో రెండో కంటివాడికి తెలియకుండా ఆనాడల్లా వెంకుని దాచింది పార్వతమ్మగారు. ‘విజయదశమి’ వస్తోందన్నంతసేపు పట్టలేదు రోజు గడవడానికి. సాయంత్రమే తల్లికి తండ్రికీ దండంపెట్టి దీవనలందు కొని ‘విజయయాత్రకు’ అన్నట్లు విజయవాడకు బయలుదేరాడు వెంకటేశ్వర్లు.  ఇక మర్నాడు ఆ నోటా ప్రాకిపోయింది..దీక్షితులుగారి కొడుకు వచ్చాడు. ఎంత దాచాలన్నా దాగలేదు. ఇష్టులు ‘పాపం! మళ్లీ ఇంటికో దీపం వెలుగుతుం•’ను కున్నారు. ఇష్టంలేనివాళ్లు బీటు పోలీసు రాకపోతాడా అనుకున్నారు రిపోర్టు చేయడానికి. అలాగే వచ్చాడు బీటు పోలీసు. వాడితో అంతా ఆడిపోసుకున్నారు దీక్షితులుగారి ప్రతికక్షులు. ఇంకేముంది? మరునాడు వాళ్ల ఇల్లు చుట్టవేశారు పోలీసులు. వివేకహీనంగా  ప్రవర్తించారు. పార్వతమ్మగారినీ, పిల్లల్నీ చొక్క పట్టుకులాగి ‘నిజం’ చెప్పమన్నాడు. ఇల్లూ ఆస్తీ ధరావతుగా రాయించుకున్నారు దీక్షితులుగారి దగ్గరనుంచి. ‘ఏం అన్యాయం అగ్గి ఐపోతోందా?’ అనుకొన్నారు పెద్ద మనుష్యులు.

అలాగే రెండు నెలలు గడిచిపోయింది.  ఆచార్యులుగారు తిరుపతి వెళుతున్నారు. నవంబరు నెలాఖరు రోజులు, ఒకనాడు పెద్దచార్యులుగారికి కబురంపింది పార్వతమ్మగారు. ఆయన వచ్చాడు. అంతా చెప్పి ‘మా వాడు విజయవాడలో వుంటాడు. జాగ్రత్త అని చెప్పి ఈ పది రూపాయలూ ఇవ్వండి.  ఎలాగైనా కనుక్కొని మీరు నా కీ సాయం చేయాలంది ఆ తల్లి. ‘అలాగే’ అన్నారు. ఆచార్యులుగారు మఱునాడు మేళతాళాలతో బయలుదేరారు. ఆచార్యులుగారు కుటుంబ సమేతులై తిరుపతికి.

4

నెల్లాళ్లయింది ఆచార్యులుగారు వెళ్ల్లి రేపోమాపో వస్తారు అని అంతా ఎందురు చూస్తున్నారు ఊళ్లో, అందరికన్నా ఆయనెప్పుడు వస్తారా అన్న ఆరాటం పార్వతమ్మగారికి ఎక్కువగా ఉంది. వచ్చిపోయే బళ్లవొంక చూస్తోంది. ఈసారి కొడుకును గూర్చి ఏమి వినాలో అని బాధపడుతోంది ఆమె. రెండు రోజులకి తిరుపతి యాత్ర పూర్తి చేసుకొని వచ్చారు ఆచార్యులుగారు. వచ్చిన నాటి రాత్రే దీక్షితులు గారింటికి వచ్చాడు. ‘పార్వతమ్మ విశేషాలేమిటి?’ అన్నది. ‘నేను వెళ్లేటప్పుడు విజయవాడలో దిగలేదండి. వచ్చేటపుడు వెళ్లినా మీవాణ్ణి కనుక్కోలేక పోయాను. అది మహానగరం, ఉండేచోటు గుర్తించలేకపోయాను’ అన్నారు ఆచార్యులు. ఎంతో ఆశించిన ఆ తల్లి ఆశలన్నీ అడియాశలయ్యాయి అనిపించింది. మళ్లీ అన్నారు ఆచార్యులు… ‘అమ్మా! విజయవాడలో ఓ చిత్రం చూశానండి. మళ్లీ మీ అబ్బాయితోటివాళ్లంతా అక్కడ సంఘం పెట్టారండి. నేవెళ్లినప్పుడు కాళేశ్వరరావు మార్కెట్టటదానినందు ‘సంఘానికీ జై’ ‘గురూజీకి జై’ నంటూ పదిహేనుమంది గుండ్రంగా కూర్చొని సంఘం పాటలు పాడు తున్నారు. జనం రెండు నిమిషాల్లో వేలుగా వాళ్లని చుట్టేశారు. ఐదు నిమిషాలైనా కాలేదు.  పోలీసు ఇనస్పెక్టరు, కానిస్టేబిల్సు, కలెక్టరు, డి.వై.ఎస్‌.‌సి, వాళ్ల దగ్గరికి వెళ్లారు. సంఘం వాళ్లు ‘నిషేధం తియ్యమని’ సత్యాగ్రహం చేస్తున్నారట. సంఘం వాళ్లయితే మీవాడు గూడా ఉంటాడని వెళ్లాను నేనక్కడికి. కాని అంతా ఓలానే బట్టలు ధరించి ఉండడంవల్ల గుర్తుపట్టలేక పోయాను. పోలీసువాళ్లు సంఘంవాళ్లని లేచి పొమ్మన్నారు. కాని వాళ్లు ఏమీ కదలలేదు. మీవాడి వయసు ఉంటుంది ఒక యువకుడికి. ముందుకు వచ్చి ‘మేము కదలం’ అని అన్నాడు. వెంటనే లాఠీఛార్జీ ప్రారంభమయింది. యువకులందరికీ గాయాలు తగిలాయి, నెత్తురు మడుగులు కట్టింది. కాని విచిత్రం! ఒక్కడూ కదలలేదు. తర్వాత అందరినీ లారీలో విసిరేసి వాళ్ల సామానులైనా తీసుకెళ్లనివ్వకుండా క్రిందపారేశారు. లారీ పోతూంటే జనంలోకి పోలీసులు సంఘం వాళ్ల సామానులు గిరవాటేస్తే నాకీ సంచి దొరికింది. ఇది చూడండి’ అని సంచీ పార్వతమ్మగారికి ఇచ్చాడు. పార్వతమ్మగారు ఏమీ మాట్లాడలేకపోయింది! ‘పాపం! ఈ సంఘం వాళ్లు ఇంకా  ఏమి కష్టాలనుభవించాలో’ అంది. ఆచార్యులుగారు సెలవు తీసుకున్నాడు, రాత్రి అంతా పడుకున్నాక పార్వతమ్మగారు దీపం పెద్దదిచేసి సంచీ విప్పి ఒక్కొక్క వస్తువునే చూస్తోంది.  అప్రయత్నంగా ఆమె కళ్లు నీళ్లు గ్రమ్మాయి, వళ్లు వణికిపోయింది. ఆ సంచీలో రెండు ధోవతులూ, రెండు చొక్కాలూ ఉన్నాయి. వాటిలో ఒక ధోవతీ, చొక్కా తను ‘వెంకు’కి విజయదశమి నాడు కట్టబెట్టినది. ధోవతి మడతలో ఒక చిన్న లేఖ ఉంది. అది తన కొడుకు వెంకు వ్రాసిందే. ‘అమ్మా! సంక్రాంతి పండుగకైనా ఇంటికి వద్దామనుకున్నా కాని పరిస్థితులు మారినాయి. నేను అధికారుల ఆజ్ఞానుసారం సత్యాగ్రహం చేస్తున్నాను. రేపటి దళానికి నేనే ముందుండాలి. ఈ ఉత్తరాన్నైనా మీకు పంపగలనో లేనో…’ అని ఉంది దానిలో. లేఖ చదువలేక పోయింది ఆమె. ఆచార్యులుగారు  చెప్పినప్పటి నుంచీ తారాడుతున్న ఆవిడ అనుమానం దృఢ•పడింది. ఆ బట్టలు కన్నీటితో తడిసి పోతున్నాయి. సంచీ అటు త్రిప్పింది. పెద్ద నెత్తురు మరక ఉంది దానిపై. తన కొడుకు దృఢత్వానికీ, త్యాగానికీ మెచ్చుకొంది. ఆ ముహూర్తంలో తన కొడుకు నిజమైన మాతృసేవ చేస్తున్నాడని మురిసిపోయింది ఆమె.

వారంరోజులైన తర్వాత భర్తతో చెప్పి, వద్దంటున్నా వినక విజయవాడ ప్రయాణమైంది. ఆనాడు సంక్రాంతి పండుగ. విజయవాడకు చేరుకోగానే కొడుకు కోసం ఎక్కడ ఎక్కడ? అని వెతకడం మొదలుపెట్టింది ఆ తల్లి. మేజిస్ట్రేటుగారికి దరఖాస్తు పెట్టుకుంది. సబ్‌జైలులో ఉన్న తన కొడుకుని చూడనిమ్మని. కాని ఆయన అనుమతి ఇవ్వలేదు. ఆశ నిరాశ అయ్యింది. సాయంత్రం దాకా ఆ జైలు గోడల వద్ద ఇటూ అటూ తిరుగుతూ ఉంది. జైలుకు ఎదుటివారి మేడపైకెడితే ఖైదీలు కనబడతారని ఒకావిడ చెప్పింది. ఆ ఇంటివారిని బ్రతిమాలుకొని ఐదుగంటలకు ఆ డాబా ఎక్కింది.

ఎదురుగా ఉన్న జైలు ఆవరణ చక్కగా కనబడు తోంది. ఖైదీలను పోలీసులు వరుసగా వదులు తున్నారు. చేత్తో ఆకులు పట్టుకొని ఒక్కరొక్కరే స్వయంసేవకులు బయటకు వస్తున్నారు. వంటకాల దగ్గర కూచున్నారు. వెంకటేశ్వర్లు కూడా ఉన్నాడు. పార్వతమ్మ ఒక్కసారి ఆవైపు చూసి కళ్లుమూసుకొంది. మాసిన గుడ్డలు; తలకు పెద్దకట్టు, చేతిలో మూకుడు – సంక్రాతి పర్వదినాన ఆ రూపంలో ఉన్న తన ముద్దులకొడుకు వెంకుని చూడలేకపోయింది. ‘అన్నం బాగా లేదు. పులుసులో పురుగులు’ అన్నాడు వెంకు. కిరాతకుడు పోలీసు లాఠీతో అతన్ని ఒక దెబ్బవేసి, పక్కలో పొడిచాడు – ‘అమ్మా! అంటూ పడిపోయాడు ‘వెంకు’. పార్వతమ్మ చూడలేక డాబాపైననే కూలబడి పోయింది. మళ్లీ లేచి చూచేసరికి నలుగురు స్వయంసేవకులు వెంకుని ఎత్తుకొని జైలులోకి తీసుకెడుతూన్నట్లు గుర్తించింది. ఇంక అక్కడ ఉండలేకపోయింది. చంటిపిల్లవలె ఏడుస్తూ మేడ మెట్లు దిగిపోయింది. వెంటనే ఇంటికి బయలు దేరింది. సంక్రాంతి నాటి దృశ్యం ఆమెలో మార్పును తెచ్చింది. స్త్రీ రూపంలో జాలిపోయి కర్కశత ప్రవేశించింది. కొడుకు దీక్షకి కొనియాడుకొంది. ప్రభుత్వ దమననీతికి పండ్లు కొరికింది. ఇప్పుడామె మనస్సు గట్టిపడింది. ఒంట్లో దిగులులేదు. ‘సత్యం జయించి తీరుతుందనే’ దృఢవిశ్వాసంతో ఇల్లు చేరుకొంది. ఇంట్లో అడుగుపెట్టేసరికి తన పేరున, ఉత్తరం వచ్చిందని సీత చెప్పింది. ఉత్తరం చూసు కొంది. ‘మీ కుమారుడు వెంకటేశ్వర్లు సత్యాగ్రహానికి వెళ్లాడు. సంఘ అధికారుల ఆదర్శాన్ని పాటిస్తూ అతడు తన విధిని నిర్వర్తించడానికి త్యాగదీక్షతో పురోగమిస్తున్నాడు’ అని ఉంది ఆ లేఖలో. బహుశః ఎవరో సంఘ అధికారులే ఆ లేఖ వ్రాసి ఉంటారని తృప్తి పడింది పార్వతమ్మగారు.

5

శీతాకాలం వసంతానికి దారిచ్చి తప్పుకొంది. ‘ఉగాది’ గూడా దాటిపోయింది. పార్వతమ్మగారు ‘సత్యం పొందే విజయాన్ని గుర్తించే ముహూర్తం’ కోసం ఎదురు చూస్తోంది. వైశాఖం తన తీష్ణమైన ఎండలతో గూడా ఆమెను వేధించలేకపోయింది. రోజులు నిమిషాలుగా గడవాలని కాంక్షిస్తోంది ఆమె. ఈ మధ్యన అనేక విషయాలు పత్రికల్లో చూచి భర్త ఆమెకు చెబుతూ ఉండేవాడు. ‘ఇంక సంఘంపై నిషేధం తొలగించరట – ఇంక ఖైదీలుగా ఉన్న వాళ్లను విడిచిపెట్టరట – ఒకటేమిటి?’ పత్రికలు తెగ ప్రకటిస్తున్నాయి. గ్రీష్మంవల్ల తపించిన భూదేవి మృగశిరా ప్రవేశానికి సుస్వాగతమిచ్చింది. ఎండిపోయిన మోళ్లు చిగిర్చాయి తొలివానకి. ఇంక వాన కురవదేమో అనిపించిన ఆ గ్రీష్మం అవమానా స్పదమమై పోయింది. ఆషాఢపు గోదావరి ఆహ్వానాల నందుకుంటూ మహాప్రవాహంలా బయలుదేరింది. ఆ మహానదిని చూసి ఈ గ్రీష్మంలో ఈ ప్రవాహం ఏ కొండల్లో దాగి వుందా? అని విస్మయపడ్డారు ప్రజలు’. ఏ ఏడాదికన్నా ఈ యేడు గోదావరి శోభాయమానంగా ఉంది.

ఆషాఢ గడియల్లోనే శుభవర్తమానం అందించింది. నిరాశపొందే సమాజానికి కాలం. నిషేధం తొలగిపోయిందన్నారు పెద్దలు. సుము హూర్తాన్న గౌరవించి ఆహ్వానించింది ఆ సతీమతల్లి పార్వతమ్మగారు. తన పట్టు నెగ్గిందనుకొంది. సులోచనాలు మరీ మరీ తుడుచుకొని పత్రిక చదివాడు దీక్షితులుగారు. సీతా, మారమ్మలు ఎగిరి గంతేశారు. ఆవాళ ఆ యింట్లో పెద్ద పండువ. ‘సంఘ సభ్యులంతా విడుదలయ్యారు. పదిరోజులకి ఇంటికి వస్తున్నానని’ ఉత్తరం వ్రాశాడు వెంకటేశ్వర్లు. శ్రావణ పూర్ణిమకి అన్నయ్యకి రాఖీకడతానని పాట పాడింది సీత. ఇంట్లో అంతా నవ్వుకొన్నారు అది చూసి.

కాని అనుకొన్నట్లు అన్నయ్య ఇంటికి రాకపోతే సీత ఆరాటపడింది. ‘ఏమే అమ్మా అన్నయ్యరాడూ?’ అంది. ‘వస్తాడమ్మా! సంఘం అంటే మాటలా? పెద్దలు అనుమతించాలి. రావాలి.’ అంది తల్లి. శ్రావణపూర్ణిమ వెళ్లిపోయింది. విఘ్నేశ్వరుడు చవితి గూడ వెళ్లింది. మళ్లీ ఉత్తరం వచ్చింది వెంకటేశ్వర్లు దగ్గర నుంచి ‘విజయదశమికి తప్పకవస్తా’నని వ్రాశాడు.

విజయదశమి, దీక్షితులుగారింటికి విజయం జేసింది. ఇంట్లో అంతా వెంకుకోసం ఎదురు చూస్తున్నారు. హారతులు, పూలహారాలు సిద్ధం చేశారు.  ఉదయం తొమ్మిది గంటలకు వెంకటేశ్వర్లు ఇంటికి వచ్చాడు. గుమ్మంలో అడుగుపెట్టగానే తండ్రి కొడుకుని కౌగలించుకొని కుంకుమబొట్టు పెట్టాడు. సీత హారతిచ్చింది పాటపాడుతూ. మారమ్మ మెడలో తెల్లగన్నేరుపూదండ ఉంచింది అన్నగారికి. తల్లి అక్షతలు చల్లి అక్కున చేర్చుకొని కొడుకుని గృహంలోకి తీసుకువెళ్లింది. సరిగా ఇది మూడో విజయదశమి ఆ ఇంటిలో జరిగిన ఈ కథకి. మొదటి విజయ దశమికి వెంకటేశ్వర్లు ప్రచారానికి వెళ్లాడు. రెండో విజయదశమికి అజ్ఞాతవాసంలో ఉన్న అర్జునుడు వలె తల్లిదండ్రులను కలుసుకొన్నాడు. ఇది మూడోదశమి. దేశంలో సంఘం విజయయాత్ర చేస్తూంటే విజయుడై వెంకటేశ్వర్లు తల్లిదండ్రులను కలుసుకొన్నాడు. రామారమంతా ఈ కథే మారుమ్రోగుతోందీనాడు. సంఘం కథ, వెంకటేశ్వర్లు విశేషం. మంచివాళ్లు వెంకటేశ్వర్లు వీధిని వెడుతుంటే నవ్వుకుని, కళ్లు పెద్దవి చేసుకొని చూస్తున్నారు. కన్నెపడుచులు ఏ పిల్ల మల్లెపూల పూజ చేస్తోందో ఈతణ్ని పొందడానికి అనుకొని నవ్వుకొంటున్నారు. సరే- కిట్టనివాళ్లకిది కీడు. వెంకటేశ్వర్లుని చూడగానే సహించలేక వెంటనే తలుపులు మూసుకొని గుడ్లలో నిప్పులు పోసుకుంటు న్నారు. ఇంతకీ ఇదంతా విజయదశమి చలవ. విజయదశమినాడు బయలుదేరి కష్టాలను జయించి విజయం పొందాడు వెంకటేశ్వర్లు. దేశానికీ, ఇంటికీ కీర్తి తెచ్చాడు.

జాగృతి, 1.10.1949

కథానిక

– రత్నం

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE