రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాకతో గ్రామాలకు మంచి రోజులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ సహకారం అందిపుచ్చుకుని రాష్ట్రంలో పంచాయతీలలో పలు కేంద్ర గ్రామీణాభివృద్ధి పథకాలను అమలుచేయనున్నారు. తెలుగుదేశం, భారతీయజనతా పార్టీ, నసేన కూటమి అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే ఆగస్టు 23న ‘స్వర్ణ గ్రామ పంచాయతీ’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించారు. రూ.4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేశారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు చేరగా పనులు కూడా ప్రారంభం అయ్యాయి. జల్‌ ‌జీవన్‌ ‌మిషన్‌ ‌కార్యక్రమం ద్వారా అన్ని గ్రామాల్లో రక్షిత మంచినీటి సదుపాయం, గ్రామీణ రహదారుల అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వనుంది. గ్రామాల్లో అభివృద్ధి అత్యంత పారదర్శకంగా జరిపేందుకు డిజిటల్‌ ‌సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. అలాగే రాష్ట్రంలో 30 లక్షల ఇళ్లకు సూర్యఘర్‌ ‌పథకం ద్వారా సౌర విద్యుత్‌ను రాయితీపై ఇచ్చేందుకు కేంద్రం సహకారం ఇవ్వనుంది. కాగా, రాష్ట్రంలోని నాలుగు గ్రామ పంచాయతీలు జాతీయ అవార్డులు దక్కించుకోవడం విశేషం.

వైసీపీ ప్రభుత్వ హయాంలో అయిదేళ్లుగా నిధుల లేమితో గ్రామ పంచాయతీలు సమస్యలు పరిష్కరించుకోలేకపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు తనవంతు నిధులు ఇవ్వకపోగా, కేంద్రం నుంచి వచ్చిన ఆర్థికసంఘం నిధులను కూడా దారి మళ్లించింది. తను భరించాల్సిన కరెంటు బిల్లుల భారాన్ని సైతం పంచాయతీలపై వేసింది. ఏకగ్రీవంగా ఎన్నికైన 90 శాతం మంది సర్పంచ్‌లు వైసీపీ ప్రభుత్వం తీరుపై అసంతృప్తితో ఉన్నారు. కొందరైతే ప్రజలకిచ్చిన హామీల మేరకు అభివృద్ధి పనులకు సొంత నిధులు వెచ్చించారు. వీరికి ప్రభుత్వం మొండిచేయి చూపింది. ఈ నేపథ్యంలో కూ•మి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్‌ ‌శాఖ మంత్రి పవన్‌ ‌కల్యాణ్‌ ‌ఢిల్లీ పర్యటన సందర్భంగా, పంచాయతీలకు జరిగిన అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. వాటి అభివృద్ధికి నిధులు ఇవ్వాలని అభ్యర్థనను ఆయా మంత్రిత్వ శాఖలు పరిశీలిస్తున్నాయి.

జల్‌ ‌జీవన్‌ ‌మిషన్‌ ‌కుళాయి కనెక్షన్లు

జల్‌జీవన్‌ ‌మిషన్‌ ‌కార్యక్రమం ద్వారా గ్రామాలన్నిటికీ మంచి నీటి కుళాయిని ఏర్పాటుచేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. 2019-2024 మధ్య అందించిన కనెక్షన్లలో కొళాయిల సామర్థ్యం, నీటి నాణ్యత అంశంలో సమస్యలను గుర్తించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన సర్వే ప్రకారం 29.79 లక్షల కుటుంబాలకు కొళాయి కనెక్షన్లు లేవు. అలాగే 2.27 లక్షల పంపులు పనిచేయడం లేదు. మరో 24 వేల కొళాయిలకు అవసరమైన నీటిని సరఫరా చేయడం లేదు. ఉపాధి పనుల్లో భాగంగా పీఎం ఆవాస్‌ ‌యోజన ద్వారా ఇళ్లు నిర్మించుకోవడానికి వంద రోజుల పని దినాలు అదనంగా కల్పించాలని, ఉపాధి నిధులతో శ్మశాన వాటికలు, పంచాయతీ భవనాలకు ప్రహరీల నిర్మాణం, ఆరోగ్య ఉపకేంద్రాలు, గ్రామాల్లో తాగునీటికి అవసరమైన పనులు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కరవు జిల్లాల్లో చేపట్టే ఉపాధి హామీ పనులకు రాష్ట్ర వాటా నిధులను తగ్గించి 90:10 దామాషా ప్రకారం కేటాయింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ ‌చౌహాన్‌ను అభ్యర్థించింది. పీఎం సడక్‌ ‌యోజన, ఏపీ రూరల్‌ ‌రోడ్డు ప్రాజెక్టు, నాబార్డు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామీణ రోడ్ల ఆధునికీకరణ పనులు చేపడుతున్నారు. 2,643 గ్రామాలకు అనుసంధాన రోడ్లు నిర్మించాలని గుర్తిస్తే, వాటిలో ‘పీఎం గ్రామీణ సడక్‌’ ‌యోజన కింద 413 రోడ్ల నిర్మాణానికి అనుమతి లభించింది. గ్రామీణ సడక్‌ ‌యోజన-4 కింద గ్రామాల్లోని అంతర్గతదారులు కూడా బాగు చేసుకునేందుకు అవకాశం కల్పించాలనే రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థ్ధనను కేంద్రం పరిశీలిస్తోంది. ఆసియా మౌలిక సదుపాయాలు, అభివృద్ధి బ్యాంకు(ఏషియన్‌ ఇన్‌‌ఫాస్ట్రక్చర్‌ అం‌డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ‌బ్యాంక్‌-ఏఐఐబీ) రుణంతో చేపట్టిన గ్రామీణ రోడ్ల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు గడువును 2026 డిసెంబరు 31 వరకు పొడిగించే విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ పరిశీలిస్తోంది. పంచాయతీరాజ్‌ ‌వ్యవస్థను సమ్మిళితం చేసి ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు ప్రతిపాదించిన రాష్ట్రీయ గ్రామ స్వరాజ్‌ అభియాన్‌(ఆర్‌జీఎస్‌ఏ) ‌కింద నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

సౌర విద్యుత్‌ ‌సదుపాయం

విద్యుత్తు ఉత్పత్తి, వినియోగంలో స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేయాలనే ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అందిపుచ్చుకోవాలని నిర్ణయించింది. సౌర విద్యుత్తును పూర్తిస్థాయిలో వినియోగించేందుకు అవసరమైన ప్రణాళికలను సత్వరం అమల్లోకి తెస్తోంది. రాష్ట్రంలో మొత్తం 132 గ్రామాలను సోలార్‌ ‌విద్యుత్తు వినియోగ మోడల్‌ ‌గ్రామాలుగా మార్చేందుకు నిర్ణయించారు. ఈ గ్రామాల్లో వందశాతం సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ వినియోగించాలి.

కుప్పం నియోజకవర్గంలో వంద శాతం సౌర విద్యుత్తు పథకాన్ని అమలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. అక్కడ 50,314 ఇళ్లు సోలార్‌ ‌విద్యుత్‌కు అనుకూలంగా ఉన్నాయి. 2,66,15,521 చదరపు అడుగుల విస్తీర్ణంలో సోలార్‌ ‌రూఫ్‌టాప్‌ ‌విద్యుదుత్పత్తికి అవకాశం ఉంది. కుప్పం రెస్కో ప్రాజెక్టుకు రూ.286 కోట్ల వ్యయం అవుతుంది. ఇందులో రూ.114 కోట్లను లబ్ధిదారులు రుణంగా పొందే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నింటిపై సోలార్‌ ‌పలకలు ఏర్పాటు చేసి వాటికి సౌర విద్యుత్తును అందిస్తారు. దీనివల్ల 100 మెగావాట్లకు సుమారుగా రూ.349 కోట్ల నుంచి రూ.379 కోట్ల మేర ఆదా అవుతుంది. లక్ష యూనిట్లకు పైగా విద్యుదుత్పత్తి లక్ష్యంతో సోలార్‌ ‌రూఫ్‌టాప్‌ ఏర్పాటు కోసం 2,186 ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించారు. 19,53,369 చదరపు మీటర్ల పరిధిలో సౌర విద్యుత్తు పలకలు ఏర్పాటు చేస్తే ఏడాదికి రూ. 262.25 కోట్ల వ్యయం అవుతుంది. ఎన్టీపీసీ విద్యుత్తు వ్యాపార్‌ ‌నిగమ్‌ ‌లిమిటెడ్‌ ‌దీన్ని చేపట్టనున్నది. దీనికి ప్రభుత్వ గ్యారెంటీ ఇవ్వనుంది. సోలార్‌ ‌రూఫ్‌ ‌టాప్‌ ఏర్పాటులో పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రాధాన్యం ఇస్తారు. వ్యవసాయ పంపుసెట్ల కోసం పీఎం కుసుమ్‌ను అమలు చేస్తారు.

30 లక్షల ఇళ్లలో పీఎంఎస్జీఎంబీవై

పీఎం సూర్యఘర్‌-‌ముఫ్త్ ‌బిజిలీ యోజనలోకి కోటి గృహాలను తేవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో 30 లక్షల ఇళ్లకు ఈ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం నిర్దేశించింది. ఒక కిలో వాట్‌ ‌సోలార్‌ ‌రూఫ్‌ ‌టాప్‌ ఏర్పాటుకు రూ.50,000 ఖర్చు అవుతుండగా.. కేంద్రం రూ. 30,000 సబ్సిడీ ఇస్తోంది. అదే విధంగా 3 కిలోవాట్‌లకు పెట్టుబడి రూ.1.45 లక్షలకుగాను కేంద్రం రూ.78,000 సబ్సిడీ ఇస్తుంది. రాష్ట్రంలో ఈ పథకానికి సమ్మతి తెలుపుతూ ఇప్పటి వరకూ 6,33,045 మంది గృహ విద్యుత్తు వినియోగదారులు రిజిస్టర్‌ ‌చేసుకున్నారు. వీరిలో పీఎం సూర్య ఘర్‌ ‌పథకానికి 70,110 దరఖాస్తు చేసుకున్నారు. 4,961 గృహాలపై సోలార్‌ ‌ప్యానల్స్ అమర్చడం పూర్తయింది.

పల్లెలు… డిజిటల్‌!

‌పంచాయతీల్లో ఇకపై డిజిటల్‌ ‌సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రజలకు వేగంగా, పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందనున్నాయి. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు కావాలంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే చాలు రెండు, మూడు రోజుల్లోనే జారీ కానున్నాయి. ఆన్‌లైన్‌లోనే ఆస్తిపన్ను చెల్లించొచ్చు.. వ్యాపార లైసెన్సులు పొందొచ్చు. వీటికి సంబంధించి కార్యదర్శులకు డిజిటల్‌కీ అందుబాటులోకి రానుంది. దీంతో ఏ ధ్రువీకరణ పత్రం కావాలన్నా ఆన్‌ ‘‌లైన్‌క్లియర్‌’‌గా ఉండనుంది. అన్ని పంచాయతీల్లో కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. పంచాయతీలు జారీచేసే వివిధ ధ్రువీకరణ పత్రాలకు నిరీక్షించాల్సిన అవసరంలేదు. సులభంగా సర్టిఫికెట్లు పొందేలా రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ కొత్తవిధానానికి శ్రీకారం చుట్టింది. మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే వాటిని కార్యదర్శులు పరిశీలించి డిజిటల్‌ ‌సంతకాలు చేస్తారు. అనంతరం మీసేవ నుంచి సర్టిఫికెట్లు తీసుకునేలా చర్యలు చేపట్టారు.

పంచాయతీల ద్వారా జనన,మరణ ధ్రువీకరణ పత్రాలను మాన్యువల్‌ ‌పద్ధతిలోనే జారీ చేస్తున్నారు. కొత్త విధానంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వెంటనే అందులో నమోదు చేసిన ఫోన్‌ ‌నంబర్‌కి దరఖాస్తు సంఖ్య సందేశం వస్తుంది. పత్రం సిద్ధం కాగానే దరఖాస్తుదారుడి ఫోన్‌కు సమాచారం అందుతుంది.కొత్త విధానం అమల్లోకి రావడంతో పంచాయతీలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. రెండు, మూడ్రోజుల వ్యవధిలో సర్టిఫికెట్లు పొందే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ, ఏమూల ఉన్నా సొంత ఊళ్లోని మన ఇంటికి ఏటా ఆస్తిపన్ను చెల్లించాలంటే ఇక పంచాయతీ వరకు వెళ్లనక్కర్లేదు. ఉన్నచోటు నుంచే నేరుగా ఆన్‌లైన్‌లో ఆస్తిపన్ను చెల్లించవచ్చు. జనవరి నుంచి స్వర్ణ పంచాయతీల్లో భాగంగా డిజిటల్‌ ‌సేవలు అందుబాటులోకి రానున్నాయి. వ్యాపార లైసెన్సులు, భవన నిర్మాణ అనుమతులు, వివాహ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ఇలా పలు సేవలను ఆన్‌లైన్‌లోనే పొందవచ్చు. ఈమేరకు పంచాయతీల్లో పాయింట్‌ ఆఫ్‌ ‌సేల్‌ (‌పీవోఎస్‌) ‌పరికరాలు సిద్ధం చేస్తున్నారు. వీటితో డెబిట్‌, ‌క్రెడిట్‌ ‌కార్డుల ద్వారా బకాయిలు చెల్లించచ్చు. మరికొన్ని చోట్ల క్యూఆర్‌ ‌కోడ్‌ ‌ద్వారా పన్ను బకాయిలు వసూళ్లకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తాలను ఆయా పంచాయతీల పీడీ ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఏపీకి నాలుగు జాతీయ అవార్డులు

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహకారం సరిగా అందిపుచ్చుకోవడం ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో ప్రథమ స్థానంలో నిలిచిన నాలుగు గ్రామ పంచాయతీలు జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి. ‘ఆరోగ్యకర’  కేటగిరిలో చిత్తూరు జిల్లా ఐరాల మండలం బొమ్మసముద్రం, ‘సంతృప్తికర తాగునీరు’లో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం న్యాయంపూడి, ‘పచ్చదనం-పరిశుభద్రత’లో అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం తగరంపూడి, ‘సామాజిక భద్రత’ కేటగిరీలో ఎన్టీఆర్‌ ‌జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల పంచాయతీకి ఈ అవార్డులు దక్కాయి. డిసెంబర్‌ 11‌న ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయా సర్పంచ్‌లకు మెమోంటో, రూ.కోటి నగదు బహూకరించారు.

తురగా నాగభూషణం

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE