బహుశా నేను చదివిన పుస్తకాల వల్ల కావచ్చు. అయినా నా ఆలోచనలు పెద్దవాళ్లలా కాదు. నేనెప్పుడు గాల్లో ఎగరకుండా కిందే ఉండి వాస్తవంగా ఆలోచిస్తాను.అందుకే విభిన్నంగా ఉండొచ్చు’’ అన్నాను సాలోచనగా… ఏమో బాబూ! ఒక్కొక్కప్పుడు నీ మాటలు వింటుంటే భయం వేస్తుంటుంది… నిదానంగా ఆలోచిస్తే అవన్నీ నిజాలనిపిస్తుంటాయి. అయినా నేను అనవసరంగా కంప్యూటర్స్‌లో చేరాననిపిస్తోంది. హాయిగా ఏ బీయస్సీలో చేరితే మన ఊరి పరిసరాల్లోనే టీచరుగా కాలం గడిచిపోయేది.. అంది కళ్లు తిప్పుతూ.
‘మీ నాన్న నిన్ను అమెరికాలో పెద్ద ఇంజనీరుగా చూద్దామనుకుంటుంటే నువ్వేంటి పల్లెటూరి దానిలా టీచరు అంటున్నావు. మీ నాన్న వింటే నిన్నేం చేస్తాడో తెలుసా?’ అన్నాను నవ్వుతూ…
‘‘నేను పల్లెటూరి దాన్నేగా! ఏం నువ్వు ఆలోచించగా లేంది నేను నీలా ఆలోచిస్తే తప్పా?’’ అంది తనూ నవ్వుతూ…
‘‘మనం తల్లితండ్రుల కోర్కెలను తీర్చాలి సమీరా. మీ నాన్న నిన్ను అమెరికా పంపాలనీ కలలు కంటున్నాడు. నీకాయన కలలని నిజం చేసే బాధ్యత లేదా చెప్పు’’ అన్నాను.
‘‘ఏమో బాబూ! ఏం జరుగుతుందో.. తలుచుకుంటేనే• భయం వేస్తోంది’’ అంది సమీరా చెట్ల వైపు చూస్తూ .
అలా మాట్లాడుకుంటూ ఇద్దరం చాలా దూరం వచ్చేశాం. రానురాను అడవి దట్టంగా కనిపిస్తోంది. దారి కూడా ఇరుగ్గా ఉంది.ఆకాశాన్నంటే సి•ల్వర్ ఓక్ చెట్లు.. వాటి చుట్టూ పొదలు, తీగలు.. దూరంగా నుంచి జంతువుల అరుపులు… పక్షుల కిలకిలా రావాలతో పోటీపడుతూ జుగల్బందీని తలపిస్తున్నాయి.
‘‘పచ్చటి, పొదలు
ఎర్రటి లతలు,
రంగుల పిట్టల కీ•రవాణి రావాలు
పచ్చటి చిలకల ముద్దుల పలుకులు
తెల్లటి గువ్వల
కువకువ అరుపులు’
‘‘నల్ల కోయిళ్ల కుహు కుహులు
వీచే చల్లని మలయ సమీరాలు
పులకించి పోతున్న వంశీ, సమీరలు’’ అన్న కవితను నేను చదివితే
‘‘అడవిని బాగా వర్ణించావు వంశీ… కానీ మధ్యలో మన పేర్లెందుకు చెప్పు’’ అని నన్ను మెచ్చుకుంది సమీర…
అలా కొద్దిసేపు అడవంతా తిరిగి రోడ్డు దగ్గరకి అందరం చేరుకున్నాము… ఆ తరువాత అదే టాక్సీలో విశాఖ బయలుదేరాము.
***
పుష్యం వచ్చి సంక్రాంతిని తెచ్చింది. అప్పటి దాకా మేమెవ్వరం మా ఊళ్లు వెళ్లలేదు. సంక్రాంతికి పది రోజుల శలవులు ఇవ్వడంతో మేము ఐదుగురం ప్యాసింజెర్లో మా ఊళ్లకు బయలు దేరాము. మా అందరివీ బొబ్బిలి చుట్టుపక్కల పల్లెలు కావడంతో ప్యాసింజర్ ఎక్కాము. 9 గంటలకు విశాఖలో బయలుదేరిన ప్యాసింజర్ 11 కి బొబ్బిలి చేరింది.
అక్కడినుంచి ఆటోల్లో బయలుదేరాము. నేను సమీరా ఒకే ఆటో ఎక్కాము . వాళ్ళ ముగ్గురు ఇంకో ఆటోల్లో వెళ్లిపోయారు. బొబ్బిలికి మా వూరు 15 కిలో మీటర్లు.
పది నిమిషాల తరువాత ఆటో పచ్చటి పొలాల బాట పట్టింది. పూర్వం రోడ్డు మీద సైకిళ్లు ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు మారిపోయింది. ఆటోలు,కార్లు, బైకులు,అప్పుడప్పుడు బస్సులు.రిక్షాలు పూర్తిగా కనుమరుగ య్యాయి..
పొలాల్లో కూలీలు కనిపించటం లేదు..ఎక్కడ చూసినా ట్రాక్టర్లు, బోరింగులు, పైపులతో పొలాల్లోకి నీళ్లు..ఎక్కడ చూసినా విద్యుత్ స్తంభాలు ..
గ్రామీణ భారతం ఆధునికతను సంతరించు కోవడం కనిపిస్తోంది..
సమీర ఆనందంగా ప్రకృతిని గమనిస్తోంది. రోడ్డు కిరువైపులా పచ్చటి పంట చేలు..
ఆకు పచ్చటి పంట చేల మీద తెల్లటి కొంగలు ఎగురుతూ కనిపిస్తున్నాయి. దూరంగా నీలాకాశం పంట చేలు కలుస్తున్న క్షితిజ రేఖ.కనుచూపు మేరంతా కంటికి నీలి, ఆకుపచ్చల వర్ణ మిశ్రమం. మధ్యలో తెల్లటి చుక్కల్లా కొంగలు. ఆ దృశ్యాన్ని చూస్తుంటే ఒక, పికాసో, బాపుల వర్ణ చిత్రాలు గుర్తుకొస్తున్నాయి.
‘‘సమీరా! ఏమిటి చూస్తున్నావు?’’ అనీ అడిగాను.
‘‘వంశీ! ప్రకృతి ఎంతో అందంగా ఉంది. ఇలాంటి దృశ్యాలు పల్లెల్లోనే చూడగలం.. పట్నాల్లో అన్నీ రణగణ ధ్వనులు. ఆ ఉక్కిరి బిక్కిరి వాతావరణం నాకు నచ్చదు. అన్నట్లు నీకో విషయం చెప్పాలి..ఇంక రేపట్నుంచీ నీతో మాట్లాడటం కుదరదు’’…అంది సమీర…
‘‘మీనాన్నకెందుకో నా మీద అంత కోపం. అయినా మనం ఇంటర్లో చేరినప్పట్నుంచే మాట్లాడు కుంటున్నాము. మీ నాన్నకెందుకో మొదట్నుంచీ మా న్నాన్నంటే ఇష్టం లేదు. ఏదో మనసులో పెట్టుకొనీ చెల్లెలు కుటుంబాన్ని పక్కన పెట్టేడు.మా అమ్మ ఎప్పుడూ మీ నాన్న చేసిన పనిని తల్చుకొని బాధపడు తుంటుంది’’… అన్నాను…
నా మాటలకు సమీర మౌనం దాల్చింది…
‘‘ఇది వరకు వేరు వంశీ! ఇప్పుడు నాకు నువ్వు తప్ప ఎవ్వరూ స్నేహితులు లేరు. ప్రతీ విషయాన్ని నీతో పంచుకోవాలనుంటుంది. ఎందుకో అలా అలవాటైపోయింది… అందుకే ఈ బాధ’’ అంది.
‘‘నాకూ అలాగే అనిపిస్తుంది సమీరా… కానీ మన కుటుంబాల వైరం మనకు అడ్డుగా నిలుస్తోంది’’ అంటూ పొలాల వైపు చూడసాగేను.
ఆటో వేగంగా వెళుతోంది… మళ్లీ ప్రకృతిని ఆస్వాదించసాగేను. దూరంగా పొలాలను చూస్తుంటే శీశ్రీ ‘పొలాలనన్నీ, హలాల దున్నీ’ అన్న గేయం గుర్తుకు వచ్చింది. చుట్టూ పొలాలు ,పచ్చటి ప్రకృతి , దూరంగా పల్లెలు ..ఈ ప్రకృతిని చూస్తుంటే నాలో కవితావేశం పొంగుకొస్తోంది..
‘‘ఏటి అలల మిలమిలలు
పైరగాలి గలగలలు
ఎలమావి తోటలు
వరిచేల పంటలతో
ఆకృతి దాల్చింది మా వూరై
కొండల్లో ఊరికి
లోయల్లో దుమికి
పాయపాయలై
పంటసీమ దారులై
సిరులు పండించె మా ఏరై
పాలపిట్టలు
గువ్వల జంటలు
ఊరపిచికలు
పైరు చేల కోతలు
పల్లె పడుచుల పాటలు
బంతిపూల ఆటలతో
వచ్చింది సంక్రాంతి పండుగై’’ అపి కవితని ఆశువుగా చదివాను.
‘‘చాలా బాగుంది వంశీ! కవిత్వం అద్భుతంగా ఉంది… కొన్నాళ్లకు నువ్వు ఇంజనీరు కంటే కవిగా మారిపోతావేంటో’’ అంది నవ్వుతూ…
ఇలా మాట్లాడుకుంటున్న సమయంలో ఆటో మా ఊళ్లోకి ప్రవేశించింది.
నేను ఊరి ముందరే ఆటో దిగిపోయి మా ఇంటికి నడుచుకుంటూ పెరట్లోంచి వెళితే ఆటోలో ఇంటికి వెళ్లిపోయింది సమీర. మేమిద్దరం కలిసి వెళితే మా మావ చూస్తాడనీ సమీర భయం….
***
సంక్రాంతి శోభ మా పల్లెలో ప్రవేశించింది. పూర్వంలా మా ఊరు లేదు. నా చిన్నప్పుడు సంక్రాంతి అంటే సంబరం… ఓ గొప్ప పండుగ.ఊరంతా సందడిగా ఉండేది. నెలాళ్ల ముందర నెలగంటు పెట్టేవారు. అంటే ఆ రోజుకి సంక్రాంతి నెల రోజులుంటుంది. అప్పట్నుంచీ ఊళ్లో చైతన్యం ప్రవేశించేది .తెల్లవారక ముందే ప్రత్యూషంలో ఇంటి ముందర రంగవల్లులు. ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలు వేసే రథం ముగ్గులు… తెల్లవారి లేచి మేమంతా ఆ ముగ్గుల్ని కన్నార్పకుండా చూసేవాళ్లం. సైకిళ్ల మీద బట్టలమ్మే వాళ్లు వచ్చే వాళ్లు. వారిని ఎవరైనా ఇంటికి పిలిస్తే మేమంతా అక్కడికి వెళ్లి మాకు ఏ బట్టలు బాగుంటాయో చూసేవాళ్లం. ప్రత్యూషపు వేళ హరిదాసులు తుంబురా మిటుకుంటూ ఇంటింటికీ వచ్చే వాళ్లు.
మా అమ్మ అతని పాత్రలో బియ్యం వేస్తే అతను దీవిస్తూ వెళ్లడం నాకింకా కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. మేమంతా ఉదయాన్నే ఏటి ఒడ్డున వాలీబాల్ ఆడి ఏట్లో స్నానం చేసి ఇంటికి వచ్చేసరికి అమ్మ ఇచ్చే నెయ్యి వేసిన వేడి వేడి ఉప్మా కమ్మగా ఉండేది.
ధనుర్మాసంలో ఇంటి ముందర ఇంటి చూరుకు వరి కుంకుల్ని వేలాడ దీసేవాడు నాన్న.. ఆ కంకులకున్న ధాన్యాన్ని తినడానికి ఎన్నో పిచ్చుకలు కిచ కిచ మంటూ వచ్చేది. ఏ పొలంలో చూసినా వరి ధాన్యపు కుప్పలు.హేమంతంలో రావడంతోనే పల్లెలన్నీ కళకళలాడేవి. ప్రత్యూషలో తెల్లటి దుప్పటి కప్పుకున్నట్లు మంచు పల్లెని కప్పేసేది. ఆకుపచ్చటి వృక్షాల దళాలన్నీ నీహారికా బిందువులతో నిండిపోయేవి. తెల్లవారి ఏటికెళితే అమాయకంగా పారే ఏరు చలికి వణికిపోతూ జాలిగా చూస్తున్నట్లు కనిపించేది.
(సశేషం)
-గన్నవరపు నరసింహమూర్తి
తూర్పు-పడమర – 5వ భాగం
ధారావాహిక నవల