పది నిమిషాల్లో ఆ గుహలకు చేరుకున్నాము. అప్పటికే అక్కడ విపరీతంగా జనం ఉన్నారు.. నేను వెళ్లి మా ఐదుగురికి టిక్కెట్లు తీసాను. అందరం గుహల ముందుకి వెళ్లాము… దానికి ఎదురుగా కొండల్లో ఓ జలధార తలలోని పాపిడిలా కనిపిస్తోంది. సమీర దాన్నే కన్నార్పకుండా చూస్తోంది. ‘‘అది గోస్తనీ నది. ఇవన్నీ తూర్పుకనుమలు. ఈ బొర్రా గుహలున్న ప్రాంతాన్ని అరకు లోయలోని అనంతగిరి కొండలు అంటారు. ఇక్కడ గుహలు సున్నపురాయితో ఏర్పడ్డాయి. ఇవి 80 మీటర్ల లోతు వరకు ఉన్నాయి. బొర్రాకి ఆ పేరు గిరిజనుల ద్వారా వచ్చింది. ఒడియా భాషలో బొర్ర అంటే రంధ్రం. అందులోంచి ఒక ఆవు కిందకు జారిపోయినపుడు ఈ గుహలు ప్రపంచానికి తెలిశాయి’’ అంటూ నాకు తెలిసిన కొన్ని వివరాలను వాళ్లకు చెప్పాను…
‘‘ఏరా వంశీ! ఈ గుహల్లొ ఉన్న రాళ్లు వేటికి సంబంధించినవి’’ అనీ నన్ను అడిగాడు శ్రీ రామ్;
‘‘ఖాండలైట్ అంటార్రా! మాకు సివిల్ ఇంజనీరింగ్‌లో జియాలజీ ఫస్ట్ ఇయర్లో వీటి మీద సబ్జెక్ట్ ఉంటుంది. అందులో వీటి గురించిన సమాచారం ఉంటుంది’’ అని చెప్పాను…
ఆ తరువాత మేమందరం మెట్లు దిగి గుహలోకి వెళ్లాం. ప్రభుత్వం గుహల్లోపల ఏర్పాటు చేసిన రంగు రంగుల లైటింగ్ ఆ గుహల్లో పరావర్తనం చెందుతూ అందంగా కనిపించసాగింది. లోపల అర కిలోమీటరు దూరం వరకూ ఈ గుహలు వ్యాపించి ఉన్నాయి. మధ్య మధ్యలో మెట్ల ద్వారా కిందకు దిగాము. అలా చాలా దూరం వెళ్లి వాటినన్నింటిని కెమేరాల్లో బంధించాము. ఒక దగ్గర శివలింగం ఉంది. మధ్య మధ్యలో రాతి పొరలు కరగడం వల్ల రకరకాల ఆకృతులుగా కనిపిస్తున్న దృశ్యాలను సమీర, మాధురి విప్పారిత నేత్రాలతో చూడసాగరు. మధు మా అందరి ఫోటోలు తీసాడు.
ఆ తరువాత బయటకు వచ్చి అక్కడే ఉన్న కాంటిన్లో భోజనం చేసి టైడా దగ్గరున్న జంగిల్ బెల్స్ నేచర్ పార్క్ బయలుదేరాము. గుహల ప్రాంతానికి జంగిల్ బెల్స్ 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గంటలో అక్కడికి చేరుకున్నాము.
అరకు- ఎస్. కోట రోడ్డు మధ్య టైడా రైల్వే స్టేషన్‌కు దగ్గరగా రోడ్డు పక్కనే ఉంది ఆ ప్రకృతివనం. చుట్టూ ఎతైన కొండలు, పొడవైన చెట్ల మధ్యలో ఉందా ప్రాంతం.అంతా అడవి… చుట్టూ చెట్ల మీద వెదురుతో ఇళ్లను టూరిస్టుల కోసం నిర్మించారు.. ఆ పార్కు కొండవాలులో ఉంది.. అక్కడ ట్రెక్కింగ్ చెయ్యడానికి సదుపాయాలున్నాయి.
చెట్ల మీద నుంచి రకరకాల పక్షుల కిలకి రావాలు వినిపిస్తున్నాయి… ఇంకా మంచు వీడలేదు. సూర్యుడి ఏటవాలు కిరణాలను మంచు అడ్డుకుంటోంది. మేమందరం చాలా సేపు ఆ నేచర్ పార్క్ అంతా తిరిగాము. సమీర, మాధురి చాలా ఉత్సాహంగా ఆ ప్రాంతాన్ని ఎక్కుతూ దిగుతూ పరిశీలించారు.. నేను వారందరి ఫోటోలు తీసాను. అక్కడ చెట్ల మీద కోతులు గెంతుతూ పర్యాటకులకు వినోదాన్ని కలిగిస్తున్నాయి;
ఆ తరువాత అక్కడే ఉన్న రెస్టారెంట్‌కి వెళ్లాం.
‘‘సమీరా! ఎలా ఉందీ పార్కు’’? శ్రీరామ్ అడిగాడు.
‘‘చాలా బాగుంది.. ముఖ్యంగా పచ్చటి అడవి, కొండలు, లోయలు, జలపాతాలతో ఈ ప్రాంతం అంతా అందంగా ఉంది…పక్షుల కిలకిల రావాలు మెలోడియిస్‌గా వినిపిస్తున్నాయి’’అంది సమీర.
పది నిమిషాల తరువాత మా అందరికీ భోజనాలు వచ్చాయి.
‘మాధురీ! ఎలా ఉంది ఇంజనీరింగ్ చదువు..నువ్వు కూడా అమెరికా వెళతావా?’’ అడిగాను….
‘‘కంప్యూటర్ సైన్స్ సిలబస్ బాగుంది గానీ లెక్చరర్స్ లాంగ్వేజెస్ సరిగ్గా చెప్పటం లేదు. వాటిని బయట నేర్చుకోమంటున్నారు. బయట బోలెడు డబ్బులు అడుగుతున్నారు. నన్ను ఇంజనీరింగ్ చదివించడానికి నాన్నగారు అప్పు చేసారు. మళ్లీ ఇలా బయట నేర్చుకోవాలంటే కష్టం. ఇంకా నా తరువాత తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. వాళ్లు చదువుకోవాలి. అన్నింటికీ ఆ ఐదెకరాల పొలం నుంచి వచ్చే ఆదాయమే ఆధారం. మా నాన్నని నేను ఇబ్బంది పెడుతున్నానేమో అనిపిస్తోంది’’ అంది మాధురి…
మాధురి మాటలు నాకు చాలా బాధ కలిగించాయి.
‘‘మాధురీ! ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు కదా! తర్వాత ఉద్యోగం చేస్తూ తీర్చుకోవచ్చు. అయినా చదువు చాలా ముఖ్యం. ముఖ్యంగా స్త్త్రీలకు. ఎందుకంటే ..తమ కాళ్ల మీద తాము నిలబడొచ్చు. చదువు లేకపోతే ఎన్నో ఇబ్బందులు పడాలి. డబ్బుకి ఇంకొకరి మీద ఆధారపడాలి’’ అని చెప్పాను…
‘‘చూడాలి… రెండవ సంవత్సరం ఫీజుకి లోన్ పెడతాను…’’ అంది మాధురి.
‘‘ఏరా శ్రీరామ్! ఎలా ఉంది ఇంజనీరింగ్. మీ కాలేజీలో బాగా చెబుతున్నారా?’’ అడిగాను.
‘‘ప్రైవేట్ కాలేజీ కదురా! అన్నింటికి డబ్బులే. లెక్చరర్స్ అందరూ కొత్తవాళ్లు. వాళ్లకి • సరియైన అనుభవం లేదు..ఇంక మాకేం చెబుతారు చెప్పు. మన రాష్ట్రంలో 60 శాతం ఇంజనీరింగ్ విద్యార్థులు కంప్యూటర్స్ చదువుతున్నారు. లెక్చరర్లకు, ఫాకల్టీకి విపరీతమైన డిమాండ్ ఉంది. డిమాండ్ సరిపడా లెక్చరర్స్, ప్రొఫెసర్లు లేరు. అయినా ఈ కోర్సు వచ్చి 15 సంవత్సరాలైంది. ఇంకా సిలబస్సే సరిగ్గా లేదు. సీ లాంగ్వేజ్ అనీ, ఇంకో లాంగ్వేజ్ అనీ అమెరికాలో దేనికి డిమాండ్ ఉంటే దాన్ని చెబుతున్నారు. అది అవుట్‌డేటెడ్ అవగానే ఇంకొకటి చెబుతున్నారు. కంప్యూటర్ లేబరేటరీ అనగానే ఓ ఏభై కంప్యూటర్లు కొనేసి ఒక గదిలో పెట్టుస్తున్నారు కానీ అందుకు తగ్గ సాఫ్ట్,ట్యూటర్లు లేరు. ఎవరికి వారు స్వంతంగా చేసుకోవలసిందే. అందుకే అందరూ బయట నేర్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇది చదివితే ఉద్యోగా లొచ్చేస్తాయనీ చదువుతునారు కానీ జ్ఞానం కోసం కాదు. ఆ తరువాత ఉద్యోగంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి’’ అన్నాడు శ్రీరామ్.
‘‘నీకెలా ఉందిరా మధూ!’’
‘‘కంప్యూటర్ సైన్స్ బ్రాంచి కొత్తది. ఉద్యోగాలొస్తున్నాయనీ అందరూ వేలం వెర్రిగా చదువుతునారు. దీనికో సిలబస్సు పాడూ లేదు. ప్రతీ సంవత్సరం మార్చేస్తు న్నారు. అమెరికా తమ వై 2కె కోసం మనవాళ్లకు గాలం వేసింది. ఆ ట్రాప్లో మన వాళ్లు పడ్డారు. ఒకసారి అమెరికా వెళ్లిన వాళ్లు ఆ సాలెగూటిలో చిక్కుకొని విలవిల లాడవలసిందే గానీ తిరిగి రాలేరన్న సత్యం వాళ్లకీ తెలుసు. అయినా మనవాళ్లు ఇప్పుడు అమెరికాకి క్యూ కడుతున్నారు. కేవలం అమెరికా కోసమే ఇక్కడ ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలను తెరిచారు. 90 శాతం కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ బ్రాంచిలే ఉంటున్నాయి. మన తల్లితండ్రులు కూడా లక్షలకు లక్షలు పోసి వీటిల్లో చేర్పిస్తున్నారు. వాళ్లకు ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు. ఇప్పుడు 8వ తరగతి నుంచే ఐఐటి కోచింగులు మొదలయ్యేయి. అంత చిన్న వయస్సు నుంచి ఈ గాడ్జెటులను వాడితే చదువేం వస్తుంది చెప్పు? ఇప్పుడు విద్యార్థులెవ్వరూ పుస్తకాలను చదవటం లేదు. సెల్ఫోన్లతో గడిపేస్తున్నారు. దాని వల్ల ఎన్నో సమస్యలొస్తున్నాయి. నువ్వు ఈ ట్రాప్లో పడకుండా హాయిగా సివిల్ తీసుకొని మంచి పనిచేసావు’’ అన్నాడు వాడు తన బాధనంత వొలక బోస్తూ.
నాకెందుకో మధు మాటల్లో నిజం ఉందని పించింది. మేము మాట్లాడుకుంటుంటే సమీర, మాధురి ఆసక్తిగా వినసాగేరు.
వాడి మాటలు వింటున్నప్పుడు నాకు మా అమ్మ అనే ‘‘లంకమేత! గోదారి ఈత’’ సామెత గుర్తు కొచ్చింది. అమెరికా వెళితే బోలెడు డబ్బు సంపాదించవచ్చు. అలాగే దాని తగ్గ ఖర్చు కూడా… చివరకు మిగిలేది ఏమీ ఉండదు… అందుకే లంక మేత గోదారి ఈత సరిగ్గా అమెరికా వెళ్లేవాళ్లకు సరిపోతుంది. కానీ నేనా మాటను అంటే అమెరికా వెళ్లేవాళ్లు నా మీద ధ్వజం ఎత్తే ప్రమాదం ఉంది. ఆ ఆలోచన రాగానే నాకు నవ్వొచ్చింది. కానీ బాగుండదనీ ఆపుకున్నాను..
భోజనాల తరువాత మాధురి అడవిలోకి రానని చెప్పి అక్కడే ఉండిపోయింది. శ్రీరామ్, మధు ట్రెక్కింగ్‌కు వెళ్లారు. నేను, సమీర కొండవాల్లో నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళాము. అడవిలో పచ్చటి చెట్లమీద ఒక విధమైన పరిమళం గుబాళిస్తోంది. రాను రాను పక్షుల కూతలు మొదలయ్యాయి. చెట్లమీద రకరకాల పక్షులు..కొన్ని ఆకాశంలో ఎగురుతునాయి. వాటిని చూస్తే నాకసూయ కలిగింది.. మానవుడికెన్నో సమస్యలు. కారణం అతనికెన్నో ఆశలు, స్వార్థం. కానీ పక్షులకూ, జంతువులకూ అవి ఉండవు. కేవలం ఆ రోజు గురించే ఆలోచిస్తాయి. రేపటి ఆలోచన ఉండదు కాబట్టే అంత ఆనందంగా ఎగర గలుగుతునాయనీ అనిపించింది నాకు. అదే విషయాన్ని సమీరతో చెప్పాను.
‘‘నీ కెందుకిటువంటి ఆలోచనలు కలుగుతాయి. వంశీ! నిన్ను, నీ ఆలోచనల్ని చూస్తుంటే నాకాశ్చర్యం కలుగుతుంటుంది.
ఎవ్వరికీ రాని ఆలోచనలన్నీ నీకొస్తుంటాయి… వయసుకి మించి ఆలోచిస్తుంటావు.. కారణం ఏమిటి?’’ అనీ అడిగింది.
-గన్నవరపు నరసింహమూర్తి
తూర్పు-పడమర – 5వ భాగం
ధారావాహిక నవల